ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికలు: నరేంద్ర మోదీ చెప్పినట్లు యోగి ఆదిత్యనాథ్ పాలనలో మహిళలు నిజంగా సుభిక్షంగా ఉన్నారా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, గీతా పాండే
- హోదా, బీబీసీ న్యూస్
ఉత్తర్‌ప్రదేశ్ ప్రజలు కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి సిద్ధమవుతున్నవేళ అందరి దృష్టి ఒక్కసారిగా మహిళల మీదకు మళ్లింది.
బ్రెజిల్ కన్నా ఎక్కువ జనాభా ఉన్న ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని 15 కోట్ల మంది ప్రజల్లో 7 కోట్ల మంది మహిళలే. దాంతో, ప్రతి రాజకీయ పార్టీ మహిళలను ఆకట్టుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.
ప్రతిపక్ష కాంగ్రెస్ నేత ప్రియాంకగాంధీ గత అక్టోబర్ నెలలో తమ పార్టీ అభ్యర్థుల్లో 40శాతం మంది మహిళలే ఉంటారని ప్రకటించడంతో ఈ వేడి రాజుకుంది.
'లడ్కీ హూ, లడ్ సక్తీ హూ' (ఆడపిల్లను నేను, నాకు పోరాడడం కూడా తెలుసు) అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ ప్రచారం ఈ రాష్ట్రంలో జోరుగా సాగుతోంది. తమను గెలిపిస్తే మహిళలకు ఉద్యోగాల్లో కోటాలు, ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, ఉచిత ఎలక్ట్రిక్ స్కూటర్లు, స్మార్ట్ ఫోన్లు ఇస్తామని ఆ పార్టీ వాగ్దానం చేసింది.
ఈ పార్టీ మహిళా అభ్యర్థుల జాబితా కూడా చాలా వైవిధ్యంగా ఉంది. అత్యాచార బాధితురాలి తల్లి, పోలీసుల హింసకు గురైనట్లుగా భావిస్తున్న ఓ పేద కూలీ, నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్న ఒక ముస్లిం సామాజిక కార్యకర్త, ఓ నటి, మరికొందరు జర్నలిస్టులు ఆ జాబితాలో ఉన్నారు.
అయితే, కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ క్షేత్ర స్థాయిలో మద్దతు శూన్యమేనని, అది అసలు దాదాపు బరిలో లేనట్లేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
కానీ, ఆ పార్టీ మహిళల మీద ప్రధానంగా దృష్టి కేంద్రీకరించడంతో ఎన్నికల బరిలోని ప్రధాన పక్షాలైన భారతీయ జనతా పార్టీ (బీజేపీ), దాని ప్రధాన ప్రత్యర్థి సమాజ్‌వాదీ పార్టీలు మహిళల కోసం పథకాలు ప్రకటించాల్సి వచ్చింది.

ఫొటో సోర్స్, Getty Images
మహిళల సాధికారత కోసం యోగి ప్రభుత్వం ఎంతో కృషి చేసింది - మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిసెంబర్ నెలలో వేలాది మంది మహిళలు హాజరైన సభలో మాట్లాడుతూ, తమ ప్రభుత్వాన్ని ప్రజలు మళ్లీ తప్పకుండా గెలిపిస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
మహిళల భద్రత, సాధికారత కోసం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలోని ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని, అందుకే వారి ఓట్లు తమకే లభిస్తాయని మోదీ అన్నారు.
తమ పార్టీ పాలనలో 'రాష్ట్రం మహిళలకు సురక్షితంగా, మెరుగైన జీవితానికి ఎన్నో అవకాశాలను అందించిన ప్రాంతం'గా మారిందని మోదీ చెప్పారు.
నిజంగానే యూపీలో మహిళలు అభివృద్ధి పథంలో ఉన్నారా? ఇప్పటికీ చాలా వరకు పితృస్వామ్య, భూస్వామ్య వ్యవస్థగా కొనసాగుతున్న భారతదేశపు ఈ పేద రాష్ట్రంలో మహిళ జీవితం నిజంగా బాగుపడిందా?
మోదీ చెప్పుకున్న మాటల్లో నిజమెంత అన్నది చూడడానికి నేను మొదట ఉపాధి అవకాశాలు, నేరాలు, లింగ నిష్పత్తి, పేదరికం వంటి అంశాలకు సంబంధించిన అధికారిక సమాచారాన్ని పరిశీలించాను. రాష్ట్రంలోని వివిధ రంగాల నిపుణులు, ప్రముఖ మహిళలతో సంభాషించాను.
