చైనా టెన్నిస్ స్టార్ పెంగ్ షుయ్: ‘నేను క్షేమంగానే ఉన్నాను’

పెంగ్ షుయ్

ఫొటో సోర్స్, IOC / GREG MARTIN

తాను క్షేమంగా, సురక్షితంగా ఉన్నానని చైనా టెన్నిస్ స్టార్ పెంగ్ షుయ్ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)కి ఆదివారం వీడియో కాల్‌లో తెలిపారు.

తమ కమిటీ అధ్యక్షుడు థామస్ బాచ్, పెంగ్‌తో 30 నిముషాల పాటు సంభాషించినట్లు ఐఓసీ ఒక ప్రకటనలో తెలిపింది.

"ఆమె బాగానే ఉన్నారు. దాని గురించే ప్రధానంగా మేం ఆందోళనపడ్డాం."

ఒక సీనియర్ చైనీస్ అధికారి తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని 35 ఏళ్ల పెంగ్ షుయ్ బహిరంగంగా ఆరోపించారు.

ఆ తరువాత మూడు వారాల పాటు ఆమె పబ్లిక్‌లో కనిపించలేదు.

దాంతో, అంతర్జాతీయ క్రీడాకారులు, ప్రభుత్వాలు ఆందోళన వ్యక్తం చేశాయి.

పెంగ్ క్షేమంగా ఉన్నట్లు రుజువులు చూపించమని చైనా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాయి.

ఈ నేపథ్యంలో, పెంగ్ క్షేమంగా ఉన్నట్లు ఐఓసీ ప్రకటన ఇచ్చింది.

"ఆదివారం వీడియో కాల్‌లో మొదట, తన క్షేమసమాచారాల గురించి ఆందోళన చెందినందుకు ఐఓసీకి పెంగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.

బీజింగ్‌లోని తన ఇంట్లో క్షేమంగా, సురక్షితంగా ఉన్నానని, ఈ సమయంలో తన ప్రైవసీని గౌరవించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

ప్రస్తుతం ఆమె తన కుటుంబ సభ్యులతో, స్నేహితులతో సమయం గడపాలని కోరుకుంటున్నారు.

ఏది ఏమైనా, ఆమె టెన్నిస్‌లో కొనసాగుతారు."

ఈ ప్రకటనతో పాటు పెంగ్‌తో మాట్లాడుతున్న వీడియో కాల్ ఫొటోను ఐఓసీ జతచేసింది.

పెంగ్ షుయ్

ఫొటో సోర్స్, Getty Images

టెన్నిస్ స్టార్ పెంగ్ కనిపించకుండా పోయారని వచ్చిన వార్తలు, తమ ప్రభుత్వంపై వచ్చిన ఒత్తిడితో.. అంతా బాగానే ఉందని చెప్పడానికి చైనా ప్రభుత్వ మీడియా అనేక ఫొటోలు, వీడియోలను విడుదల చేసింది.

బీజింగ్‌లోని ఒక టెన్నిస్ టోర్నమెంటులో పెంగ్ నవ్వుతూ ఇతర అధికారులతో పాటు నిల్చుని ఉన్న వీడియో క్లిప్‌ను ఆదివారం ఉదయం ఓ ప్రభుత్వ మీడియా జర్నలిస్టు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

ఆ టోర్నమెంటు నిర్వాహకులు కూడా పెంగ్ ఫొటోలను తమ అధికారిక వీచాట్ పేజీలో ప్రచురించినట్లు రాయిటర్స్ తెలిపింది.

అయితే, పెంగ్ క్షేమంగా ఉన్నట్లు చూపించడానికి ఈ ఫొటోలు "సరిపోవని", ఇది తమ ఆందోళనలకు పరిష్కారం కాదని వుమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ (డబ్ల్యూటీఏ) ప్రతినిధి రాయిటర్స్‌తో అన్నారు.

"ఆమె క్షేమసమాచారాల గురించి పడుతున్న ఆందోళనలకుగానీ, నిర్బంధంగా ఆమె చేత మాట్లాడిస్తున్నారన్న అనుమానాలకుగానీ ఈ వీడియోలు పరిష్కారం కాదు" అంటూ ఆదివారం డబ్ల్యూటీఏ ఒక తాజా ప్రకటన ఇచ్చింది.

"ఈ వీడియో చూపించినప్పటికీ, ఆమె చేసిన లైంగిక ఆరోపణలపై పూర్తి స్థాయిలో చట్టబద్ధమైన, పారదర్శకమైన దర్యాప్తు జరపాలనే మా డిమాండ్‌లో మర్పులు ఉండవు. ఆమె కనిపించలేదనే మా ఆందోళలను అదే కారణం" అని ఆ ప్రకటనలో తెలిపింది.

చైనా మాజీ వైస్ ప్రీమియర్ జాంగ్ గోలీ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డట్లు ఆ దేశ సోషల్ మీడియా సైట్ వీబోలో పెంగ్ నవంబర్ నెల ప్రారంభంలో ప్రకటించారు.

తనతో లైంగిక సంబంధం పెట్టుకోమని జాంగ్ గోలీ బలవంతపెట్టినట్లు పెంగ్ ఆరోపించారు.

అయితే, కొన్ని నిముషాల వ్యవధిలోనే ఈ పోస్టును తొలగించారు.

చైనాలో ఒక సీనియర్ రాజకీయవేత్తపై ఇలాంటి ఆరోపణలు రావడం ఇదే తొలిసారి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)