యుక్రెయిన్ సంక్షోభం: బలగాలు వెనక్కి వస్తున్నాయన్న రష్యా, ఆధారాలు చూపాలని కోరిన పాశ్చాత్య దేశాలు

రష్యా ట్యాంకు

ఫొటో సోర్స్, EPA/RUSSIAN DEFENCE MINISTRY

మిలటరీ డ్రిల్స్‌ను పూర్తి చేసుకున్న బలగాలు... క్రిమియా నుంచి వెళ్లిపోతున్నాయని బుధవారం ఉదయం రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

యుక్రెయిన్ సరిహద్దుల్లోని బలగాలు వెనక్కి వస్తున్నట్లు మంగళవారమే రష్యా పేర్కొంది.

అయితే ఆపరేషన్ నుంచి రష్యా వెనక్కి తగ్గుతున్నట్లు, బలగాలు యుక్రెయిన్ సరిహద్దుల నుంచి తిరిగి వస్తున్నట్లుగా ఎలాంటి ఆధారాలు తమకు కనిపించలేదని బ్రిటన్ రక్షణమంత్రి బెన్ వాలస్ అన్నారు.

''మా పరిశీలన ప్రకారం మైదానంలో పరిస్థితులు మరోలా కనిపిస్తున్నాయి'' అని బీబీసీ బ్రేక్‌ఫాస్ట్ కార్యక్రమంలో ఆయన అన్నారు.

''యుక్రెయిన్‌లో సార్వభౌమాధికారం ఉన్న ద్వీపకల్పం క్రిమియా. దానిపై దండయాత్ర చేసిన రష్యా 2014లో దాన్ని స్వాధీనం చేసుకుంది. దీన్ని బట్టి చూస్తే రష్యా, డ్రిల్స్‌ను పూర్తి చేసుకొని వెనక్కి వెళ్లిపోతుందంటే నమ్మశక్యంగా అనిపించడం లేదు. క్రిమియా మళ్లీ యుక్రెయిన్‌లో కలవడం చూడాలని అంతర్జాతీయ సమాజం ఆశిస్తోంది'' అని ఆయన చెప్పుకొచ్చారు.

మిలిటరీ డ్రిల్స్

ఫొటో సోర్స్, EPA

రష్యా ఏం చెప్పింది?

క్రిమియాలో మిలిటరీ డ్రిల్స్ ముగిశాయని, తమ భద్రతా బలగాలు క్రిమియా నుంచి వచ్చేస్తున్నాయని రష్యా పేర్కొంది.

''వ్యూహాత్మక ఆర్మీ వ్యాయామాల్లో దక్షిణ మిలిటరీ జిల్లాకు చెందిన బలగాల భాగస్వామ్యం ముగిసింది. దీంతో అవి శాశ్వత స్థావరాలకు వచ్చేస్తున్నాయి'' అని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.

''రైళ్ల ద్వారా యుద్ధ ట్యాంకులు, సైనిక వాహనాలు, ఫిరంగులు, ఇతర ఆయుధ సామగ్రిని క్రిమియా నుంచి తరలిస్తున్నాం'' అని ఆ ప్రకటనలో చెప్పారు. కానీ ఎన్ని బలగాలను అక్కడి నుంచి తరలిస్తున్నారో మాత్రం చెప్పలేదు.

టెలివిజన్‌లలో ప్రసారమైన ఫుటేజీలో రష్యా మిలిటరీ యూనిట్లు, క్రిమియాలోని వంతెనను దాటుతున్నట్లుగా కనిపించాయి.

యుక్రెయిన్ సరిహద్దుల నుంచి కొన్ని బలగాలను వెనక్కి పిలిపిస్తున్నట్లుగా రష్యా పేర్కొన్న మరుసటి రోజే క్రిమియాలో డ్రిల్స్ కూడా ముగిశాయని ప్రకటించింది.

