ప్రశాంత్‌ కిశోర్‌: రాజకీయ వ్యూహకర్తా? నాయకుడా

ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని ప్రచారం జరుగుతోంది
ఫొటో క్యాప్షన్, ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది
    • రచయిత, వినీత్ ఖరే
    • హోదా, బీబీసీ కరస్పాండెంట్

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్న చర్చలు, ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ, ఆయన అసలు వ్యూహం ఏమిటనేది మాత్రం ఎవరికీ అర్థం కావడం లేదు.

2014 జనరల్ ఎలక్షన్స్‌లో బీజేపీకి సలహాదారుగా వ్యవహరించిన ప్రశాంత్ కిశోర్ ఇప్పుడు రాహుల్ గాంధీ, ప్రియాంక, ఇంకా ఇతర ప్రతిపక్ష నాయకులతో చర్చలు జరుపుతున్నారు.

మిగిలిన ఎన్నికల వ్యూహకర్తలకు, ప్రశాంత్ కిశోర్‌కు ఉన్న తేడా ఏంటంటే, ఆయన పెయిడ్ ప్రొఫెషనల్. అంటే డబ్బులు తీసుకుని వ్యూహాలు అందిస్తారు.

ఆయనకో పెద్ద రీసెర్చ్ టీమ్ ఉంది. పైగా, ఆయన ఎప్పుడూ ఒకే పార్టీకి పని చేయరు.

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీని ఎదుర్కొనేందుకు తృణమూల్ కాంగ్రెస్‌ పార్టీకి ఆయన సలహాలు ఇచ్చారు. అక్కడ మమతా బెనర్జీ ఘన విజయం సాధించడంతో ఆయన పేరు మరోసారి మారుమోగింది.

ఆయన సలహాల వల్లే మమతా బెనర్జీకి అంతటి విజయం సాధ్యమైందని కొందరు భావిస్తున్నారు.

ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్‌లో చేరుతారన్న ఊహాగానాలు పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత నుంచి ప్రారంభమయ్యాయి.

దీనికి తోడు శరద్ పవార్‌లాంటి నేతలతో ఆయన మంతనాలు జరుపుతుండటంతో ప్రతిపక్షాలను ఏకం చేసే ప్రయత్నం చేస్తున్నారన్న ఊహాగానాలు కూడా వినిపించాయి.

బిహార్‌ లోని భోజ్‌పురి మాట్లాడే ప్రాంతంలో పుట్టిన 44 ఏళ్ల ప్రశాంత్ కిశోర్ ఇప్పటి వరకు నరేంద్ర మోదీ, నితీశ్‌ కుమార్‌, మమతా బెనర్జీ, కెప్టెన్ అమరీందర్ సింగ్, వై.ఎస్.జగన్‌, ఎం.కె.స్టాలిన్‌లాంటి నేతలకు ప్రొఫెషనల్‌ పొలిటికల్ మేనేజర్‌గా సలహాలు, సూచనలు అందించారు.

ఈ ఏడాది మే 2న ఓ టీవీ ఇంటర్వ్యూలో ఇకపై ప్రొఫెషనల్ పొలిటికల్ కన్సల్టెంట్ పాత్రను పోషించడం లేదని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు ప్రశాంత్‌ కిశోర్‌. తాను రాజకీయాల్లోకి ప్రవేశించాలని అనుకుంటున్నట్లు ప్రకటించారు.

ఆయన రాజకీయాల్లో ఉన్నారా అన్న సందేహం ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటుంది. ఎవరైనా ఒక వ్యక్తి ఓ రాజకీయ పార్టీకి ఉపాధ్యక్షుడిగా పని చేస్తున్నాడనుకుందాం. అలాంటి వ్యక్తి మీద ఆయన రాజకీయాల్లో ఉన్నారా లేరా అన్న సందేహాలు ఎప్పటికీ రావు.

కానీ, ప్రశాంత్‌ కిశోర్‌ రాజకీయ వ్యూహకర్తా లేక నాయకుడా అన్న విషయం మాత్రం ఎప్పుడూ సందేహంగానే ఉంటుంది.

