LIC IPO: 'బంగారు గుడ్డు పెట్టే బాతును ప్రభుత్వం అమ్మేస్తోంది'- ఉద్యోగ సంఘాలు

ఎల్ఐసీ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, సల్మాన్ రావీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

భారతీయ జీవిత బీమా సంస్థ (లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా- ఎల్ఐసీ), ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద బీమా కంపెనీ. కానీ ఎల్ఐసీ ప్రత్యేకత ఏంటంటే, ఇది పూర్తిగా ప్రభుత్వ సంస్థ.

1956లో ఎల్ఐసీని జాతీయం చేశారు. దశాబ్దాల కాలం పాటు ఇది భారతీయ ఏకైక బీమా సంస్థగా వెలుగొందింది.

2000 సంవత్సరంలో మరోసారి బీమా రంగంలోకి ప్రైవేటు కంపెనీలను ఆహ్వానించారు. అయినప్పటికీ భారత్‌లో అతిపెద్ద బీమా కంపెనీగా ఎల్‌ఐసీ నిలిచింది.

బీమా రంగంలో ఎల్‌ఐసీ 75 శాతం వాటాను కలిగి ఉంది.

ప్రభుత్వ ముసాయిదా, డీఆర్‌హెచ్‌పీ ప్రకారం ఎల్‌ఐసీ ఎంబెడెడ్ వాల్యూ 71.56 బిలియన్ డాలర్లు.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

ప్రభుత్వ ఉద్దేశం

భారత ప్రభుత్వానికి చెందిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అస్సెట్ మేనేజ్‌మెంట్ (డీఐపీఎఎం) సంస్థ సెబీకి సమర్పించిన ముసాయిదా ప్రకారం, ఎల్‌ఐసీలోని కేవలం 5 శాతం షేర్లను మాత్రమే ప్రభుత్వం విక్రయించనుంది. అంటే 31.6 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించనున్నారు.

ఈ షేర్ల ద్వారా రూ. 63 వేల కోట్ల రూపాయలను సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ఇందులో 10 శాతం షేర్లను బీమా చేసిన వారి కోసం రిజర్వ్ చేయనున్నట్లు ముసాయిదాలో పేర్కొన్నారు.

అంతేకాకుండా, పెట్టుబడిదారుల కోసం కూడా ఈ షేర్లలో కొంత వాటాను కేటాయించారు. ఎల్ఐసీ ఉద్యోగుల కోసం కూడా ఒక నిబంధనను తీసుకొచ్చారు.

పది శాతం షేర్లను 29 కోట్ల మంది పాలసీ హోల్డర్ల కోసం రిజర్వ్ చేయడం... ఐపీఓ విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషిస్తుందని ప్రభుత్వం నమ్ముతోంది.

రిటెయిల్ ఇన్వెస్టర్ల కోసం 35 శాతం షేర్లను రిజర్వ్ చేయాలనే నిబంధన కూడా ఉంది. ఒక షేరు ధరను రూ. 4.7గా నిర్ధరించారు.

భారత ప్రభుత్వానికి ఎల్‌ఐసీలో 100 శాతం వాటా ఉంది. అంటే 100 శాతం షేర్లు భారత ప్రభుత్వానివే.

ఐపీఓ జారీ అయిన తర్వాత ఎల్ఐసీలో ప్రభుత్వ వాటా 95 శాతానికి తగ్గిపోతుంది.

ఐపీఓ జారీ చేయడం వల్ల ఎల్ఐసీ మరింత పారదర్శకంగా పనిచేస్తుందని పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ఎల్ఐసీ, భారత ప్రభుత్వానికి మాత్రమే జవాబుదారీగా ఉంది. ఐపీఓ జారీ తర్వాత పెట్టుబడిదారులకు కూడా ఎల్‌ఐసీ జవాబుదారీగా వ్యవహరించాల్సి ఉంటుంది.

ఐపీఓ ద్వారా వచ్చే ఆదాయం నేరుగా ప్రభుత్వ ఖాతాకే చేరుతుంది. ఆ ఆదాయంలో ఎల్‌ఐసీకి వచ్చేదేమీ ఉండదు.

డీఐపీఏఎం కార్యదర్శి తుహిన్ కాంత్ పాండే, ఒక ఇంగ్లీష్ వార్తాపత్రికతో మాట్లాడుతూ... ''2021 మార్చి 31 నాటికి అంటే గత ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి ఎల్ఐసీ.. 28.3 కోట్ల బీమాలతో, 10.35 లక్షల మంది ఏజెంట్లతో కొత్త బిజినెస్ ప్రీమియంలో 66 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది'' అని చెప్పారు.

ఎల్ఐసీ ఉద్యోగ సంఘాలు

ఫొటో సోర్స్, ANI

ఎల్ఐసీ ఉద్యోగుల సంఘాల నిరసన

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఎల్ఐసీ ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఉద్యోగ సంఘాలన్నీ కలిసి మార్చి 28, 29 తేదీల్లో సమ్మెకు పిలుపునిచ్చాయి.

ఉద్యోగుల సంఘానికి చెందిన ఏకే భట్నాగర్, బీబీసీతో మాట్లాడుతూ ఎల్ఐసీని 'బంగారు గుడ్లు పెట్టే బాతు' అని 'డబ్బులు కాసే చెట్టు' అని అభివర్ణించారు.

