యుక్రెయిన్ సంక్షోభం: కొన్ని దేశాలు అమెరికాతో జత కట్టకుండా, రష్యా పక్షం వహిస్తున్నాయి ఎందుకు

ఫొటో సోర్స్, Getty Images
రెండవ ప్రపంచ యుద్ధం తరువాత, ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో ప్రపంచం రెండు ధృవాలుగా చీలిపోయింది. ఒక ధృవానికి అమెరికా నాయకత్వం వహిస్తే, మరొక ధృవానికి సోవియట్ యూనియన్ నాయకత్వం వహించింది.
రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన నాలుగు సంవత్సరాల తరువాత 1949లో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో) ఏర్పడింది. సోవియట్ యూనియన్ నుంచి రక్షణ కోసం అమెరికా, కెనడా సహా ఇతర పశ్చిమ దేశాలు దీన్ని ప్రారంభించాయి.
తొలుత 12 దేశాలు నాటోలో సభ్యత్వం స్వీకరించాయి. ప్రస్తుతం ఈ సంఖ్య 30కి పెరిగింది. నాటో సభ్యదేశాలు పరస్పరం సహాయ సహకారాలు అందించుకుంటాయి. వీటిల్లో ఏదైనా ఒకదానిపై దాడి జరిగితే అది మొత్తం సంస్థపై జరిగిన దాడిగా పరిగణిస్తామని ప్రారంభంలోనే నాటో ప్రకటించింది.
అయితే, 1991 డిసెంబర్‌లో సోవియట్ యూనియన్ పతనం తరువాత ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు మారాయి. నాటో పుట్టుకకు ప్రధాన కారణమైన సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైపోయింది.
రెండు ధృవాల్లో ఒక ధృవం వీగిపోయింది. ప్రపంచమంతా ఒకే ధృవంగా మారింది. అమెరికా అగ్రరాజ్యంగా అవతరించింది.
సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తరువాత రష్యా ఏర్పడింది. కానీ, ఆ దేశ ఆర్థిక పరిస్థితులు అధోగతి పాలయ్యాయి. ఈ పరిస్థితుల నుంచి బయటపడేందుకు రష్యా ప్రయత్నిస్తూ ఉంది.
అప్పట్లో అమెరికా కోరుకుంటే రష్యాను తన శిబిరంలోకి తీసుకోగలిగేదే కానీ, ఆ దేశం ప్రచ్ఛన్న యుద్ధ భావజాలం నుంచి బయటపడలేదని, రష్యాను సోవియట్ యూనియన్ లాగానే పరిగణించిందని నిపుణులు అంటారు.
సోవియట్ యూనియన్‌కు వ్యతిరేకంగా నాటో ప్రారంభమైనప్పటికీ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు మొదట్లో దాని పట్ల వ్యతిరేకత లేదు.

ఫొటో సోర్స్, KREMLIN
నాటో పట్ల పుతిన్ అభిప్రాయం ఏమిటి?
బ్రిటన్ మాజీ రక్షణ మంత్రి జార్జ్ రాబర్ట్‌సన్ 1999 నుంచి 2003 వరకు నాటో సెక్రటరీ జనరల్‌గా ఉన్నారు.
మొదట్లో పుతిన్ రష్యాను నాటోలో కలపాలని భావించారు కానీ, అందులో చేరే సాధారణ ప్రక్రియకు సమ్మతించలేదని జార్జ్ రాబర్ట్‌సన్ గతంలో అన్నారు.
పుతిన్ 2000లో రష్యా అధ్యక్షుడయ్యారు. ఆయనతో తన మొదటి సమావేశాన్ని గుర్తు చేసుకుంటూ జార్జ్ రాబర్ట్‌సన్ ఇలా వివరించారు.
"సంపన్నమైన, స్థిరమైన పశ్చిమ దేశాల్లో భాగం కావాలని కోరుకున్నారు పుతిన్. మమ్మల్ని నాటోలోకి ఎప్పుడు ఆహ్వానిస్తారు? అని నన్ను అడిగారు. నాటోలో చేరమని మేం దేశాలను ఆహ్వానించం, ఇందులో చేరాలనుకునేవాళ్లు దరఖాస్తు పెట్టుకుంటారు అని చెప్పాను. మాది దరఖాస్తు పెట్టుకునే దేశం కాదు అని ఆయన అన్నారు."
సీఎన్ఎన్ మాజీ జర్నలిస్ట్ మైఖేల్ కోసిన్స్కి నిర్వహించే 'వన్ డెసిషన్ పాడ్‌కాస్ట్'లో జార్జ్ రాబర్ట్‌సన్ ఈ వివరాలు చెప్పారు.
2000 మార్చి 5న పుతిన్, బీబీసీ జర్నలిస్ట్ డేవిడ్ ఫ్రాస్ట్‌కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని చెప్పారు.
"నాటో పట్ల మీ అభిప్రాయం ఏమిటి? భాగస్వామిగా మరే అవకాశాలున్న సంస్థగా భావిస్తున్నారా? లేక ప్రత్యర్థిగా, శత్రువుగా చూస్తున్నారా?" అని డేవిడ్ ఫ్రాస్ట్ పుతిన్‌ను అడిగారు.
"రష్యా, యూరోప్ సంస్కృతిలో భాగం. దాన్నుంచి రష్యాను విడదీసి చూడలేను. ఈ నాగరిక ప్రపంచంలో భాగంగా నాటోను శత్రువుగా పరిగణించలేను. ఇలాంటి ప్రశ్న లేవనెత్తడం రష్యాకు, ప్రపంచానికి కూడా మంచిది కాదని నా అభిప్రాయం. హాని తలపెట్టడానికి ఇలాంటి ప్రశ్నే చాలు" అంటూ పుతిన్ జవాబిచ్చారు.

