ఇంటి మెట్ల కింద రహస్య అర, అందులో ఆరేళ్ల పాప.. రెండేళ్లుగా అందులోనే ఉంటున్న చిన్నారిని ఎలా కనిపెట్టారంటే..

ఫొటో సోర్స్, SAUGERTIES POLICE
న్యూయార్క్‌లో రెండేళ్లకు పైగా కనిపించకుండా పోయిన ఒక పాపను ఇటీవల ఒక ఇంట్లో మెట్ల కింద ఉన్న ఒక రహస్య అరలో కనుగొన్నారు.
చిన్నారి పైస్లీ షుల్టిస్ కనిపించకుండా పోయి రెండేళ్లు దాటింది. మొన్నటివరకూ ఆమె ఆచూకీ కూడా తెలీలేదు.
ఈ ఆరేళ్ల చిన్నారి న్యూయార్క్‌లోని సాగెర్టీస్ నగరంలోని ఒక ఇంట్లో మెట్ల కింద రహస్యంగా ఏర్పాటు చేసిన ఒక అరలో దొరికిందని పోలీసులు చెప్పారు.
ఆరోగ్యంగా ఉన్న చిన్నారిని పోలీసులు ఆమె లీగల్ గార్డియన్‌కు అప్పగించారు. ప్రస్తుతం ఈ చిన్నారి తన అక్కతో కలిసి ఉంటోంది.
పైస్లీ కస్టడీని కోల్పోవడంతో ఆమె తల్లిదండ్రులే పాపను తమ కొత్త ఇంటి నుంచి తీసుకెళ్లి దాచిపెట్టాలని నిర్ణయించుకున్నట్లు పోలీసులు గుర్తించారు.
చిన్నారి కస్టడీలో జోక్యం చేసుకోవడం, పిల్లలకు హాని కలిగించడం లాంటి కేసులను పాప తల్లిదండ్రులపై పోలీసులు నమోదు చేశారు.
పైస్లీకి నాలుగేళ్ల వయసున్నప్పుడు 2019 జులైలో న్యూయార్క్‌లోని టియోగా కంట్రీ నుంచి పాప కనిపించకుండా పోయిందని పోలీసులకు రిపోర్ట్ చేశారు.
ఆ సమయంలో పాపను ఆమె తల్లిదండ్రులు 33 ఏళ్ల కూపర్, 32 ఏళ్ల షుల్టిస్ జూనియర్లు కిడ్నాప్ చేసుంటారని పోలీసులు భావించారు.
సాగర్టీస్ నగరంలోని ఒక రహస్య ప్రాంతంలో ఉన్న భవనంలో పైస్లీని దాచి ఉంటారని సమాచారం రావడంతో పోలీసులు ఆ ఇంటికి సెర్చ్ వారెంట్‌తో వెళ్లారు.
ఆ భవనంలో పోలీసులు అంతకు ముందు కూడా చాలాసార్లు గాలించారు. కానీ వాళ్లకు ఏ ఆచూకీ దొరకలేదు.
ఆ ఇల్లు పాప తాతయ్య కిర్క్ షుల్టిస్ సీనియర్‌ది. పోలీసులు తనిఖీలు చేసినప్పుడు పైస్లీ ఎక్కడుందో తనకు తెలీదని ఆయన వారికి చెప్పారు.

ఫొటో సోర్స్, SAUGERTIES POLICE
కానీ, సోమవారం మరోసారి ఆ ఇంటికి వెళ్లి తనిఖీలు చేసినప్పుడు, పోలీసు అధికారుల్లో ఒకరైన ఎరిక్ తీలేకు బెస్‌మెంట్‌కు వెళ్లే చెక్క మెట్లు కాస్త తేడాగా ఉన్నట్టు అనిపించింది.
ఆమె వెంటనే తన దగ్గరున్న టార్చ్ లైటును మెట్ల చెక్కల మధ్య ఉన్న ఖాళీ సందులో వేశారు. తీలేకు లోపల ఒక బ్లాంకెట్ కనిపించింది.
దీంతో ఆమె మరికొన్ని మెట్లు, పలకలు తొలగించి చూడాలని నిర్ణయించారు. కొన్ని తీయగానే తీలేకు మెట్ల కింద లోపల చిన్న పాదాలు కనిపించాయి.
తర్వాత అధికారులు మిగతా చెక్కల మెట్లు కూడా తీయడంతో తడితో చల్లగా ఉన్న ఒక చిన్న అరలో పైస్లీ, పాపను అక్కడ దాచిపెట్టిన ఆమె తల్లి కూపర్ కూడా కనిపించారు. పాపను పరీక్షించిన డాక్టర్లు ఆమె ఆరోగ్యంగా ఉన్నట్టు నిర్ధరించారు.
పాప అపహరణ
పైస్లీ అసలు తల్లిదండ్రులు కూపర్, కిర్క్ షుల్టిస్ జూనియర్... పాప మిస్ అవడానికి ముందే తమ ఇద్దరు కూతుళ్ల కస్టడీని కోల్పోయారు. పైస్లీని వాళ్లు మెట్ల కింద అన్నేళ్లు దాచిపెట్టడానికి అదే కారణమని పోలీసులు భావిస్తున్నారు.
"పెద్ద పాపను లీగల్ గార్డియన్, స్థానిక అధికారులు తీసుకెళ్లారని ఎవరో ఆమె తల్లిదండ్రులకు ఉప్పందించారు. దాంతో వాళ్లిద్దరూ పైస్లీని తీసుకుని పారిపోయారు, కనిపించకుండా దాచేశారు" అని సాగర్టీస్ పోలీసులు స్థానిక చానల్‌కు చెప్పారు.
పైస్లీ దొరికిన తర్వాత పాపను దాచిపెట్టిన నేరానికి ఆమె తల్లిదండ్రులు, తాతయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు.
నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్‌ప్లాయిటెడ్ చిల్డ్రన్ వివరాల ప్రకారం అమెరికాలో మిస్సయిన చాలా మంది పిల్లలను అధికారులు కాసేపట్లోనే గుర్తిస్తున్నారు.
కానీ, పిల్లలను కుటుంబ సభ్యులే అపహరించినపుడు అలాంటి వారిని వెతకడానికి చాలా కాలం పడుతోందని ఆ సంస్థ చెబుతోంది. అలాంటి పిల్లల ఆచూకీ తెలుసుకోడానికి సగటున 10 నెలలు పడుతోందని వివరించింది.

ఇవి కూడా చదవండి:
- ‘పోర్న్ సైట్లలోని నా ఫొటోలను తెలిసినవారు ఎవరైనా చూస్తారేమో అని భయంగా ఉంది’
- రామానుజాచార్యులు ఎవరు? సమాజం కోసం, సమానత్వం కోసం ఆయన ఏం చేశారు? రూ. వెయ్యి కోట్ల విగ్రహంపై విమర్శలు ఏంటి?
- ఆంధ్రప్రదేశ్: ఉద్యోగులు ఆశించినవన్నీ జరగవా? కొత్త పీఆర్సీ జీవోలను ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందా?
- రష్యా, యుక్రెయిన్ సంక్షోభం నుంచి చైనా లబ్ధి పొందాలని చూస్తోందా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













