ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌ బదిలీ వివాదం: హఠాత్తుగా ఎందుకు బదిలీ చేశారు, తెరవెనుక కారణాలేంటి?

డీజీపీ గౌతం సవాంగ్

ఫొటో సోర్స్, FACEBOOK/ANDHRAPRADESHSTATEPOLICE

    • రచయిత, జింకా నాగరాజు
    • హోదా, బీబీసీ కోసం

ఒకప్పుడు కేంద్రంలో క్యాబినెట్ సెక్రటరీ (1996-1998)గా పనిచేసిన టీఎస్ఆర్ సుబ్రమణియన్ (1961 బ్యాచ్ ఐఏఎస్) తన సర్వీసు అనుభవాల మీద మంచి పుస్తకం రాశారు.

దాని పేరు 'జర్నీస్ త్రూ బాబూడమ్ అండ్ నేతాల్యాండ్' (Journeys Through Babudom and Netaland). రాజకీయ నాయకుల, ఐఏఎస్ అధికారుల అనుబంధం అర్థం చేసుకునేందుకు బాగా పనికొచ్చే పుస్తకం అది. టీఎస్ఆర్ ఉత్తరప్రదేశ్ క్యాడర్ ఐఏఎస్ అధికారి.

ఇందులో ఒక అనుభవాన్నిఆయన ఉదహరించారు. ములాయం సింగ్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఐఏఎస్ అధికారుల సమావేశమొకటి జరిగింది. దానికి ములాయం సింగ్ ముఖ్య అతిథిగా వచ్చి ప్రసంగించారు.

ఆయన చేసిన ప్రసంగం గొప్పగా ఉంటుంది. కొందరు ఐఏఎస్ ఆఫీసర్ల క్యారెక్టర్ గురించి ఆయన నిర్మొహమాటంగా చెప్పారు.

"మీకు గొప్ప మేధో శక్తి, విద్య ఉంది. మీలో కొందరు గొప్ప పండితులున్నారు. వారెంత పండితులంటే నోబెల్ ప్రైజ్ పండితులకు ఏ మాత్రం తీసిపోరు. మీరు బుర్ర ఉపయోగించి పనిచేస్తే అది విజయవంతమవుతుంది. మీకు మంచి జీతం వచ్చే గొప్ప ఉద్యోగం ఉంది. మీ పిల్లలకు మీరు మంచి చదువు చెప్పించవచ్చు. సమాజం మిమ్మల్ని బాగా గౌరవిస్తుంది.

అలాంటపుడు మీరొచ్చి నా కాళ్లు పట్టుకుంటారేమిటి? మీరంతా నాబూట్లు నాకుతారెందుకు? మీ సొంత ప్రయోజనాలకు నా దగ్గరికి వస్తారెందుకు? ఇలా మీరు దిగజారితే, మీరు కోరిన పనిని నేను చేసేస్తాను. అయితే, దానికి తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుంది" అన్నారు.

ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ (1986 బ్యాచ్ ఐపీఎస్)ను ఉన్నట్లుండి బదిలీ చేసినపుడు ఎవరికైనా ములాయం సింగ్ వ్యాఖ్య గుర్తొస్తుంది.

చాలా మంది సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు రాజకీయ నాయకుల అండ కోసం వెంపర్లాడతారు. అండ సంపాదిస్తారు. రాజకీయ నాయకుడు కోరిన పనులన్నీ చేస్తారు. ఎక్కడో బెడిసికొడుతుంది. వచ్చిన దారినే వెళ్లిపోతారు. సవాంగ్ దీనికి అతీతం కాదు. ఆయన వచ్చిన రాజకీయ రాస్తాలోనే వెళ్లిపోయారు.

ఏపీ పోలీస్

ఫొటో సోర్స్, FB/AP POLICE

2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన గంటల్లోనే అప్పటి డీజీపీ ఆర్‌పీ ఠాకూర్‌ని తొలగించి సవాంగ్‌ను నియమించారు. కారణం ఆయనని తెలుగుదేశం ప్రభుత్వం నియమించి ఉండటం.

ఆర్‌పీ ఠాకూర్‌ను లెక్క ప్రకారం తొలగించడానికి వీల్లేదు. సుప్రీంకోర్టు ఒక తీర్పు ప్రకారం డీజీపీకి పదవీకాలం కనీసం రెండేళ్లు ఉండాలి. ఆ నియమం పాటించకుండా ఆయనను తొలగించారు.