తాజాగా ఆయన కాంగ్రెస్‌లో చేరుతున్నారంటూ ఊహాగానాలు సాగుతున్నాయి. మరి ప్రజల నాడిని పట్టుకోగలరని అందరూ భావించే వ్యక్తిని పార్టీలో చేర్చుకోవడానికి రాజకీయ నాయకులు ఎందుకు వెనకాడుతున్నారు?

గతంలో ప్రశాంత్‌ కిశోర్‌ కాంగ్రెస్-సమాజ్‌వాది కూటమికి వ్యూహకర్తగా వ్యవహరించారు. అయితే, ఉత్తర్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ కూటమి ఘోర వైఫల్యాన్ని ఎదుర్కొంది.

అయితే, ఆయనకు విజయవంతమైన వ్యూహకర్త అన్న పేరు మాత్రం ఉంది. పశ్చిమ బెంగాల్ ఎన్నికలలో బీజేపీ నుంచి గట్టి సవాల్ ఎదురైనప్పటికీ మమతా బెనర్జీ సాధించిన ఘన విజయం ప్రశాంత్‌ కిశోర్‌ ప్రాధాన్యాన్ని పెంచింది.

ఆ తర్వాత కొద్ది రోజులకే ఆయన ఎన్సీపీ నేత శరద్ పవర్‌తోపాటు, మరికొందరు కాంగ్రెస్ నేతలతో సమావేశం కావడంతో 2024 ఎన్నికల్లో మోదీకి పోటీగా ప్రతిపక్షాలను ఏకం చేసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని ఊహాగానాలు వినిపించాయి.

భారత రాజకీయాల్లో ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడం చాలా కష్టమైనపని అయినప్పటికీ, ప్రశాంత్‌ కిశోర్‌ బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను కూడగట్టే పనిలో ఉన్నారని ముంబయికి చెందిన రచయిత, జర్నలిస్ట్ ధవల్ కుల్‌కర్ణి అభిప్రాయపడ్డారు.

''మమతా బెనర్జీని ప్రధానమంత్రిని చేయాలనుకుంటే, ఇతర సీనియర్ నాయకులు అందుకు అంగీకరిస్తారా? శరద్ పవార్ ఒప్పుకుంటారా? 2019లో ప్రతి ఎన్డీయేతర పార్టీకీ బీజేపీని అధికారం నుంచి తప్పించాలన్న అభిప్రాయం ఉంది. కానీ ఎవరూ కలిసి రాలేదు. స్టాలిన్ ఒక్కరే రాహుల్ గాంధీ ప్రధాన మంత్రిగా ఉంటారని చెప్పారు'' అని చెన్నైకి చెందిన సీనియర్ జర్నలిస్ట్ డి.సురేశ్‌ కుమార్ అన్నారు.

మూడు, లేదా నాలుగవ ఫ్రంట్ బీజేపీతో పోటీ పడగలదని తాను భావించడం లేదని ఎన్టీటీవీ చర్చలో ప్రశాంత్‌ కిశోర్‌ వ్యాఖ్యానించారు.

ప్రతిపక్షాలను ఏకతాటి పైకి తెచ్చే ఆలోచనలో భాగంగా శరద్ పవార్‌ను తదుపరి రాష్ట్రపతి చేయడానికి ఏకాభిప్రాయం కూడగట్టేందుకు ప్రశాంత్‌ కిశోర్‌ నేతలను కలుస్తున్నారని కూడా ఊహాగానాలు వెలువడ్డాయి.

''ప్రధాని కావాలన్న కల నెరవేర లేదు కాబట్టి, వచ్చే ఏడాది జరగబోయే అధ్యక్ష ఎన్నికలపై ఆయన దృష్టిపెట్టి ఉండవచ్చు. అయితే, ఇవన్నీ ఊహాగానాలే. శరద్‌ పవార్ దీనిపై నోరు విప్పలేదు'' అని ధవల్‌ కుల్‌కర్ణి అన్నారు.

