Novak Djokovic: ఆస్ట్రేలియా నుంచి పంపించివేయడంతో దుబయికి ప్రయాణం

Novak Djokovic

ఫొటో సోర్స్, EPA

టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్ ఆస్ట్రేలియాలో వీసా కోసం చేసిన చివరి ప్రయత్నం విఫలం కావడంతో ఆయన్ను మెల్‌బోర్న్ అధికారులు దేశం నుంచి పంపించేశారు.

దీంతో జకోవిచ్ మెల్‌బోర్న్ నుంచి విమానంలో దుబయి బయలుదేరారు.

ప్రజారోగ్య కారణాలతో ప్రభుత్వం తన వీసాను రెండోసారి రద్దు చేసిన తరువాత జకోవిచ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించగా కోర్టు ఆయన అప్పీల్‌ను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించింది.

కోవిడ్-19 వ్యాక్సీన్ వేసుకోని ఈ 34 ఏళ్ల సెర్బియన్ టెన్నిస్ క్రీడాకారుడి మూలంగా ప్రజారోగ్యం ప్రమాదంలో పడుతుందని ప్రభుత్వం తన వాదన వినిపించింది.

కోర్టులో చేసిన అపీల్ కూడా తిరస్కరానికి గురికావడంతో జకోవిచ్ తన ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ నిలబెట్టుకోవడానికి ఈసారి మెల్‌బోర్న్‌లో పోటీ పడే అవకాశాన్ని కోల్పోయారు.

ఆస్ట్రేలియా ప్రభుత్వం వీసా రద్దు చేయడంతో ఆయనకు కోర్టులో పోరాడడమే చివరి అవకాశంగా మిగిలింది. ఇప్పుడు ఆ అవకాశం కూడా లేకుండాపోయింది.

జకోవిచ్

ఫొటో సోర్స్, Reuters

ఈ వివాదం ఎలా మొదలైంది?

జనవరి 17 సోమవారం నుంచి ప్రారంభమయ్యే ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో ఆడేందుకు తనకు అనుమతి లభించిందని జొకోవిచ్ జనవరి 4న స్వయంగా వెల్లడించారు.

ఆస్ట్రేలియాలో కోవిడ్ నిబంధనల ప్రకారం ఆ దేశాన్ని సందర్శించేవారు ఎవరైనా రెండు డోసులు టీకా వేయించుకుని ఉండాలి. లేదంటే 14 రోజులు క్వారంటైన్‌లో ఉండాలి. కానీ, టీకాలు వేయించుకోని జొకోవిచ్ తనకు వైద్యపరమైన మినహాయింపు ఉందని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

విక్టోరియా రాష్ట్రం, టెన్నిస్ ఆస్ట్రేలియాల నిర్వహణలోని రెండు స్వతంత్ర వైద్య ప్యానళ్ల నుంచి ఈ మినహాయింపు లభించింది.

జొకోవిచ్ చేసిన ఈ ప్రకటనపై ఆస్ట్రేలియా ప్రజల నుంచి ఆగ్రహం వెల్లువెత్తింది.

కోవిడ్ మొదలైనప్పటి నుంచి కఠినమైన లాక్‌డౌన్‌లు, ఆంక్షలను ఆస్ట్రేలియా ప్రజలు అనుభవించారు. అక్కడి వయోజనుల్లో 90 శాతం కంటే ఎక్కువ మంది రెండు డోసుల టీకా వేయించుకున్నారు.

జొకోవిచ్ విషయంలో నిర్ణయాధికారాన్ని తొలుత విక్టోరియా రాష్ట్రానికే అప్పగించారు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్. కానీ, ఇమిగ్రేషన్ అధికారులు, ఫెడరల్ ప్రభుత్వానిదే తుది నిర్ణయమని ఆ తరువాత చెప్పారు.

జకోవిచ్‌ తీరును కొందరు తప్పుపట్టగా, మరికొందరు ఆయనకు మద్దతుగా నిలిచారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జొకోవిచ్‌ తీరును కొందరు తప్పుపట్టగా, మరికొందరు ఆయనకు మద్దతుగా నిలిచారు

ఆస్ట్రేలియాలో జొకోవిచ్ ఎంట్రీ

జనవరి 5న రాత్రి జొకోవిచ్ మెల్‌బోర్న్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే, అధికారులు 6వ తేదీ తెల్లవారుజామున ఆయన ఎంట్రీని నిరాకరించారు.

అక్కడికక్కడే ఆయన వీసా రద్దు చేసి ఇమిగ్రేషన్ డిటెన్షన్ సెంటర్‌కు తీసుకెళ్లారు. జొకోవిచ్ అక్కడ అయిదు రోజులున్నారు.

జొకోవిచ్ విషయంలో తీసుకున్న ఈ నిర్ణయానికి ఆస్ట్రేలియాలో చాలామంది మద్దతు పలికారు. అదే సమయంలో కొందరు అభిమానులు ఆయన్ను ఉంచిన హోటల్ బయట నిరసన తెలిపారు. జొకోవిచ్ స్వదేశం సెర్బియాలోనూ ఆస్ట్రేలియాకు వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి.

జొకోవిచ్‌ను ఆస్ట్రేలియా అధికారులు వేధించారంటూ సెర్బియా ప్రధాని అలెగ్జాండర్ వ్యూసిచ్ ఆరోపించారు.

జొకోవిచ్ కుటుంబ సభ్యులు కూడా ఆస్ట్రేలియాపై ఆరోపణలు చేశారు. 'గ్వాంటనామో బే ఉగ్రవాది'లా జొకోవిచ్‌ను ట్రీట్ చేస్తున్నారని కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. మరోవైపు జొకోవిచ్ లీగల్ టీం వీసా రద్దును న్యాయస్థానంలో సవాలు చేసింది.

