సినిమా టికెట్లు ఇకపై ప్రభుత్వ వెబ్‌సైట్‌లో విక్రయం.. కీలక నిర్ణయం తీసుకున్న ఆంధ్రప్రదేశ్ సర్కార్

ఏడేళ్లపై వయసున్న పిల్లలు తల్లిదండ్రులతో చూడగలిగేవి, 13 ఏళ్లపై వయసున్న పిల్లలు తల్లిదండ్రులతో చూడగలిగేవి, 16ఏళ్లపై వయసున్న పిల్లలు తల్లిదండ్రులతో చూడగలిగేవి అని వర్గీకరించారు.

ఫొటో సోర్స్, Getty Images

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఇకపై సినిమా టికెట్లన్నీ ఆన్‌లైన్‌లో అమ్మాలని నిర్ణయించింది. అది కూడా ప్రభుత్వమే చేపట్టేందుకు సిద్ధమవుతోంది.

దానికి కోసం ఓ యాప్‌ని రూపొందించాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే తమిళనాడులో అమలవుతున్న విధానాన్ని ఏపీలో కూడా తీసుకొచ్చేందుకు సన్నద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది. దానికోసం ప్రత్యేక పోర్టల్ సిద్ధం చేయబోతున్నట్టు తెలిపింది.

ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు రైల్వే టికెట్ల ఆన్‌లైన్ విధానం తరహాలో సినిమా టికెట్ల కోసం ఓ వెబ్‌సైట్ రూపొందించబోతున్నారు.

ప్రస్తుతం ఐఆర్సీటీసీ ఆధ్వర్యంలో రైల్వే టికెట్లు అమ్ముతున్నారు. అదే విధంగా సినిమా టికెట్ల కోసం ప్రత్యేక వెబ్‌సైట్ రూపొందిస్తారు.

దానికి సంబంధించిన వ్యవహారాలను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఫిల్మ్‌, టెలివిజన్‌, థియేటర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ పర్యవేక్షిస్తుందని తాజాగా విడుదల చేసిన జీవోలో పేర్కొన్నారు.

సినిమా జీవో

ఫొటో సోర్స్, ugc

ఏపీ హోంశాఖ విడుదల చేసిన జీవో నెం. 782 ప్రకారం ఈ ఏర్పాట్ల కోసం ఓ కమిటీని నియమించారు.

కమిటీకి హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చైర్మన్‌గా ఉంటారు. ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కోచైర్మన్‌గా ఉంటారు. ఏపీఎఫ్‌టీడీసీ సెక్రటరీ, వాణిజ్య పన్నుల శాఖ ప్రతినిధి, ఏపీటీఎస్ ఎండీ, కృష్ణా, గుంటూరు జిల్లాల రెవెన్యూ జాయింట్ కలెక్టర్లు, ఐటీ శాఖ ప్రత్యేక కార్యదర్శి సభ్యులుగా కమిటీలో ఉంటారు.

ఆన్‌లైన్‌లో టికెట్ల అమ్మకాలకు సంబంధించిన విధి విధానాలను ఈ కమిటీ రూపొందిస్తుంది.ఈ విధానం అమలులోకి వస్తే రాష్ట్రంలోని బీ, సీ సెంటర్లు సహా అన్నీ ఆన్‌లైన్ పరిధిలోకి వస్తాయి. టికెట్లన్నీ ఆన్‌లైన్‌లో తీసుకోవాల్సి ఉంటుంది. దాని ద్వారా మొత్తం టికెట్ల ఆదాయం ప్రభుత్వానికి జమ అవుతుంది. ప్రభుత్వం నుంచి ఎగ్జిబిటర్లు, ప్రొడ్యూసర్లకు అవి చేరతాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)