అపుడు వచ్చిన గౌతమ్ సవాంగ్ ఇప్పటిదాకా పదవిలో ఉన్నారు. ఆయన రెండేళ్ల కాలం పూర్తి చేశారు. రెండేళ్ల కాలం పూర్తిచేశాక డీజీపీని బదిలీ చేసేందుకు ప్రభుత్వానికి అధికారం ఉంది.

అయితే, ఇలా బదిలీ చేసేందుకు ఒక ప్రక్రియ ప్రారంభించాలి. అది తదుపరి డీజీపీ ఎంపిక విధానం.

అది ప్రారంభించకుండా, ఉన్నట్లుండి బదిలీ చేయడం వల్ల గౌతమ్ సవాంగ్‌ది సాధారణ అడ్మినిస్ట్రేటివ్ బదిలీ అనుకోవడానికి వీల్లేదని మాజీ ఐఎఎస్ అధికారి షఫీకుజ్జామా (1977 ఆంధ్రప్రదేశ్ క్యాడర్) చెప్పారు.

"ప్రకాశ్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆప్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు డీజీపీ నియమాకం, టెన్యూర్ మీద తీర్పు ఇచ్చింది. దాని ప్రకారం, డీజీపీని బదిలీ చేయాలనుకుంటే, డీజీపీ ర్యాంకు ఉన్న అధికారుల పేర్లన్నింటిని ప్రభుత్వం యుపీఎస్‌సీకి పంపించాలి. అందులోనుంచి మూడు పేర్లను యుపీఎస్‌సీ ఎంపిక చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తుంది. అందులోనుంచి ప్రభుత్వం ఒక పేరును ఎంపిక చేసి డీజీపీగా నియమిస్తుంది"

"ఈ ప్రక్రియ జరగలేదు. మరొకరిని తాత్కాలిక డీజీపీగా నియమించి ఆయనను తప్పించారు. అందువల్ల గౌతమ్ సవాంగ్‌ది అడ్మినిస్ట్రేటివ్ ట్రాన్స్‌ఫర్ కాదు. ఎక్కడో ఆయన ముఖ్యమంత్రిని ఇరుకునపెట్టారని అందువల్ల పంపించారని అనుకోవాలి" అని అన్నారు షఫీకుజ్జామా.

సీఎం జగన్‌తో కొత్త డీజీపీ కెవి.రాజేంద్రనాథ్ రెడ్డి

ఫొటో సోర్స్, FB/Andhra Pradesh CM

ఫొటో క్యాప్షన్, సీఎం జగన్‌తో కొత్త డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి

ఈ లెక్కన బదిలీ చేశాక, సవాంగ్‌ని ఏపీపీఎస్‌సీ ఛైర్మన్‌గా నియమించినా బదిలీ అయిన తీరు మాత్రం మాయని మచ్చే.

నిజానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో డీజీపీ గౌతమ్ సవాంగ్ బాగా ఒదిగిపోయారు. ఆయనను ముఖ్యమంత్రి 'అన్నా' అని ఎంతో చనువుగా పిలిచేవారని చెబుతారు. అంతేకాదు, ఆయనకు ముఖ్యమంత్రి దగ్గర ఎంత చనువుందంటే, నేరుగా తలుపు తీసుకుని ముఖ్యమంత్రి ఆఫీస్‌లోకి వెళ్లే వారు.

తాను ముఖ్యమంత్రితో మాట్లాడుతుంటే, డీజీపీ అలా లోనికి వచ్చే వారని ఒక సీనియర్ అధికారి చెప్పారు.

జగన్-సవాంగ్ సాన్నిహిత్యం గురించి ప్రతిపక్ష పార్టీలు తీవ్ర విమర్శలు చేశాయి.

"డీజీపీ సవాంగ్ పోలీసు అధికారిగా పని చేసిందెపుడు? ఆయన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నేతలా పనిచేశారు. ఆ పార్టీ ఆదేశాల ప్రకారమే కేసులు పెట్టేవారు, అరెస్టులు చేసేవారు. ప్రతిపక్ష నేతలను సతాయించే వారు. అందుకే అయనొక పోలీసు అధికారి అని మర్చిపోయి ముఖ్యమంత్రి ఆయన్ను 'అన్నా' అనిపిలిచేవారు" అని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు చెప్పారు.

డీజీపీ వైసీపీ అజెండా ప్రకారమే పనిచేశారు తప్ప ఆయన ఎపుడూ వృత్తి ధర్మం నిర్వర్తించలేదని కూడా శ్రీనివాసులు అన్నారు.

