జగన్‌తో చిరంజీవి భేటీ: ఎవరికీ భయం వద్దని జగన్ భరోసా ఇచ్చారు.. అది నాకు ధైర్యాన్నిచ్చింది - చిరంజీవి

ఫొటో సోర్స్, @ChiruFanClub
'ఎవరికీ భయం వద్దని జగన్ భరోసా ఇచ్చారు.. అది నాకు ధైర్యాన్నిచ్చింది' అని ఏపీ సీఎం జగన్‌తో భేటీ అనంతరం మీడియాతో చిరంజీవి చెప్పారు.
''వినోదం కూడా సామాన్యులకు అందుబాటులో ఉంచాలనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రయత్నాన్ని అభినందిస్తున్నాను'' అని చిరంజీవి అన్నారు.
ఎగ్జిబిటర్లు, థియేటర్ల సాదకబాధకాలు అన్నీ ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి వివరించానని, దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు.
హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న చిరంజీవి అక్కడి నుంచి నేరుగా సీఎం క్యాంప్ ఆఫీసుకి వెళ్లారు. తాడేపల్లిలోని సీఎంఓలో జగన్‌తో భేటీ అయ్యారు. సుమారు గంటకు పైగా వారిద్దరి మధ్య చర్చలు జరిగాయి. జగన్ ఇంట్లోనే చిరంజీవి లంచ్ కూడా చేశారు.
'గ్లామర్ ఫీల్డ్ కనిపించేంత గొప్పగా లేదు...'
అనంతరం హైదరాబాద్ తిరిగి వెళ్లటానికి గన్నవరం తిరిగి వచ్చిన చిరంజీవి అక్కడ మీడియాతో మాట్లాడారు. సినీ పరిశ్రమ పెద్దగా సీఎం ఆహ్వానం మేరకు తాను తాడేపల్లి వచ్చినట్టు చెప్పారు. సీఎంతో చర్చించిన అంశాల గురించి క్లుప్తంగా వివరించారు.
''గ్లామర్ ఫీల్డ్ బయటకు కనిపించేటంత గొప్పగా లేదు. ఈ విపత్తువేళ అనేక సమస్యలున్నాయి. కడుపు నిండని కార్మికులున్నారు. అలాంటి కార్మికులను ఆదుకోవడానికి, వారి ఉపాధికి ఢోకా లేకుండా ఆలోచించాల్సిన బాధ్యత ఉంది'' అని చిరంజీవి పేర్కొన్నారు.
''థియేటర్ల వారికి కూడా సమస్యలున్నాయి. థియేటర్లు మూసేయాల్సి వస్తుందనే అభద్రతాభావంతో ఉన్నారు. వారికి సంబంధించి నిర్మాణాత్మక సూచనలు చేశాము'' అని ఆయన తెలిపారు.
''ఐదవ షో ఉండాలనే ప్రతిపాదన కూడా ఆయన మన్నించారు. సానుకూలంగా సూచనలన్నీ లోతుగా అర్థం చేసుకున్నారు. అన్నింటినీ పరిశీలించాలనే ధోరణిలో ఉన్నందుకు సంతోషంగా ఉంది. ఈ మీటింగ్ ఫలప్రదమయ్యింది. జీవోని పునఃపరిశీలిస్తామనడం శుభవార్త'' అని చెప్పారు.
'రెండో యాంగిల్ కూడా అర్థం చేసుకున్నారు...'
''రెండో యాంగిల్ నుంచి కూడా సీఎం జగన్ అవగాహన చేసుకున్నారు. ఒక పక్షానే ఉండకుండా అందరినీ సమదృష్టితో చూస్తానని అన్నారు. కమిటీ నిర్ణయం తీసుకుంటుందని, అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం ఉంటుందని చెప్పారు. ఎవరికీ భయం అవసరం లేదని భరోసా ఇచ్చారు. అది నాకు ధైర్యాన్నిచ్చింది'' అని చిరంజీవి వివరించారు.