ఫొటో సోర్స్, Getty Images
నాటో, యుక్రెయిన్ సంబంధాలు
ప్రస్తుతం తలెత్తిన యుక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో, అమెరికా నాటో విస్తరణను నిలిపివేస్తేనే ఉద్రిక్తతలు తగ్గుతాయని పుతిన్ సూటిగా చెబుతున్నారు.
"తూర్పు భాగంలో నాటో విస్తరణ ఆమోదయోగ్యం కాదు. క్షిపణులతో అమెరికా మా ఇంటి బయట నిల్చుంది. కెనడా లేదా మెక్సికో సరిహద్దుల్లో క్షిపణులను మోహరిస్తే అమెరికాకు ఎలా ఉంటుంది?" అంటూ గత డిసెంబర్‌లో పుతిన్ ప్రశ్నించారు.
మధ్య, తూర్పు యూరోప్ దేశాలైన రొమేనియా, బల్గేరియా, స్లోవేకియా, స్లోవేనియా, లాట్వియా, ఎస్టోనియా లిథువేనియా 2004లో నాటోలో చేరాయి. 2009లో క్రొయేషియా, అల్బేనియా కూడా చేరాయి. జార్జియా, యుక్రెయిన్‌లు కూడా 2008లో నాటో సభ్యతం పొందవలసి ఉంది కానీ, అది జరుగలేదు.
ఈ రకంగా నాటో విస్తరించడంపై పుతిన్ ఆగ్రహం పెరుగుతూనే ఉంది.
యుక్రెయిన్ సంక్షోభాన్ని అడ్దంగా పెట్టుకుని పుతిన్, అమెరికా నేతృత్వంలోని ఏకధృవ ప్రపంచాన్ని సవాలు చేస్తున్నారని కొందరు నిపుణులు భావిస్తున్నారు.
ఇంతకు ముందు సిరియాలో కూడా ఆయన ఇలాగే చేశారు. సిరియాలో బషర్ అల్-అస్సద్‌ను పదవి నుంచి తొలగించడానికి అమెరికా లక్ష ప్రయత్నాలు చేసింది. కానీ, పుతిన్ అది జరగనివ్వలేదు. బషర్ అల్-అస్సద్‌కు పుతిన్ సహాయం అందిస్తూనే ఉన్నారు. చివరకు అమెరికా, సిరియా నుంచి వైదొలగింది.
అయితే, ఇప్పుడు ప్రపంచం మళ్లీ రెండు ధృవాలుగా విడిపోతోందని, చైనా మాత్రమే కాకుండా, రష్యా నుంచి కూడా అమెరికాకు సవాళ్లు ఎదురవుతున్నాయని విశ్లేషకులు అంటున్నారు.
ఇదిలా ఉండగా, ప్రపంచంలోని కొన్ని దేశాలు అమెరికాను విడిచిపెట్టి రష్యా పక్షం వహిస్తున్నాయి. అవేమిటో, ఎందుకో చూద్దాం.

