ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ: సీఎస్‌ను బదిలీ చేసే అధికారం సీఎంకు ఉంటుందా?

ఫొటో సోర్స్, facebook/AndhraPradeshCM
- రచయిత, వి శంకర్
- హోదా, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగంలో కీలక మార్పులు జరిగాయి. అనూహ్యంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మార్పు జరిగింది. ఎల్వీ సుబ్రహ్మణ్యంను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆయన స్థానంలో నీరబ్ కుమార్‌కి తాత్కాలికంగా బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అసలేం జరిగింది?
ఏపీ ప్రభుత్వ సాధారణ పరిపాలన విభాగం అధిపతిగా ప్రవీణ్ ప్రకాష్ నియమితులయిన నాటి నుంచి పలు పరిణామాలు జరుగుతున్నాయి.
అందులో భాగంగా తొలుత సీఎస్‌కి సంబంధం లేకుండా వివిధ శాఖలకు చెందిన ఫైళ్లు తనకు పంపించాలని ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ప్రవీణ్ ప్రకాశ్ ఆదేశాలు జారీ చేయడం కలకలం రేపింది.
క్యాబినెట్ కార్యదర్శిగా వ్యవహరించే సీఎస్ స్థానంలో సాధారణ పరిపాలన విభాగం ముఖ్య కార్యదర్శి హోదాలో కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ప్రవీణ్ ప్రకాష్ నిర్ణయం తీసుకోవడంతో ఈ వ్యవహారం కొత్తమలుపు తిరిగింది.
దాంతో సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం కూడా తీవ్రంగా స్పందించారు. ఏకంగా షోకాజ్ నోటీసు జారీ చేశారు.
ముఖ్యమంత్రి కార్యాలయంలో ముఖ్య కార్యదర్శి హోదాలో ఉన్న వ్యక్తికి షోకాజ్ నోటీసు జారీ చేయడం దేశంలోనే అరుదైన ఘటనగా చెబుతున్నారు.
ప్రవీణ్ ప్రకాష్‌కి నోటీసు జారీ అయిన కొన్ని గంటల్లోనే సీఎస్ సీటు మారుస్తూ నిర్ణయం వెలువడింది. ఎల్వీ సుబ్రహ్మణ్యంను బాపట్లలోని ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ జనరల్‌గా బదిలీ చేస్తూ ప్రభుత్వం జీఓ (RT-2478) జారీ చేసింది. దీనిపై సంతకం చేసింది ప్రవీణ్ ప్రకాశ్ కావడం విశేషం.

ఫొటో సోర్స్, facebook/AndhraPradeshCM
ముఖ్యమంత్రికి ఈ అధికారం ఉందా?
కాగా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న అధికారిని రాష్ట్ర ప్రభుత్వమే బదిలీ చేసిన సంఘటన గత 10-15 ఏళ్లలో చోటు చేసుకోలేదు.
సాధారణంగా ఎన్నికల సమయంలో విధులు సరిగా నిర్వర్తించడం లేదని, తమ ఆదేశాలు పాటించడం లేదని ఎన్నికల సంఘం సీఎస్‌లను మారుస్తుంటుంది. ఆ తరహాలోనే ఎల్వీ సుబ్రహ్మణ్యం ఈ బాధ్యతల్లోకి వచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వంలో అత్యంత సీనియర్ అయిన కొద్దిమంది ఐఏఎస్‌ల్లో ఒకరిని సీఎస్‌గా నియమిస్తుంటారు. కాబట్టి, ఈ హోదాలో వీరి పదవీకాలం చాలా తక్కువ ఉంటుంది.
తన ప్రభుత్వం హయాంలో పనిచేసే ఐఏఎస్‌లను బదిలీ చేసే అధికారం ముఖ్యమంత్రికి ఉంటుంది. అయితే, ఆ బదిలీ ఉత్తర్వులు జారీ చేసేది మాత్రం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శే.
అలాంటిది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శినే బదిలీ చేస్తూ ఉత్తర్వులు విడుదల చేయడంతో ఈ విషయం చర్చనీయాంశం అయ్యింది.
