గుజరాత్: తల్లి కళ్లెదుటే కూతురి హత్య: ప్రేమించట్లేదని గొంతు కోశాడు, ప్రాణం పోయేదాకా ఎవర్నీ దగ్గరకు రానివ్వలేదు...

20 ఏళ్ల యువకుడు గ్రీష్మను హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి
ఫొటో క్యాప్షన్, 20 ఏళ్ల యువకుడు గ్రీష్మను హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి

మహిళల భద్రత గురించి గ్రీష్మ వెకారియా కుటుంబం ప్రభుత్వాన్ని నిలదీస్తోంది. గుజరాత్ రాష్ట్రంలో మహిళలకు కల్పిస్తున్న రక్షణ గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది.

బీబీసీ గుజరాతీతో మాట్లాడిన గ్రీష్మ కుటుంబసభ్యులు... పట్టపగలే తమ కూతురు దారుణ హత్యకు గురైందని, ఇలాంటి పరిస్థితుల్లో మహిళల భద్రతకు కృషి చేస్తున్నట్లు ప్రభుత్వం ఎలా చెప్పుకుంటోందని నిలదీశారు.

ప్రేమ ప్రతిపాదనను తిరస్కరించిందనే అక్కసుతో కుటుంబ సభ్యుల ఎదుటే ఫెనిల్ గోయాని అనే యువకుడు గ్రీష్మ గొంతుకోసి హత్య చేశారని చెబుతున్నారు.

''ఇలాంటి ఘటనలు జరుగుతుంటే అమ్మాయిలు ఎలా చదువుకుంటారు? 'బేటీ బచావో, బేటీ పడావో' అంటూ ప్రభుత్వం ప్రకటనలు చేస్తోంది. పట్టపగలే అమ్మాయిల హత్యలు జరుగుతున్నప్పుడు ఇలాంటి ప్రకటనలకు అర్థమే లేదు. వాటిని వెంటనే తొలగించాలి. మహిళల భద్రత గురించి ప్రభుత్వం ఇస్తోన్న నినాదాలను ఆపేయాలి. 'బేటీ బచావో'కు బదులుగా, 'మీ కూతురును కాపాడుకోవాలంటే ఆమెను ఇంటికే పరిమితం చేయండి' అని చెబితే బావుంటుంది'' అని గ్రీష్మ బంధువు రాధిక ఆగ్రహం వ్యక్తం చేశారు.

వీడియో క్యాప్షన్, ‘నా న్యూడ్ ఫొటోలను టెలిగ్రాం తొలగించట్లేదు... అలాంటి ఫొటోలు ఇంకా కావాలంట’

నిందితుడు ఫెనిల్‌ను తీవ్రంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. ''దేశంలోని ఏ ఆడపిల్లకు కూడా గ్రీష్మ గతి పట్టకూడదు. అమ్మాయిలకు రక్షణ ఏది? రాష్ట్ర ప్రభుత్వం తగిన భద్రతను కల్పిస్తేనే రాష్ట్రంలోని అమ్మాయిలు భద్రంగా ఉంటారు'' అని ఆమె వ్యాఖ్యానించారు.

తమ కూతురు గ్రీష్మకు న్యాయం జరగాలని ఆమె తల్లి విలాస్ వెకారియా బీబీసీతో అన్నారు.

బీబీసీతో మాట్లాడిన గ్రీష్మ తల్లి విలాస్ వెకారియా... తమ కుమార్తెకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. ''నా కూతురు అమాయకురాలు. ఆమె ఏ తప్పు చేయలేదు. అయినా హత్య చేశారు. నాకు న్యాయం కావాలి. నా కళ్లెదుటే నా కూతురు గొంతుకోశాడు. రక్తం ధారలుగా పారింది. ఇదంతా నా కళ్ల ముందే జరిగింది'' అని ఆమె విలపించారు.

