ఫ్రెంచ్ సైన్యం మాలి దేశాన్ని వదిలిపెట్టి ఎందుకు వెళుతోంది?

ఫ్రెంచ్ జెండాను కాలుస్తున్న ప్రజలు

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, ఫ్రెంచ్ జెండాను కాలుస్తున్న ప్రజలు

పశ్చిమ ఆఫ్రికాలోని మాలి దేశం నుంచి తమ సేనలను ఉపసంహరించుకుంటున్నామని ఫ్రాన్స్ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మేక్రాన్ ప్రకటించారు. మాలిలో 2013 నుంచి ఫ్రెంచ్ సైన్యం ఇస్లాం తీవ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడుతోంది.

మాలి, చుట్టు పక్కల దేశాల్లో సుమారు 5000 మంది ఫ్రెంచ్ సైనికులు ఉన్నారు. వీరు అల్ ఖైదా, ఇస్లామిక్ స్టేట్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్నారు.

కానీ, గత 8 ఏళ్లుగా మాలి ప్రభుత్వం నుంచే కాకుండా అక్కడి ప్రజల నుంచి కూడా ఫ్రెంచ్ సైనికుల పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

సాహెల్ ప్రాంతంలో, మాలిలో పొంచి ఉన్న ముప్పు ఏంటి?

మధ్యప్రాచ్యంలో ఎదురుదెబ్బలు తగిలిన తరువాత ఇస్లామిక్ స్టేట్ గ్రూప్, అల్ ఖైదాలు ఆఫ్రికాలోని సాహెల్ ప్రాంతం మీద దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నాయి.

ఆఫ్రికా ఖండంలో తూర్పు నుంచి పశ్చిమానికి విస్తరించిన సహారా ఎడారి దిగువ ప్రాంతంలో ఒక పట్టీలో ఉన్న ప్రాంతమే సాహెల్. ఈ ప్రాంతంలోనే చాద్, నైజర్, మాలి, బర్కినా ఫాసో, మారుటీనియాలు ఉన్నాయి.

ఇస్లామిక్ స్టేట్ ఇన్ ది గ్రేటర్ సహారా, అల్ ఖైదా అనుబంధ సంస్థ జమాత్ నుస్రత్ అల్ ఇస్లాం వల్ ముస్లిమీన్ (జెఎన్ఐఎం) ఈ ప్రాంతంలో తీవ్రవాద దాడులు చేశారు. ఈ దాడుల్లో కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయారు. మరి కొన్ని వేల మంది నిరాశ్రయులయ్యారు. కొన్ని వేల పాఠశాలలు మూతపడ్డాయి.

సాహెల్‌లో అన్సారౌల్ ఇస్లాం, బోకో హరామ్ అనే మరో రెండు జిహాదీ గ్రూపులు ఉన్నాయి.

ఇస్లామిక్ స్టేట్ ఇన్ ది గ్రేటర్ సహారా, అల్ ఖైదా అనుబంధ సంస్థ జమాత్ నుస్రత్ అల్ ఇస్లాం వాల్ ముస్లిమీన్ (జెఎన్ ఐఎం) సాహెల్ ప్రాంతంలో అధికారం కోసం పోటీ పడతాయి.
ఫొటో క్యాప్షన్, ఇస్లామిక్ స్టేట్ ఇన్ ది గ్రేటర్ సహారా, అల్ ఖైదా అనుబంధ సంస్థ జమాత్ నుస్రత్ అల్ ఇస్లాం వాల్ ముస్లిమీన్ (జెఎన్ ఐఎం) సాహెల్ ప్రాంతంలో అధికారం కోసం పోటీ పడతాయి.

ఈ పోరాటంలో ఫ్రాన్స్ ఎందుకు పాలుపంచుకుంది?

మాలిలో సైనిక తిరుగుబాటు ఎదుర్కొంటున్న సమయంలో ప్రభుత్వ అభ్యర్ధన మేరకు ఫ్రాన్స్ మాలీకి 2013లో 5000 మంది సేనలను పంపింది.

లిబియా నాయకుడు మువమ్మర్ గడాఫీని గద్దె దించి హతమర్చిన తర్వాత దేశంలో ఉత్తర భాగపు స్వాతంత్య్రం కోసం పోరాడాలనే కృత నిశ్చయంతో టువారెగ్ కిరాయి సైనికులు మాలికి తిరిగి వచ్చారు.