కానీ పాశ్చాత్య దేశాల నాయకులు మాత్రం రష్యా చర్యపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

యూకే రక్షణ మంత్రి కార్యదర్శి బెన్ వాలస్
ఫొటో క్యాప్షన్, బెన్ వాలస్

'యుక్రెయిన్‌పై రష్యా దాడి చేయడం ఇప్పటికీ సంభవమే'

క్రిమియా నుంచి బలగాలు వెనక్కి వస్తున్నాయని రష్యా పేర్కొన్న తర్వాత... యూకే రక్షణ మంత్రి బెన్ వాలస్ రష్యా తీరుపై సందేహం వ్యక్తం చేశారు.

చెప్పే మాటలను బట్టి కాకుండా, చేసే పనుల ఆధారంగా రష్యాను అంచనా వేస్తామని ఆయన అన్నారు.

''రష్యా చేసిన ప్రకటన నిజమా కాదా అని తెలుసుకునేందుకు యూకే నిఘా సంస్థలపై ఆధారపడటం ఉత్తమం. లేదా బలగాల కదలిక ఆధారంగా కూడా దీన్ని తెలుసుకోవచ్చు.''

''ఇప్పటివరకు చూసినదాని ప్రకారమైతే రష్యా చెప్పినదానికి భిన్నంగానే జరుగుతోంది. రష్యా బలగాల సంఖ్య పెరుగుతోంది. బలగాలు స్థావరాల నుంచి ప్రయోగ ప్రాంతాలకు కదులుతున్నాయి.''

''రష్యా, ఫీల్డ్ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తోంది. నావికాదళ విన్యాసాలను చేపడుతోంది. వీటిని సాధారణ విన్యాసాలుగా పరిగణించకూడదు.''

''కేవలం సైనిక విన్యాసాల కోసమే, 60 శాతం బలగాలతో ఒక దేశాన్ని చుట్టుముట్టడం జరగదు. మంగళవారం వరకు కూడా రష్యా, యుక్రెయిన్‌పై విజయవంతంగా దాడిచేసే స్థితిలోనే ఉంది.''

''యుక్రెయిన్‌పై దాడికి పాల్పడకుండా రష్యాను నిరోధించారు. కానీ ఇప్పటికీ రష్యా దాడి చేసే అవకాశం ఉంది'' అని బెన్ చెప్పారు.

రష్యా దళాలు ఈరోజు యుక్రెయిన్‌పై దాడి చేస్తాయని అమెరికా నిఘా సంస్థలు పేర్కొన్న విషయం గురించి వాలస్‌ను బీబీసీ అడిగింది.

దీనికి సమాధానంగా ఆయన ''ఒకే తేదీ కాదు. వారు కొన్ని తేదీలను దృష్టిలో పెట్టుకొన్నారు'' అని చెప్పారు.

''రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆదేశిస్తే, ఇప్పటికి కూడా ఇది జరుగుతుంది. కానీ ఆయన ఇంకా నిర్ణయం తీసుకున్నట్లు లేరు'' అని ఆయన వివరించారు.

ఎంఐ6 మాజీ హెడ్ జాన్ సావర్స్

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, ఎంఐ6 మాజీ హెడ్ జాన్ సావర్స్

'రష్యా దాడి చేసే ప్రమాదం తగ్గింది': మాజీ ఎంఐ6 చీఫ్

యుక్రెయిన్‌పై రష్యా భీకర దాడికి పాల్పడుతుందని కొన్ని పాశ్చాత్యా దేశాలు చిత్రీకరించాయని, ఇప్పుడు ఆ ప్రమాదం కూడా తగ్గిపోయిందని బీబీసీ రేడియా కార్యక్రమంలో రష్యా ఎంఐ6 మాజీ హెడ్ జాన్ సావర్స్ చెప్పారు.

''ఏదైనా దేశంపై దాడి చేయాలని రష్యా అధ్యక్షుడు నిర్ణయించుకుంటారని నేను అనుకోను. నిజానికి అలాంటి నిర్ణయం తీసుకోవడం ఆయనకు కూడా చాలా ప్రమాదకరంగా మారుతుందని నేను భావిస్తున్నా'' అని ఆయన అన్నారు.

ISWOTY

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)