హిప్పోక్రటిస్ ప్రమాణం ఏంటి? దీనికీ చరక శపథానికీ తేడా ఏంటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, పద్మ మీనాక్షి
- హోదా, బీబీసీ ప్రతినిధి
వైద్య విద్యార్థులు పట్టభద్రులు అయ్యే సమయంలో హిప్పోక్రటిస్ ప్రమాణం చేస్తారు. అయితే, ఎన్నో సంవత్సరాలుగా అమలులో ఉన్న ఈ విధానాన్ని చరక శపథంతో మార్పిడి చేయాలని నేషనల్ మెడికల్ కమిషన్ సూచించినట్లు వార్తలొచ్చాయి. అయితే, ఈ విషయం గురించి నేషనల్ మెడికల్ కమిషన్ వెబ్ సైటులో అధికారిక సమాచారం లేదు. హిప్పోక్రటిస్ ప్రమాణం అంటే ఏంటి? దీనికి చరక శపథానికి తేడా ఏంటి?
హిప్పోక్రటిస్ ప్రమాణం అంటే ఏంటి?
వైద్య విద్య పూర్తి చేసుకున్నాక వైట్‌కోట్ ఉత్సవం జరిగినప్పుడు, హిప్పోక్రటిస్ ప్రమాణం చేస్తారు. ఈ ప్రతిజ్ఞ ద్వారా రోగులకు సేవలందించేటప్పుడు కొన్ని వైద్య విలువలకు కట్టుబడి ఉంటామని వైద్యులు ప్రమాణం చేస్తారు.
నేషనల్ మెడికల్ కమిషన్ మెడికల్ కాలేజీ ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఈ ప్రతిపాదన చేసినట్లు వార్తలొచ్చాయి.
అయితే, ఈ వివరాలు ఎన్‌ఎంసి వెబ్ సైటులో లేవు. ఈ వార్తల నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుడు, పార్లమెంట్ సభ్యుడు శశి థరూర్ కూడా ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
"చాలా మంది డాక్టర్లు ఈ ప్రతిపాదన పట్ల విచారం వ్యక్తం చేస్తున్నారు. భారతీయ విద్యా విధానంలోకి భారతీయతను మేళవించే అంశాలను జోడించడాన్ని నేను సమర్థిస్తాను. కానీ, అది అంతర్జాతీయ విలువలు, ప్రమాణాలను పణంగా పెట్టేదిగా ఉండకూడదు. ప్రపంచ వ్యాప్తంగా వైద్యులందరూ చేసే హిప్పోక్రటిస్ ప్రమాణాన్ని చరక శపథంతో మార్చే బదులు దానిని కూడా జత చేయవచ్చు కదా" అని ట్వీట్ చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
హిప్పోక్రటిస్ శపథంలో ఏముంది?
హిప్పోక్రటిస్ క్రీస్తు పూర్వం 4-5 శతాబ్దాలకు చెందిన గ్రీకు వైద్యుడు. ఈ ప్రమాణం రూపుదిద్దుకోవడానికి ఆయన వైద్యమే మూలం అని అంటారు. ఈయన ప్లేటో, సోక్రటీస్, అరిస్టాటిల్ కు సమకాలికులని చెబుతారు.
అయితే, హిప్పోక్రటిస్ శపథానికి, ఆధునిక వైద్య పితామహునిగా భావించే హిప్పోక్రటిస్ కు ఎటువంటి సంబంధం లేదని కొంత మంది నిపుణులంటారు.
ఈ ప్రతిజ్ఞను బట్టీ ఇది హిప్పోక్రటిస్ కంటే ఒక శతాబ్ధం ముందు నాటిదని అనిపిస్తూ ఉంటుందని శిశిర్ కే మజుందార్ 1995లో రాసిన "ఎథికల్ యాస్పెక్ట్స్ ఆఫ్ ది హిప్పోక్రటిక్ ఓత్ అండ్ ఇట్స్ రిలవెన్స్ టు కాంటెంపరరీ మెడిసిన్" అనే పత్రంలో పేర్కొన్నారు.
ఈ శపథాన్ని వైద్యులు 3వ శతాబ్దం నుంచి పాటిస్తున్నట్లు చరిత్ర చెబుతోంది.