గడాఫీ ఆయుధాలతో, అల్ ఖైదాతో సంబంధమున్న ఇస్లామిస్టులతో కూటమి ఏర్పరుచుకున్నారు. ఇరువురూ కలిసి మాలి ఉత్తర ప్రాంతాన్ని తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు. అక్కడి నుంచి దేశం మొత్తాన్ని ఆధీనంలోకి తెచ్చుకుంటామని బెదిరించారు.

మాలి 1960 వరకు ఫ్రెంచ్ కాలనీగా ఉండేది. మాలి జనాభాను, అక్కడ నివసిస్తున్న 6,000 మంది ఫ్రెంచ్ పౌరులను రక్షించాలని భావిస్తున్నట్లు మాలి ప్రభుత్వం ప్రకటించింది.

మాలి 1960 వరకు ఫ్రెంచ్ కాలనీగా ఉండేది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మాలి 1960 వరకు ఫ్రెంచ్ కాలనీగా ఉండేది.

2400 మంది ఫ్రెంచ్ సైనికులు ఉత్తర మాలిలో ఉండగా, మిగిలిన వారిని మాలి, చాద్, నైజర్, బర్కినా ఫాసో, మారుటీనియాలో ఉన్న జిహాదీ సెల్స్‌ను ఏరివేసేందుకు డ్రోన్‌లు హెలీకాఫ్టర్లు వాడేందుకు నియమించారు.

స్థానిక సైన్యంతో పాటు మరో 14,000 మంది ఐక్యరాజ్యసమితి శాంతియుత దళాలు కూడా సాహెల్ ఎడారిలో గస్తీ కాస్తూ ఉండేవి.

ఫ్రెంచ్ సేనలపై వ్యతిరేకత ఎలా పెరిగింది?

9 ఏళ్ల క్రితం ఫ్రెంచ్ సేనలు మాలిలో అడుగుపెట్టినప్పుడు వారికి సాదర స్వాగతం లభించింది. కానీ, కాలక్రమంలో వారి పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది..

దేశంలో తీవ్రవాద దాడులు క్రమంగా పెరిగాయి. దీంతో పాటు, మాలి దేశస్థులు తిరుగుబాటు గ్రూపుల్లో చేరడం కూడా పెరిగింది.

గత తొమ్మిదేళ్లలో వారు సహారా ఎడారిలో స్థావరాలు ఏర్పర్చుకుని ఈ ప్రాంతంలో దాడులు చేస్తుండడంతో గత 9 బుర్కినా ఫాసో, నైజర్ లాంటి దేశాలకు కూడా తీవ్రవాద ముప్పు విస్తరించింది.

ఫ్రాన్స్‌కున్న సైనిక బలంతో తీవ్రవాద సమస్యను పరిష్కరించాల్సి ఉండాల్సిందని చాలా మంది స్థానికులు భావిస్తారు. అలా చేయలేని పక్షంలో తమ దేశం నుంచి తప్పుకోవాలని వారు భావిస్తున్నారు. ఫ్రెంచ్ సైన్యం ఈ దేశంలో ఉండటం దేశాన్ని ఆక్రమించడం లాంటిదేనని కూడా వారంటున్నారు.

ఆపరేషన్ బర్ఖానేలో 55 మంది ఫ్రెంచ్ సైనికులు ప్రాణాలు కోల్పోవడంతో ఫ్రాన్స్‌లో కూడా ఈ మోహరింపు పట్ల వ్యతిరేకత మొదలైంది.

ఫ్రెంచ్ సేనలకు వ్యతిరేకంగా మాలిలో తరచుగా నిరసనలు జరుగుతూ ఉంటాయి.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఫ్రెంచ్ సేనలకు వ్యతిరేకంగా మాలిలో తరచుగా నిరసనలు జరుగుతూ ఉంటాయి.

మాలిలో 2020 ఆగస్ట్‌లో సైనిక తిరుగుబాటు జరిగింది. ఎనిమిదేళ్ల కాలంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూలదోయడం అది రెండోసారి. ఈ సైనిక ప్రభుత్వానికి, ఫ్రాన్స్ ప్రభుత్వానికి మధ్య కూడా భేదాభిప్రాయాలు తలెత్తాయని కూడా చెబుతున్నారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరుపుతామని అంగీకరించిన సైనిక ప్రభుత్వం మాట తప్పింది. 2025 వరకు అధికారంలో ఉంటామని చెబుతోంది. మిలిటరీ నిర్ణయాన్ని ఫ్రాన్స్ రాయబారి వ్యతిరేకించడంతో ఆయనను పదవి నుంచి తొలగించారు.

