పాకిస్తాన్‌లో 'రివెంజ్ పోర్న్' కేసులు ఎందుకు పెరుగుతున్నాయి

- రచయిత, షుమైలా జాఫ్రీ
- హోదా, బీబీసీ న్యూస్, లాహోర్ నుంచి
రబియా (పేరు మార్చాం)కు కొన్నేళ్ల క్రితం ఒక అబ్బాయితో స్నేహం ఉండేది. వారిద్దరి మధ్య చనువు పెరగడంతో తన ప్రైవేటు ఫొటోలను రబియా ఆ అబ్బాయికి పంపించారు. కొన్నాళ్ల తర్వాత వారిద్దరూ విడిపోయారు. అయితే ఒకరోజు తన ఫొటోలను ఆ అబ్బాయి పోర్న్ వెబ్‌సైట్‌లలో పెట్టినట్లు రబియా తెలుసుకున్నారు.
రబియా రహస్యంగా నన్ను కలుసుకోవడానికి వచ్చినప్పుడు, ఆమె ప్రతీదాన్ని అనుమానంగా చూశారు.
తాను ఎదుర్కొంటున్న ఈ సమస్య గురించి బీబీసీతో రబియా మాట్లాడారు. ''వీటిని ఎలా ఆపాలో నాకు అర్థం కావడం లేదు. మెదడు పనిచేయట్లేదు. ఆ ఫొటోలు వేగంగా ఆన్‌లైన్‌లో షేర్ అవుతున్నాయి. నాకు చాలా భయంగా ఉంది. మాకు తెలిసిన వారెవరైనా ఆ ఫొటోలను చూస్తే నా పరిస్థితి ఏంటి? నాతో సత్సంబంధాలు లేని వ్యక్తుల చేతికి అవి చిక్కితే, వారు వాటిని ఎలా ఉపయోగించుకుంటారో అని భయమేస్తుంది'' అని తన ఆవేదనను వెళ్లగక్కారు.
ఇలాంటి కఠిన పరిస్థితుల్లో ఒక ఫ్రెండ్ సహాయంతో లాహోర్‌లోని 'డిజిటల్ రైట్స్ ఫౌండేషన్' అనే ఎన్జీవో హెల్ప్‌లైన్ సహాయాన్ని ఆమె పొందారు.
పాకిస్తాన్‌లోని మహిళలకు డిజిటల్ భద్రతను అందించడానికి ఈ సంస్థ పనిచేస్తుంది. డిజిటల్ భద్రత గురించి మహిళల్లో అవగాహనను పెంచుతోంది.
కోర్టులో తన మాజీ ప్రియునికి వ్యతిరేకంగా రబియా ఎలాంటి ఆరోపణలు చేయలేదు. కానీ పోర్న్ వెబ్‌సైట్ల నుంచి తన ఫొటోలను తొలగించడంలో సఫలమైంది.
కానీ ఇప్పటికీ తాను ఏదో ఉచ్చులో చిక్కుకుపోయినట్లుగా అనిపిస్తోందని, అన్ని విషయాల్లో రాజీ పడాల్సి వస్తోందని ఆమె భావిస్తున్నారు.
''ఇప్పుడు నేను ఎవర్నీ నమ్మలేను. మళ్లీ ఆ ఫొటోలు ఇంటర్నెట్‌లో కనిపిస్తాయేమోనని నిరంతరం భయపడుతూనే ఉన్నా. ఈ భయం జీవితాంతం నన్ను వెంటాడుతూనే ఉంటుంది'' అని రబియా పేర్కొన్నారు.
పాకిస్తాన్‌లో వేగంగా పెరిగిపోతోన్న'రివేంజ్ పోర్న్' కేసులకు సంబంధించి రబియా ఉదంతం ఒక ఉదాహరణ మాత్రమే. సన్నిహితంగా మెదిలిన ఫొటోలను ఎదుటివారి అనుమతి లేకుండానే ఉపయోగించుకోవడం, వాటి ద్వారా బ్లాక్‌మెయిల్‌కు పాల్పడటం వంటి కేసులు పాకిస్తాన్‌లో పెరిగాయి.
