యుక్రెయిన్ ఉద్రిక్తతలు: పుతిన్‌తో భేటీకి బైడెన్ సమ్మతి

ఫొటో సోర్స్, MAXAR VIA REUTERS
యుక్రెయిన్ విషయంలో తలెత్తిన సంక్షోభం గురించి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో శిఖరాగ్ర సమావేశం నిర్వహించటానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సూత్రప్రాయంగా అంగీకరించారు.
ఈ సదస్సును ఫ్రాన్స్ ప్రతిపాదించింది. రష్యా తన పొరుగు దేశమైన యుక్రెయిన్ మీద దండెత్తకపోతేనే ఈ భేటీ జరుగుతుందని అమెరికా అధ్యక్ష భవనం శ్వేత సౌధం స్పష్టంచేసింది.
దశాబ్దాల కాలంలో యూరప్‌లో తలెత్తిన అత్యంత తీవ్రమైన భద్రతా సంక్షోభం యుక్రెయిన్ అంశం. ఈ సంక్షోభానికి బైడెన్, పుతిన్ చర్చలతో దౌత్య పరిష్కారం లభించే అవకాశముంది.
రష్యా సైనిక చర్య చేపట్టడానికి సిద్ధంగా ఉందని నిఘా సమాచారం సూచిస్తున్నట్లు అమెరికా అధికారులు చెప్తున్నారు. కానీ అటువంటిదేమీ లేదని రష్యా తిరస్కరిస్తోంది.
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్.. పుతిన్‌తో రెండు సార్లు మూడు గంటల పాటు ఫోన్‌లో మాట్లాడిన అనంతరం బైడెన్, పుతిన్‌ల మధ్య శిఖరాగ్ర సదస్సు నిర్వహించాలనే ప్రతిపాదనను ప్రకటించారు.
మాస్కో కాలమానం ప్రకారం సోమవారం ఉదయం రెండోసారి పుతిన్‌తో మాట్లాడారు మాక్రాన్.
శిఖరాగ్ర సదస్సు జరిగేట్లయితే అది ఎలా ఉండాలనే వివరాలను అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లిన్కెన్, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌ల మధ్య గురువారం జరిగే భేటీలో చర్చిస్తారని మాక్రాన్ కార్యాలయం చెప్పింది.
‘‘యుక్రెయిన్ మీద రష్యా పూర్తిస్థాయి దాడి చేయటానికి రష్యా సన్నాహాలను కొనసాగిస్తున్నట్లు’’ కనిపిస్తోందని, అదే జరిగితే ‘‘తక్షణమే తీవ్ర పర్యవసానాలను’’ విధించటానికి అమెరికా సిద్ధంగా ఉందని కూడా వైట్ హౌస్ పేర్కొంది.
యుక్రెయిన్ సరిహద్దులో అనేక కొత్త ప్రాంతాల్లో రష్యా సైనిక బలగాలు, సాయుధ సంపత్తి మోహరింపులు ఉన్నట్లు ఉపగ్రహ చిత్రాలు చూపుతున్నాయని, సైనిక సన్నద్ధత పెరిగినట్లు ఇది సూచిస్తోందని.. అమెరికాకు చెందిన సంస్థ మాక్సర్ చెప్పింది.
యుక్రెయిన్ సరిహద్దు వెంట రష్యా దాదాపు 1,90,000 మంది సైనికులను మోహరించినట్లు బైడెన్ ప్రభుత్వం అంచనా వేస్తోంది. వీరిలో తూర్పు యుక్రెయిన్‌లోని డోన్స్, లుహాన్స్ ప్రాంతాల్లో వేర్పాటువాద దళాలు కూడా ఉన్నాయని చెప్పింది.

ఫొటో సోర్స్, GETTY IMAGES
మాక్రాన్‌తో మొదటి ఫోన్‌కాల్‌లో మాట్లాడినపుడు.. ఈ సంక్షోభానికి దౌత్య పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరముందనే దానికి పుతిన్ అంగీకరించారని ఫ్రాన్స్ అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది. కాల్పుల విరమణ లక్ష్యంగా కొన్ని గంటల్లో పుతిన్, బైడెన్‌ల మధ్య భేటీ ఏర్పాటు చేయటానికి తీవ్ర కృషి జరుగుతుందని చెప్పింది.
