యుక్రెయిన్ సంక్షోభం: 'రష్యా బలగాల ఉపసంహరణలో నిజం లేదు'- అమెరికా

యుక్రెయిన్ నుంచి బలగాల విరమణ జరుగుతున్నట్లు బుధవారం రష్యా ప్రభుత్వం ప్రకటించింది

ఫొటో సోర్స్, EPA/RUSSIAN DEFENCE MINISTRY

ఫొటో క్యాప్షన్, యుక్రెయిన్ నుంచి బలగాల విరమణ జరుగుతున్నట్లు బుధవారం రష్యా ప్రభుత్వం ప్రకటించింది

యుక్రెయిన్ సరిహద్దు నుంచి తమ బలగాలు వెనక్కి వస్తున్నాయని రష్యా చేస్తోన్న వ్యాఖ్యల్లో నిజం లేదని అమెరికా సీనియర్ అధికారి ఒకరు అన్నారు. అంతేకాకుండా ఇటీవలే 7000 అదనపు బలగాలు సరిహద్దులకు చేరుకున్నాయని ఆయన తెలిపారు.

యుక్రెయిన్‌పై దండెత్తడానికి ఏ క్షణంలోనైనా రష్యా ఏదో ఒక సాకును చూపెట్టగలదని ఆయన అన్నారు.

సైనిక కసరత్తులు పూర్తి చేసుకున్న రష్యా భద్రతా బలగాలు, యుక్రెయిన్ సరిహద్దుల నుంచి వచ్చేస్తున్నట్లు మాస్కో పేర్కొంది.

రష్యా వాదనను సమర్థించే ఎలాంటి ఆధారాలు తమకు కనబడట్లేదని, రష్యా చెబుతోన్న బలగాల విరమణను ధ్రువీకరించలేమని పాశ్చాత్య దేశాలు పేర్కొంటున్నాయి.

యుక్రెయిన్ సరిహద్దుల్లో లక్షకు పైగా బలగాలను మోహరించిన రష్యా, యుక్రెయిన్‌పై దాడి చేసే ప్రణాళిక తమకు లేదని చెబుతూ వస్తోంది.

''యుక్రెయిన్ నుంచి బలగాల విరమణ జరుగుతున్నట్లు బుధవారం రష్యా ప్రభుత్వం ప్రకటించింది. ఈ వ్యాఖ్యతో అందరి దృష్టిని ఆకర్షించింది. కానీ అందులో నిజం లేదనే విషయం మాకు తెలుసు. ఇటీవలి రోజుల్లో 7000 అదనపు బలగాలను యుక్రెయిన్ సరిహద్దులకు తరలించారు. అందులో కొంతమంది బుధవారమే అక్కడికి చేరుకున్నారు'' అని వైట్‌హౌస్ సీనియర్ అధికారి ఒకరు విలేఖరులతో చెప్పారు.

దాడి గురించి పాశ్చాత్య దేశాలు చేస్తోన్న ఆందోళనను 'హిస్టీరియా'గా రష్యా పేర్కొంటోంది. క్రిమియా నుంచి యుద్ధ ట్యాంకులు వెళ్లిపోతున్నట్లు చూపించే వీడియోను బుధవారం రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది.

వీడియో క్యాప్షన్, రష్యాకు యుక్రెయిన్ ఎందుకంత కీలకమో చెప్పే మూడు కారణాలు

పాశ్చాత్య దేశాలతో పాటు యుక్రెయిన్ కూడా బలగాల గురించి రష్యా వాదనపై సందేహం వ్యక్తం చేసింది. ''ఇప్పటివరకైతే దళాల ఉపసంహరణ జరుగుతున్నట్లు మాకు కనిపించలేదు. దాని గురించి మేం విన్నాం అంతే'' అని బీబీసీతో యుక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమర్ జెలెన్‌స్కీ చెప్పారు.

