అసెరెడో: 30 ఏళ్ల తర్వాత బయటపడ్డ ఘోస్ట్ సిటీ.. ‘భయానకం. కానీ, ఇదే వాస్తవం’

అసెరెడో శిథిలాలు

ఫొటో సోర్స్, EPA

స్పెయిన్, పోర్చుగల్ సరిహద్దుల్లో ఉన్న లిండోసో రిజర్వాయర్ కారణంగా 1992లో గలీసియాలోని అసెరెడో పట్టణం నీళ్లల్లో మునిగిపోయింది.

ఆ సంవత్సరం జనవరి 8న రిజర్వాయర్‌ను నింపాలని పోర్చుగీస్ జలవిద్యుత్ కంపెనీ ఈడీపీ నిర్ణయించింది. అక్కడి ఆనకట్టను నిర్వహించే సంస్థ ఇది.

అసెరెడో శిథిలాలు

ఫొటో సోర్స్, Reuters

ఆరోజు అసెరెడో కాలంలో ఆగిపోయింది. ఆ పట్టణ జీవితం ముగిసింది.

మూడు దశాబ్దాల తరువాత తీవ్రమైన కరువు ఏర్పడడంతో రిజర్వాయర్ దాదాపుగా ఎండిపోయింది. దాంతో, అసెరెడో పట్టణం బయటపడింది. ఇళ్లు, భవనాల శిథిలాలు బయటికొచ్చాయి.

అసెరెడో శిథిలాలు

ఫొటో సోర్స్, EPA

సందర్శకులకు కనువిందుగా..

ప్రస్తుతం ఇది సందర్శకులకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. అందమైన, నిర్జనమైన ఈ ప్రదేశాన్ని చూడ్డానికి వందలాది స్పెయిన్, పోర్చుగీస్ పర్యటకులు వస్తున్నారు.

‘‘మేం విగో నుంచి వచ్చాం. నీళ్లల్లోంచి ఒక పట్టణం బయటపడిందని విన్నాం. దాన్ని టీవీలో చూడ్డం వేరు. ప్రత్యక్షంగా చూడ్డం వేరు. అందుకే ఇక్కడ ఆగాం" అని ఒక విజిటర్ ఈఎఫ్ఈ వార్తాసంస్థతో చెప్పారు.

అసెరెడో శిథిలాలు

ఫొటో సోర్స్, Reuters

కానీ, కొందరికి ఆ ప్రదేశం విషాదాన్ని కలిగిస్తోంది.

"ఏదో సినిమా చూస్తున్నట్టుంది. ఎందుకో విచారంగా ఉంది. వాతావరణ మార్పులు, కరువుల కారణంగా కొన్నేళ్ల తరువాత ఇదే జరుగుతుంది అనిపిస్తోంది" అని మాక్సిమినో పెరెజ్ రొమెరో రాయిటర్స్ వార్తాసంస్థతో అన్నారు.

అసెరెడో శిథిలాలు

ఫొటో సోర్స్, Reuters

అది చూడగానే తాను అసెరెడోలో పనిచేస్తున్న రోజులు గుర్తొచ్చి తీపి జ్ఞాపకాలు, భయం ఒకేసారి కమ్మాయని లోబియోస్‌కు చెందిన జోస్ అల్వారెజ్ అన్నారు.

"ఇది భయానకం. కానీ, ఇదే వాస్తవం. జీవితమంటే అంతే. కొందరు మరణిస్తారు. కొందరు జీవిస్తారు" అని అల్వారెజ్ రాయిటర్స్‌కు చెప్పారు.

అసెరెడో శిథిలాలు

ఫొటో సోర్స్, Reuters

రిజర్వాయర్ వాడకంపై విమర్శలు

అసెరెడోలో ఏం జరిగిందో తెలిసిన చుట్టుపక్కల ప్రాంతాలవారు రిజర్వాయర్ కారణంగా గలీసియాలో వచ్చిన మార్పులను విమర్శిస్తున్నారు.

"ఇది దారుణం. ఎంత అమానుషంగా రిజర్వాయర్‌ను ఖాళీ చేశారో తెలుస్తోంది. రిజర్వాయర్‌లను దోచుకుంటున్న పద్ధతికి చాలా విచారంగా ఉంది" అని గ్జింజో డే లిమియా నివాసి ఫ్రాన్సిస్కో ఈఎఫ్ఈ ఏజెన్సీకి తెలిపారు.

అసెరెడో శిథిలాలు

ఫొటో సోర్స్, Reuters

గత కొద్ది నెలలుగా వర్షాలు పడకపోవడంతో ఈ పరిస్థితి వచ్చిందని లోబియోస్ ప్రధాన మునిసిపాలిటీ మేయర్ మరియా డెల్ కార్మెన్ యానెజ్ అన్నారు. అయితే, ఈడీపీ జలవిద్యుత్ ప్లాంట్ రిజర్వాయర్‌ను "కొల్లగొట్టిందని" ఆమె అభిప్రాయపడ్డారు.

కరువు ముదురుతుండడంతో విద్యుత్ ఉత్పత్తి, నీటిపారుదల కోసం డ్యాం నీటిని ఉపయోగించడం నిలిపివేయాలని లిండోసో సహా ఆరు ఆనకట్టల నిర్వాహకులకు పోర్చుగీస్ ప్రభుత్వం ఫిబ్రవరి 1న ఆదేశాలిచ్చింది.

అసెరెడో శిథిలాలు

ఫొటో సోర్స్, EPA

స్పెయిన్‌లో రిజర్వాయర్ల స్థిరత్వం గురించే తలెత్తే ప్రశ్నలు కొత్తేం కాదు.

గత ఏడాది, పబ్లిక్ సర్వీస్ కంపెనీలు రిజర్వాయర్ల నుంచి నీటిని సంగ్రహించడం పట్ల పలు స్పానిష్ పట్టణాలు ఫిర్యాదు చేశాయి.

స్పెయిన్‌లో రిజర్వాయర్‌లు 44 శాతం సామర్థ్యంతోనే పనిచేస్తున్నాయని, ఇది గత దశాబ్దపు సగటు (61 శాతం) కంటే చాలా తక్కువగా ఉందని స్పెయిన్ పర్యావరణ మంత్రిత్వ శాఖ డేటా చెబుతోంది.

రాబోయే వారాల్లో కరువు మరింత పెరుగుతుందని అయితే, దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న సమస్యలను ఇంకా గుర్తించలేదని ఆ దేశ మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)