Bhopal: స్నేహను కాపాడేందుకు కదిలే రైలు కిందికి దూకిన మొహమ్మద్ మహబూబ్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

ఫొటో సోర్స్, S NIAZI
- రచయిత, షురేహ్ నియాజీ
- హోదా, బీబీసీ కోసం
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌కు చెందిన 37 ఏళ్ల మొహమ్మద్ మహబూబ్ కార్పెంటర్ పనులు చేస్తూ జీవిస్తున్నారు. ఆయన నగరంలోని బర్‌ఖేడీ ప్రాంతంలో ఒక షాపులో పనిచేస్తుంటారు.
కానీ, ఇటీవల ఆయన జీవితం మారిపోయింది. ఇప్పుడు ఆయనకు చాలా ప్రాంతాల్లో సన్మానాలు జరుగుతున్నాయి. మహబూబ్ చేసిన పనిని మెచ్చుకుంటూ చాలా మంది ఆయన ఇంటికి వస్తున్నారు.
ఫిబ్రవరి 5న ఆయన తన ప్రాణాలకు తెగించి, రైల్వే ట్రాక్ మీద చిక్కుకుపోయిన ఒక యువతి ప్రాణాలు కాపాడారు.
ఆమె రైల్వే ట్రాక్ మీద ఆగివున్న గూడ్స్ కింద నుంచి ట్రాక్ దాటబోయారు. సరిగ్గా అప్పుడే ఆ రైలు ముందుకు కదిలింది.
దీంతో, భయపడిపోయిన యువతి గట్టిగా కేకలు వేయడంతో దగ్గరే ఉన్న మహబూబ్ వెంటనే కదిలిన ఆ రైలు కిందికి దూరారు. ట్రాక్‌పై పడుకుని ఆమె తలను కిందికి అదిమి పట్టుకున్నారు.
ఈలోపు వారి పైనుంచి గూడ్స్ బోగీలు వెళ్లిపోయాయి. రైలు వెళ్లిపోయిన తర్వాత మహబూబ్, ఆ యువతి సురక్షితంగా బయటికొచ్చారు.
"ఆ పని ఆ అల్లానే చేయించాడు. అమ్మాయి సాయం కోసం అరిచినపుడు, నేను ఆమెకు 30 అడుగుల దూరంలో ఉన్నా. ఆ సమయంలో అక్కడున్న దాదాపు 30-40 మంది అదంతా చూస్తున్నారు. కానీ, నాకు ఆమెకు సాయం చేయాలని అనిపించడంతో, చేశాను" అని మహబూబ్ చెప్పారు.
ఆయన వివరాల ప్రకారం ఈ ఘటన ఫిబ్రవరి 5న జరిగింది. కానీ, దీని గురించి తెలిసన చాలా కొద్ది మంది మాత్రమే బయట చెప్పారు. మహబూబ్ కూడా తను చేసింది ఎవరికీ తెలియాల్సిన అవసరం లేదులే అనుకున్నారు.
మహబూబ్, ఆ యువతి రైల్వే ట్రాక్ కింద ఉన్న వీడియో వైరల్ కాకపోయుంటే, ఆయన చేసిన ఈ సాహసం గురించి బహుశా ఎవరికీ తెలిసేది కాదు.

ఫొటో సోర్స్, S NIAZI
వైరల్ అయిన వీడియో
ఆరోజు అక్కడ జనంలో ఉన్న ఎవరో ఆ ఘటనను వీడియో తీసి ఫిబ్రవరి 11న షేర్ చేశారు. అది వైరల్ అవడంతో, భోపాల్‌లో అందరూ మహబూబ్ గురించి అందరూ చర్చించుకోవడం మొదలెట్టారు.
అయితే, మహబూబ్‌కు ఆ యువతి వివరాలు పెద్దగా తెలీదు. సురక్షితంగా బయటపడిన తర్వాత యువతి ఏడుస్తూ అక్కడే ఉన్న ఒక వ్యక్తితో కలిసి వెళ్లిపోయారు.
మహబూబ్‌కు మూడేళ్ల పాప ఉంది. తల్లిదండ్రులను కూడా ఆయనే చూసుకుంటున్నారు. తను చేసింది అమ్మనాన్నలకు చెప్పగానే, మంచిపని చేశావని వాళ్లు తనను మెచ్చుకున్నారని మహబూబ్ చెప్పారు.