సీఎస్‌ను మార్చినప్పుడు లేదా కొత్త సీఎస్‌గా మరొకరు నియమితులైనప్పుడు మాత్రం ఆ ఉత్తర్వులను సాధారణ పరిపాలన విభాగం ముఖ్య కార్యదర్శి జారీ చేస్తారు.
ఇప్పుడు ఎల్వీ సుబ్రహ్మణ్యంను బదిలీ చేస్తూ ప్రవీణ్ ప్రకాశ్ కూడా ఆ హోదాలోనే జీఓ జారీ చేశారు.
కాగా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని బదిలీ చేసే అధికారం ముఖ్యమంత్రికి ఉంటుందని గతంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఐవైఆర్ కృష్ణారావు తెలిపారు.
అయితే, ఒక సంవత్సరంలోపు పదవీకాలం ఉన్నప్పుడు ఒక అధికారిని ప్రభుత్వం బదిలీ చేస్తే.. సదరు అధికారి అదే నగరం/పట్టణంలో పనిచేసేందుకు అవకాశం కల్పించాలని, అలాంటి అవకాశం లేకపోతే రిటైర్మెంట్ పూర్తయ్యే వరకూ అదే పోస్టులో కొనసాగించాలంటూ గతంలో న్యాయస్థానాలు తీర్పులు ఇచ్చాయి. కాబట్టి, ఎల్వీ సుబ్రహ్మణ్యం కనుక కోర్టును లేదా క్యాట్ (సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్)ను ఆశ్రయిస్తే ఈ బదిలీ చెల్లుబాటు కాకపోవచ్చునని పేరు చెప్పేందుకు ఇష్టపడని ఒక ఉన్నతాధికారి తెలిపారు.
సీఎస్ హోదాలో ఎల్ వి సుబ్రహ్మణ్యం ఇలా..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా 1983 బ్యాచ్ ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రమణ్యం అనూహ్యంగా బాధ్యతల్లోకి వచ్చారు.
2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు కేంద్ర ఎన్నికల సంఘం ఆయన్ని ఈ పదవిలో నియమించింది. ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టి సీఎస్‌గా ఎల్వీ ని కొనసాగించారు.

ఫొటో సోర్స్, facebook/AndhraPradeshCM
ఎమ్మార్ కేసులో జగన్ సహా నిందితుడిగా ఎల్వీ సుబ్రహ్మణ్యం
వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో ఎమ్మార్ సంస్థకు కేటాయించిన భూముల వివాదం అప్పట్లో ఎల్ వి సుబ్రహ్మణ్యం మెడకు చుట్టుకుంది. ఆయన సీబీఐ కేసుల్లో ఇరుక్కున్నారు.
జగన్ ఆస్తుల వ్యవహారంలో బయటకు వచ్చిన ఈ కేసులో ఎల్వీ సుబ్రహ్మణ్యం పై అప్పట్లో సీబీఐ ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసింది.
ఏపీఐఐసీ ఎండీగా ఉన్నకాలంలో ఎమ్మార్ సంస్థకు కేటాయించిన భూముల విషయంలో నిబంధనలు ఉల్లంఘించారని ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి.
చివరకు ఎల్వీ సుబ్రహ్మణ్యం హైకోర్టుని ఆశ్రయించగా, కోర్టు ఆయనకు క్లీన్‌చిట్ ఇచ్చింది.
‘సీఎంకి లేఖ రాశాను, ఇది సరికాదు’ - రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శర్మ
ఏపీ ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాలు శ్రేయస్కరం కాదని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ అభిప్రాయపడ్డారు.
ఆయన బీబీసీ తో మాట్లాడుతూ.. ‘‘సీఎస్, జిఏడి విభాగాల మధ్య సమస్యని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళాను. సీఎంకి వారం క్రితమే లేఖ రాశాను. క్యాబినెట్‌లో తీసుకోవాల్సిన నిర్ణయాలను సీఎస్ నిర్దరిస్తారు. ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయాల వెనుక ఆర్థిక, న్యాయపరమైన అంశాలు పరిశీలించి సీఎస్ క్యాబినెట్ ముందు ప్రతిపాదిస్తారు. దానికి భిన్నంగా సాగడం శ్రేయస్కరం కాదు. అయినా ప్రభుత్వ పెద్దలు స్పందించలేదు’’ అన్నారు.

