రాంగోపాల్ వర్మ: పవన్ కల్యాణ్, బాలకృష్ణను ఏపీ ప్రభుత్వం టార్గెట్ చేసిందా? అన్న ప్రశ్నకు ఆర్జీవీ ఏమన్నారు?

వర్మ,

సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో సమావేశమయ్యారు.

సినిమా టికెట్ల ధరలను ఏపీ ప్రభుత్వం ఇటీవల తగ్గించడంపై ఆయన అభ్యంతరం తెలిపారు. ఇదే విషయంపై చర్చించేందుకు ఆయన పేర్ని నానితో భేటీ అయ్యారు.

సమావేశం ముగిసిన తర్వాత ఆర్జీవీ మీడియాతో మాట్లాడారు. తాము ప్రధానంగా ఐదు అంశాలపై చర్చించామని తెలిపారు.

పవన్ కల్యాణ్, బాలకృష్ణను ఏపీ ప్రభుత్వం టార్గెట్ చేసిందా? అని మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన ఇలా సమాధానం ఇచ్చారు.

"ఇది ఒకరిద్దరు నటులను లక్ష్యంగా చేసుకుని తీసుకున్న నిర్ణయం కాదు. ప్రభుత్వ నిర్ణయం సినిమా పరిశ్రమలో ఉన్న డిస్ట్రిబ్యూటర్లు, దర్శకులు, నిర్మాతలపై ప్రభావం చూపిస్తుంది" అని అన్నారు.

వీడియో క్యాప్షన్, సినిమా టికెట్ల రేట్లపై హీరో నాని వ్యాఖ్యలతో మళ్లీ ఈ దుమారం రాజుకున్నట్లయింది

"సినిమాకయ్యే ఖర్చు మూలంగా సినిమా టికెట్ ధర పెరుగుతుందనే విషయం గురించి నా అభిప్రాయాన్ని నేను చెప్పాను. దీని వల్ల ప్రేక్షకుడు ఇబ్బంది పడతాడని ప్రభుత్వం చెప్పింది.

ఇది పరస్పర అభిప్రాయ వ్యక్తీకరణ మాత్రమే. ఇరు వర్గాల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకుని ఒక పరస్పర అంగీకారానికి రావాలని ఆశిస్తున్నాను. దీనిపై ప్రభుత్వమే తుది నిర్ణయం తీసుకుంటుంది" అని చెప్పారు.

జీఎస్టీని ఎవరు చెల్లించటం లేదనే విషయం గురించి తనకు అవగాహన లేదని, దాని గురించి మాట్లాడనని అన్నారు.

సినిమా పరిశ్రమ అంటే నేనొక్కడినే కాదు. నేను ఎగ్జిబిటర్లు లేదా డిస్ట్రిబ్యూటర్ల తరుపు నుంచి రావడం లేదు. నేనొక నిర్మాతగా చర్చించేందుకు వచ్చాను. కేవలం సినిమా టికెట్ ధరపై మాట్లాడేందుకు వచ్చాను" అని రాంగోపాల్ వర్మ చెప్పారు.

తప్పుడు కలెక్షన్లు, పన్ను ఎగవేతపై ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చన్న ఆర్జీవీ మంత్రి నానితో చర్చలు సంతృప్తికరంగా జరిగినట్లు చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)