INSTAGRAM: 'చారిత్రక కట్టడాల దగ్గర సెల్ఫీలు తీసుకోవడం కాదు.. అవి చెప్పే కథలు వినాలి'

కొందరు ఔత్సాహికులు ఇన్‌స్టాగ్రామ్‌లో దిల్లీ చరిత్ర కథలు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, కొందరు ఔత్సాహికులు ఇన్‌స్టాగ్రామ్‌లో దిల్లీ చరిత్ర కథలు చెబుతున్నారు.
    • రచయిత, జోయా మతీన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కోల్‌కతాకు చెందిన ఉమైర్‌కు ఏడేళ్ల వయసున్నప్పుడు ఒక నాణేల వ్యాపారితో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి నాణేలు సేకరించడం ఒక అభిరుచిగా మారింది. అదే మొదటిసారి ఉమైర్ చరిత్ర గురించి తెలుసుకోవడం.

నాణేలపై ఉన్న రాజుల గురించి తెలుసుకుంటూ, వారి చరిత్రలు చదవడం ప్రారంభించారు.

"నాకు 16 ఏళ్లు వచ్చేసరికి ఆ వ్యక్తులు, ప్రాంతాలను చూడాలనే వెర్రి కోరిక మొదలైంది" అంటూ ఉమైర్ చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఉమైర్‌కు 27 ఏళ్లు. దిల్లీలో ఫ్యాషన్ బ్రాండ్‌లకు డిజిటల్ మార్కెటింగ్ చేస్తుంటారు.

'సిక్కావాలా' అంటే నాణేలు సేకరించే వ్యక్తి అని అర్థం. అదే ఉమైర్ ఇన్‌స్టాగ్రామ్‌ పేజీ పేరు. అక్కడ, చరిత్ర మిగిల్చిన గుర్తులన్నీ పంచుకుంటారు ఉమైర్.

దిల్లీలోని చారిత్రక ప్రదేశాల్లో హుమాయున్ సమాధి కూడా ఒకటి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, దిల్లీలోని చారిత్రక ప్రదేశాల్లో హుమాయూన్ సమాధి కూడా ఒకటి

ఇన్‌స్టాగ్రామ్‌‌లో పోస్ట్ చేయడమంటే చరిత్రను ఒక ఫొటోకు కుదించడం కాదు. ఉమైర్ పెట్టే క్యాప్షన్స్ ఓ కమ్మని కథలా సాగిపోతాయి. రాజ్యాలేలిన చక్రవర్తులు, చరిత్ర చూసిన కుట్రలు, కుతంత్రాలు, తిరుగుబాటుదారుల కథలన్నీ సుమారు 300 పదాల్లో ఆసక్తి కలిగించేలా చెప్తారు ఉమైర్.

"ఏదైనా శిథిలాన్ని చూసినప్పుడు, చరిత్రకు సజీవ రూపంలా కనిపిస్తుంది. వెంటనే దాని వెనుక కథను అందరితో పంచుకోవాలనుకుంటా" అన్నారు ఉమైర్.

చాలా ఏళ్లుగా పరిశోధకులు, చరిత్రకారులు మాత్రమే దిల్లీ చరిత్ర గురించి చెబుతూ వచ్చారు. ఇప్పుడు ఉమైర్ లాంటి ఔత్సాహికులు కూడా చరిత్రను తమ కళ్లతో చూపిస్తున్నారు.

ఉమైర్ మాత్రమే కాదు ఇలాంటి ఔత్సాహికులు ఎందరో ఉన్నారు.

పాత దిల్లీలోని అంతగా ప్రాముఖ్యం లేని జైన దేవాలయాలు సుఫియాన్‌ను ఆకర్షించాయి

ఫొటో సోర్స్, RAMEEN KHAN

ఫొటో క్యాప్షన్, పాత దిల్లీలోని అంతగా ప్రాముఖ్యం లేని జైన దేవాలయాలు సుఫియాన్‌ను ఆకర్షించాయి

'చరిత్రతో ప్రేమలో పడాలి'

34 ఏళ్ల రమీన్ ఖాన్ ఎంబీఏ చేశారు. స్నాప్‌డీల్ సంస్థలో పనిచేస్తున్నారు. దిల్లీ మీద ఇష్టంతో ఈ నగరానికి వచ్చారు.