వృత్తిపరంగా డీజీపీకి చాలా కాలంగా ప్రశంసలు వస్తూనే ఉన్నాయి. దేశంలోనే బెస్ట్ డీజీపీగా ఆయనకు 'ది బెటర్ ఇండియా సంస్థ' ఆ మధ్య అవార్డు అందించింది. కేంద్ర హోం శాఖ నుంచి కూడా సవాంగ్ ఉత్తమ డీజీపీ అని పేరుపొందారు. ఆయన హయాంలో ఆంధ్రాకు ఉత్తమ పోలీసింగ్ అవార్డులు కూడా వచ్చాయి.

ఒకవైపు ప్రతిపక్షం నుంచి విమర్శలు ఎదుర్కొంటూనే, మరోవైపు ఉత్తమ సర్వీసు అవార్డులు కూడా అందుకున్న డీజీపీ సవాంగ్ ఎందుకు అసాధారణంగా బదిలీ కావలసి వచ్చింది?

ఏపీ ఉద్యోగ సంఘాల చలో విజయవాడ
ఫొటో క్యాప్షన్, ఏపీ ఉద్యోగ సంఘాల 'చలో విజయవాడ' కార్యక్రమం

డీజీపీ సవాంగ్ బదిలీకి కారణమేమిటి?

ఆ మధ్య విజయవాడలో జరిగిన ఉద్యోగుల ఆగ్రహ ప్రదర్శన విజయవంతం కావడమే డీజీపీ మీద బదిలీ వేటుకు కారణమని బాగా ప్రచారంలో ఉంది. ప్రదర్శన విజయవంతం అయిన మరుసటి రోజున ముఖ్యమంత్రి జగన్ ఒక సమావేశం ఏర్పాటు చేశారు. అందులో డీజీపీని దోషిగా నిలబెట్టడమే కాకుండా కటువైన భాష ప్రయోగించారని ఒక కథనం ప్రచారంలో ఉంది. దాంతో ఆయన మనసు గాయపడిందని చెబుతున్నారు.

ఆ తర్వాత విశాఖ జిల్లా అనకాపల్లిలో గంజాయి దహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దీనికి కారణం, ఇంత పెద్ద ఎత్తున గంజాయిని ఎపుడూ పట్టుకోలేదు, దహనం చేయలేదు. అందుకే అదొక చారిత్రాత్మక కార్యక్రమం అవుతుందని సవాంగ్ వెళ్లారని ఆయన సన్నిహితులొకరు చెప్పారు.

విజయవాడ ప్రదర్శన వల్లే ఆయనను బదిలీ చేశారా లేక విజయవాడ ప్రదర్శనను సాకుగా తీసుకున్నారా అనేది తెలియదు.

గంజాయి దహనం చేస్తున్న గౌతం సవాంగ్
ఫొటో క్యాప్షన్, గంజాయి దహనం చేస్తున్న గౌతమ్ సవాంగ్

''ఈ మధ్య కాలంలో సవాంగ్ కేంద్రానికి దగ్గరవుతూ ఉన్నారని, కేంద్రానికి సమాచారం లీకవుతూ ఉందని'' ఒక రాజకీయ వర్గంలో ఒక మాట ప్రచారంలో ఉంది.

''ఈ కారణంతోనే సవాంగ్‌ని వదిలించుకోవాలని ముఖ్యమంత్రి భావించినట్లు, దానికి విజయవాడ ఉద్యోగుల ప్రదర్శనని సాకుగా వాడుకున్నట్లు'' ఈ వర్గం చెబుతూ ఉంది.

మరోవైపు, ''వైసీపీ అజెండా ప్రకారం పని చేయడం సాధ్యం కావడం లేదని, ఇలా పనిచేస్తూ పోతే, రేపు ప్రభుత్వం మారితే రిటైరయ్యాక కూడా చిక్కులొస్తాయని భావించి బదిలీ మీద వెళ్లిపోతానని సవాంగ్ కోరినట్లు'' మరొక కథనం కూడా ప్రచారంలో ఉంది.