2024 ఎన్నికల్లో కింగ్ మేకర్‌గా మారాలని ప్రశాంత్ కిశోర్ భావిస్తున్నారా?

ఫొటో సోర్స్, TWITTER @PRASHANTKISHOR

ఫొటో క్యాప్షన్, 2024 ఎన్నికల్లో కింగ్ మేకర్‌గా మారాలని ప్రశాంత్ కిశోర్ భావిస్తున్నారా?

ప్రశాంత్‌ కిశోర్‌ అవసరం ఎంత?

తెర వెనక ఎన్నికల నిర్వాహకులు చేసే పని విమర్శలకు అతీతం కాదు.

ఒక నాయకుడు ఎన్నికల ప్రచారంలో ముందుకు వెళ్లేందుకు ఎలక్షనీరింగ్ మేనేజర్‌ గ్రౌండ్ ప్రిపేర్ చేస్తారు. అక్కడున్న సమస్యలు, ఎన్నికల సమీకరణాలు, ప్రజల మూడ్‌ను గుర్తించడంలో ఎన్నికల నిర్వాహకులు ముందుంటారు.

అయితే, ప్రశాంత్ కిశోర్‌లాంటి ఎన్నికల మేనేజర్‌ ల ప్రాబల్యం పెరుగుతుండటం భారత రాజకీయాల పతనానికి నిదర్శనమని పంజాబ్‌కు చెందిన రాజకీయ విశ్లేషకుడు డాక్టర్ జగ్‌రూప్ సైఖోన్ అభిప్రాయపడ్డారు.

''ఇది రాజకీయ వ్యవస్థ దివాలా తనానికి నిదర్శనం. రాజకీయ పార్టీలలో మేనేజర్లుగా వ్యవహరించే వారికి అధికారాలు పెరుగుతున్నాయి'' అని జగ్‌రూప్ అన్నారు.

ఈ ఎలక్షన్ మేనేజర్లను నమ్ముకుని రాజకీయ నాయకులు చాలామంది కింది స్థాయిలో వాస్తవాలను చూడటం లేదని, చాలా చోట్ల ప్రజలు నేతలను గ్రామాలలోకి రానివ్వడం లేదని ఆయన అన్నారు.

కింది స్థాయిలో అవినీతి కారణంగా కొన్నేళ్ల నుంచి ప్రజలు పార్టీకి ఎలా దూరమవుతున్నారో టీఎంసీ నేతలు పశ్చిమ బెంగాల్ ఎన్నికల సందర్భంగా బీబీసీ ప్రతినిధికి వివరించారు.

మమతా బెనర్జీకి సన్నిహితులైన నేతలు ఆమెకు ఈ విషయం చెప్పలేదు. కానీ, ప్రశాంత్‌ కిశోర్‌ నేతలకు అన్ని విషయాలు వివరించారు.

ప్రశాంత్‌ కిశోర్‌ టీమ్ సభ్యులు క్షేత్ర స్థాయిలో ఉన్న పరిస్థితులను గ్రహిస్తారు. ప్రతి చిన్న విషయాన్ని ప్రశాంత్‌ కిశోర్‌ తెలుసుకోగలుగుతారు. ప్రచారంలో నాయకులు ఎక్కడ ఏం మాట్లాడాలో ఆయన బృందమే నిర్ణయిస్తుంది.

పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ప్రశాంత్‌ కిశోర్‌ ఐడియా ప్రకారమే 'బంగ్లా నిజెర్‌ మియ్‌కే చాయ్'(బంగ్లా తన బిడ్డను కోరుకుంటోంది) అనే పోస్టర్లు లక్షలాదిగా ప్రచారంలో వాడారు.

దీంతోపాటు 'దీదీ కో బోలో' హెల్ప్‌లైన్ ప్రోగ్రాం ప్రారంభించారు. కొళాయిలో నీళ్లు రాకపోవడం దగ్గర్నుంచి, వీధుల్లో చెత్త వరకు ఏ సమస్యనైనా ఫోన్ కాల్ ద్వారా ఫిర్యాదు చేసేందుకు అవకాశం కల్పించారు. వీటిపై స్థానిక అధికారులు చర్యలు తీసుకుంటారు.