"దిల్లీ రావడం ఓ అందమైన ప్రారంభం" అని రమీన్ అంటారు. అప్పటి నుంచీ ఆయనకు పర్యటనలపై ఆసక్తి పెరిగింది. ఇప్పటివరకూ 10 రాష్ట్రాలు తిరిగారు. ఆ విశేషాలన్నీ తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజీ 'సిటీ టేల్స్'లో పోస్టు చేస్తుంటారు.

చరిత్రతో అందరూ ప్రేమలో పడాలని ఉమైర్, రమీన్ అంటారు.

"చాలామంది పురాతన కట్టడాలను చూడ్డానికి వెళ్లి సెల్ఫీలు తీసుకుంటారు, డాన్స్ వీడియోలు లేదా రీల్స్ క్రియేట్ చేస్తారు. అది కాదు. ఆ ప్రదేశం మనకు చెబుతున్న కథలు వినాలి" అంటారు ఉమైర్.

చరిత్ర మీద విపరీతమైన ఆసక్తి ఉన్న ఉమైర్ లాంటివాళ్లకు ఏ చిన్న శిథిలమైనా ఆకర్షణే

ఫొటో సోర్స్, UMAIR SHAH

ఫొటో క్యాప్షన్, చరిత్ర మీద విపరీతమైన ఆసక్తి ఉన్న ఉమైర్ లాంటివాళ్లకు ఏ చిన్న శిథిలమైనా ఆకర్షణే

వీళ్లకి ఇన్‌స్టాగ్రామ్‌లో వేలమంది ఫాలోవర్స్ ఉన్నారు. రాణా సఫ్వీ వంటి ప్రఖ్యాత చరిత్రకారుల ప్రశంసలు కూడా పొందారు.

"వర్తమానాన్ని చరిత్రను ముడిపెట్టే ఇలాంటి ఔత్సాహికులు మనకి కావాలి. చరిత్రకారులు చేసిన పరిశోధనలను అందరికీ సులువుగా అర్థమయే రీతిలో చెప్పగలగాలి. వీళ్లు మంచి పని చేస్తున్నారు. మనందరం కొంచం కొంచంగా అన్నీ నేర్చుకుంటూ ఎదుగుతాం. వీళ్లు ఎదగడం నేను చూశాను. గత అనుభవాల నుంచి నేర్చుకుంటూ, ఏవైనా తప్పులు ఉంటే సరిదిద్దుకుంటూ ముందుకెళుతున్నారు" అని సఫ్వీ అన్నారు.

చారిత్రక కట్టడం

ఫొటో సోర్స్, Getty Images

'పురాతన కట్టడాల పట్ల నిర్లక్ష్యానికి కారణం శ్రద్ధ, అవగాహన లేకపోవడమే'

దేశ రాజధాని దిల్లీ చారిత్రక కట్టడాలకు పెట్టింది పేరు. కోటలు, గోరీలు, సమాధులు, తోటలు, పురాతన ఆలయాలు, మసీదులు.. ఇలా చూడ్డానికి ఎన్నో ఉన్నాయి. శీతాకాలం అయితే ఇంకా బావుంటుంది.

అలాంటి ఓ శీతాకాలపు మధ్యాహ్నం ఉమైర్, మెహ్రౌలీ ఆర్కియోలాజికల్ పార్క్‌ను సందర్శించారు. మరొకరోజు రమీన్ కూడా అక్కడికి వెళ్లారు.

వాళ్లకు ఎంత పాపులారిటీ ఉందంటే ఫలనా ప్రదేశానికి వెళ్లి ఫొటోలు తీసి చూపించమని ఫాలోవర్స్ అడుగుతుంటారు. మెహ్రౌలి కూడా అలా వచ్చిన ఒక ప్రతిపాదనే.