సినిమా టికెట్ ధరల తగ్గింపు, అదనపు షోలకు అనుమతి నిరాకరించడం సహా ఏపీ ప్రభుత్వం చేపట్టిన పలు చర్యలను సినీ రంగంలోని కొందరు తప్పుబడుతున్నారు. ఏపీ సర్కారు తీరు మీద విమర్శలు కూడా చేస్తున్నారు.
అదే సమయంలో నటుడు నాగార్జున సహా మరికొందరు మాత్రం ఏపీ ప్రభుత్వ నిర్ణయం వల్ల తమకు ఎటువంటి సమస్యా లేదని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్, చిరంజీవి మధ్య జరిగిన చర్చలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఏపీ సీఎం అపాయింట్మెంట్ కోసం పలువురు ప్రముఖులు కూడా ప్రయత్నించినప్పటికీ కేవలం చిరంజీవి ఒక్కరికే అనుమతి వచ్చిందని ప్రచారం సాగుతోంది.
'ఎవరూ మాటలు జారవద్దు...'
''ఈ సమావేశ వివరాలన్నీ పరిశ్రమలోని అందరికీ చెబుదాం. ఇంకా ఏమయినా ప్రతిపాదనలు వారి నుంచి వస్తే త్వరలోనే సీఎంని మళ్లీ కలుస్తాను'' అని చిరంజీవి తెలిపారు.
సీఎం తనను మరోసారి ఆహ్వానిస్తామన్నారని, అందరితో మాట్లాడి తుది నిర్ణయం తీసుకుంటామన్నారని తెలిపారు.
''సినీ పరిశ్రమకు ఒక బిడ్డగానే నేను వచ్చాను. పెద్దగా కాదు. అనవసరంగా ఆందోళన వద్దు. ఎవరూ మాటలు జారవద్దు. నిర్మాణాత్మక నిర్ణయం వస్తుంది. నా మాటను మన్నించండి. వారం, పది రోజుల్లో జీవో వస్తుంది'' అని విజ్ఞప్తి చేశారాయన.
''సీఎం ఎంతమందితో రమ్మంటే అంతమందితో వస్తాను. ఒక్కడిని రమ్మన్నా, వంద మందితో రమ్మన్నా సీఎం మాటను గౌరవిస్తాను'' అని తర్వాతి చర్చల గురించి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
''సమస్యకు ఫుల్ స్టాప్ పడుతుంది. ఆ దిశలోనే సమావేశం జరిగింది. ధరలు పెంచుతారా తగ్గిస్తారా అనేది కాదు గానీ అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం వస్తుంది'' అని మరో ప్రశ్నకు బదులిచ్చారు.
''అన్ని సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లాను. సమగ్రంగా అన్ని సమస్యలను ఆయన దృష్టిలో పెట్టాను. కమిటీలో నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ రిపోర్ట్ మీద చర్చలు ఉంటాయి. అందరినీ పిలిస్తే, ఆయన ఆదేశాల మేరకు వ్యవహరిస్తాం. రెండు మూడు వారాల్లో తుది నిర్ణయం ఉంటుంది'' అని చిరంజీవి వివరించారు.
ఇవి కూడా చదవండి:
- విశాఖలో తొలి సినీ స్టూడియో ‘ఆంధ్ర సినీటోన్’ రెండు చిత్రాలతోనే ఎందుకు మూతపడింది
- పుష్ప-సమంత: ‘ఊ అంటావా మావా..’ పాట ఐటెం సాంగ్ పంథాను తిరగరాస్తుందా? ‘మగ బుద్ధి’ గురించి చంద్రబోస్ ఏమన్నారు?
- మైక్ టైసన్: విజయ్ దేవరకొండ 'లైగర్'లో ఈ బాక్సింగ్ హీరో ఏం చేస్తున్నాడు?
- ప్రేమ, విరహం, భక్తి, రక్తి, విప్లవం, వినోదం అన్నీ తెలిసిన కలం
- కరుణ కుమార్: పలాస, శ్రీదేవి సోడా సెంటర్ల నుంచి మెట్రో కథల వరకు..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