జనవరి 10న ఆస్ట్రేలియా కోర్డు ఈ కేసులో వాదనలు విన్నది. జొకోవిచ్ న్యాయవాద బృందం ప్రధానంగా ఓ విషయాన్ని కోర్టుకు చెప్పింది.

'టెన్నిస్ ఆస్ట్రేలియా' అధికారులను, తన న్యాయవాదులను సంప్రదించేందుకు ఉదయం 8.30 గంటలు(ఆస్ట్రేలియా కాలమానం) వరకు గడువు కావాలని జొకోవిచ్ కోరినా ఇమిగ్రేషన్ అధికారులు అవకాశం ఇవ్వకుండా వీసా రద్దు చేశారని జొకోవిచ్ న్యాయవాదులు కోర్టుకు చెప్పారు.

'నిష్పాక్షిక న్యాయ విధాన' తిరస్కరణ, 'అసమంజస న్యాయ ప్రక్రియ' కిందకు ఇది వస్తుందని జొకోవిచ్ న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

జొకోవిచ్‌ తన కేస్ వివరించడానికి అధికారులు చాలా సమయం ఇచ్చారని ప్రభుత్వ వర్గాలు కోర్టులో వాదించాయి.

అయితే, న్యాయమూర్తి ఆంథోనీ కెల్లీ... జొకోవిచ్ న్యాయవాదుల వాదనతో ఏకీభవిస్తూ వీసా రద్దు నిర్ణయాన్ని కొట్టివేశారు.

జొకోవిచ్‌ను వెంటనే విడిచిపెట్టాలని, ఆయనకైన ఖర్చులను ప్రభుత్వమే చెల్లించాలని ఆదేశించారు.

జొకోవిచ్ ట్రావెల్ డిక్లరేషన్, కోర్ట్ డాక్యుమెంట్లు అన్నీ ఆస్ట్రేలియా మీడియాలో వచ్చాయి. వాటి ప్రకారం జొకోవిచ్ ఒక్క డోస్ కూడా వ్యాక్సీన్ వేసుకోలేదని తేలింది. అంతేకాదు, రెండు సార్లు ఆయన కోవిడ్ బారిన పడినట్లూ ఆ పత్రాల్లో ఉంది. చివరగా ఆయనకు డిసెంబర్ 16న చేసిన పరీక్షల్లోనూ కోవిడ్ పాజిటివ్‌గానే రిపోర్ట్ వచ్చింది.

దీంతో జొకోవిచ్ వ్యవహారంలో ఎన్నో కొత్త ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి.

కరోనా పాజిటివ్‌గా తేలిన తరువాత కూడా జొకోవిచ్ ఈవెంట్‌లకు హాజరైనట్లు తేలింది. పాజిటివ్‌గా నిర్ధరణయిన వెంటనే ఒక ఫ్రెంచ్ పబ్లికేషన్‌కు ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు జొకోవిచ్.

స్పెయిన్ నుంచి దుబయి మీదుగా వచ్చిన జొకోవిచ్ గత 14 రోజులలో తాను ఎక్కడికీ వెళ్లలేదని ఆస్ట్రేలియా అధికారులకు తెలిపారు. కానీ ఆ కాలంలో అతను సెర్బియాలో ఉన్నట్లు సోషల్ మీడియా పోస్ట్‌లు చూపించాయి.

జకోవిచ్

ఫొటో సోర్స్, Getty Images

కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయిన తరువాత జొకోవిచ్ ఏమేం చేశారు?

జనవరి 12న ఆస్ట్రేలియాలో నిర్బంధం నుంచి విడుదలైన రెండు రోజుల తరువాత జొకోవిచ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ప్రకటన చేశారు.

తన ఇమిగ్రేషన్ ఫారంలలో పొరపాట్లు దొరికాయని అందులో ఆయన అంగీకరించారు. తన ఏజెంట్‌ కారణంగా పొరపాట్లు జరిగినట్లు ఆయన చెప్పుకొచ్చారు.

ఒక ఫ్రెంచ్ జర్నలిస్ట్‌ను కలిశానని.. తనకు కోవిడ్ సోకిందని తెలిసిన తరువాత కూడా ఐసోలేషన్ నిబంధనలను ఉల్లంఘించి మాస్క్ లేకుండా ఫోటో షూట్‌లో పాల్గొన్నట్లు తెలిపారు. ఇవన్నీ తాను చేసి ఉండాల్సింది కాదని జొకోవిచ్ తన ఇన్‌స్టా పోస్ట్‌లో రాశారు.

వీసా మళ్లీ రద్దు

జనవరి 14న ఆస్ట్రేలియా ఇమిగ్రేషన్ మంత్రి అలెక్స్ హాక్ జొకోవిచ్ వీసాను రద్దు చేసినట్లు ప్రకటించారు. ప్రజారోగ్యం, ప్రజాప్రయోజనాల దృష్ట్యా ఆయన వీసాను రద్దు చేస్తున్నట్లు తెలిపారు.

దీంతో జొకోవిచ్ ఇప్పుడు బహిష్కరణ ఎదుర్కొంటున్నారు. అదేసమయంలో ఆయన ఎలాగైనా ఆస్ట్రేలియా ఓపెన్‌లో పాల్గొనేందుకు గాను చివరి ప్రయత్నంగా మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశాలున్నాయి.

కోర్టులో ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చి టోర్నీలో పాల్గొని కప్ గెలిస్తే అత్యంత విజయవంతమైన ఆటగాడిగా చరిత్రలో నిలిచిపోతాడు. లేదంటే, అవమానకర రీతిలో ఇంటికి పయనమవుతాడు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)