దిల్లీగా ఏకమైన ఏడు నగరాల్లో మెహ్రౌలీ ఒకటి. సుమారు 200 ఎకరాల విస్తీర్ణంలో దగ్గర దగ్గర 100 రాతి శిథిలాలు, గోరీలు ఉన్నాయక్కడ.

"తాజ్ మహల్ లేదా కుతుబ్ మినార్‌లా ఇవి అంత పాపులర్ కాలేదు. కానీ, వీటిని కూడా గుర్తించాలి" అంటారు రమీన్.

దిల్లీలో ఉన్న ఒక లోతైన మెట్లబావి

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, దిల్లీలో ఉన్న ఒక లోతైన మెట్లబావి

కుతుబ్ మినార్ నుంచి మెహ్రౌలీ కొన్ని మీటర్ల దూరంలోనే ఉంటుంది. అక్కడకు వెళ్లిన వారిలో కొందరు ఇక్కడికీ వెళుతుంటారు.

తుగ్లక్‌ల నుంచి లోధీల వరకు, రాజపుత్‌లు, మొఘలుల నుంచి బ్రిటిష్ వరకు, ఈ నగరం గత చరిత్ర ఆనవాళ్లను మన కళ్ల ముందు ఉంచుతుంది అంటారు రమీన్.

అయితే, ఆ స్థలాన్ని నిర్లక్ష్యం చేసిన సంకేతాలు అక్కడక్కడా కనిపిస్తూ ఉంటాయి. చుట్టూ పేరుకుపోయిన పొదలు, ముళ్లకంచెలు, ఒకప్పటి రాజ ప్రాంగణాలలో మంట వేసి చుట్టూ కూర్చుని పొగ తాగే మనుషులు, మెట్ల బావుల్లోకి తొంగి చూస్తే పోగుపడిన చెత్త కనిపిస్తుంది.

శ్రద్ధ, అవగాహన లేకపోవడమే ఈ నిర్లక్ష్యానికి కారణమని రమీన్ అంటారు.

"చరిత్ర బోరింగ్ అనుకుంటారు చాలామంది. అందుకే, తెలుసుకోవాలన్న ఆసక్తి చూపించరు."

చరిత్రలో మరుగునపడిన శిథిలాలను వెలికితీయాలనే ఉద్దేశంతోనే మెహ్రౌలీ వెళ్లానని రమీన్ చెప్పారు.

అక్కడ ఆయనకు ఊహించని నిధి నిక్షేపాలు దొరికాయి. పక్కనే ఉన్న హరియాణాలో 15వ శతాబ్దానికి చెందిన ఒక మసీదు కంటబడింది. అది ఇప్పుడు ఒక ప్రభుత్వ పాఠశాల.

"ఇలా ఎవరికీ తెలియని ప్రదేశాల గురించి నేను పోస్ట్ చేసినప్పుడు, చాలామంది ఉత్సాహం చూపిస్తారు. అదే ఉత్సాహంతో వాళ్లు కూడా ఇవన్నీ సందర్శిస్తారని ఆశిస్తున్నా" అంటారు రమీన్.

పురావస్తు ఉద్యానవనం దాదాపు 200 ఎకరాల్లో విస్తరించింది

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పురావస్తు ఉద్యానవనం దాదాపు 200 ఎకరాల్లో విస్తరించి ఉంది

'ఇది క్షమించరాని అజ్ఞానం'

ఉమైర్ కూడా ఇలాంటి ప్రదేశాలను కనుగొన్నారు.

మెహ్రౌలీలో ఒక రెండంతస్థుల మొఘల్ సమాధి ఉంది. అక్కడి చెక్కడాలపై ధూళి నిండిపోయుంటుంది కానీ, జాగ్రత్తగా గమనిస్తే విక్టోరియన్ ఆర్కిటెక్చర్ జాడలు కనిపిస్తాయి.

