తాజ్‌మహల్ కట్టిన కూలీల చేతులను షాజహాన్ నరికేయించారా?
తాజహమల్ నిర్మాణ పనులు 1632 జనవరి నుంచి మొదలయ్యాయి. అప్పటివరకూ షాజహాన్ దక్షిణాదినే ఉన్నారు. అదే సమయంలో భారత్‌లో పర్యటించిన పీటర్ మండీ తన 'ట్రావెల్స్ ఆఫ్ పీటర్ మండీ ఇన్ యూరోప్ అండ్ ఏసియా' పుస్తకంలో ఆ వివరాలు రాశారు.
"షాజహాన్ తాజ్‌మహల్ కోసం ఆసియాలోని వివిధ ప్రాంతాల నుంచి 40 రకాల రత్నాలను తెప్పించారు.
"పచ్చలను సిల్క్ రూట్ ద్వారా చైనాలోని కాష్గర్ నుంచి తెప్పించారు. నీలంగా ఉండే లాపిస్ లాజూలిని అఫ్గానిస్తాన్ గనుల నుంచి తీసుకొచ్చారు. వైడూర్యాలను టిబెట్ నుంచి, పగడాలను అరేబియాలోని ఎర్ర సముద్రం నుంచి తెప్పించారు.
పసుపుగా ఉండే అంబర్‌ను బర్మా నుంచి, కెంపులను శ్రీలంక నుంచి తెప్పించారు. కాట్స్ ఐని ఈజిఫ్టు నుంచి, నీలాలను గల్ఫ్ నుంచి తెప్పించారు. తర్వాత నీలాలను అశుభం అని చెప్పడంతో వాటిని సరిగా ఉపయోగించలేదు" అని తాజ్‌మహల్ గురించి రాసిన "తాజ్‌మహల్ పాషన్ అండ్ జీనియస్ అట్ ద హార్ట్ ఆఫ్ మొఘల్ ఎంపైర్" పుస్తకంలో రచయిత డయానా, మైకెల్ ప్రెస్టన్ రాశారు.
కార్మికుల చేతులు నరికించారనే కథ నిజం కాదు
తాజ్‌మహల్ గురించి రాసిన "తాజ్‌మహల్ పాషన్ అండ్ జీనియస్ అట్ ద హార్ట్ ఆఫ్ మొఘల్ ఎంపైర్" పుస్తకంలో రచయిత డయానా, మైకెల్ ప్రెస్టన్ మరో విషయం రాశారు.
''తాజ్‌మహల్ నిర్మించడానికి వెదురు, కొయ్యలు ఇటుకలతో ఒక పరంజాను నిర్మించారు. పని పూర్తయిన తర్వాత ఆ పరంజాను కూల్చడానికే ఐదేళ్లు పట్టచ్చని ఆ పనుల్లో ఉన్నవారు షాజహాన్‌కు చెప్పారు. దాంతో షాజహాన్ దానిని కూల్చిన తర్వాత ఆ పరంజాలో ఉన్న ఇటుకలన్నీ తాజ్‌మహల్ కట్టిన వారికే ఇచ్చేస్తానని ప్రకటించారు"
"దాంతో కూలీలు తమ శక్తినంతా ఉపయోగించి రాత్రికిరాత్రే అంత పెద్ద పరంజాను కూల్చేశారు. తాజ్‌మహల్ నిర్మాణం పూర్తయ్యేవరకూ బయటి వారు దానిని చూడకుండా ఆ పరంజాను నిర్మించారని చెప్పడం నిజం కాదు. గోడల బయట నుంచి తాజ్‌మహల్ నిర్మాణాన్ని చూశాడని ఒక వ్యక్తికి కళ్లు తీసేశారనే కథ కూడా వాస్తవం కాదు" అని వారు రాశారు.
తాజ్‌మహల్ నిర్మాణంలో పాలు పంచుకున్న ప్రతి కూలీకీ షాజహాన్ చేతులు నరికేయించాడని, ప్రపంచ ఎనిమిదో వింతను వేరే ఎవరూ నిర్మించకుండా ఆయన అలా చేశాడని అక్కడ ప్రతి గైడ్ ఒక కథ చెబుతారు. కానీ ఆ ఘటనకు కూడా ఎలాంటి ఆధారాలూ లేవు. ఏ చరిత్రకారుడూ ఆ విషయం గురించి రాయలేదు.
షాజహాన్ జీవితచరిత్ర 'షాజహాన్ ద రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ ద మొఘల్ ఎంపరర్' రాసిన ఫర్గూస్ నికోల్ మరో విషయం కూడా రాశారు.
"తాజ్‌మహల్ నిర్మాణంలో పనిచేసిన ఎక్కువ మంది కూలీలు కనోజ్‌కు చెందిన హిందువులు. దానిపై పువ్వులు, తీగలు లాంటివి చెక్కడానికి శిల్పులను పోఖ్రా నుంచి పిలిపించారు. కశ్మీర్‌కు చెందిన రాంలాల్‌కు తోటపని బాధ్యతలు అప్పగించారు" అని చెప్పారు.
ఇక తాజ్‌మహల్ కూల్చేయాలని బ్రిటిషర్లు ఎందుకు అనుకున్నారు? అందులోని అమూల్యమైన రత్నాలు ఏమయ్యాయి? పూర్తి వివరాలు పై వీడియోలో చూడండి.
ఇవి కూడా చదవండి:
- రామగుండం: ఇండియాలోనే అతి పెద్ద ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ ఎలా పనిచేస్తుందంటే
- పుష్ప-సమంత: ‘ఊ అంటావా మావా..’ పాట ఐటెం సాంగ్ పంథాను తిరగరాస్తుందా? ‘మగ బుద్ధి’ గురించి చంద్రబోస్ ఏమన్నారు?
- ఈ సినీ దర్శకుడు ఇస్లాం వదిలి హిందూ మతం స్వీకరించడానికి, బిపిన్ రావత్ మరణానికి సంబంధం ఏమిటి
- కృతి శెట్టి: ‘శృంగారం కూడా నటనే కదా.. అలా ఉంటే బాగుంటుందని నేనే దర్శకుడికి చెప్పా’
- తాజ్‌మహల్‌కు పొదిగిన 40 రకాల రత్నాలను ఆంగ్లేయులు దోచుకెళ్లారా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)