"వ్యూహాలు, రహస్య లక్ష్యాలను బహిరంగంగా చెప్పలేని చట్ట వ్యతిరేక ప్రభుత్వాలతో కలిసి సైనికపరంగా పని చేయలేం" అని మేక్రాన్ అన్నారు.

ఇస్లామిస్ట్ గ్రూపులతో శాంతి ఒప్పందాన్ని చేసుకునేందుకు ఫ్రాన్స్ తిరస్కరించింది. ఈ విధానానికి చాలా మంది మాలి ప్రజలు మద్దతు పలికారు.

జిహాదీ గ్రూపులతో పోరాడేందుకు రష్యా సంస్థ వాగ్నర్ నుంచి సైనికులను పిలిపించుకోవాలన్న మాలి సైనిక ప్రభుత్వ నిర్ణయాన్ని కూడా ఫ్రాన్స్ అంగీకరించలేదు.

"మేము కిరాయి సైనికులతో కలిసి పని చేయలేం" అని ఫ్రాన్స్ సైనిక దళాల మంత్రి ఫ్లోరెన్స్ పార్లీ చెప్పారు.

ఇప్పుడేం జరుగుతోంది?

ఆపరేషన్ బర్ఖానేలో పాల్గొన్న ఫ్రెంచ్ సైనికులను మరో నాలుగు లేదా ఆరు నెలల్లో వెనక్కి పిలిపిస్తారు.

ఈ సేనలను టాకూబా టాస్క్ ఫోర్స్‌తో కలిసి పని చేస్తున్న ఇతర యూరోప్ దేశ సేనలతో పాటు సాహెల్‌లో ఇతర దేశాలకు తరలిస్తారు. ఈ ప్రాంతంలో సైనిక పరమైన సేవలు ఎలా ఉండాలో ప్రణాళికలు వేసుకుంటున్నామని అక్కడికి సైన్యాన్ని పంపించిన దేశాలు చెబుతున్నాయి.

మాలి నుంచి ఫ్రాన్స్ సేనలను తప్పించడంతో ఈ ప్రాంతంలో సుస్థిరత దెబ్బ తింటుందేమోనని పొరుగు దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఇదొక రాజకీయ లోటును సృష్టిస్తుందని ఐవరీ కోస్ట్ అధ్యక్షుడు అలస్సనే ఔట్టరా హెచ్చరించారు.

"సరిహద్దులు కాపాడుకోవడానికి మేం మా సైనిక బలగాలను మరింతగా మోహరించాల్సి రావచ్చు " అని ఆయన అన్నారు.

ఫ్రెంచ్ సేనలు వెళ్లిపోయినా, ఐక్యరాజ్యసమితి తన శాంతి సేనలను దేశంలో ఉంచాలని ఘనా అద్యక్షుడు నానా అకూఫో-అడ్డో విజ్ఞప్తి చేశారు.

మాలిలో కొన్ని వర్గాలు వాగ్నర్ గ్రూప్ కిరాయి సైనికులను దేశంలోకి స్వాగతించాయి. ఇది రాజకీయంగా తటస్థ పరిణామమని వారు భావిస్తున్నారు. అయితే, చాలా పశ్చిమ దేశాలు ఈ పరిణామాన్ని అనుమానంతో చూస్తున్నాయి. సైనిక సహకారం పేరుతో మాలిలో కాంట్రాక్టులు సంపాదించడానికే రష్యా ఇలా చేస్తోందని వారు ఆరోపిస్తున్నారు.

వాగ్నర్ సంస్థ ఇతర ఆఫ్రికా దేశాలైన మొజాంబిక్, సుడాన్, సెంట్రల్ ఆఫ్రికా రిపబ్లిక్‌లలో కూడా సేవలను అందిస్తోంది. లిబియా ప్రచ్ఛన్నపోరుకు సంబంధించిన యుద్ధ నేరాలలో దీని ప్రమేయం ఉందనే ఆరోపణలు కూడా వినిపిస్తుంటాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)