డిజిటల్ ప్రచారంలో కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలన్నీ బీజేపీ వెనుకే ఉన్నాయి ఎందుకు?

ఫొటో సోర్స్, MYOGIADITYANATH
- రచయిత, నయనిక చక్రవర్తి
- హోదా, బీబీసీ మానిటరింగ్
ఈ ఫిబ్రవరిలో ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కరోనా థర్డ్ వేవ్ భయాల మధ్య, ఈసారి ఎన్నికల ప్రచారాల్లో సోషల్ మీడియా వాడకం బాగా పెరిగింది.
ఫిబ్రవరి 10 నుంచి ఓటింగ్ ప్రారంభమైంది.
దేశంలోని అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో ఏడు దశల్లో పోలింగ్ జరగనుంది. మార్చి 7న చివరి దశ ఓటింగ్ జరుగుతుంది.
కరోనా వ్యాప్తి భయాల దృష్ట్యా ఎన్నికల ప్రచారంలో పలు నిబంధనలు, నిషేధాలు విధించింది ఎన్నికల సంఘం.
ఈ నేపథ్యంలో, వివిధ రాజకీయ పార్టీలు తమ ప్రచారాలకు ఇంటర్నెట్, సోషల్ మీడియా వేదికలను ఆశ్రయించాయి. ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో విపరీతంగా ప్రచారాలు నిర్వహించాయి.

ఫొటో సోర్స్, GETTY IMAGES
సాధారణ ప్రచార నియమాలు డిజిటల్ ప్రచారాలకూ వర్తిస్తాయి
సామాజిక మాధ్యమాల ద్వారా ఓటర్లను ఆకట్టుకునేందుకు వివిధ పార్టీలు అనేక రకల పద్ధతులను అనుసరిస్తున్నాయి.
పార్టీ సిద్ధాంతాలను తెలియజేసేలా పాటలు కట్టి ఫేస్ బుక్, యూట్యూబ్‌లలో పోస్ట్ చేస్తున్నారు.
కొన్ని పార్టీలు ప్రతి సీటుకూ ఒక వాట్సాప్ గ్రూపు క్రియేట్ చేశాయి. ప్రచార సంబంధిత సమాచారాన్ని ఈ గ్రూపులలో విస్తృతంగా షేర్ చేస్తున్నాయి.
అయితే, ఇంటర్నెట్‌పై జరుగుతున్న వర్చువల్ ప్రచారాలకూ, ఖర్చులకూ సాధారణ (భౌతిక) ప్రచార నియమాలే వర్తిస్తాయని ఎన్నికల సంఘం స్పష్టం చేసినట్లు ది హిందూ వార్తాపత్రికలో ఓ కథనాన్ని ప్రచురించారు.
ఇందుకోసం అభ్యర్థులు ప్రత్యేకంగా ఒక బ్యాంకు ఖాతాను తెరవాలని, ప్రచార ఖర్చుల జాబితాను ఎన్నికల సంఘానికి సమర్పించాలని కమిషన్‌కు చెందిన ఒక ఉన్నతాధికారి తెలిపారని రాశారు.
అలాగే, ప్రజలను రెచ్చగొట్టే ప్రసంగాలు, ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయడం మొదలైనవాటిపై ప్రవర్తనా నియమావళి సోషల్ మీడియాకూ వర్తిస్తుందని స్పష్టం చేశారు.
ఏ పార్టీకి ఎంతమంది ఫాలోవర్లు?
ఇటీవల కాలంలో కమ్యూనికేషన్‌కు సోషల్ మీడియా ఒక ప్రముఖ సాధనంగా మారింది. రాజకీయంగా ఏకం కావడానికీ ఈ వేదికలు సహకరిస్తున్నాయి.
గత దశాబ్దంలో రాజకీయ పార్టీలు సోషల్ మీడియా వ్యవహారాల్లో మరింత క్రియాశీలకంగా మారాయని గణాంకాలు చెబుతున్నాయి.
భారతీయ జనతా పార్టీ 2013-14లో సోషల్ మీడియాను ఒక ప్రధాన సాధనంగా ఉపయోగించడం ప్రారంభించింది. అప్పటి నుంచి సామాజిక మాధ్యమాలలో ఆ పార్టీ బలం పుంజుకుంటూ వచ్చింది.
ప్రస్తుతం బీజేపీకి ఇన్‌స్టాగ్రామ్‌లో 42 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. యూట్యూబ్‌లో 40.1 లక్షలు, ఫేస్‌బుక్‌లో 1.67 కోట్లు, ట్విట్టర్‌లో 1.73 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.