ఫొటో సోర్స్, DR APPARAO
1924లో డబ్ల్యు హెచ్ జోన్స్ గ్రీసు నుంచి ఆంగ్లంలోకి అనువదించిన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రెస్, లడ్ విగ్ ఈడెల్ స్టీన్ (1943 - జాన్ హాప్కిన్స్ ప్రెస్ )లో ప్రచురించిన అనువాదం ప్రకారం హిప్పోక్రటిస్ ప్రమాణం చెబుతున్న వివరాలను ఆంధ్ర యూనివర్సిటీ మైక్రోబయాలజీ ప్రొఫెసర్ డాక్టర్ అప్పారావు వివరించారు.
"నా సామర్ధ్యానికనుగుణంగా రోగులకు సహాయం చేసేందుకు చూస్తాను కానీ, వారిని గాయపరిచేందుకు చూడను".
"ఎవరైనా అడిగినా కూడా విషం ఇవ్వను, ఇతరులకు అటువంటి సలహాలు ఇవ్వను. మహిళలకు గర్భ విచ్చిత్తి కోసం మందులు ఇవ్వను. నా వృత్తిని, జీవితాన్ని నేను పవిత్రంగా సంరక్షించుకుంటాను".
"నేను అడుగుపెట్టిన ప్రతీ ఇంట్లో ఉన్న రోగులకు సహాయం చేస్తాను. ఉద్దేశ పూర్వకంగా ఎవరికీ హాని చేయను. నా వృత్తి జీవితంలో భాగంగా నాకు తెలిసిన సమాచారాన్ని ఇతర దేశాల్లో ప్రచురణకు ఇవ్వను. వాటిని నేను పవిత్ర రహస్యాలుగా భావిస్తాను".
"ఈ నియమాలు హిపోక్రటిస్ కాలానికి అనుగుణంగా, గ్రీకు మతపరమైన ఆచారాల ప్రకారం శరీరంపై కోతను విధించడాన్ని నిషేధంగా చూడటంతో అటువంటి నియమం ఉండేది". ఆధునిక కాలంలో అవసరమైనప్పుడు గర్భ విచ్చిత్తి కోసం మందులు ఇవ్వకపోతే ఎలా కుదురుతుందని డాక్టర్ అప్పారావు అన్నారు. ఆయన కింగ్ జార్జ్ హాస్పిటల్ మైక్రో బయాలజీ విభాగాధిపతిగా రిటైర్ అయ్యారు.
ఇతర దేశాల్లో వైద్యుల ప్రమాణాలు ఎలా ఉంటాయి?
అమెరికన్ మెడికల్ అసోసియేషన్, బ్రిటిష్ మెడికల్ అసోసియేషన్ రూపొందించిన వైద్య నియమావళి ప్రధానంగా హిప్పోక్రటిక్ ప్రతిజ్ఞలోని నియమావళితో ముడిపడి ఉంటుంది. కానీ, అందులో ఇంగ్లీష్ వైద్యుడు థామస్ పర్సివల్ రూపొందించిన నియమావళి కూడా ఉంటుంది.
ప్రపంచ వ్యాప్తంగా వైద్య సంస్థలు హిప్పోక్రటిస్ నియమావళికి కొన్ని మార్పులు చేర్పులు చేసి అమలు చేస్తున్నారని డాక్టర్ అప్పారావు అన్నారు. వైద్యులు పాటించాల్సిన నియమావళిని సాధారణంగా ఆసుపత్రుల్లో, క్లినిక్స్ లో ప్రదర్శిస్తారు.
1847లో అమెరికన్ మెడికల్ అసోసియేషన్ కోడ్ రూపొందించింది. ఇది 1903, 1949, 1957,2008లో అప్ డేట్ అయింది. 1949లో వరల్డ్ మెడికల్ అసోసియేషన్ అంతర్జాతీయ మెడికల్ కోడ్ ఆఫ్ ఎథిక్స్ ను రూపొందించింది.
దీనిని 1968, 1983, 2006లో సవరణలు చేశారు.
2021 మేలో ఈ కోడ్ ఆధునిక వెర్షన్ ను విడుదల చేశారు.
"ఇందులో రోగుల పట్ల, ఇతర వైద్యుల పట్ల, వైద్య సిబ్బంది, సమాజం పట్ల వైద్యులు నిర్వర్తించాల్సిన బాధ్యతలను పొందుపరిచారు.
‘‘వృత్తిపరంగా అత్యున్నత నిర్ణయాలు తీసుకోవాలి".
