రష్యా - యుక్రెయిన్ ఉద్రిక్తతలు: పుతిన్‌కు ఏం కావాలి? 7 కీలక ప్రశ్నలు, సమాధానాలు

ఫొటో సోర్స్, EPA
యుక్రెయిన్ మీద దాడి చేసే ప్రణాళికలను గత కొన్ని నెలలుగా తోసిపుచ్చుతూ వచ్చిన రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ ఇప్పుడు శాంతి ఒప్పందాన్ని పక్కన పడేసి, తూర్పు ప్రాంతంలో తిరుగుబాటుదారుల అధీనంలోని రెండు ప్రాంతాల్లో "శాంతి స్థాపనకు" రంగంలోకి దిగాలని తన సైనిక దళాలకు ఆదేశించారు.
యుక్రెయిన్ సరిహద్దుకు సమీపంలో రష్యా 1,50,000 మంది సైనిక బలగాలను మోహరించింది. ఆ దేశంలోకి చొచ్చుకుపోవడానికి అనుకూలమైన దారుల్ని కూడా గుర్తించింది. ఈ యుద్ధమే జరిగితే మొత్తం యూరప్ భద్రత వ్యవస్థలే దెబ్బతినే ప్రమాదం ఉంది.
1. పుతిన్ దాడికి ఆదేశించారా?
పుతిన్ 'శాంతి పరిరక్షక దళాలను' ఆ ప్రాంతానికి పంపించారు. కానీ, వారు శాంతిని నెలకొల్పడానికి వస్తున్నారని ఎవరూ అనుకోవడం లేదు. అదొక అర్థం లేని మాట అని ఆస్ట్రేలియా ప్రధాని అన్నారు. అవి యుద్ధం చేసేందుకు వచ్చే సైనిక బలగాలేనని యుక్రెయిన్ జనరల్ అన్నారు.
యుక్రెయిన్‌కు తూర్పున ఉన్న రెండు ప్రాంతాలను స్వతంత్ర భూభాగాలుగా గుర్తించడం ద్వారా రష్యా అధ్యక్షుడు పుతిన్ 2014లోనే శాంతి ఒప్పందాన్ని బుట్టదాఖలు చేశారు. ఆ రెండు ప్రాంతాలూ రష్యా అండ కలిగిన తిరుగుబాటుదారుల అధీనంలోనివే.
అది 4.4 కోట్ల జనాభా ఉన్న యుక్రెయిన్ మీద రష్యా చేసిన మొదటి దాడి. ఆ తరువాత ఆ దేశానికి దక్షిణంగా ఉన్న క్రిమియాను తమలో విలీనం చేసుకుంది.
రష్యా అధినేత రాబోయే రోజుల్లో దాడులకు దిగుతారని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ గత కొన్ని రోజులుగా చెబుతూనే ఉన్నారు. ఉపగ్రహ ఛాయాచిత్రాలు కూడా యుక్రెయిన్ సరిహద్దుకు 9-19 మైళ్ల దూరంలో రష్యా సేనలు ఉన్నట్లు సూచిస్తున్నాయి.
2. రష్యా ఎందుకు యుక్రెయిన్‌ను లక్ష్యంగా చేసుకుంది?
యుక్రెయిన్ యూరప్ సంస్థలైన నాటో, ఈయూల వైపు ఉండడాన్ని రష్యా మొదటి నుంచీ వ్యతిరేకిస్తోంది. యుక్రెయిన్ ఎప్పుడూ పశ్చిమ దేశాల చేతుల్లో కీలుబొమ్మగానే ఉందని, అది ఎప్పుడూ స్వతంత్ర దేశంగా లేనే లేదని పుతిన్ ఇప్పుడు అంటున్నారు.
30 దేశాల కూటమి అయిన నాటోలో యుక్రెయిన్ చేరదని పాశ్చాత్య ప్రపంచం తనకు హామీ ఇవ్వాలని పుతిన్ డిమాండ్ చేస్తున్నారు. యుక్రెయిన్ అటు రష్యాతోనూ, ఇటు యూరోపియన్ యూనియన్‌తోనూ సరిహద్దును పంచుకుంటోంది. ఒకప్పటి సోవియట్ రిపబ్లిక్‌లో భాగమైన యుక్రెయిన్‌కు రష్యా సామాజిక, సాంస్కృతిక జీవనంతో దగ్గరి అనుబంధం ఉంది. ఆ దేశంలో రష్యన్ భాషను మాట్లాడే వాళ్లు అత్యధికంగా ఉంటారు. అయితే, 2014లో రష్యా దాడి చేసినప్పటి నుంచి ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బ తిన్నాయి.
3. రష్యా ఎంత దూరం వెళ్లగలదు?
ప్రస్తుతం రష్యా దృష్టి అంతా యుక్రెయిన్ తూర్పు ప్రాంతం మీదే కేంద్రీకృతమై ఉంది. అక్కడ రష్యా దళాలు త్వరలోనే సరిహద్దును చేరుకునే దశలో ఉన్నాయి.
ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్ రష్యాను హెచ్చరించారు. "28 లక్షల జనాభా ఉన్న యుక్రెయిన్ రాజధాని కీవ్‌ను వారు టార్గెట్ చేసుకునే అవకాశం ఉందని మేం భావిస్తున్నాం" అని బైడెన్ అన్నారు.
రష్యా వైపు నుంచి దాడులేమీ ఉండవని చెబుతున్నప్పటికీ, క్రిమియా, బెలారస్, తూర్పు యుక్రెయిన్ సరిహద్దు ప్రాంతాల్లో రష్యా తన సైనికులను మోహరించే అవకాశాలున్నాయి.
అంటే, యుక్రెయిన్‌ను తూర్పు, ఉత్తర, దక్షిణ దిశల నుంచి రష్యా చుట్టుముట్టే పరిస్థితి కనిపిస్తోంది. తద్వారా అది అక్కడ ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని తొలగించే ప్రయత్నం చేయవచ్చు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
యుక్రెయిన్ నౌకాశ్రయాలను నిర్బంధించడం, బెలారస్ గుండా అణ్వాయుధాలను తరలించడం వంటివి కూడా రష్యా చేసే అవకాశం ఉంది. దీనికితోడు రష్యా సైబర్ దాడులకు కూడా పాల్పడవచ్చు. గత జనవరిలో యుక్రెయిన్ ప్రభుత్వ వెబ్‌సైట్లు స్తంభించిపోయాయి. ఫిబ్రవరి నెలలో ఆ దేశంలోని అతి పెద్ద బ్యాంకుల వెబ్ సైట్ల మీద కూడా దాడులు జరిగాయి.
4. యుక్రెయిన్ కోసం పశ్చిమ దేశాలు ఎంతదాకా వెళ్లగలవు?
పశ్చిమ దేశాలు ఇప్పటికే యుక్రెయిన్‌కు సైనిక బలగాలను పంపించే ఉద్దేశాలేవీ తమకు లేవని చెప్పాయి. అంటే, అవి ప్రధానంగా రష్యా మీద ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతున్నాయి.
నాటో దేశాలు యుక్రెయిన్‌కు సలహాదారులు పంపించడం, ఆయుధాలు ఇవ్వడం, ఫీల్డ్ ఆస్పత్రులు ఏర్పాటు చేయడం వంటి సహాయాలు అందించడానికి ముందుకు వస్తున్నాయి. ఇదే సమయంలో బాల్టిక్ స్టేట్స్, పోలండ్‌లలో 5,000 సైనికులను మోహరించారు. మరో 4,000 మందిని రొమేనియా, బల్గేరియా, హంగరీ, స్లోవేకియా దేశాలకు పంపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఫొటో సోర్స్, EPA
5. అసలు పుతిన్‌కు ఏం కావాలి?
రష్యా ఇదే అదనుగా నాటోతో తన బంధాన్ని తిరిగి పటిష్టం చేసుకునేందుకు మూడు డిమాండ్లను ప్రధానంగా ముందుకు తీసుకొచ్చింది.
ఒకటి, మరింత విస్తరించేది లేదని నాటో చట్టబద్ధంగా అంగీకరించడం. "యుక్రెయిన్ ఎన్నటికీ నాటో సభ్య దేశం కాకూడదన్నది మాకు చాలా ముఖ్యం" అని రష్యా ఉప విదేశాంగ మంత్రి సెర్గెయి ర్యాబకోవ్ అన్నారు.
రష్యా వెనక్కి, ముందుకు వెళ్లడం అనేదేమీ ఉండదని, ఎవరేం చేస్తున్నా చేతులు ముడుచుకుని కూర్చుంటామా అని పుతిన్ అన్నారు.
యుక్రెయిన్ స్వాతంత్ర్యాన్ని, సార్వభౌమాధికారాలను గుర్తిస్తూ రష్యా 1994లో ఒక ఒప్పందం మీద సంతకాలు చేసింది. కానీ, గత ఏడాది పుతిన్ ఒక సుదీర్ఘమైన లేఖలో రష్యన్లు, యుక్రెయిన్లు ఒకే దేశమని, ఈనాటి యుక్రెయిన్ పూర్తిగా కమ్యూనిస్టు రష్యా ఏర్పాటు చేసిందేనని వ్యాఖ్యానించారు. సోవియట్ యూనియన్ 1991లో ముక్కలు కావడాన్ని పుతిన్ "చరిత్రాత్మక రష్యా విచ్ఛిన్నం"గా చూస్తున్నారు.
యుక్రెయిన్ కనుక నాటోలో చేరితే, ఆ కూటమి మళ్లీ క్రిమియాను లాక్కునేందుకు ప్రయత్నిస్తుందని కూడా పుతిన్ అన్నారు.