ఉద్రిక్తతలు పెరగటానికి యుక్రెయిన్ సైన్యమే కారణమని పుతిన్ తప్పుపట్టారు. దీనిని యుక్రెయిన్ తిరస్కరించింది. తమ దేశంలో జోక్యం చేసుకోవటానికి సాకును సృష్టించటానికి రష్యా రెచ్చగొట్టే ప్రచారం చేస్తోందని ఆరోపించింది.
అయితే.. రష్యా, యుక్రెయిన్, ఫ్రాన్స్, జర్మనీలతో కూడిన డాన్బాస్‌లో గొడవలను పరిష్కరించుకోవటానికి ఏర్పాటు చేసిన బృందం నార్మండీ ఫార్మాట్ ద్వారా చర్చలను పునరుద్ధరించటానికి ఇరువురు నాయకులూ అంగీకరించారని ఫ్రాన్స్ అధ్యక్ష కార్యాలయం చెప్పింది.
మాక్రాన్‌కు పుతిన్ ఇచ్చిన హామీలు.. దౌత్య పరిష్కారం కోసం ఆయన ఇంకా ప్రయత్నించగలరని చెప్పే ఆహ్వానించదగ్గ సంకేతాలని బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ చెప్పారు. అయితే, ఉక్రెయిన్ సరిహద్దు నుంచి సైనిక బలగాలను ఉపసంహరించుకోవాలని పుతిన్‌కు ఆయన పిలుపునిచ్చారు.

ఇదిలావుంటే.. బెలారస్‌లో ఆదివారం ముగియాల్సి ఉన్న సైనిక విన్యాసాలను పొడిగిస్తున్నట్లు రష్యా ఇంతకుముందు ప్రకటించింది. అక్కడ 30,000 మంది రష్యా సైనికులు ఉన్నారు. యుక్రెయిన్ తూర్పు ప్రాంతంలో దిగజారుతున్న పరిస్థితులు.. ఈ విన్యాసాలను కొనసాగించటానికి ఒక కారణమని బెలారస్ ప్రకటన నిందించింది.
‘‘పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని, సైనిక దాడి ముంచుకు వస్తోందని ప్రతీదీ సూచిస్తున్నాయి’’ అని అమెరికా విదేశాంగ మంత్రి బ్లిన్కెన్ సీఎన్ఎన్ టీవీ చానల్‌తో చెప్పారు.
‘‘యుద్ధ ట్యాంకులు కదలటం, యుద్ధ విమానాలు ఎగరటం మొదలయ్యేవరకూ.. పుతిన్ ముందుకు సాగకుండా ఒత్తిడిచేసి ఒప్పించటానికి మేం ప్రతి అవకాశాన్నీ, ప్రతి నిమిషాన్నీ ఉపయోగించుకుంటాం’’ అన్నారాయన.
యుక్రెయిన్ మీద త్వరలో దాడి జరుగుతుందని అమెరికా విశ్వసిస్తున్నట్లు అమెరికా మీడియాలో వార్తలు వచ్చిన నేపథ్యంలో బ్లిన్కెన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఫొటో సోర్స్, NURPHOTO VIA GETTY IMAGES
దాడి మొదలుపెట్టాల్సిందిగా క్షేత్రస్థాయిలోని రష్యా కమాండర్లకు ఉత్తర్వులు అందాయని, వారు ఎలా దాడి చేయాలనే దానిపై నిర్దిష్ట ప్రణాళికలను రచిస్తున్నారని అమెరికాకు నిఘా సమాచారం అందిందని సీబీఎస్ న్యూస్ ఒక కథనంలో చెప్పింది.