"చికిత్స తీసుకునేందుకు గాని, నిరాకరించేందుకు గాని రోగికున్న హక్కులను గౌరవించాలి. నిర్ణయాలు తీసుకునే విషయంలో వ్యక్తిగత లాభం, లేదా వివక్షను చూపించకూడదు".
"వృత్తిపరమైన, నైతిక స్వతంత్రతతో సమర్ధవంతమైన ఆరోగ్య సేవలను దయతో, గౌరవంతో అందించాలి. రోగులతో, ఇతర వైద్యులతో నిజాయితీతో మెలగాలి. మోసపూరితమైన చర్యల గురించి ఫిర్యాదు చేయాలి. వ్యక్తిగతంగా తెలిసిన విషయాలనే ధృవీకరించాలి. స్థానిక, జాతీయ నియమావళిని గౌరవించాలి".
"ఆధునిక కాలంలో వైద్యం వైద్యుని చేతి నుంచి వివిధ వర్గాలకు బదిలీ అయిపొయింది. ఈ నేపథ్యంలో నియమావళికి అనుగుణంగా ఎంత వరకు వైద్యం జరుగుతుందనేది పెద్ద ప్రశ్న" అని డాక్టర్ అప్పారావు అన్నారు.
"చైనా వైద్య విధానం అత్యంత ప్రాచీనమైనది. ప్రపంచంలో 260కి పైగా వైద్య విధానాలు ఉన్నాయి" అని వివరించారు.
"హిప్పోక్రటిస్ కొంత మంది శిష్యులను తయారు చేసుకుని వైద్య విధానాలను రూపొందించారు. ఒకప్పుడు సేవగా ఉన్న వైద్యం నేడొక పరిశ్రమగా మారిపోయింది" అని అన్నారు.
"ఆధునిక వైద్యం అవకాశవాద వైద్యం" అని అప్పారావు అంటారు.

ఫొటో సోర్స్, DR RAJASEKHAR
హిపోక్రటిస్ ప్రమాణానికి నేడు వైద్య రంగంలో ఉన్న పరిస్థితులకు పొంతనే లేదని అంటారు నర్సీపట్నంకు చెందిన ప్రైవేటు వైద్యుడు డాక్టర్ పిఎస్వీ రాజశేఖర్.
ప్రమాణంలో చెప్పే విషయాలకు ప్రాధాన్యత ఆచరణలో పూర్తిగా లోపించిందని అంటూ వైద్యం సేవగా కంటే ఒక వ్యాపారంగా మారిపోయిందని అన్నారు.
ఒక చిన్న సమస్యకు వేల రూపాయిల ఖర్చు చేసే వైద్య పరీక్షలు చేయనిదే చికిత్స చేయడం లేదు. చికిత్స చేసేందుకు 50% రోగి చెప్పే విషయం, 25% వైద్య పరిశీలన, 25% వైద్య విచారణ మీద ఆధారపడి ఉంటుంది. కానీ, నేడు పూర్తిగా స్కానింగ్ ఆధారంగా చికిత్స చేస్తున్నారు" అని విచారం వ్యక్తం చేశారు.
"అటవీ ప్రాంతాల్లో ఉండే సింగిల్ బెడ్ ఉన్న ఆసుపత్రి నుంచి దిల్లీలో ఉన్న 1000 పడకల ఆసుపత్రి వరకు ఆసుపత్రి స్థాయిని బట్టీ సెలైన్ ఎక్కించడం, ఇతర పరీక్షలు చేయించడం లాంటివి సాధారణంగా చేస్తున్నారు. ఇది దురదృష్టకర పరిస్థితి" అని విచారం వ్యక్తం చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
చరక సంహిత ఏమి చెబుతుంది?
ప్రాచీన భారత చరిత్రలో చెప్పినట్లుగా చరక సంహిత చారిత్రకత గురించి ఆధారాలు లేవు. చరక సంహిత కూడా ఒక్క వ్యక్తి మాత్రమే చేసిందని చెప్పలేం అని నిపుణులు అంటారు. చరక సంహిత 1, 2వ శతాబ్దానికి చెందిన ప్రాచీన వైద్య గ్రంథం అని చెబుతారు.
