తిరుపతి ఎమ్మెల్యే కొడుక్కి కోపమొస్తే ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు నీటి సరఫరా ఆగిపోయిందా.. ఇంతకూ ఏం జరిగింది?

- రచయిత, తులసీప్రసాద్ రెడ్డి
- హోదా, బీబీసీ కోసం
తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తాగునీటి సరఫరా నిలిపేశారని, దీనిపై ఉన్నత స్థాయి విచారణ చేపట్టాలని కోరుతూ బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు లేఖ రాశారు.
ఈ లేఖతో పాటు స్థానిక పత్రికలలో ఈ ఉదంతంపై వచ్చిన వార్తల క్లిప్లింగ్‌లను జోడించి ఆయన జ్యోతిరాదిత్య సింధియాను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.
జ్యోతిరాదిత్య సింధియాకు జీవీఎల్ రాసిన లేఖలో వైసీపీ నేత, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డిపై ఆరోపణలు చేశారు. ఉద్దేశపూర్వకంగా నీటి సరఫరా నిలిపివేయించారన్నది జీవీఎల్ ఆరోపణ.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
విమానాశ్రయ క్వార్టర్స్‌కూ నీటి సరఫరా నిలిపివేయడంతో అక్కడున్న కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యాయని జీవీఎల్ చెప్పారు. నివాస గృహాలకు వెళ్లే రోడ్లు అకస్మాత్తుగా తవ్వేయడంతో ప్రైవేట్ వాటర్ ట్యాంకర్లు రావడానికి కూడా వీల్లేకపోయిందని.. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని జీవీఎల్ తన లేఖలో వివరించారు.
మరమ్మతుల వల్లే సరఫరాలో అంతరాయం ఏర్పడిందని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నతాధికారులు చెబుతున్నారని, కానీ, అది నిజం కాదని జీవీఎల్ ఆరోపించారు.
వైసీపీ స్థానిక నేతలు ప్రతీకార చర్యలు తీసుకునేందుకు నీటిని నిలిపివేశారన్నారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపించాలని లేఖలో కోరారు.

ఫొటో సోర్స్, GVL
తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ జనవరి 10న హఠాత్తుగా విమానాశ్రాయనికి నీటి సరఫరాను నిలిపివేసిందన్నారు.
పాలక వైసీపీకి చెందిన కొంతమందికి విమానాశ్రయ ప్రవేశాన్ని అధికారులు నిరాకరించడంతో ఆ తర్వాత రోజు క్వార్టర్స్‌కు నీటి సరఫరాను నిలిపేశారని జీవీఎల్ ఆరోపించారు.
దీనివల్ల తిరుపతి విమానాశ్రయానికి వెళ్లే వందలాది మంది ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారని లేఖలో ఆయన పేర్కొన్నారు.
దీనిపై ఎయిర్ పోర్ట్ అధికారులు కూడా మీడియాలో వస్తున్న కథనాలు వాస్తవమేనని చెప్పారని ఆయన తన లేఖలో తెలిపారు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని విమానాశ్రయాలకు సరైన సేవలు అందేలా చూడాలని ముఖ్యమంత్రి జగన్‌కు సూచించాలని కోరుతున్నానంటూ సింధియాకు రాసిన లేఖలో పేర్కొన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
జీవీఎల్ నరసింహరావుతో పాటు మరికొందరు కూడా దీనిపై కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రికి ఫిర్యాదులు చేశారు.
మాజీ ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి కూడా వైసీపీ నేతల తీరును తప్పుపడుతూ ట్వీట్ చేశారు.
జీవీఎల్ ఫిర్యాదుకు స్పందించిన మంత్రి జ్యోతిరాదిత్య అవసరమైన చర్యలు తీసుకుంటామంటూ ట్వీట్ చేశారు.
ఈ సమస్యను పరిశీలిస్తామని, విమానాశ్రయంలో ప్రయాణికులు, సిబ్బందికి ఎలాంటి అసౌకర్యం కలగబోదని కేంద్ర మంత్రి ట్వీట్ చేశారు.