చాలా సంవత్సరాల క్రితం తీసుకున్న వీడియోలు కూడా రివెంజ్ పోర్న్ కేసుల్లో కనిపిస్తున్నాయి. ఇది బాధితుల జీవితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది.

పాకిస్తాన్ చట్టాలు ఏం చెబుతున్నాయి?
డిజిటల్ రైట్స్ ఫౌండేషన్ హెల్ప్‌లైన్‌కు గతేడాది 4000లకు పైగా ఫిర్యాదులు వచ్చాయి. అందులో దాదాపు 1600 ఫిర్యాదులు, సన్నిహిత ఫొటోల దుర్వినియోగానికి సంబంధించినవే అని ఆ సంస్థ వెల్లడించింది.
నిజానికి ఈ కేసుల వాస్తవ సంఖ్యను తెలుసుకోవడం చాలా కష్టమైన పని అని ఈ సమస్యను నిర్మూలించడం కోసం పనిచేస్తోన్న కార్యకర్తలు పేర్కొంటారు. ఎందుకంటే చాలా సందర్భాల్లో సిగ్గు, భయం, అవమానం కారణంగా బాధిత మహిళలు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడంలేదని వారు చెప్పారు.
గత కొన్నేళ్లుగా ఈ సమస్యల గురించి ఫిర్యాదు చేసే మహిళల సంఖ్య చాలా రెట్లు పెరిగిందని పాకిస్తాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలోని సైబర్ క్రైమ్ వింగ్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఉజ్మా ఖాన్ తెలిపారు. రివేంజ్ పోర్న్‌కు సంబంధించిన ఫిర్యాదులను పర్యవేక్షించే బాధ్యత కూడా సైబర్ క్రైమ్ వింగ్‌పైనే ఉంది.
ఈ కేసుల్లో ఎక్కువగా మాజీ ప్రియులు, ఫియాన్సీ, సహోద్యోగులనే నిందితులుగా పేర్కొంటున్నారు. చాలా కేసుల్లో భర్తలు కూడా నిందితులుగా ఉంటున్నారు. మహిళలకు సంబంధించిన ఫొటోలను కుటుంబసభ్యులకు పంపిస్తామని లేదా సోషల్ మీడియాలో షేర్ చేస్తామని బెదిరింపులకు పాల్పడుతుంటారు.
సైబర్ క్రైమ్‌ను నిరోధించడానికి రివేంజ్ పోర్న్ వంటి నేరాలకు పాల్పడిన వారికి ఏడేళ్ల జైలు శిక్షతో పాటు భారీ జరిమానాలను విధిస్తూ 2016లో పాకిస్తాన్‌లో ఒక నిబంధనను తీసుకొచ్చారు. అయినప్పటికీ, ఇంకా చాలామంది మహిళలు దోషులను శిక్షించడానికి చట్టపరమైన మార్గాన్ని ఎంచుకోవడం లేదు.
''బాధిత మహిళలంతా, ఇప్పటికే జరగకూడని భయంకరమైన నష్టం జరిగిపోయిందని అనుకుంటారు. దీన్ని ఇక ఇక్కడితోనే ఆపేయాలి. దీని గురించి ఎక్కువ మందికి తెలియకపోవడమే మంచిది. కుటుంబసభ్యులకు కూడా దీని గురించి తెలియకూడదని బాధితులు భావిస్తారు'' అని ఉజ్మా చెప్పారు.