ఫొటో సోర్స్, Getty Images
చైనా
నాటోను విస్తరించడం చైనాకు కూడా ఇష్టం లేదు. ఫిబ్రవరి 3న బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుకలకు పుతిన్ హాజరయ్యారు. ఫిబ్రవరి 4న ఈ రెండు దేశాలు ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. ఆ సందర్భంగా చైనా నాటో విస్తరణపై అభ్యంతరం వ్యక్తం చేసింది.
కాగా, మంగళవారం యుక్రెయిన్‌లో పరిస్థితిని సమీక్షించేందుకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సమావేశమైంది. అందులో చైనా రాయబారి జాంగ్ జున్ మాట్లాడుతూ, అన్ని పక్షాలూ చర్చలు, సంప్రదింపులు కొనసాగించాలని తమ దేశం కోరుకుంటోందని అన్నారు. సమానత్వం, పరస్పర గౌరవం ప్రాతిపదికన సమస్యలు పరిష్కరించుకునేందుకు కృషి చేయాలని చైనా విజ్ఞప్తి చేసింది. శాంతియుత మార్గాల ద్వారా వివాదాలను పరిష్కరించుకోవాలని పేర్కొంది.
కొత్త ప్రచ్ఛన్న యుద్ధానికి కాలు దువ్వే ప్రయత్నాలను సఫలీకృతం కానివ్వకూడదని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఇటీవల విజ్ఞప్తి చేశారు.
మరోవైపు, రష్యాపై పశ్చిమ దేశాల ఆంక్షలు పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చైనా, రష్యాకు అండగా నిలుస్తుందని నిపుణుల అంచనా.
ఇప్పుడు, రష్యా, చైనాలు కలిసి ప్రపంచ రాజకీయాలకు సంబంధించిన అనేక అంశాలపై అమెరికాను సవాలు చేస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
భారత్
ప్రపంచంలో అయిదవ అతిపెద్ద దేశంగా, ఆసియాలో మూడవ అతిపెద్ద దేశంగా భారత్ ప్రపంచ రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తుంది.
రష్యాకు లేదా అమెరికాకు బహిరంగంగా మద్దతు తెలుపడం భారత్‌కు కష్టమని విశ్లేషకులు అంటున్నారు.
మంగళవారం జరిగిన ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సమావేశంలో భారత్, రష్యాను ఖండించలేదు. యుక్రెయిన్ సార్వభౌమాధికారం గురించి మాట్లాడలేదు. దౌత్యపరమైన చర్చల ద్వారానే ఈ సమస్య పరిష్కారం అవుతుందని మాత్రం పేర్కొంది.
చారిత్రకంగా భారత్, రష్యాల మధ్య స్నేహమే ఉంది. 2014లో రష్యా క్రిమియాను స్వాధీనం చేసుకున్నప్పుడు భారత్ వ్యతిరేకించలేదు.
భారత్, అమెరికా పక్షాన నిలబడలేదు. కానీ, రష్యాతో కూడా బహిరంగంగా చేతులు కలుపలేదు.
కానీ, ఇప్పుడు అలీనంగా ఉండడం భారత్‌కు అంత సులువు కాదు.
క్రొయేషియా
2009లో క్రొయేషియా నాటోలో చేరింది. కానీ యుక్రెయిన్ సంక్షోభంపై క్రొయేషియా ధోరణి నాటోకు అనుగుణంగా లేదు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
రష్యాతో వివాదం పెచ్చుమీరితే యుక్రెయిన్ నుంచి తమ సైన్యాన్ని ఉపసంహరించుకుంటామని క్రొయేషియా అధ్యక్షుడు జోరన్ మిలనోవిక్ గత నెలలో చెప్పారు. రష్యా భద్రతా ఆందోళనలను పట్టించుకోవాలని క్రొయేషియా పేర్కొంది.
కాగా, మంగళవారం జరిగిన సమావేశంలో, యుక్రెయిన్‌లోని రెండు వేర్పాటువాద ప్రాంతాలను స్వతంత్ర భూభాగాలుగా పుతిన్ గుర్తించారు. క్రొయేషియా దానిని ఖండించింది.
అజర్‌బైజాన్
అజర్‌బైజాన్ అధ్యక్షుడు రష్యా పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన 'అలై డిక్లరేషన్'పై సంతకం చేశారు. రష్యాకు తాము వ్యతిరేకం కాదని చెప్పడమే అజర్‌బైజాన్ అధ్యక్షుడి పర్యటన ఉద్దేశమని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
పాకిస్తాన్
పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రష్యాలో పర్యటించారు. దాంతో, పాకిస్తాన్ అమెరికాకు దూరమవుతోందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇమ్రాన్ ఖాన్ పర్యటన సమయం కూడా ముఖ్యమైనదని అంటున్నారు. పాకిస్తాన్.. అమెరికా, దాని మిత్రదేశాల వ్యతిరేక శిబిరంలో చేరడానికి ప్రయత్నిస్తోందని అంటున్నారు.

ఫొటో సోర్స్, Reuters
ఇవి కూడా చదవండి:
- రష్యా-యుక్రెయిన్ సంక్షోభం: భారత వైఖరిపై ఇంత చర్చ ఎందుకు
- డీఫిబ్రిలేషన్ ఇచ్చి ఉంటే మంత్రి గౌతమ్ రెడ్డి ప్రాణాలు కాపాడగలిగేవారా?
- బ్రిటన్ను భయపెట్టిన భారత మేజిక్ మహారాజు
- యుక్రెయిన్ సంక్షోభ సమయంలో ఇమ్రాన్‌ఖాన్ రష్యా ఎందుకు వెళ్లారు, భారత్‌పై చూపే ప్రభావమేమిటి?
- కర్ణాటక: బజరంగ్ దళ్ కార్యకర్త హత్య కేసు.. పోలీసులు ఏం చెబుతున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