ఫొటో సోర్స్, FB/Tirupati Airport - AAI
బొత్స సత్యనారాయణ రాక సందర్భంగా మొదలైన వివాదం
రేణిగుంటలో ఉన్న తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి నిత్యం ప్రముఖులు వస్తుంటారు. ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల చేరుకోవడానికి ఈ విమానాశ్రయం నుంచే రాకపోకలు సాగిస్తారు.
ఇక్కడికి వచ్చే రాజకీయ, వ్యాపార ప్రముఖులకు స్వాగతం పలికేందుకు స్థానిక నాయకులు పెద్దసంఖ్యలో విమానాశ్రయానికి వెళ్తుంటారు.
అలాంటి సందర్భాలలో విమానాశ్రయ అధికారులు నిబంధనల పేరుతో అడ్డుకుంటున్నారని స్థానిక నాయకులు గతంలోనూ పలుమార్లు ఆరోపించారు.
తాజా వివాదమూ ఇలాగే మొదలైంది. ఇటీవల తిరుపతిలో జరిగిన జాతీయ స్థాయి కబడ్డీ పోటీల ముగింపు కార్యక్రమానికి ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ హాజరయ్యారు.
రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న మంత్రికి స్వాగతం పలికేందుకు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డి వెళ్లారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డి.
తన పీఏతో కలిసి విమానాశ్రయంలోనికి వెళ్తున్న అభినయ రెడ్డిని ఎయిర్ పోర్ట్ అథారిటీ మేనేజర్ సునీల్ ప్రోటోకాల్ లేదంటూ అడ్డుకున్నారని... స్థానిక ఎమ్మెల్యే కుమారుడని, తిరుపతి డిప్యూటీ మేయర్‌ని అని అభినయ్ రెడ్డి చెప్పినా అనుమతించకపోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుందని స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి.

ఫొటో సోర్స్, facebook/bhumana abinay reddy
తెలుగు గంగ నీటి నిలిపివేత
విమానాశ్రయ అధికారులతో వివాదం తరువాత తిరుపతి డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి ఎయిర్ పోర్ట్ అథారిటీ సిబ్బంది నివాసాలకు వెళ్లే తెలుగు గంగ నీటిని నిలిపివేయించారన్నది ఆరోపణ.
అంతేకాకుండా రేణిగుంట ఎయిర్ పోర్టుకు వెళ్లే తెలుగు గంగ నీటి పైపులైను నిలిపివేయడంతో ట్యాంకుల ద్వారా రేణిగుంట ఎయిర్ పోర్ట్‌కి, తిరుపతిలోని ఎయిర్ పోర్ట్ సిబ్బంది నివాసాలకు నీటిని తరలించారు.
తిరుపతిలో ఎయిర్ పోర్ట్ అథారిటీ సిబ్బంది ఉండే క్వార్టర్ల ముందు భాగంలో ఉన్న రోడ్డును తవ్వేయడం, డ్రైనేజీ వ్యవస్థను సైతం నిలిపివేయడంతో అక్కడి వాహనాలను బయటకు తీయలేక ఇబ్బందులు పడ్డారని స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి.
విమానాశ్రయ డైరెక్టర్ ఏమన్నారంటే...
దీనిపై రేణిగుంట ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ సురేష్ ‘బీబీసీ’తో మాట్లాడారు. ఎలాంటి వివాదం ఏర్పడలేదని చెప్పారు.
నీటి సరఫరా ఆగిందా అన్న ప్రశ్నకు సమాధానంగా ఆయన అలాంటివి సాధారణమేనని చెప్పారు.
మా ప్రమేయం లేదు: భూమన
మరోవైపు తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి దీనిపై మాట్లాడుతూ.. బీజేపీ నేతలు అనవసర రాద్దాంతం చేస్తున్నారని, అక్కడేమీ సమస్యలేదని అన్నారు.
తాము నీటి సరఫరా ఆపించామన్నది అవాస్తవమని, నీటి సరఫరా ఆగడానికి తమకు ఎలాంటి సంబంధం లేదని ‘బీబీసీ’తో చెప్పారు.
తిరుపతి మున్సిపల్ కమిషనర్ గిరీషా ఏం చెబుతారో తెలుసుకునేందుకు బీబీసీ ప్రయత్నించగా, గిరీషా ఫోన్‌లో అందుబాటులో దొరకలేదు.
ఇవి కూడా చదవండి:
- జొకోవిచ్: టీకా వేసుకోలేదు, రెండుసార్లు కోవిడ్ వచ్చినా ఈవెంట్లలో పాల్గొనడం ఆపలేదు.. ఎందుకిలా
- ‘శత్రు దేశంలో సీక్రెట్ ఏజెంట్లం మేం.. పోలీసులను పెద్దగా పట్టించుకోం’
- పాతికేళ్ల కిందట పంది గుండెను మనిషికి అమర్చిన భారతీయ వైద్యుడిని జైలులో ఎందుకు పెట్టారు?
- ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికలు: ఉన్నావ్ అత్యాచార బాధితురాలి తల్లికి కాంగ్రెస్ టికెట్... ఆమె స్పందన ఏంటి?
- ఎన్నికలకు ముందు యూపీలో బీజేపీని వీడుతున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, కారణమేంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