పుతిన్ చేసిన ఇతర డిమాండ్లలో, రష్యా సరిహద్దు ప్రాంతాల్లో నాటో సాయుధ దళాలను మోహరించకూడదన్నది కూడా ఉంది. అంతేకాకుండా, 1997 తరువాత ఆ కూటమిలో చేరిన సభ్య దేశాల నుంచి కూడా సైనిక శక్తిని, పాటవాన్ని ఉపసంహరించుకోవాలని కూడా పుతిన్ డిమాండ్ చేస్తున్నారు.
అంటే, మధ్య యూరప్, తూర్పు యూరప్, బాల్టిక్స్‌లో నాటో ఉండకూడదు. ఒక విధంగా నాటో 1997 పూర్వ స్థితికి వెళ్లాలని రష్యా కోరుకుంటోంది.
6. నాటో ఏమంటోంది?
నాటో ఒక రక్షణాత్మక కూటమి. ఎవరైనా తమ కూటమిలో చేరవచ్చన్నది దాని విధానం. అందులో మార్పు ఏమీ ఉండదని 30 సభ్య దేశాలు నిక్కచ్చిగా చెబుతుంటాయి.
నాటోలో చేరడానికి "స్పష్టమైన, ఆచరణయోగ్యమైన సమయ నిర్దేశం" జరగాలని యుక్రెయిన్ అధ్యక్షుడు కోరారు. కానీ, అది సమీప భవిష్యత్తులో జరిగే సూచనలేమీ కనిపించడం లేదు. జర్మనీ చాన్స్‌లర్ కూడా ఈ విషయాన్ని ఇదివరకే స్పష్టం చేశారు.
నాటోలో సభ్యత్వం ఉన్న దేశాలు ఏవైనా తమ సభ్యత్వాన్ని రద్దు చేసుకునే అవకాశాలు దాదాపు లేవనే చెప్పాలి.
పశ్చిమ దేశాలు 1990లోనే నాటోను తూర్పు దిశగా ఒక్క అంగుళం కూడా విస్తరించనివ్వమని మాట ఇచ్చాయని పుతిన్ అంటున్నారు. కానీ, అది విస్తరించిందన్నది వాస్తవం.

ఫొటో సోర్స్, Reuters
7. దీనికి దౌత్య పరిష్కారం ఉందా?
ఎలాంటి కారణం లేకుండానే తూర్పు యుక్రెయిన్ ప్రాంతంలో శాంతి స్థాపన ప్రక్రియను రష్యా ధ్వంసం చేస్తోందని జర్మనీ ఆరోపించింది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ శాంతి ఒప్పందాన్ని పునరుద్ధరించే సూచనలేవీ కనిపించడం లేదు.
పుతిన్-బైడెన్ భేటీ మీద కొందరు ఆశావహంగా కనిపించారు. కానీ, ఇప్పుడు ఆ ఆశలు కూడా ఆవిరైపోయాయి.
అణ్వస్త్రాలను దేశ భూభాగాలకు వెలుపల మోహరించకుండా అమెరికాతో ఒప్పందం కుదుర్చుకోవాలని రష్యా కోరుకుంది. అయితే, చిన్న, మధ్య శ్రేణి క్షిపణులను మోహరించే పరిమితుల గురించి చర్చలు ప్రారంభిద్దామని, ఖండాంతర క్షిపణుల విషయంలోనూ కొత్త ఒప్పందంపై చర్చించవచ్చని అమెరికా ప్రతిపాదించింది.
పాశ్చాత్య దేశాల స్పందన పట్ల రష్యా నిరుత్సాహంతో ఉంది. అయితే, క్షిపణి స్థావరాల విషయంలో పరస్పర 'పారదర్శక యంత్రాంగాన్ని' ఏర్పాటు చేసుకునే దిశగా అడుగులు వేయడంపై సానుకూలంగా ఉంది. ప్రస్తుతం రష్యాకు స్వదేశంలో రెండు... రొమేనియా, పోలండ్ దేశాల్లో రెండు క్షిపణి స్థావరాలు ఉన్నాయి.

ఫొటో సోర్స్, Reuters
ఇవి కూడా చదవండి:
- దుబాయ్‌లో 13 రోజుల సహవాసం, మాల్దీవుల్లో, మెక్సికోలో డేటింగ్, ఇండియాలో పెళ్లి
- కస్తూర్బా గాంధీ: శరీరం భస్మమైంది, ఆమె 5 గాజులు మిగిలే ఉన్నాయి
- యుక్రెయిన్-రష్యా ఉద్రిక్తతలపై భద్రతామండలి అత్యవసర సమావేశం: భారత్, చైనా ఏమన్నాయంటే..
- లఖీంపుర్ ఖీరీ: ‘ప్రభుత్వం డబ్బు తిరిగి తీసుకున్నా మంచిదే కానీ మాకు న్యాయం కావాలి’
- తల్లి కళ్లెదుటే కూతురి హత్య: ప్రేమించట్లేదని గొంతు కోశాడు, ప్రాణం పోయేదాకా ఎవర్నీ దగ్గరకు రానివ్వలేదు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