తొలుత సైబర్ దాడితో ఈ సైనిక ఆక్రమణ మొదలవుతుందని.. ఆ తర్వాత క్షిపణుల దాడులు, వైమానిక దాడులు జరుగుతాయని, ఆపైన భూతల బృందాలు రాజధాని కీవ్‌ను స్వాధీనం చేసుకోవటానికి ప్రయత్నిస్తాయని ఆ కథనం వివరించింది.
రష్యా సంప్రదాయ బలగాల్లో దాదాపు 75 శాతం యుక్రెయిన్ సరిహద్దులో మోహరించి ఉన్నాయని పేరు వెల్లడించని నిఘా అధికారి ఒకరు సీఎన్ఎన్‌తో చెప్పారు. యుక్రెయిన్‌ను దెబ్బకొట్టే దూరంలో రష్యా బలగాలను కేంద్రీకరించటం అత్యంత అసాధారణమైన విషయమని పేర్కొన్నారు.
అయితే.. సరిహద్దు వెంట రష్యా ‘దాడి బృందాలు’ ఏవీ ఇంకా ఏర్పడలేదని.. కాబట్టి ‘‘రేపు లేదా ఎల్లుండి’’ దాడి జరిగే అవకాశం కనిపించటం లేదని యుక్రెయిన్ రక్షణ మంత్రి అలెక్సీ రెజ్నికోవ్ చెప్పారు.
ఇతర పరిణామాల్లో...
శనివారం ఇద్దరు యుక్రెయిన్ సైనికులు కాల్పుల్లో చనిపోయిన తర్వాత.. ఆదివారం అనేకసార్లు కాల్పుల విరమణను ఉల్లంఘించారంటూ తిరుగుబాటుదార్లు, ప్రభుత్వ బలగాలు పరస్పరం ఆరోపించుకున్నాయి.
వేర్పాటువాద ప్రాంతాల నుంచి వేలాది మంది పౌరులను ఖాళీ చేయించి, రష్యాకు తరలిస్తున్నారు. వారిలో యుద్ధం చేసే వయసున్న వారిని యుద్ధానికి సిద్ధం చేస్తున్నారు.
యుక్రెయిన్ సరిహద్దు ప్రాంతాలతో పాటు రష్యాలోని బహిరంగ ప్రదేశాల్లో దాడులు జరిగే అవకాశముందని మాస్కోలోని అమెరికా రాయబార కార్యాలయం అమెరికన్లను హెచ్చరించింది. దీనిని రష్యా విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి ఒకరు విమర్శించారు.
రష్యాతో సన్నిహిత సంబంధాలున్న, మాజీ సోవియట్ రాష్ట్రమైన యుక్రెయిన్‌ను నాటోలో చేర్చుకోబోమని హామీలు ఇవ్వాలని పుతిన్ డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే దానివల్ల రష్యాకు ఎలాంటి ముప్పూ ఉండబోదని పశ్చిమ దేశాల సైనిక కూటమి నాటో తిరస్కరిస్తోంది.
రష్యా సైనిక దాడి జరిగితే.. తూర్పు యుక్రెయిన్‌లో 14,000 మంది ప్రాణాలను బలిగొన్న ఘర్షణ కన్నా మరింత తీవ్ర రక్తపాతం జరిగే యుద్ధం మొదలవుతుందని భయాందోళనలను వ్యక్తమవుతున్నాయి.

ఇవి కూడా చదవండి:
- ఈ దేశంలో తెలుగుకున్న క్రేజ్ అంతా, ఇంతా కాదు
- తిరుమల పూటకూళ్ల మిట్ట చరిత్ర ఏంటి? కొండపై హోటళ్లు, రెస్టారెంట్లు తొలగించాలని టీటీడీ ఎందుకు నిర్ణయించింది?
- ఏపీ డీజీపీ బదిలీ వివాదం: గౌతమ్ సవాంగ్‌ను హఠాత్తుగా ఎందుకు బదిలీ చేశారు, తెరవెనుక కారణాలేంటి?
- 30 ఏళ్ల తర్వాత బయటపడ్డ ఘోస్ట్ సిటీ.. ‘భయానకం. కానీ, ఇదే వాస్తవం’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