''డీజీపీ సవాంగ్ డిపార్ట్‌మెంట్‌లో బాగా ఐసోలేట్ అయ్యారు. డీజీపీ చెప్పినట్లు ప్రతిపక్ష నేతల మీద కేసులు పెట్టి సతాయించడం, వైసీపీ నేతలను వెనకేసుకురావడం కష్టంగా ఉందని జిల్లా స్థాయి అధికారులు వ్యతిరేకిస్తున్నారు. వీళ్లే ఉద్యోగుల ప్రదర్శన సమయంలో పరోక్షంగా సహకరించి పచ్చ జండా ఉపారు. ఇలా పోలీసు శాఖ మీద డీజీపీ పట్టు కోల్పోతున్నారు. ఇలాంటి డీజీపీ ఎన్నికలప్పుడు కొనసాగడం మంచిది కాదని ముఖ్యమంత్రి భావించారు. అందుకే బదిలీ చేశారనేది'' మరొక కథనం.

ఇలా సవాంగ్ బదిలీకి చాలా కారణాలు వినబడుతున్నాయి. అయితే, ఉద్యోగుల బలప్రదర్శనను చూపి సవాంగ్‌ను బదిలీ చేసుంటే, అది తప్పని ప్రముఖ జర్నలిస్టు జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ చెప్పారు.

"ఉద్యోగుల ప్రదర్శన తేదీని చాలా ముందే ప్రకటించారు. పోలీసులు అంక్షలు విధించారు. అలాంటపుడు పెద్ద ఎత్తున ఉద్యోగులు విజయవాడ చేరుకునే వ్యూహాలను కనిపెట్టి పోలీసులను అప్రమత్తం చేయాల్సిన బాధ్యత ఇంటెలిజెన్స్ శాఖది. అందుకే ఉద్యోగుల బలప్రదర్శన విజయవంతం కావడానికి కారణం ఇంటెలిజెన్స్ వైఫల్యం. ఇంటెలిజెన్స్ విభాగం విఫలమయితే ఇంటెలిజెన్స్ చీఫ్‌కి ప్రమోషన్, డీజీపీకి బదిలీ మిగిలింది. ఇందులో జగన్ మార్క్ రాజకీయ కోణం ఉంది. దానికి డీజీపీ బలయ్యారు" అని అన్నారాయన.

సీఎం జగన్‌తో ఏపీ పోలీసు అధికారులు

ఫొటో సోర్స్, FB/Andhra Pradesh CM

జగన్ వ్యూహం, పర్యవసానాలు

ఈ మధ్య కాలంలో రాజకీయాల్లో ఒక కొత్త ట్రెండ్ కనిపిస్తోంది. ఎన్నికల్లో గెలిచి పదవీ బాధ్యతలు స్వీకరించిన మరుక్షణం నుంచి ముఖ్యమంత్రులకు వచ్చే ఎన్నికల్లో గెలుస్తామో లేదో అనే భయం పట్టుకుంటోంది.

అందువల్ల బాధ్యతలు చేపట్టిన మరుసటి గంట నుంచి రెండు రకాల రాజకీయ నీతి పాటించడం సర్వత్రా కనిపిస్తోంది.

ఇందులో ఒకటి నచ్చిన అధికారులను కీలకమయిన బాధ్యతల్లోకి తీసుకోవడం, ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు విపరీతంగా నగదు పంపిణీ పథకాలు ప్రకటించడం. రెండవది వచ్చే ఎన్నికల నాటికి ప్రతిపక్షం లేకుండా చేసుకోవడం.

ఇందులో మొదటి దానికి అధికారులను వాడుకుంటే, రెండోదానికి పోలీసు వ్యవస్థని వాడుకోవడం కనిపిస్తుంది.

ఆంధ్రప్రదేశ్‌లో 2019లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి జగన్ అమలు చేస్తున్నది ఇదే. ఓటర్లను మచ్చిక చేసుకోవడం, ప్రతిపక్షాన్ని నిర్మూలించే కార్యక్రమం జరుగుతోంది. దీనికి సై అనే అధికారులు ఉంటారు. లేదంటే పోతారు.

మొదటి చీఫ్ సెక్రెటరీ ఎల్‌వీ సుబ్రమణ్యం బదిలీ కూడా ఈ వ్యూహం పర్యవసానమే అని చెబుతారు.

ఆయన కొంతవరకే ముఖ్యమంత్రి రాజకీయ వ్యూహంతో కలసి పని చేశారు. ఆ తర్వాత సాధ్యం కాలేదు. అంతే వేటు పడింది.

ఇపుడు డీజీపీ సవాంగ్ కూడా ఇదేవిధంగా అసాధారణ బదిలీతో పదవి వదిలేయాల్సి వచ్చింది.

నగదు బదిలీ సంక్షేమ పథకాలు అమలుచేయడం ఆర్థిక భారమయినా జగన్ ప్రభుత్వం ముందుకు పోతూనే ఉంది.