ఈ విషయంలో బాధిత మహిళలు వెనకడుగు వేయడానికి మరో కారణాన్ని కూడా ఉజ్మా తెలిపారు. ''సుదీర్ఘ కాలం పాటు న్యాయపోరాటం చేయడానికి వారిదగ్గర తగిన వనరులు ఉండవు. అంత సామర్థ్యం కూడా ఉండదు. దీనివల్ల ఇది వారి నిశ్చితార్థం లేదా పెళ్లి ఆగిపోవడానికి కారణమవుతుంది. చాలా కేసుల్లోని మహిళల్లో ఆత్మహత్య ఉత్తమమనే ధోరణి కనబడుతోంది'' అని ఆమె వివరించారు.

ఫొటోల విషయంలో జాగ్రత్త వహించాలి
రివేంజ్ పోర్న్ బాధితులైన మహిళలకు సహాయం చేసేందుకు డిజిటల్ రైట్స్ ఫౌండేషన్ సంస్థ ప్రయత్నిస్తోంది. కానీ భయం, అవమానం కారణంగా ఫిర్యాదు చేసేందుకు బాధితులు ముందుకు రావడం లేదు. ఈ సంస్థ, మహిళలకు మానసిక ధైర్యాన్ని అందించడమే కాకుండా కోర్టుల్లో న్యాయపోరాటానికి కావాల్సిన న్యాయ సహాయాన్ని కూడా అందిస్తోంది.
డిజిటల్ రైట్స్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నిగత్ దాద్ ఈ అంశం గురించి బీబీసీతో మాట్లాడారు. ''నాకు తెలిసినంతవరకు టెక్నాలజీ, ఇంటర్నెట్‌ను వినియోగించే యువతులు, మహిళలే ఈ నేరాల బారిన పడుతున్నారు. వారు ఇంటర్నెట్‌ను వాడుతున్నారు, కానీ వారికి రక్షణ నిబంధనల గురించి తెలిసి ఉండదు. వారు ఎలాంటి డేటా ఇంటర్నెట్‌లో షేర్ చేస్తున్నారో కూడా వారికి తెలియదు. ఆ డేటా ఎవరికి చేరుతుంది, దాన్ని ఎలా వాడుకుంటారు అనే విషయాలపై వారికి అవగాహన ఉండదు'' అని ఆయన అన్నారు.
''రివేంజ్ పోర్న్ బాధితులంతా, ఇదంతా తమ స్వయంకృతమే అనే అపరాధ భావనలో ఉంటారు. ఒకర్ని నమ్మి తమ ఫొటోలను పంపించడం వల్లనే ఈ కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోంది అనుకుంటారు'' అని నిగత్ చెప్పారు.
మారుమూల ప్రాంతాల్లోని చాలామంది మహిళలకు న్యాయపరమైన నిబంధనలు, డిజిటల్ రైట్స్ ఫౌండేషన్ వంటి సంస్థల గురించి అవగాహన లేదని నిగత్ పేర్కొన్నారు. చాలా కేసుల్లో బాధితులు సొంత కుటుంబసభ్యుల సహాయం కూడా తీసుకోరు. ఎందుకంటే కుటుంబ సభ్యులకు చెప్పినవెంటనే వారినే నిందించడం ప్రారంభిస్తారు. కొన్ని సందర్భాల్లో పరువు హత్యలకు కూడా దారితీస్తాయి'' అని నిగత్ చెప్పుకొచ్చారు.

2016లో పాకిస్తాన్‌కు చెందిన మొదటి మహిళా సోషల్ మీడియా సెలెబ్రిటీ కందీల్ బలోచ్‌ను స్వయానా తన సోదరుడే హత్య చేశారు. ఎందుకంటే, సామాజిక మాధ్యమాల్లో కందీల్ షేర్ చేస్తోన్న వీడియాల వల్ల తమ కుటుంబ పరువుకు నష్టం కలుగుతోందని ఆయన భావించారు.
కందీల్ బలోచ్ హత్య తర్వాతే, సామాజిక మాధ్యమాలను మహిళలకు సురక్షితమైన ప్రదేశాలుగా మార్చాలనే చర్చ ప్రారంభమైంది. బాధితులకు సహాయం చేయడానికి చట్టాలను రూపొందించారు.