ఎన్నికలు జరుగుతున్న అయిదు రాష్ట్రాల్లో సోషల్ మీడియా ప్రచారాన్ని నిర్వహించే బాధ్యతను కేంద్ర సమాచార సాంకేతిక శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌కు బీజేపీ అప్పగించినట్లు హిందీ న్యూస్ ఛానెల్ రిపబ్లిక్ భారత్ ఒక నివేదికలో పేర్కొంది.
సామాజిక మాధ్యమాలలో తమ పార్టీ బలం పుంజుకోవడానికి ప్రధాన కారణం "భారీ సంఖ్యలో" ఉన్న ఐటీ వలంటీర్లేనన్నది బీజేపీ విశ్వాసమంటూ ఎన్‌డీటీవీ వెబ్‌సైట్ ఒక కథనాన్ని ప్రచురించింది.
బీజేపీకి సుమారు 14 లక్షల మంది యాక్టివ్ రిజిస్టర్డ్ వలంటీర్లు ఉన్నారని ఒక సీనియర్ బీజేపీ నాయకుడు తెలిపినట్లు ఈ కథనంలో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, SOPA IMAGES
మరోవైపు, బీజేపీకి ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ సోషల్ మీడియాలో చాలా వెనుకబడి ఉంది.
కాంగ్రెస్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 10 లక్షలు, ట్విట్టర్‌లో 84 లక్షలు, యూట్యూబ్‌లో 17.7 లక్షలు, ఫేస్‌బుక్‌లో 62 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.
కాగా, "పార్టీ డిజిటల్ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఒక సమగ్ర ప్రణాళికను రూపొందించాం. వర్చువల్ ర్యాలీని నిర్వహించడానికి బ్లూప్రింట్ సిద్ధం చేశాం. మా దగ్గర ఫోన్ నంబర్లతో కూడిన ఒక డేటాబేస్ ఉంది. కిందిస్థాయి కార్యకర్తలను గుర్తించి లిస్ట్ తయారుచేశాం" అని కాంగ్రెస్ సోషల్ మీడియా చీఫ్ రోహన్ గుప్తా ఇండియా టుడేకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
ఈసారి పంజాబ్, గోవా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏపీ-ఆప్), "ఏక్ మౌకా కేజ్రీవాల్ కో" పేరుతో జనవరి 25న సోషల్ మీడియాలో తన ప్రచారాన్ని ప్రారంభించింది.
దిల్లీ ప్రభుత్వం చేసిన "మంచి పనులను" ఆ రాష్ట్ర ప్రజలు సోషల్ మీడియాలో ప్రచారం చేయాలని ఆప్ కోరినట్లు హిందీ న్యూస్ ఛానెల్ ఆజ్ తక్ తెలిపింది.
"మా ప్రభుత్వం నుంచి మీరు ఎలాంటి ప్రయోజనాలు పొందారో ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌ల ద్వారా ప్రజలకు తెలియజేయండి. అలాగే, కేజ్రీవాల్‌కు ఒక అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేయండి" అని దిల్లీ సీఎం కేజ్రీవాల్ కోరినట్లు పై నివేదిక పేర్కొంది.
ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీకి ట్విట్టర్‌లో 58 లక్షలు, యూట్యూబ్‌లో 23 లక్షలు, ఇన్‌స్టాగ్రామ్‌లో 6.30 లక్షలు, ఫేస్‌బుక్‌లో 52 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.
కంటెంట్‌ను వైరల్ చేయడం ఒక ముఖ్య ప్రణాళిక
సోషల్ మీడియాలో కంటెంట్‌ను వైరల్ చేయడం ద్వారా ఓటర్లను, ముఖ్యంగా యువతను ఆకర్షించేందుకు అన్ని పార్టీలూ ప్రయత్నిస్తున్నాయి.
ఉత్తర్ ప్రదేశ్‌లో బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని ప్రధాని నరేంద్ర మోదీ డిసెంబర్ 31న వర్చువల్ ర్యాలీ ద్వారానే ప్రారంభించారు.
పార్టీ, ఈ వర్చువల్ ర్యాలీ లింకును స్థానిక ప్రజలకు షేర్ చేసింది. అలాగే, వివిధ ప్రాంతాల్లో స్టూడియోలు కూడా ఏర్పాటు చేసింది. ప్రధాన మంత్రి ప్రసంగాన్ని ఈ స్టూడియోలలో టెలికాస్ట్ చేశారు.