సుశ్రుతుడు 4వ శతాబ్దంలో రూపొందించిన గ్రంథాల్లో శస్త్ర చికిత్స గురించి ఉంటుంది. ఇది గ్రీసు విధానం కంటే పురాతనమైనదని అంటారు. ఆయుర్వేదిక్ వైద్యం ఈ సిద్ధాంతాల కనుగుణంగానే ఉంటుంది.
రోగికి వైద్యం అందిస్తున్నప్పుడు ఉండాల్సిన సేవా భావం, వైద్యుడికి ఉండాల్సిన లక్షణాలును కూడా చరక శపథంలో ఉంటుందని శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేదిక్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ మురళీ కృష్ణ చెప్పారు.
ఒక మహిళకు చికిత్స చేస్తున్నప్పుడు ఆమెకు సంబంధీకులైన పురుషుడు కూడా వైద్యం అందిస్తున్న సమయంలో దగ్గర ఉండాల్సిన అవసరాన్ని చరక శపథం చెబుతుంది" అని వివరించారు.
ఆధునిక కాలంలో ఇది ఎంత వరకు సాధ్యమయ్యే పని అని ప్రశ్నించినప్పుడు, "చాలా వృత్తుల్లో పాటించాల్సిన విలువలు, ప్రతిజ్ఞలు ఉంటాయి. విలువలను నేర్పించడం గురువుల బాధ్యత. ఎంత వరకు విద్యార్థులు అమలు చేస్తారనేది వారి వ్యక్తిగత విలువలకు తగినట్లుగా ఉంటుంది" అని అన్నారు.
రోగితో ప్రయోగం చేయకూడదని చరక శపథం చెబుతుంది. తీవ్రంగా రోగం బారిన పడిన రోగితో వ్యవహరించాల్సిన తీరు, మరణ వార్తను తెలియచేసే విధానం లాంటి సూక్ష్మాతి విషయాలను కూడా చరక సంహితలో పొందుపరిచినట్లు
ఆయుర్వేద వైద్యులు కావడానికి అవసరమైన అర్హతలను సుశ్రుత సంహితలో విధికానుప్రవేశలో పొందుపరిచినట్లు చెప్పారు.
"చరక శపథం ప్రధానంగా భారతదేశానికి, ఇక్కడ వైద్య విధానాలు, సంస్కృతికి అనుగుణంగా ఉంటుంది" అని తెలిపారు.

ఫొటో సోర్స్, AFP/Getty Images
ప్రపంచంలో కొన్ని వందల రకాల వైద్య విధానాలున్నప్పుడు ఎవరికి నచ్చిన ప్రతిజ్ఞలు వారు చెప్పుకుంటుంటుంటే, విశ్వమానవ సౌభ్రాతృత్వం ఎలా వస్తుంది. ఆధునిక వైద్యాన్ని అనుసరిస్తున్నప్పుడు, ఒక్క చరకుని ప్రతిజ్ఞ మాత్రమే చేయాలంటే ఎలా కుదురుతుందని ప్రశ్నించారు.
అయితే, ఈ చరక శపథంలో మహిళతో పాటుగా పురుషుడు లేకపోతే ఒక పురుష వైద్యుడు చికిత్స చేయకూడదనే నియమం కూడా ఉంది. ఇలాంటి నియమాలు హిపోక్రటిక్ ప్రతిజ్ఞలో ఉండవు. ఈ తరహా సిద్ధాంతాలు ఆధునిక కాలంలో ఎలా పాటిస్తాం? అని ప్రశ్నించారు.
"వైద్యాన్ని మానవత్వంతో అందించేందుకు చూడాలి కానీ, శపథాలు మార్చడంలో చేకూరే ప్రత్యేక ప్రయోజనాలేవి ఉండవు" అని అప్పారావు అన్నారు.

ఇవి కూడా చదవండి:
- బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు నామినీలు వీరే
- భారీ విగ్రహాలను చైనా నుంచే ఎందుకు తెప్పిస్తున్నారు, ఇక్కడ తయారు చేయలేరా
- BBC ISWOTY నామినీ పీవీ సింధు: రెండు ఒలింపిక్ పతకాలతో చరిత్ర సృష్టించిన తెలుగమ్మాయి
- 'మహాభారత్' సీరియల్ భీముడు ప్రవీణ్ కుమార్ మృతి
- ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికలలో అసదుద్దీన్ ప్రభావం చూపలేకపోతున్నారా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