మరోవైపు మంగళవారం యుక్రెయిన్‌కు చెందిన రక్షణ శాఖ, ఆర్మీకి చెందిన వెబ్‌సైట్లతో పాటు రెండు బ్యాంకులు సైబర్ దాడికి గురయ్యాయి. దీని వెనక ఎవరున్నారో ఇంకా తెలియలేదు. కానీ యుక్రెయిన్ మాత్రం రష్యాపై సందేహాలు వ్యక్తం చేస్తోంది. గతంలో కూడా యుక్రెయిన్‌లోని ఆన్‌లైన్ మౌలిక సదుపాయాలపై పెద్ద ఎత్తున సైబర్ దాడులు జరిగాయి.

ఇందులో తమ ప్రమేయం లేదని రష్యా ప్రభుత్వం తేల్చి చెప్పింది.

యుక్రెయిన్‌ను అస్థిరపరిచేందుకు రష్యా నేరుగా రణరంగంలోకి దిగకుండా సైబర్ దాడుల ద్వారా యుద్ధం చేసే ప్రమాదం ఉందని చాలాకాలంగా ఆందోళనలు ఉన్నాయి.

''రష్యా బలగాలు వెనక్కి వెళ్లిపోతున్నట్లుగా ఎలాంటి ఆధారాలు లేవు'' అని నాటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ బుధవారం అన్నారు.

బ్రస్సెల్స్‌లో జరిగిన నాటో రక్షణ మంత్రుల శిఖరాగ్ర సమావేశంలో ఆయన మాట్లాడారు. సెంట్రల్, ఆగ్నేయ ఐరోపాలో స్వయం సమృద్ధి గల మిలిటరీ యూనిట్ల ఏర్పాటు గురించి కూటమి పరిశీలిస్తోందని అన్నారు. మరోవైపు 'నాటో'ను ఒక ప్రమాదంగా భావించవద్దని రష్యాకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు.

రష్యాతో చర్చలకు నాటో సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. సంఘర్షణ అంచుల నుంచి వెనక్కి తగ్గడానికి రష్యాకు ఇంకా సమయం మించిపోలేదని ఆయన వ్యాఖ్యానించారు.

నాటో సెక్రటరీ జనరల్ ప్రకటనలపై తమకు ఎలాంటి ఆసక్తి లేదని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.

వీడియో క్యాప్షన్, యుక్రెయిన్ సరిహద్దుల్లో ఏం జరుగుతోంది? రష్యా ఏం చేస్తోంది?

సంక్షోభం ప్రభావం చాలా కాలం ఉంటుంది

జొనాథన్ బేలీ విశ్లేషణ

డిఫెన్స్ కరెస్పాండెంట్

ప్రచ్ఛన్న యుద్ధం ముగిసినప్పటి నుంచి ఐరోపాలో తలెత్తిన అత్యంత తీవ్రమైన భద్రతా సంక్షోభంగా దీన్ని జెన్స్ స్టోలెన్‌బర్గ్ అభివర్ణించారు. ముప్పు ఇంకా తొలిగిపోలేదని ఆయన స్పష్టం చేశారు.

రష్యా అధ్యక్షుడు పుతిన్ దాడికి ఆదేశించనప్పటికీ, ఈ సంక్షోభం ప్రభావం చాలా కాలం పాటు ఉంటుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.

యూరోపియన్ భద్రతతో పోటీపడటానికి మాస్కో సిద్ధంగా ఉన్నట్లు మోహరించిన మిలిటరీ బలగాల ద్వారా అర్థం అవుతోంది.

రొమేనియా, నల్ల సముద్రం ప్రాంతంలో కొత్త యుద్ధ బృందాల ఏర్పాటును పర్యవేక్షించడానికి స్టోల్టెన్‌బర్గ్, నాటో మిలిటరీ ప్లానర్లను నియమించారు.

అయితే దీని గురించి ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. కానీ ఏర్పాటు చేసే ఈ అదనపు బలగాలను కేవలం నిరోధకంగా పనిచేయడానికి మాత్రమే ఉపయోగించాలని నాటో నొక్కి చెప్పింది.

ఉద్రిక్తతలను తగ్గించేందుకు చర్చలు జరపాలని రష్యాను నాటో కోరుతోంది. ఒకవేళ దౌత్యం పనిచేయకపోతే మాత్రం ఈ అంశం ఇరుదేశాల సైనికులు తలపడటంతో ముగుస్తుంది.

ISWOTY

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)