చట్టం అమల్లోకి వచ్చిన ఐదేళ్ల తర్వాత కూడా రివేంజ్ పోర్న్, అనుమతి లేకుండా ఫొటోల దుర్వినియోగం, బ్లాక్‌మెయిల్ చేయడం వంటి కేసుల్లో కేవలం 27 మందిని మాత్రమే దోషులుగా తేల్చారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
సుదీర్ఘంగా సాగే న్యాయ ప్రక్రియ
గత నెలలో పాకిస్తాన్ మానవ హక్కుల కమిషన్, కరాచీ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు చెందిన ఒక కేస్ స్టడీని తన నివేదికలో పొందుపర్చింది. ఈ కేస్ స్టడీని మంగళవారం ఆవిష్కరించనున్నారు.
ఈ కేస్ స్టడీకి 'రీ థింకింగ్ ద ప్రివెన్షన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ క్రైమ్స్ యాక్ట్, హౌ సైబర్ లాస్ ఆర్ వెపనైజ్డ్ అగెన్స్ట్ ఉమెన్' అని పేరు పెట్టారు. తన ఫొటోలు దుర్వినియోగం అయ్యాయని, వాటిని ఆన్‌లైన్‌లో పోస్ట్ చేశారని పేర్కొంటూ ఒక మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్ చేసిన ఫిర్యాదు గురించి ఈ కేస్ స్టడీ తెలుపుతుంది.
ఆమె ఫిర్యాదు నమోదు చేసి నాలుగు సంవత్సరాల 8 నెలలు, 141 విచారణలు జరిగిన తర్వాత, అదే యూనివర్సిటీకి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్‌ను న్యాయస్థానం దోషిగా తేల్చింది. ఈ నాలుగు సంవత్సరాల కాలంలో కేసును నాశనం చేసేందుకు ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎఫ్‌ఐఏ) అన్ని విధాలా ప్రయత్నించినట్లు ఆ నివేదికలో పేర్కొన్నారు.
విచారణ సంస్థ మొదట్లో కోర్టు విచారణ గురించి మహిళకు తెలియజేయలేదు. విచారణ సంస్థ అధికారి, ప్రాసిక్యూటర్ల నిర్లక్ష్యం కారణంగా ఆమె గంటల తరబడి విచారణకు హాజరయ్యేందుకు నిరీక్షించాల్సి వచ్చింది. నిందితుని తరఫు న్యాయవాది అడిగే ప్రశ్నలు ఆమెను ఇబ్బందిపెట్టేలా ఉన్నాయి. దుర్వినియోగమైన చిత్రాల గురించి క్షుణ్ణంగా వివరించమని ఆమెను న్యాయవాది అడిగేవారు.
''ఎఫ్ఐఏ, ఈ ప్రక్రియను సులభం చేసేందుకు మహిళలకు మరింత చేరువ చేసేందుకు ప్రయత్నిస్తోంది. కానీ ఆ నివేదికలో ఏజెన్సీ గురించి చెప్పిన వివరాల్లో కూడా కొంతవరకు నిజం ఉంది'' అని నిగత్ అన్నారు.
''కొన్ని కేసులు వరకే కోర్టు వరకు వస్తాయి. బాధిత మహిళ ఫిర్యాదు నమోదుచేయబడి, విచారణ ప్రారంభమైతే ఇక్కడ ఇంకో ప్రశ్న తలెత్తుతుంది. కోర్టు విచారణ జరిగినంత కాలం బాధితురాలు భద్రంగా ఉండగలదా? అనే ప్రశ్నరాక మానదు. విచారణకు సంబంధించిన అంశాలు మీడియాలో రాకుండా జాగ్రత్తపడాలి, కోర్టుల్లో ప్రవేశపెట్టే సాక్ష్యాధారాలు పక్కాగా ఉండాలి. ఇంత సుదీర్ఘ ప్రక్రియ ఉంది కాబట్టే, న్యాయపోరాటానికి మహిళలు ముందుకు రావడం లేదు'' అని నిగత్ వివరించారు.