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం, బీమా కంపెనీలను జాతీయ చేసిన ప్రాథమిక స్ఫూర్తికి విరుద్ధమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా 1956లో ఎల్ఐసీని జాతీయ చేస్తూ ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ, ఆర్థిక మంత్రి సీవీ దేశ్‌ముఖ్ చెప్పిన మాటలను ఆయన గుర్తు చేశారు. ''ఎల్ఐసీని జాతీయం చేయడం వల్ల, బీమా కంపెనీలు చేసే మోసాలకు అడ్డుకట్ట వేయవచ్చు. అలాగే ఇది ప్రజలకు సామాజిక భద్రతను కల్పిస్తూ దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని'' వారు చెప్పిన మాటలను భట్నాగర్ తాజాగా గుర్తు చేశారు.

బ్యాంకులతో పోలిస్తే బీమా సంస్థ ఎల్ఐసీ పూర్తిగా అవినీతి రహితమైనదని కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి.

వీడియో క్యాప్షన్, బామ్మగారి షేర్ మార్కెట్‌ ట్రేడింగ్ పాఠాలు

''ఇప్పటివరకు బీమా తీసుకున్నవారి దగ్గరి నుంచి 99 శాతం కేసుల్లో ఎల్ఐసీ సెటిల్‌మెంట్లను చేస్తోందని... ఈ విషయంలో ప్రైవేటు బీమా కంపెనీల రికార్డు అత్యంత పేలవంగా ఉందని'' ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి.

''షేర్ మార్కెట్‌లోకి ఎల్ఐసీని తీసుకురావాలని భారత ప్రభుత్వం ప్రతిపాదనలు తెచ్చింది. ఎల్ఐసీని ఐపీఓలోకి తీసుకురావడం అంటే, దేశంలోనే ఆర్థికంగా పటిష్టంగా ఉన్న సంస్థను నాశనం చేసినట్లే'' అని రాష్ట్రపతికి రాసిన వినతి పత్రంలో ఉద్యోగ సంఘాలు పేర్కొన్నాయి.

''ప్రస్తుతానికైతే భారత ప్రభుత్వం కేవలం 5 శాతం షేర్ల విక్రయం గురించే మాట్లాడుతోంది. కానీ 'సెబీ' షరతు ప్రకారం... రిజిస్ట్రేషన్ పూర్తి అయ్యాక, మూడేళ్ల లోగా సంస్థకు చెందిన 25 శాతం వాటాలను విక్రయించాల్సి ఉంటుంది. అంటే 'ఆఫ్ లోడ్' కింద 25 శాతం షేర్లను సంస్థ విడుదల చేయాల్సి ఉంటుంది'' అని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి.

''ఇప్పుడు ఐపీఓ జారీ అయితే, రానున్న మూడేళ్లలో 25 శాతం షేర్లను ఎల్ఐసీ జారీ చేయాల్సి ఉంటుందని'' భట్నాగర్ చెప్పారు.

ఎల్ఐసీ

ఫొటో సోర్స్, LIC INDIA/BBC

ప్రైవేటీకరణకు సిద్ధమవుతున్నారా?

వివిధ కంపెనీలను ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు ఎల్‌ఐసీ సొమ్మును వినియోగిస్తున్నారని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. ఇది కాకుండా గత ఆర్థిక సంవత్సరంలో కేవలం పన్ను రూపంలోనే ఎల్‌ఐసీ నుంచి ప్రభుత్వానికి రూ. 10,500 కోట్లు సమకూరాయని, డివిడెండ్ ద్వారా రూ. 2889 కోట్లు వచ్చాయని వారు చెబుతున్నారు.

''ఇదే కాకుండా వివిధ ప్రాజెక్టుల కోసం ఎల్ఐసీకి చెందిన 36 లక్షల కోట్లు నిధులు వాడుకున్నారు. ఎల్ఐసీ సొంత ఆస్తుల విలువ దాదాపు రూ. 38 లక్షల కోట్లు'' అని ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి.

ఉదాహరణకు 2015లో ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఓఎన్జీసీ) ఐపీఓకు వచ్చినప్పుడు ఎల్ఐసీ 1.4 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టింది.

ఐడీబీఐ బ్యాంకును అప్పుల నుంచి గట్టెక్కించడంలో కూడా ఎల్ఐసీ కీలక పాత్ర పోషించింది.

''2020 మార్చి వరకు వివిధ విద్యుత్ ప్రాజెక్టుల్లో రూ. 24,803 కోట్లు, రెసిడెన్షియల్ ప్రాజెక్టుల్లో రూ. 9,241 కోట్లు, వివిధ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు పలు ప్రాజెక్టుల్లో రూ. 18,253 కోట్లు ఎల్ఐసీ పెట్టుబడులు పెట్టినట్లుగా'' తన నివేదికలో ఉద్యోగ సంఘాలు పేర్కొన్నాయి.

ఎల్ఐసీ

ఫొటో సోర్స్, Getty Images

''ఇంతకుముందు వరకు బీమా చేసుకున్న వారికి ప్రయోజనం చేకూర్చేలా ఎల్ఐసీ పనిచేసేది. ఇక నుంచి పెట్టుబడిదారులకు లబ్ధి చేకూర్చేలా ఎల్ఐసీ దృష్టి సారిస్తుంది'' అని భట్నాగర్ అన్నారు.

ప్రభుత్వం ఇప్పుడు చేస్తుందంతా చూస్తుంటే... ఎల్ఐసీని ప్రైవేటుపరం చేసేందుకు బాటలు పరుస్తున్నట్లే అనిపిస్తోంది.

''బంగారు గుడ్లు పెట్టే బాతును కాపాడండి'' అంటూ ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాలు సూచిస్తున్నాయి.

ISWOTY

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)