గ్రీష్మ తల్లి విలాస్ వెకారియా
ఫొటో క్యాప్షన్, గ్రీష్మ తల్లి విలాస్ వెకారియా

ఏడాదిగా గ్రీష్మను వేధిస్తోన్న ఫెనిల్

గత ఏడాదిగా గ్రీష్మను ఫెనిల్ వేధిస్తున్నాడని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు చేశారు. దీని తర్వాత ఇరు కుటుంబాలు ఒక రాజీకి వచ్చాయి.

ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దీన్ని చూసిన ప్రజలు పోలీసు వ్యవస్థ పనితీరును ప్రశ్నిస్తున్నారు.

నిందితుడు ఫెనిల్‌పై కారు దొంగతనం కేసు కూడా నమోదైంది. ఈ కేసును కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫెనిల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

సూరత్‌లోని కమ్రేజ్ ప్రాంతానికి చెందిన ఖోల్వాడ్ లక్ష్మీధన్ సొసైటీలో నివసించే గ్రీష్మ వెకారియా... అమ్రోలీలోని జెజె షా కాలేజీలో బీకామ్ చదువుతున్నారు.

నిందితుడు ఫెనిల్ గొయాని

ఫొటో సోర్స్, INSTAGRAM

ఫొటో క్యాప్షన్, నిందితుడు ఫెనిల్ గోయాని

ఘటన రోజు ఏం జరిగింది?

నిందితుడు ఫెనిల్ పంజాక్ గోయాని గత సంవత్సర కాలంగా గ్రీష్మను వేధిస్తున్నారు. సౌరాష్ట్రలోని గిరియాధర్‌కు చెందిన మోతీ వావాడి గ్రామానికి చెందిన ఫెనిల్... సూరత్‌లోని కపూదారాలో ఉన్న సాగర్ సొసైటీలో నివసిస్తున్నారు.

''గ్రీష్మ తల్లిదండ్రులు, ఫెనిల్ గురించి ఆయన తల్లిదండ్రుల దృష్టికి కూడా తీసుకెళ్లారు. గ్రీష్మ మామతో పాటు ఆమె తండ్రి స్నేహితుడు వెళ్లి ఫెనిల్ కుటుంబాన్ని కలిసి ఫిర్యాదు చేశారు. ఇకపై గ్రీష్మను వేధించనని, ఆమె వెంటపడటం మానేస్తానని ఫెనిల్ కూడా వాగ్దానం చేసినట్లు'' ఫిర్యాదులో పేర్కొన్నారు.

''ప్రేమికుల రోజుకు రెండు రోజుల ముందు శనివారం గ్రీష్మ ఉండే సొసైటీకి ఫెనిల్ చేరుకున్నారు. ఫెనిల్‌ను చూసిన గ్రీష్మ, అతని గురించి తన పెదనాన్న సుభాష్‌కు చెప్పింది. ఫెనిల్‌ను ఆపేందుకు సుభాష్ ప్రయత్నించారు. కానీ చాకుతో ఆయన్ను గాయపరిచాడు.''

''ఆమె తమ్ముడు, 17 ఏళ్ల ధ్రువ్ కూడా ఫెనిల్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కానీ గ్రీష్మను వెనకనుంచి దొరకబుచ్చుకున్న ఫెనిల్ ఆమె మెడపై కత్తిపెట్టి అందరినీ భయపెట్టాడు.''

''గ్రీష్మ కూడా తన తమ్ముడు, పెదనాన్నను కాపాడేందుకు ప్రయత్నించింది. కానీ ఆమె నిందితునికి చిక్కింది. మెడపై కత్తిపెట్టిన ఫెనిల్ ఆమెను గట్టిగా అదిమి పట్టుకున్నాడు. ఆమెను వదిలిపెట్టాలని గ్రీష్మ తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు వేడుకున్నారు. కానీ గొంతు కోసి ఆమెను హత్య చేశాడు'' అని ఫిర్యాదులో పేర్కొన్నారు.