ఫొటో సోర్స్, Govt of AP
‘సీఎం తీరు సరికాదు’ - మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ని తొలగించే అధికారం ముఖ్యమంత్రికి ఉన్నప్పటికీ ఈ విధానం సరికాదని ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు వ్యాఖ్యానించారు.
‘‘సీఎస్‌ను తొలగించిన విధానం సరిగా లేదు. ఎలాంటి బాధ్యత లేకుండా.. అంతులేని అధికారం చలాయించే ముఖ్యమంత్రి కార్యాలయం, ముఖ్యమంత్రుల మెడలకు ఉచ్చులా చుట్టుకుంటూ ఉన్నది. దీనిని నియంత్రించలేని ముఖ్యమంత్రుల పతనానిని సీఎంఓనే కారణమవుతోంది’’ అని ఒక ఫేస్‌బుక్ పోస్టులో కృష్ణారావు తెలిపారు.
‘‘హిందూ దేవాలయాల్లో అన్య మతస్తులను తొలగించే విషయంలో గట్టిగా నిలబడి నందుకు (ఎల్వీ సుబ్రహ్మణ్యంకు) ఇది బహుమానం అయితే ఇంకా దారుణం’’ అని ఆయన ఈ పోస్టులో పేర్కొన్నారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా వైఎస్ జగన్ కోరి తెచ్చుకున్న వ్యక్తి ఎల్వీ సుబ్రహ్మణ్యం అని, అలాంటి వ్యక్తిని బదిలీ చేశారంటే అర్థం అక్కడ అక్రమాలు జరుగుతున్నాయని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.
కాగా, సీఎస్ బదిలీ.. ఈపీ రొయప్ప కేసు (1974)లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు విరుద్ధమని న్యాయ నిపుణుడు వృద్ధుల కల్యాణ రామారావు బీబీసీతో మాట్లాడుతూ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- వైఎస్ రాజశేఖర రెడ్డి: హెలికాప్టర్ అదృశ్యం తర్వాత 25 గంటల్లో ఏం జరిగింది?
- ఆరాంకో: ప్రపంచంలో అత్యధిక లాభాలు సంపాదించే కంపెనీ షేర్ మార్కెట్లోకి ఎందుకొస్తోంది?
- భూపత్ డాకూ: భారత్ నుంచి పారిపోయిన ఈ దోపిడీ దొంగకు పాకిస్తాన్ ఆశ్రయం ఇచ్చింది
- దిల్లీ కాలుష్యం: పొల్యూషన్ మానిటర్స్‌కు అందని స్థాయిలో విష వాయువులు
- వేముగోడులో రజకులను ఎందుకు వెలివేశారు?
- భారత్ విడుదల చేసిన కొత్త మ్యాపులు ఆమోదయోగ్యం కాదన్న పాకిస్తాన్
- ఆకలితో ఉన్న 500 మేకలు రొనాల్డ్ రీగన్ లైబ్రరీని కాలిఫోర్నియా వైల్డ్ ఫైర్ నుంచి ఇలా కాపాడాయి..
- మెక్ డోనల్డ్స్ బర్గర్లు: పదేళ్లైనా పాడవలేదు.. బూజు పట్టలేదు.. ఎందుకు?
- వరల్డ్ వీగన్ డే: ఏ ప్రాణినీ ఇబ్బంది పెట్టని ఆహారం
- ఈ మొక్కలు కార్చిచ్చుతో మళ్లీ పుడతాయి.. అంగారకుడిపై పెరుగుతాయి... 32000 సంవత్సరాలు బతుకుతాయి
- పవన్ కల్యాణ్: ‘‘ప్రభుత్వానికి రెండు వారాల గడువు ఇస్తున్నా.. పరిష్కరించకపోతే అమరావతి వీధుల్లో నడుస్తా...’’
- రెండు వారాల్లో సుప్రీం కోర్టు కీలక తీర్పులు
- భారత్‌పై బంగ్లాదేశ్ తొలి టీ20 విజయం, ఖలీల్ అహ్మద్‌పై అభిమానుల ఆగ్రహం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