ఆ తరువాత తెలిసిందేమంటే, గత అయిదేళ్లలో కొంత మెరుగుదల కనిపించినప్పటికీ పరిస్థితిలో అంత గొప్ప మార్పేమీ లేదు.
ఇటీవల విడుదలైన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్‌హెచ్ఎస్ 5) ప్రకారం 2015-16, 2019-21 మధ్య కాలంలో కొంత సానుకూల మార్పులు చోటు చేసుకున్నాయి.
- రాష్ట్రంలో 90 శాతానికి పైగా నివాసాలకు విద్యుత్ సౌకర్యం ఉంది. గతంలో ఇది 72.6 శాతంగా ఉండింది.
- అయిదేళ్ల కిందట 36.4% మాత్రమే ఉన్న టాయిలెట్ల సౌకర్యం ఇప్పుడు 68.8 శాతం నివాసాలకు పెరిగింది.
- గతంలో మూడింట ఒక ఇంట్లో మాత్రమే గ్యాస్ పొయ్యి ఉండేది. ఇప్పుడు మూడింట రెండు వంతుల నివాసాల్లో కాలుష్య రహిత ఇంధనాన్ని వినియోగిస్తున్నారు.
- మొత్తంగా మహిళల అక్షరాస్యత, ఉన్నత విద్యలో చేరుతున్న మహిళల సంఖ్య కూడా పెరిగింది.

ఫొటో సోర్స్, Getty Images
"మా పార్టీ మహిళలకు ఎంతో గౌరవాన్ని, ప్రోత్సాహాన్ని ఇస్తోంది. మా ప్రభుత్వం మహిళలకు ఎంతో చేసింది. అందుకు మహిళలు మా పట్ల ఎంతో సంతోషంగా ఉన్నారు" అని యూపీకి చెందిన బీజేపీ ఎంపీ గీతా శాక్య అన్నారు.
కానీ, అదే సమయంలో మహిళలను ఆందోళనకు గురి చేస్తున్న అంశాలు కూడా చాలానే ఉన్నాయి. తాజాగా విడుదలైన మల్టీడైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ (ఎంపీఐ) రాష్ట్రంలోని 24 కోట్ల జనాభాలో గణనీయంగా 44 శాతం మంది పోషకాహారానికి నోచుకోవడం లేదని వెల్లడించింది.
లక్షలాది మంది చిన్నారులు పాఠశాలలకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ప్రసూతి మరణాలు, శిశు మరణాల విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం చేసిందేమీ లేదని ఈ నివేదిక సూచిస్తోంది. రాష్ట్రంలోని 32% ప్రజలకు పారిశుద్ధ్య సౌకర్యాలు అందుబాటులో లేవు.
పేదరికం అన్నది స్త్రీ, పురుష వివక్ష లేకుండా అందరి మీద ప్రభావం చూపిస్తుంది. కానీ, అధ్యయనాలు మాత్రం మహిళలు ఎక్కువగా ప్రభావితమైనట్లు సూచిస్తున్నాయి. ముఖ్యంగా, వనరులు ముందుగా పురుషులకు అందుబాటులో ఉండే పితృస్వామ్య వ్యవస్థలో ఇలా జరుగుతుంటుంది.
ఆందోళన కలిగించే మరో అంశం ఏమిటంటే, కార్మిక శక్తిలో మహిళ ప్రాధాన్యం తక్కువగా ఉండడం. ఇది నిజానికి ఈ రాష్ట్రానికి మాత్రమే సంబంధించిన సమస్య కాదు. మొత్తం భారతదేశాన్ని వేధిస్తున్న సమస్య.
కరోనా మహమ్మారి రాకముందు కూడా యూపీలో 9.4% మహిళలు మాత్రమే పని చేసేవారు. అధికారిక లెక్కల ప్రకారం గత రెండేళ్లలో ఈ శాతం మరింతగా పడిపోయింది. ఇది నిజంగా ఆందోళన కలిగించే విషయమేనని అంగీకరించిన శాక్య, "ఈ అంశాన్ని మోదీ దృష్టికి తీసుకువెళ్తాం" అని అన్నారు.