డిప్యూటీ ఎస్పీ బీకే వానార్ తెలిపిన వివరాల ప్రకారం.. మృతురాలు, నిందితుని వయస్సు 20 నుంచి 21 ఏళ్లలోపు ఉంటుంది

ఫొటో సోర్స్, INSTAGRAM/_FENIL_01

ఫొటో క్యాప్షన్, డిప్యూటీ ఎస్పీ బీకే వానార్ తెలిపిన వివరాల ప్రకారం.. మృతురాలు, నిందితుని వయస్సు 20 నుంచి 21 ఏళ్లలోపు ఉంటుంది

ఆత్మహత్యకు ప్రయత్నించిన నిందితుడు

ప్రత్యక్ష సాక్షులు చెప్పినదాని ప్రకారం, ''గ్రీష్మ గొంతు కోసిన తర్వాత కూడా ఫెనిల్ అక్కడే ఉన్నాడు. ఆమెను ఎవరూ కాపాడకుండా అడ్డుకున్నాడు.''

గ్రీష్మ చనిపోయిందని నిర్ధరించుకున్న తర్వాత కత్తితో పొడుచుకొని చనిపోయేందుకు నిందితుడు ప్రయత్నించినట్లు కొన్ని మీడియా కథనాలు తెలిపాయి.

దీని గురించి సూరత్ డిప్యూటీ ఎస్పీ బీకే వానార్, బీబీసీ గుజరాతీతో మాట్లాడారు. ''నిందితుడు ఆత్మహత్యకు ప్రయత్నించలేదు. నిజానికి గ్రీష్మను ఎవరూ కాపాడకుండా అతను ఘటనా స్థలంలోనే ఉన్నాడు. గొంతు కోశాక కిందపడిన గ్రీష్మ బాధతో విలవిల్లాడింది. అయినప్పటికీ ఆమె వద్దకు నిందితుడు ఎవర్నీ రానీయలేదు. ఆసుపత్రికి తీసుకెళ్లనీయలేదు. ఆమె చనిపోయిందని నిర్ధరించుకునేవరకు అక్కడే ఉన్నాడు'' అని చెప్పారు.

''నిందితుడు అక్కడే రెండు, మూడు నిమిషాలు ఉన్నారు. గ్రీష్మ నొప్పితో బాధపడుతోన్న సమయంలో అతను పొగాకు నములుతూ ఇతరులను గాయపరిచేందుకు ప్రయత్నించాడు. అక్కడ ప్రజలు గుమిగూడటం మొదలుకావడంతో వారిని భయపెట్టడానికి తనను తానే పొడుచుకున్నాడు'' అని ఆయన వివరించారు.

వీడియో క్యాప్షన్, ‘లవర్ బాయ్స్’: యువతుల్ని ఉచ్చులోకి దింపుతున్నారు.. సెక్స్ కోసం అమ్మేస్తున్నారు

గ్రీష్మ, ఫెనిల్ వయస్సు 20 లేదా 21 సంవత్సరాల మధ్య ఉండొచ్చని వానార్ చెప్పారు.

ఫెనిల్ తండ్రి పంకజ్ గోయాని మీడియాతో మాట్లాడుతూ... ''కుటుంబానికి ఫెనిల్ సమస్యగా తయారయ్యాడు. ఎవరి మాట అతను వినడు. గ్రీష్మ కుటుంబం ఫెనిల్ గురించి ఫిర్యాదు చేసినప్పుడు కూడా నేను అతన్ని మందలించాను. ఇకపై గ్రీష్మను బాధపెట్టనని అప్పుడు చెప్పాడు. కానీ అతనిలో మార్పు రాలేదు'' అని అన్నారు.

ఫెనిల్ ఆరోగ్య పరిస్థితి గురించి కూడా ఆసుపత్రి వారిని విచారించలేదని ఆయన తెలిపారు.

గ్రీష్మ తండ్రి ఆఫ్రికాలో పనిచేస్తుంటారు. ఆయన ఆఫ్రికా నుంచి భారత్‌కు వచ్చేసరికే ఆమె అంత్యక్రియలు ముగిశాయి. కుటుంబసభ్యులతో పాటు పొరుగువారు కూడా పెద్ద సంఖ్యలో గ్రీష్మ అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

ఫెనిల్

ఫొటో సోర్స్, INSTAGRAM

కాలేజీ నుంచి తొలగింపు..