ఏపీ సీఎంతో ఎల్వీ సుబ్రమణ్యం

ఫొటో సోర్స్, FACEBOOK/ANDHRAPRADESHCM

ఫొటో క్యాప్షన్, ఏపీ సీఎంతో ఎల్వీ సుబ్రమణ్యం

చాలావరకూ నగదు బదిలీ బాగానే జరుగుతోందని అనక తప్పదు. అదే విధంగా గ్రామ సచివాలయం, వాలంటీర్ వ్యవస్థ కూడా విమర్శలొచ్చినా బాగానే పనిచేస్తోందని చెబుతారు. అందువల్ల ఓటర్లను మచ్చిక చేసుకునే ప్రయత్నం నిరాటంకంగా సాగుతూనే ఉంది.

అయితే, ప్రతిపక్ష పార్టీని దెబ్బతీయడమనే వ్యూహం విజయవంతం కావడం లేదు. చంద్రబాబుని, లోకేష్‌ని అరెస్టు చేసి జైల్లో పెట్టడం వీలు కాలేదు. తెలుగుదేశం నెట్‌వర్క్ నిర్వీర్యం కాలేదు.

తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పర్యటనలు చేస్తూనే ఉన్నారు. ఆ పార్టీ నేతలు ఉద్యమాలూ చేస్తున్నారు, అరెస్టై, బెయిల్ మీద బయటకు వస్తున్నారు. అమరావతి రైతుల ఉద్యమం కొనసాగుతూనే ఉంది. ఉద్యోగులలో అసంతృప్తి ఇప్పుడు తోడయింది.

అనేక పథకాలున్నా ప్రజల్లో అనేక రకాల ఇతర అంశాల మీద ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతోందని తెలుగుదేశం భావిస్తోంది. ఇక దానిని సొమ్మచేసుకోవడమే పని. ఉద్యోగుల బలప్రదర్శన సాగిన తీరు తెలుగుదేశం నమ్మకాన్ని ధృవీకరించింది.

"ఉద్యోగుల అసాధారణ బలప్రదర్శనకు అన్ని వైపుల నుంచి మద్దతు లభించుండాలి. ఇది కేవలం ఉద్యోగుల నిరసనే కాదు, ఏ మూలో పెరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేకత కూడా తోడయితేనే ఇంత భారీ ప్రదర్శన సాధ్యమవుతుంది" అని ప్రముఖ ఆర్థికవేత్త, రాజకీయ వ్యాఖ్యాత పెంటపాటి పుల్లారావు అన్నారు.

ఒకటి మాత్రం నిజం. ఇంతవరకు కనిపించని ప్రభుత్వ బలహీనతలు కొన్నింటిని ఉద్యోగుల ప్రదర్శన బహిర్గతం చేసింది.

దానితోనే ఉద్యోగులను 24 గంటల్లో చర్చలకు పిలిచి, వాళ్ల కోర్కెలకు ఒప్పుకోవడం కంటే, ప్రభుత్వం ఇస్తానన్నవాటికే వారిని ఒప్పించడం జరిగింది. అయితే, ఇది ఉద్యోగుల్లో గూడుకట్టుకున్న అసంతృప్తిని పోగొట్టలేక పోయింది.

ప్రదర్శన విజయానికి కారణమయిన ఐక్యకార్యాచరణ సమితి చీలిపోయింది. ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న ఉద్యోగ నేతలు బాగా అపకీర్తి పాలయ్యారు. వారిని కొన్ని సంఘాలు బాహాటంగా విమర్శిస్తున్నాయి.

ముఖ్యంగా ఉపాధ్యాయులు అసంతృప్తితో ఉన్నారు. గ్రామస్థాయిలోని కొన్ని వర్గాల ఉద్యోగస్తులు నిరసన తెలుపుతూనే ఉన్నారు. వీటికి టీడీపీ సహజంగా వత్తాసు పలుకుతుంది. వాళ్ల మద్దతు కూడగడుతుంది. సవాంగ్ బదిలీ నాటికి ఇదీ రాజకీయ పరిస్థితి.