ఇలాంటి కార్యక్రమాలు మమతా బెనర్జీకి ఓట్లు పడటానికి సహాయపడ్డాయని పేర్కొన్న అమితాబ్ భట్టసాలి, ఇలాంటి వాటికి ప్రశాంత్‌ కిశోర్‌ నుంచి సలహాలు తీసుకోవాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు.

కాంగ్రెస్ పార్టీ డ్రాయింగ్ రూమ్‌ పార్టీగా మారిందని ప్రణబ్ ముఖర్జీ తనకు ఒకసారి చెప్పారని జర్నలిస్ట్ జయంత్ ఘోషల్ అన్నారు. ''సామాన్యులు పార్టీకి దూరమయ్యారు. సమస్య ఎక్కడుందో ప్రశాంత్‌ కిశోర్‌ అధ్యయనం చేస్తారు. అందువల్ల కోరుకున్న వారందరికీ టిక్కెట్ దక్కదు'' అన్నారు జయంత్ ఘోషల్.

అయితే, సోషల్ మీడియాలో కూడా కనిపించని జయలలిత లాంటి నేతలు ఎంతటి ఆత్మవిశ్వాసంలో ఉంటారో జర్నలిస్ట్ సురేశ్‌ కుమార్ వివరించారు.

''ప్రజలను ఆమె ఆకట్టుకున్నారు. చాలా కొద్దిమంది సాయంతోనే ఆమె పాలించారు. తాము గెలవలేమని భావించినప్పుడే నేతలు ఎన్నికల వ్యూహకర్తలను ఆశ్రయిస్తారు. నరేంద్ర మోదీ కూడా సలహాదారుల కారణంగానే ప్రజాదరణ గల నాయకుడిగా ఎదిగారని అంటారు. కానీ అది నిజం కాదు'' అన్నారు సురేశ్ కుమార్.

''మోదీ చక్కగా ఆకట్టుకునేలా ప్రసంగించగలరు. మంచి వక్తగా ప్రజలు ఆయన్ను ఇష్టపడతారు'' అన్నారాయన.

పశ్చిమబెంగాల్‌ ఎన్నికల్లో ప్రశాంత్ కిశోర్ సలహాల కారణంగానే మమతా బెనర్జీ గెలిచారని అంటున్నారు

ఫొటో సోర్స్, SANJAY DAS

ఫొటో క్యాప్షన్, పశ్చిమబెంగాల్‌ ఎన్నికల్లో ప్రశాంత్ కిశోర్ సలహాల కారణంగానే మమతా బెనర్జీ గెలిచారని అంటున్నారు

ప్రశాంత్‌ రాజకీయ ఆకాంక్షలు

ప్రశాంత్‌ కిశోర్‌కు రాజకీయ ఆకాంక్షలు ఉన్నాయని, అవి రాజ్యసభ సభ్యుడు కావడంతోనే ఆగిపోవని సీనియర్ జర్నలిస్ట్ జయంత్ ఘోషల్ అభిప్రాయపడ్డారు.

''2024 ఎన్నికలలో సంకీర్ణ ప్రభుత్వానికి కింగ్ మేకర్ కావాలని ప్రశాంత్‌ కిశోర్‌ కోరుకుంటున్నారు'' అన్నారు జయంత్ ఘోషల్

''అయితే ఇదంతా ఉత్తర్‌ ప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలపై ఆధారపడి ఉంది. ఆ తర్వాతనే ఆయన ఉద్దేశాలు తెలుస్తాయి'' అన్నారాయన.

భారత దేశంలో కోవిడ్ మరణాల సంఖ్య నాలుగు లక్షలు దాటిన సమయంలో ప్రశాంత్‌ కిశోర్‌ రాజకీయ సమావేశాలు జరుగుతున్నాయి.

కోవిడ్‌ను నియత్రించే విషయంలో మోదీ మద్దతుదారులు కూడా సంతోషంగా లేరు.ఆర్థిక వ్యవస్థ గందరగోళంలో ఉంది, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం పెరుగుతున్నాయి.