ఇది ఇలా మరుగున పడిపోవడం "క్షమించరాని అజ్ఞానం" అంటారు ఉమైర్.

థామస్ మెట్‌కాల్ఫ్, అనే బ్రిటిష్ ఏజెంట్ ఈ సమాధికి మరమ్మత్తులు చేయించి "అతిథుల కోసం ఒక రిసార్ట్"గా ఉపయోగించారని ఉమైర్ వివరించారు.

"ఇదే దిల్లీలో తొలి హోటల్ అని చెప్పుకోవచ్చు" అన్నారు.

హరియాణాలోని నజీమ్ అల్ హఖ్ మసీదులో ఇప్పుడు పాఠశాలను నిర్వహిస్తున్నారు

ఫొటో సోర్స్, RAMEEN KHAN

ఫొటో క్యాప్షన్, హరియాణాలోని నజీమ్ అల్ హఖ్ మసీదులో ఇప్పుడు పాఠశాలను నిర్వహిస్తున్నారు

'ఈ నగరం పట్ల ఉన్న ప్రేమతోనే ఇదంతా చేస్తున్నా'

దిల్లీ గురించి చెప్పాలంటే ముందు షాజహానాబాద్ లేదా పురానా దిల్లీ గురించి ప్రస్తావించాలి. అక్కడే ఎర్రకోట, విశాలమైన జామా మసీదు ఉన్నాయి. ఇరుకైన వీధులు, చిన్నచిన్న దుకాణాలు, అంగళ్లలో అమ్మే ఆహార పదార్థాలు, లోపల్లోపలికి ఉండే ఇళ్లు.. తప్పక చూడాల్సిన ప్రదేశం ఇది.

28 ఏళ్ల అబు సూఫియాన్ జామా మసీదు సమీపంలో నివసిస్తారు. మీడియా కన్సల్టంట్‌గా పనిచేస్తున్నారు. తనకు కూడా ఒక ఇన్‌స్టాగ్రాం పేజీ ఉంది. దాని పేరు 'పురానా దిల్లీ వాలో కీ బాతేం' అంటే పురానా దిల్లీవాసుల కబుర్లు అని అర్థం. ఆయనకు కూడా వేలల్లో ఫాలోవర్స్ ఉన్నారు.

కులీ ఖాన్ సమాధి

ఫొటో సోర్స్, RAMEEN KHAN

ఫొటో క్యాప్షన్, కులీ ఖాన్ సమాధి

పాత హవేలీలు, శిథిలమైన భవనాలు, ఘనమైన జైన దేవాలయాలు, రుచికరమైన ఆహార పదార్థాల వెనుక కథలు చెబుతుంటారు సూఫియాన్.

"ఈ నగరం పట్ల ఉన్న ప్రేమతోనే ఇదంతా చేస్తున్నా" అంటారాయన.

"పురాన దిల్లీ తన శరీరంలో ఒక భాగం లాగ. అంతా బాగా తెలుసు అతనికి. షాజహానాబాద్‌పై నేను రాసిన పుస్తకం కోసం చాలాసార్లు సూఫియాన్ సహాయం తీసుకున్నాను. పుస్తకంలో తన పేరు చాలాసార్లు ప్రస్తావించాను కూడా" అని సఫ్వి చెప్పారు.

జామా మసీదు భారతదేశంలోని అతిపెద్ద మసీదు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జామా మసీదు

ఉమైర్, రమీన్‌లు చరిత్ర గుర్తులుగా మిగిలిన కట్టడాల పట్ల ఆకర్షితులయితే, సూఫియాన్ అక్కడ నివసించే, ఆ ప్రాంతాన్ని సందర్శించే ప్రజల జీవితాల పట్ల ఆసక్తి చూపిస్తారు.

"దిల్లీ నగరం అంతులేని రహస్యాల నిలయం. అన్వేషించాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. ఒక్కొక్కటిగా వెతుక్కుంటూ ముందుకెళ్లాలి" అంటారు సూఫియాన్.

ISWOTY

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)