సీఎం జగన్

ఫొటో సోర్స్, FACEBOOK/YSJAGAN

ఎన్నికల టీమ్ ఏర్పాటులో జగన్

ఉత్తరాది ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత రాజకీయ పర్యవసానాలు వేగంగా మారుతాయని, రాజకీయ పున:సమీకరణలు దేశవ్యాప్తంగా జరుగుతాయని రాజకీయ పండితులు చెబుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని కూడా పత్రికలు రాస్తున్నాయి. దీనికి సమాయత్తమవుతూ ఎన్నికల క్యాబినెట్ వస్తుందని, జిల్లాల్లో కొత్త అధికారులు వస్తారని వార్తలొస్తున్నాయి. ఇందులో భాగమే కొత్త డీజీపీని తీసుకురావడం అని చాలా మంది అనుమానిస్తున్నారు.

"ఇంటెలిజెన్స్ చీఫ్ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి(1992 బ్యాచ్)ని డీజీపీగా తీసుకోవాలని ఎప్పుడో నిర్ణయం అయింది. దానికి తోడు ఆయన కడప జిల్లా ప్రొద్దుటూరుకి చెందిన వ్యక్తి. డిపార్ట్‌మెంట్ మీద ఆయనకు గ్రిప్ రావాలంటే ఇప్పుడే నియామకం జరగాలి. దీనికి సవాంగ్ ఉద్వాసన తప్పదు. ఉద్యోగుల ప్రదర్శన విజయవంతం కావడంతో ప్రభుత్వ ప్రతిష్ట దిగజారింది. డీజీపీని దీనికి కారకుడిని చేశారు. ఇలాంటి డీజీపీ ఎన్నికలకు పనికిరాడని భావించినట్లున్నారు. ఈ సాకుతో సవాంగ్ మీద వేటు వేసి ఉండవచ్చు" అని ఒక రిటైర్డ్ పోలీసు అధికారి అభిప్రాయపడ్డారు.

అయితే, ఎంతో 'విధేయత'తో పనిచేసిన డీజీపీ సవాంగ్‌ను అవమానపర్చారనే ప్రచారం తీవ్రంగా జరుగుతూ ఉంది. ఇది ముఖ్యమంత్రి జగన్ ఇమేజ్‌కు దెబ్బ. ఈ ప్రచారం ఇతర అధికారులను నిరుత్సాహపర్చవచ్చు. దీనికి విరుగుడుగానే సవాంగ్‌ని ఏపీపీఎస్‌సీ ఛైర్మన్‌గా నియమించి ఉండవచ్చు.

నియామకాలే జరపని కమిషన్‌కు ఛైర్మన్‌గా నియమించడం అంటే కంటితుడుపేనని వేరే చెప్పాల్సిన పనిలేదు.

2019లో డీజీపీని పదవి నుంచి తీసేశాక ఆర్‌పీ ఠాకూర్‌ని మొదట ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డిపార్ట్‌మెంట్ కమిషనర్‌గా నియమించారు. అపుడు కూడా విమర్శలు వచ్చాయి.

తర్వాత ఆయనను ఆర్టీసీ ఎండీగా నియమించారు. అంతేకాదు, మరుసటి సంవత్సరం రిటైరయ్యాక ఆయనని కమిషనర్ ఆఫ్ ఎంక్వయిరీస్‌గా నియమించి 'గౌరవించారు'. ఇదే సవాంగ్ విషయంలో కూడా జరగవచ్చు.

డీజీపీ స్థానంలో ఉన్నవారు రిటైర్మెంట్ వరకు ఆ పోస్టులో కొనసాగితే ప్రోటోకాల్ ప్రకారం గౌరవ వందనంతో వీడ్కోలు లభిస్తుంది.

కానీ, అంతవరకు మానసిక ఒత్తిడిని తట్టుకోవడం, న్యూనతా భావంతో అన్నింటికీ తలవంచి పనిచేయడం, కోర్టు మెట్లు ఎక్కడం దిగడం, రాజకీయ స్వామీజీల చుట్టూ ప్రదక్షణలు చేయడం, ప్రతిపక్షాల విమర్శలను ఎదుర్కోవడం భరించినపుడే ఆ యోగం దక్కుతుంది.

బదిలీ వల్ల ఉపశమనం దొరికిందని సవాంగ్ భావిస్తున్నారా? సవాంగ్ ఎపుడో 2023లో రిటైర్ కావలసి ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలొచ్చి ప్రభుత్వం మారితే, పాత డీజీపీ పోక తప్పదు. అంటే రాజేంద్రనాథ్ రెడ్డి పుల్ టైం డీజీపీగా ఓకే అయితే ఆయన కొనసాగింపు వచ్చే ఎన్నికల ఫలితాలను బట్టి ఉంటుంది.

(అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం)

ISWOTY Footer

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)