రాష్ట్రంలో స్త్రీ-పురుషుల నిష్పత్తి మెరుగుపడిందనే ఎన్ఎఫ్‌హెచ్ఎస్ 5 లెక్కలను కూడా నిపుణులు ప్రశ్నిస్తున్నారు.
"జననాల రిజిస్ట్రేషన్ వంటి ప్రత్యామ్నాయ అధికారిక లెక్కల ప్రకారం 2018 వరకు ఈ విషయంలో ఎలాంటి మెరుగుదల లేదు" అని సామాజిక కార్యకర్త, పరిశోధకులు అయిన సాబు జార్జ్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
"చట్ట విరుద్ధంగా ఎన్నో అల్ట్రాసౌండ్ క్లినిక్స్ పని చేస్తున్నాయి" అని సాబు చెప్పారు. అంటే, ఆడపిల్లల భ్రూణహత్యలు పెరుగుతున్నాయన్నమాట.
అన్నింటికన్నా తీవ్రమైన ఆందోళన కలిగిస్తున్న అంశం రాష్ట్రంలో మహిళల పట్ల పెరుగుతున్న హింస. "2018లో నిర్వహించిన ఒక సర్వే భారతదేశం మహిళలకు అత్యంత ప్రమాదకరమైన ప్రదేశం అని పేర్కొంది.
ఇక భారతదేశం లోపల ఉత్తర్‌ప్రదేశ్ పరిస్థితి మరీ దారుణం" అని లక్నో యూనివర్సిటీ మాజీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ రూప్ రేఖా వర్మ అన్నారు.
"అధికారిక సమాచారాన్ని పరిశీలిస్తే రాష్ట్రంలో బీజేపీ పాలనలో మహిళల హింస, అత్యాచారాలు గణనీయంగా పెరిగిపోయాయని తెలుస్తుంది" అని ఆమె అన్నారు.
యూపీలో ప్రతి ఏటా మహిళలపై దాడుల కేసులు, అత్యాచార కేసులు వేల సంఖ్యలో నమోదవుతుంటాయి. ఈ విషయంలో దేశంలో యూపీదే మొదటి స్థానం.
ప్రభుత్వం ఇప్పటివరకు విడుదల చేసిన తాజా సమాచారం ప్రకారం 2020లో రాష్ట్రంలో మహిళలపై దాడులు, అత్యాచార కేసులు దాదాపు 50,000 రికార్డ్ అయ్యాయి. ఈ డేటా ప్రకారం 2,796 మంది మహిళలు అత్యాచారానికి గురయ్యారు. 9,257 మంది మహిళలు కిడ్నాప్‌నకు గురయ్యారు. 2,302 మంది మహిళలు వరకట్న హింసకు బలయ్యారు. కనీసం 23 మంది మహిళలు యాసిడ్ దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు.
ఎన్ఎఫ్‌హెచ్ఎస్ 5 వివరాల ప్రకారం రాష్ట్రంలో 35% మంది వివాహిత మహిళలు కుటుంబ హింసను ఎదుర్కొంటున్నారు.
ఇలాంటి నేరాలు చాలా చోట్ల జరుగుతూనే ఉన్నాయి. కానీ, ఇక్కడి అధికారుల స్పందన మూలంగా ఇలాంటి కొన్ని కేసులు అంతర్జాతీయ పత్రికల్లో హెడ్‌లైన్స్‌గా మారాయి.
2020లో ఈ రాష్ట్రంలో గ్యాంగ్ రేప్‌కు గురైనట్లుగా భావిస్తున్న ఒక టీనేజర్ చనిపోయినప్పుడు ఆమె కుటుంబ సభ్యులు అధికారుల మీద ఆరోపణలు చేశారు. తమ సమ్మతి లేకుండానే బాధితురాలికి అధికారులు బలవంతంగా అంత్యక్రియలు చేశారని వారు ఆరోపించారు. ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు కూడా అసలు రేప్ జరగలేదని పదే పదే చెబుతూ వచ్చారు. హత్రాస్ రేప్ కేసుగా సంచలనం సృష్టించిన ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మీద అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తాయి.