''ప్రశాంత్ కిశోర్ ఏ పార్టీలోనైనా చేరవచ్చు. ఆయనకు ఆ ఆప్షన్ ఉంది. కోరుకుంటే రాజ్యసభ ఎంపీ కూడా కావచ్చు. కానీ, అలా కావాలని కోరుకోవడం లేదు. ప్రస్తుతం తృణమూల్ రాజ్యసభ స్థానాలు రెండు ఖాళీగా ఉన్నాయి. ఆయనతో సంబంధాలు ఏమీ చెడిపోలేదు కాబట్టి బీజేపీ కూడా ఆయన్ను లాగడానికి ప్రయత్నిస్తోంది'' అని ఘోషల్ అన్నారు.

అయితే, ఆయన భావజాలమేంటో చెప్పాలని జర్నలిస్ట్ సురేశ్ కుమార్ అన్నారు.

''ఆయన కాసేపు మితవాద పార్టీతో, కాసేపు అతివాద పార్టీతో ఉంటారు. కొన్నాళ్లు తమిళపార్టీలు, మరికొన్నాళ్లు తెలుగు పార్టీలతో కలిసి పని చేస్తారు. నాయకుడిగా ఎదగాలంటే ఆయన క్షేత్రస్థాయిలో చాలా కష్టపడాల్సి ఉంటుంది'' అన్నరాయన.

ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమిని గెలిపిచలేకపోయారని ప్రశాంత్ కిశోర్‌ పై విమర్శలు కూడా ఉన్నాయి.

ఫొటో సోర్స్, TWITTER

ఫొటో క్యాప్షన్, ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమిని గెలిపిచలేకపోయారని ప్రశాంత్ కిశోర్‌ పై విమర్శలు కూడా ఉన్నాయి.

మాయాజాలం నిజమేనా?

ప్రశాంత్‌ కిశోర్‌ అంత గొప్ప ఇంద్రజాలికుడైతే మరి ఆయన మాయాజాలం ఉత్తర్‌ ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ కూటమికి ఎందుకు విజయాన్ని అందించలేకపోయిందన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.

అయితే, ప్రశాంత్‌ కిశోర్‌ సూచనలను కాంగ్రెస్ పాటించలేదని, అందుకే ఈ పరిస్థితి వచ్చిందని కొందరు చెబుతున్నారు.

ఇదే కాకుండా, 2014లో ప్రశాంత్‌ కిశోర్‌ అందించిన సహాయం వల్లే నరేంద్ర మోదీ విజయం సాధించారనడం కూడా అతిశయోక్తి అని చాలామంది విశ్లేషకులు భావిస్తున్నారు.

జగన్, స్టాలిన్‌ల విజయంలో కూడా అప్పటి ప్రభుత్వాల వైఫల్యాలే ప్రధాన కారణమని, ప్రశాంత్ కిశోర్ పాత్ర ఏమీ లేదని విశ్లేషకులు అంటున్నారు.

ఫొటో సోర్స్, TWITTER @MKSTALIN, YS JAGAN/FB

ఫొటో క్యాప్షన్, జగన్, స్టాలిన్‌ల విజయంలో కూడా అప్పటి ప్రభుత్వాల వైఫల్యాలే ప్రధాన కారణమని విశ్లేషకులు అంటున్నారు.

అప్పట్లో కాంగ్రెస్ పార్టీ అవినీతి, అక్రమాలపై ప్రజలు విసిగిపోయి ఉన్నారని, అందుకే నరేంద్ర మోదీకి పట్టంగట్టారని, ఇక్కడ ప్రశాంత్‌ కిశోర్‌ అవసరం లేనే లేదని కొందరు వాదిస్తున్నారు.

తమిళనాడులో అన్నాడీఎంకే నేతల పట్ల, ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు పాలన పట్ల ప్రజలు అసంతృప్తితో ఉన్నందువల్లే స్టాలిన్, జగన్‌మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారని జర్నలిస్ట్ సురేశ్ కుమార్ అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)