ఫెనిల్ చదివిన కాలేజీలో స్థానిక జర్నలిస్ట్ వందన్ భదానీ కూడా చదువుకున్నారు. భదానీ చెప్పినదాని ప్రకారం, హాజరు 10 శాతం కంటే తక్కువగా ఉండటంతో 2020 జూన్‌లోనే కాలేజీ యాజమాన్యం అతన్ని తప్పించింది.

''ఫెనిల్, కాలేజీలో ఒక సంవత్సరం మాత్రమే చదివారు. రెండో ఏడాది నుంచి చదువు మానేశారు. ఎంబ్రాయిడరీ బొటిక్ సెంటర్‌లో అతను పనిచేసేవాడు. గత 15-17 రోజులుగా ఖాళీగానే తిరుగుతున్నాడు. ప్రాథమికంగా చూస్తే ఇది వన్ సైడ్ లవ్ కేసుగా కనిపిస్తోంది. పోలీసు రికార్డుల ప్రకారం అతనిపై కారు దొంగతనం కేసు కూడా నమోదైంది. ఆ కేసులో మరో నలుగురు కూడా నిందితులుగా ఉన్నారు. సమగ్ర విచారణ తర్వాతే వారు ఆ కారును ఎందుకు దొంగిలించారో తెలుస్తుంది'' అని వానార్ అన్నారు.

ఫిబ్రవరి 12న మరో ముగ్గురు లేదా నలుగురితో కలిసి గ్రీష్మ సొసైటీకి ఫెనిల్ వచ్చినట్లు కొంతమంది చెప్పారని వందన్ తెలిపారు. ఫెనిల్‌తో వచ్చినవారు బయటే ఆగిపోయారు. తర్వాత పారిపోయారని వందన్ అన్నారు. కానీ పోలీసులు దీన్ని ఇంకా ధ్రువీకరించలేదు.

''కాలేజీకి వెళ్లి ఫెనిల్, గ్రీష్మతో గొడవపడ్డాడు. అతను చాలా ప్రమాదకరమైన వ్యక్తి. ఇప్పటికే అతడిని రెండు, మూడు సార్లు హెచ్చరించారు. ఇకపై ఫెనిల్ నుంచి ఎలాంటి వేధింపులు ఉండబోవని ఆయన తండ్రి కూడా చెప్పారు. రెండు, మూడు నెలలు అంతా ప్రశాంతంగానే ఉంది. ఆ తర్వాత మళ్లీ గ్రీష్మతో గొడవపడ్డాడు. ఇదంతా గ్రీష్మ తండ్రికి తెలియదు. కానీ మిగతా కుటుంబసభ్యులందరికీ దీని గురించి గ్రీష్మ చెప్పింది'' అని వందన్ తెలిపారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు

గ్రీష్మ హత్య వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గ్రీష్మ హత్యకు సంబంధించిన వీడియోకు తప్పుడు వ్యాఖ్యలు జోడించి సోషల్ మీడియాలో వ్యాప్తి చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఈ హత్యకు సంబంధించి తప్పుడు కథనాలు వ్యాప్తి చెందుతున్నాయని బీబీసీ గుజరాతీ చేసిన ఫ్యాక్ట్ చెక్‌లో తేలింది.

లవ్ జిహాద్, ఇస్లాం మతమార్పిడికి ముడిపెట్టి తప్పుడు వాదనలతో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఈ వీడియోను షేర్ చేస్తున్నట్లు బీబీసీ గుజరాతీ పరిశోధనలో కనుగొంది.

''గ్రీష్మను హత్య చేసిన ఫెనిల్ ఒక ముస్లిం యువకుడు. హిందు యువతి అయిన గ్రీష్మ, ఇస్లాంలోకి మారేందుకు అంగీకరించకపోవడంతోనే ఫెనిల్ ఆమెను హత్య చేశాడు'' అని పేర్కొంటూ దేవ్ కటోచ్ అనే ఖాతాదారుడు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ఇలాంటి వాదననే హిందూ రాష్ట్ర ప్రశాసనిక్ సమితి అనే ట్విట్టర్ అకౌంట్ కూడా షేర్ చేసింది.

ISWOTY

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)