కానీ, వైరల్ అయిన వీడియోను శనివారం మహబూబ్ తన భార్యకు చూపించిన తర్వాతే, భర్త ఎంత పెద్ద సాహసం చేశాడో ఆమెకు అర్థమైంది.
"ప్రజలకు సాయం చేయాలనే మా మతం చెబుతుంది" అని మహబూబ్ భార్య రూహీ అన్సారీ అన్నారు.
"నేను పట్టాలపై పడుకున్నప్పుడు, ఆ అమ్మాయి తలను నా చేతులతో కిందికి అదిమిపట్టి ఉంచాను. ఎందుకంటే ఆమె భయంతో తల పైకెత్తాలని ప్రయత్నిస్తోంది. ఆమె తల పైకి లేపితే, ఏదైనా తగులుతుందేమోనని నాకు అనిపించింది" అని మహబూబ్ ఆరోజు ఘటనను గుర్తు చేసుకున్నారు.
రైలు వెళ్లిపోయిన తర్వాత ఆమె తన సోదరుడితో అక్కడ నుంచి వెళ్లిపోయారు. కష్టాల్లో ఉన్న ఒక అమ్మాయికి సాయం చేసినందుకు సంతోషంగా ఉందని, కాపాడ్డంలో కాస్త ఆలస్యం చేసినా ఆమె ప్రాణాలే పోయేవని మహబూబ్ అన్నారు.
"ఆ సమయంలో నా మనసుకు అనిపించింది నేను చేశా" అంటారు మహబూబ్
మహబూబ్ ఆ సమయంలో మసీదులో రాత్రి నమాజు తర్వాత ఇంటికి వెళ్తున్నారు. ఆయన నగరంలోని బర్‌ఖేడీ ఫాటక్ దగ్గరకు చేరుకున్నప్పుడు ఈ ఘటన జరిగింది.

ఫొటో సోర్స్, S NIAZI
మనసులో ఏం అనిపించింది
రైల్వే ట్రాక్ మీద పడుకున్న సమయంలో రైలు భాగాలు ఏవైనా ఆ యువతికి తగులుతాయేమోనని మహబూబ్ భయపడ్డారు.
మహబూబ్ కాపాడిన ఆ యువతి పేరు స్నేహ గౌర్. భోపాల్‌లోని ఒక ప్రైవేటు సంస్థలో ఆమె సేల్స్‌లో పనిచేస్తున్నారు.
ఆ రోజు తర్వాత స్నేహ ఇప్పటివరకూ మహబూబ్‌ను కలవలేదు. కానీ, ఆయన తన ప్రాణాలు కాపాడారని ఆమె చెప్పారు.
ఆ రోజు ఘటన జరిగిన సమయంలో స్నేహను తీసుకెళ్లడానికి ఆమె సోదరుడు వచ్చారు. కానీ, ఆయన రైల్వే ట్రాక్ అవతలివైపే నిలబడిపోయారు.
అదే సమయంలో రైల్వే ట్రాక్ కిందున్న తాను సురక్షితంగా ఉన్నానని ఆమె తన సోదరుడికి చెప్పాలనుకున్నారు. అందుకే, తన తలను పైకెత్తాలని ప్రయత్నించారు.
మహబూబ్ దగ్గర ఇప్పటివరకూ మొబైల్ ఫోన్ లేదు. కానీ, ఈ ఘటన తర్వాత నగరంలోని ఎన్నో సంస్థలు మహబూబ్‌ను సన్మానించాయి. వాటిలో బీబీఎం అనే సంస్థ డైరెక్టర్ షోయబ్ హాష్మీ ఆయనకు సన్మానం చేసి, ఒక మొబైల్ ఫోన్ కూడా ఇచ్చారు.
"మొహమ్మద్ మహబూబ్‌కు ఈ గౌరవం దక్కాలి. ఆయన తన ప్రాణాలకు తెగించి మరొకరి ప్రాణాలు కాపాడారు. అయితే, ఈ విషయం ఎవరికీ చెప్పకూడదని ఆయనే అనుకున్నారు. కానీ మీడియా, సోషల్ మీడియాలో ఇది వైరల్ కావడంతో ఆయన తర్వాత దీని గురించి చెప్పారు" అన్నారు షోయబ్ హాష్మీ.