మరోవైపు, కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా ఫేస్‌బుక్‌లో 30 నిమిషాల లైవ్ చాట్ ద్వారా ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల ప్రచారాన్ని వర్చువల్‌గా ప్రారంభించారని ఏబీపీ న్యూస్ ఛానెల్ వెల్లడించింది.
ఇదిలా ఉండగా, ప్రజలు కూడా తమ డిమాండ్లను తెలుపడానికి సోషల్ మీడియాను విస్తృతంగా వాడుకుంటున్నారు.
రైతు సంఘాలు, విద్యార్థి సంఘాల వంటివి పలు హ్యాష్‌ట్యాగ్‌లు, మీమ్స్, స్పూఫ్‌ల ద్వారా తమ డిమాండ్లను వ్యక్తపరుస్తున్నాయని ది వైర్ వెబ్‌సైట్ తెలిపింది.
తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం జరుగుతోందని రైతు సంఘాలు, యువతకు ఉపాధి కల్పించడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని విద్యార్థి సంఘాలు సోషల్ మీడియాలో ప్రచారం లేవనెత్తాయి.
పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీకి, కాంగ్రెస్‌కు మధ్య సోషల్ మీడియాలో పోటీ జోరందుకుంది. ఈ సందర్భంగా, హిందీ పాటలపై తయారుచేసిన ఒక వీడియో ఫేస్‌బుక్, ట్విట్టర్‌లలో వైరల్ అయింది. ఇందులో ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ, ప్రస్తుత సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ కనిపిస్తారు. ఈ వీడియోకు ఫేస్‌బుక్‌లో దాదాపు 10 లక్షల వ్యూస్ వచ్చాయి.

ఫొటో సోర్స్, AFP
‘బీజేపీకి ఆర్థిక బలం ఉంది’
డిజిటల్ మీడియా ప్రచారంలో డబ్బు ప్రధాన పాత్ర పోషిస్తుందని ఉత్తర్ ప్రదేశ్‌లోని నోయిడాలో ఉన్న ఒక డిజిటల్ మీడియా కంపెనీకి చెందిన ఉన్నత అధికారి ఇండియా టుడే వెబ్‌సైట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు.
"ఇంటర్నెట్ వలన అందరికీ సమాన అవకాశాలు లభిస్తున్నాయి. కానీ, ఇందులో డబ్బు ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటాయో వారి ప్రచారం మెరుగ్గా సాగుతుంది" అని ఆయన అన్నారు.
ఈ విషయంలో బీజేపీ చాలా బలంగా ఉంది. అందుకే డిజిటల్ మాధ్యమంలో ఇతర పార్టీల కన్నా వేగంగా ఆ పార్టీ ముందుకు దూసుకుపోతోంది.
రూ.2,700 కోట్లకు పైగా ఆస్తులతో బీజేపీ అత్యంత ధనిక రాజకీయ పార్టీ అని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) సంస్థ గత ఏడాది మార్చిలో పేర్కొంది. రూ.929 కోట్లతో కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిచింది.
2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో డిజిటల్ ప్రచారాలలో బీజేపీ అందరినీ వెనక్కి నెట్టేసిందని హిందూస్థాన్ టైమ్స్ నివేదిక పేర్కొంది.
2019లో ఫిబ్రవరి, ఏప్రిల్ మధ్య కాలంలో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, గూగుల్ యూట్యూబ్‌లలో బీజేపీ రూ.25 కోట్ల విలువ గల ప్రకటనలను ఇచ్చిందని గూగుల్, ఫేస్‌బుక్ డేటా చెబుతోంది.
అదే కాంగ్రెస్, ఈ రెండు ప్లాట్‌ఫాంలలో రూ.1.42 కోట్ల విలువ గల ప్రకటనలను ప్రసారం చేసింది.
ఇవి కూడా చదవండి:
- ‘నేను భారతీయురాలినని నిరూపించుకోవడానికి ఐదేళ్లు కష్టపడ్డాను’
- సినిమా టిక్కెట్ల ధరల సమస్య ముగిసినట్లే, నెలాఖరుకు జీవో రావొచ్చు: చిరంజీవి
- ‘నాకు చాలా భయమేసింది.. నేను భయపడినప్పుడల్లా అల్లా పేరు తలుచుకుంటాను’
- ‘పొరుగు దేశాన్ని ఆక్రమించినందుకు రూ. 24 వేల కోట్లు పరిహారం చెల్లించండి’
- బాడీ షేమింగ్, ట్రోలింగ్‌పై కాజల్ అగర్వాల్ రియాక్షన్.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