ఇక, 2018లో బీజేపీ శాసనసభ్యుడు ఒకరు తనపై అత్యాచారయత్నం చేశాడని ఒక మహిళ ఆరోపించారు. పోలీసులు తన గోడు పట్టించుకోవడం లేదనే ఆక్రోశంతో ఆమె ఆదిత్యనాథ్ కార్యాలయం ఎదుట తన ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఆమె ఫిర్యాదు చేసిన తరువాత కూడా ఆ ఎమ్మెల్యే బీజేపీలో కొనసాగుతూ ఆ ప్రాంతంలో తన పలుకుబడిని కొనసాగించారు.
ఆగస్ట్ నెలలో ఓ 24 ఏళ్ల మహిళ పోలీసులు, న్యాయవ్యవస్థ తనను వేధించాయని ఆరోపిస్తూ ఒంటికి నిప్పంటించుకుని చనిపోయారు. ప్రతిపక్షానికి చెందిన ఎంపీ తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. ఆ ఎంపీకి వత్తాసుగా పోలీసులు, న్యాయవ్యవస్థ పని చేశాయని ఆమె ఆరోపించారు.
"అత్యాచారం జరిగినప్పుడు ఏ మహిళైనా పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయలేదు. ప్రభుత్వమే బాధితురాలి వద్దకు వెళ్లి అవమానించి, ఆమె ఆరోపణలను తోసిపుచ్చుతుంటుంది" అని సదాఫ్ జఫర్ అనే సామాజిక కార్యకర్త అన్నారు. సదాఫ్ ఇప్పుడు కాంగ్రెస్ తరఫున రాష్ట్ర రాజధాని లక్నోలో శాసనసభకు పోటీ చేస్తున్నారు. "యూపీలో మహిళలు మొండి ధైర్యంతోనే, దేవుడి దయ వల్లనో మనుగడ సాగిస్తున్నారు" అని ఆమె అన్నారు.
లింగ వివక్షపై దాదాపు నాలుగు దశాబ్దాలుగా పోరాడుతున్న ప్రొఫెసర్ వర్మ, మహిళల అణచివేత విషయంలో బీజేపీని మాత్రమే నిందించాల్సిన పని లేదని అన్నారు.
"అన్ని రాజకీయ పార్టీలూ మహిళలను అవమానకరంగా చూస్తున్నాయి. నేరస్థులకు కాపు కాసే పనిని అన్ని పార్టీలూ చేస్తున్నాయి. అయితే, ఇతర పార్టీలు ప్రజాభిప్రాయానికి ఎంతో కొంత బెదిరి వెనక్కి తగ్గుతున్నాయి. కానీ, ఈ ప్రభుత్వం మాత్రం అవేమీ పట్టించుకోవడం లేదు" అని వర్మ అన్నారు.
రాష్ట్రంలోని మహిళలకు సాధికారత చేకూరిందనే మోదీ మాటలు "పుండు మీద కారం చల్లినట్లుగా ఉన్నాయి" అని ఆమె అన్నారు.
మహిళల సమస్యలు ఎందుకని ఎన్నికల అజెండాలో ప్రధానంగా కనిపించవనే ప్రశ్నకు బదులిస్తూ, "ఎందుకంటే అధిక శాతం ఓటింగ్ అంతా కులం, మతాల ప్రాతిపదికనే జరుగుతుంటుంది. మహిళా ఓటర్లు ఒక కూటమిగా ఓట్లు వేయడమంటూ జరగదు. వారికున్న స్వేచ్ఛ అతి స్వల్పం. వాళ్లు ఎవరికి ఓటు వెయ్యాలో ఇంట్లో వాళ్లు చెబుతుంటారు. కుటుంబంతో పాటుగా ఓట్లు వేస్తుంటారు" అని బదులిచ్చారు.

ఇవి కూడా చదవండి:
- ఎల్ఐసీ IPO: 'బంగారు గుడ్డు పెట్టే బాతును ప్రభుత్వం అమ్మేస్తోంది'- ఉద్యోగ సంఘాలు
- ‘పోర్న్ సైట్లలోని నా ఫొటోలను తెలిసినవారు ఎవరైనా చూస్తారేమో అని భయంగా ఉంది’
- 'హిజాబ్‌కు రియాక్షనే కాషాయ కండువా'-ఉడుపి నుంచి గ్రౌండ్ రిపోర్ట్
- ‘యుక్రెయిన్‌లో ఉండొద్దు, ఇండియా వెళ్లిపోండి’ - భారత పౌరులకు రాయబార కార్యాలయం సూచన
- యుక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం తప్పించడానికి 5 మార్గాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

