స్థానిక పోలీసు అధికారులు కూడా మహబూబ్‌కు సన్మానం చేశారు.
ఆ రోజు ఈ ఘటన జరిగిన సమయంలో అదే ప్రాంతంలో పనిచేసే జీషాన్ ఖురేషీ కూడా అక్కడే ఉన్నారు.
"నేను అక్కడే ఉన్నాను, ఆయన అంత ధైర్యం చేయడం చూసి నాకు భయమేసింది. అప్పుడు ఆయన ప్రాణాలే పోయుండేవి" అన్నారు.

ఫొటో సోర్స్, S NIAZI
ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కావాలనే డిమాండ్
"ఆన చాలా పెద్ద సాహసం చేశాడు. రైలు వెళ్లిపోయిన తర్వాత లేచిన యువతి చాలా భయంతో ఉన్నారు. ఏడుస్తూ అక్కడే ఉన్న తన బంధువుతో కలిసి వెళ్లిపోయారు. అక్కడ చాలా మంది ఉన్నా, ఎవరూ ఆమెను కాపాడే ధైర్యం చేయలేకపోయారు" అని జీషాన్ చెప్పారు.
నగరంలో ఎక్కువమంది రాకపోకలు సాగించే బర్‌ఖేడీ ఫాటక్ దగ్గర ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లేదు. ఇక్కడ మొదట్లో ఒక గేటు ఉండేది. కానీ ఏడేళ్ల క్రితం దాన్ని మూసేశారు. ఇప్పుడు ఇదే ప్రాంతంలో రోజూ దాదాపు పదివేల మంది ఇలాగే రోజూ రైల్వే ట్రాక్ దాటి అవతలకు వెళ్తుంటారు.
"ఈ ప్రాంతంలో మూడో లైన్ వేయడంతో దాదాపు రోజూ ఇక్కడ గూడ్స్ రైళ్లు నిలిచుంటాయి. ఒక్కోసారి అవి గంటలపాటు ఉండిపోతాయి. అందుకే, జనం తప్పనిసరి పరిస్థితుల్లో రైళ్ల కింద నుంచి పట్టాలు దాటుతున్నారు" అని స్థానికుడు అల్మాస్ అలీ చెప్పారు.
అవతలివైపు వెళ్లడానికి వేసిన రోడ్డు చాలా దూరంలో ఉంది. దాంతో జనం ఇలా రోజూ ప్రమాదకరంగా రైల్వే ట్రాక్ దాటుతున్నారు. ఇంతకు ముందు కూడా ఇలా దాటే సమయంలో ఎంతోమంది ప్రమాదాలకు గురయ్యారు.
రైల్వే పోలీసుల వివరాల ప్రకారం గత ఏడాది ఇక్కడ ట్రాక్ దాటుతూ 18 మంది చనిపోయారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కోసం స్థానికులు ఎన్నోసార్లు డిమాండ్ చేశారు. తాజా ఘటన తర్వాత ఇప్పుడు రైల్వే శాఖ ఫుట్ ఓవర్ బ్రిడ్జికి అనుమతులు ఇచ్చింది. దీని నిర్మాణానికి ఏడాదిన్నర నుంచి రెండేళ్లు పట్టవచ్చని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:
- ‘పోర్న్ సైట్లలోని నా ఫొటోలను తెలిసినవారు ఎవరైనా చూస్తారేమో అని భయంగా ఉంది’
- రామానుజాచార్యులు ఎవరు? సమాజం కోసం, సమానత్వం కోసం ఆయన ఏం చేశారు? రూ. వెయ్యి కోట్ల విగ్రహంపై విమర్శలు ఏంటి?
- ఆంధ్రప్రదేశ్: ఉద్యోగులు ఆశించినవన్నీ జరగవా? కొత్త పీఆర్సీ జీవోలను ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందా?
- రష్యా, యుక్రెయిన్ సంక్షోభం నుంచి చైనా లబ్ధి పొందాలని చూస్తోందా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