న్యాయంగా విచారణ జరగాలి
తమ సంస్థపై వచ్చిన ఆరోపణలను ఎఫ్ఐఏ ఖండించింది. బాధితుల పట్ల వివక్ష చూపారనే వ్యాఖ్యలను కూడా కొట్టేసింది.
న్యాయప్రక్రియను మరింత సులభం చేసేందుకు పనిచేస్తున్నామని ఎఫ్ఐఏ స్పష్టం చేసింది. కొన్నేళ్లలో డజన్ల సంఖ్యలో ఏజెన్సీలో నియామకాలు జరిగాయని, కొత్త సాంకేతికత ఆధారంగా వారికి శిక్షణ ఇస్తున్నట్లు ఎఫ్ఐఏ పేర్కొంది.
''మా వైపు నుంచి ఇంత కృషి చేస్తున్నప్పటికీ, దోషులను న్యాయస్థానం ముందు నిలబెట్టడం చాలా సవాలుతో కూడుకున్న పని'' అని సైబర్ క్రైమ్ వింగ్ ఆపరేషన్స్ డైరెక్టర్ బాబర్ బక్త్ ఖురేషి అన్నారు.
''నేరాన్ని రుజువు చేసేందుకు విచారణకు తగినంత సమయం పడుతుంది. దేశ రాజ్యాంగం ప్రకారం ప్రతీఒక్కరికీ న్యాయమైన విచారణ పొందే హక్కు ఉంటుంది. కానీ దీనికి కొన్నేళ్ల సమయం పడుతుంది. 2016లో 'ప్రివెన్షన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ క్రైమ్స్ యాక్ట్' అమల్లోకి వచ్చింది. 2019 నుంచి ఇప్పటివరకు 27 కేసుల్లో దోషులకు శిక్ష పడింది'' అని ఆయన చెప్పారు.

బాబర్ బక్త్ ప్రకారం, సైబర్ క్రైమ్ వింగ్‌లో ఎక్కువ మంది మహిళా సిబ్బందిని నియమిస్తున్నారు. అందరికీ ప్రత్యేక శిక్షణను అందిస్తున్నారు.
''మా దగ్గరికి సహాయం కోసం వచ్చే మహిళలకు సులభమైన న్యాయప్రక్రియను అందించేందుకు కృషి చేస్తున్నాం. వారి కోసం వారు పట్టుదలగా నిలబడేలా మేం ప్రోత్సహిస్తాం. మా శక్తిమేర ప్రయత్నించినా కొన్ని సందర్భాల్లో కొంతమంది మహిళలు వెనకడుగు వేస్తారు. అలాంటి కేసుల్లో నిందితులను శిక్షించడం అసాధ్యంగా మారుతుంది'' అని ఆయన వివరించారు.

ఇవి కూడా చదవండి:
- 'హిజాబ్‌కు రియాక్షనే కాషాయ కండువా'-ఉడుపి నుంచి గ్రౌండ్ రిపోర్ట్
- ‘యుక్రెయిన్‌లో ఉండొద్దు, ఇండియా వెళ్లిపోండి’ - భారత పౌరులకు రాయబార కార్యాలయం సూచన
- న్యూడ్ వీడియో కాల్స్‌తో చిక్కుల్లో ఎలా పడేస్తారంటే..
- ‘పరిహారం ఇవ్వలేదు, పునరావాస కాలనీలు కట్టలేదు. కానీ ఊళ్లు ఖాళీ చేయాలని బెదిరిస్తున్నారు’
- యుక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం తప్పించడానికి 5 మార్గాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













