టెలిగ్రామ్: ‘నా న్యూడ్ ఫొటోలను ఈ సోషల్ మీడియా యాప్ తొలగించట్లేదు’

మహిళల న్యూడ్ చిత్రాలు

ఫొటో సోర్స్, KLAWE RZECZY

    • రచయిత, గ్లోబల్ డిస్‌ఇన్ఫర్మేషన్ టీమ్
    • హోదా, బీబీసీ వరల్డ్ సర్వీస్

మహిళలను హింసించడానికి, అవమానించడానికి, వేధించడానికి సోషల్ మీడియా యాప్ 'టెలిగ్రామ్'లో పెద్ద ఎత్తున వారి ప్రైవేటు, సన్నిహిత ఫొటోలను షేర్ చేస్తున్నట్లు బీబీసీ పరిశోధనలో తేలింది.

హెచ్చరిక: ఈ కథనంలో లైంగిక స్వభావానికి సంబంధించిన సమాచారం ఉంటుంది.

ఒక్క క్షణంలో సారా జీవితం పూర్తిగా మారిపోయింది. ఆమె నగ్న చిత్రం ఒకటి లీకై టెలిగ్రామ్‌లో షేర్ అయింది. ఫొటోతో పాటు ఆమె ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ఖాతాల ప్రొఫైళ్లు, ఫోన్ నంబర్‌ను కూడా యాప్‌లో ఉంచారు. మరిన్ని ఫొటోలు పెట్టాలంటూ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఆమెకు ఫోన్లు రావడం మొదలైంది.

''నేనో వేశ్యను అనే భావనను నాకు కలిగిస్తున్నారు. నా ఫొటోలను నేనే యాప్‌లో షేర్ చేశానని వారందరూ అనుకుంటున్నారు. మహిళగా నా విలువను కోల్పోయాను'' అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

టెలీగ్రామ్‌లో ఫొటోలు వ్యాప్తి చెందడంతో సారా బయటకు వెళ్లడం మానేశారు

సారా (పేరు మార్చాం), ఒక వ్యక్తికి తన ఫొటోను పంపించారు. కానీ అది చివరకు 18,000 ఫాలోవర్లు ఉన్న ఒక టెలిగ్రామ్ గ్రూపులో దర్శనమిచ్చింది. ఆ గ్రూపులోని చాలా మంది తన పొరుగువారే. క్యూబాలోని హవానాలో ఆమె నివసిస్తారు. వీధుల్లోని అపరిచితులు కూడా తన ఫొటోను చూసి ఉంటారేమో అని ఆమె నిత్యం భయపడుతున్నారు.

''నాకు బయటకు వెళ్లాలని అనిపించట్లేదు. నా స్నేహితులను కలవాలని అనుకోవట్లేదు. నేను చాలా నలిగిపోయాను. ఇది నిజం'' అని ఆమె పేర్కొన్నారు.

ఈ సమస్య ఆమె ఒక్కరిదే కాదు. నెలల తరబడి టెలిగ్రామ్‌ను పరిశోధించిన తర్వాత... కనీసం 20 దేశాల్లోని మహిళలకు చెందిన వేలాది లీకైన, రహస్యంగా తీసిన, దొంగిలించిన ఫొటోలను టెలిగ్రామ్‌కు చెందిన పెద్ద గ్రూపులు, చానెళ్లు షేర్ చేస్తున్నట్లు మాకు తెలిసింది. ఈ సమస్య పరిష్కారం దిశగా టెలిగ్రామ్ కృషి చేస్తుందని చెప్పడానికి చాలా తక్కువ ఆధారాలు ఉన్నాయి.

సొంత దేశాన్ని విడిచిపెట్టే పరిస్థితుల్లోకి తనను నెట్టారని నిగర్ అన్నారు
ఫొటో క్యాప్షన్, సొంత దేశాన్ని విడిచిపెట్టే పరిస్థితుల్లోకి తనను నెట్టారని నిగర్ అన్నారు

క్యూబాకు వేల మైళ్ల దూరంలో ఉన్న నిగర్, తన కొత్త జీవితానికి అలవాటు పడాల్సి వస్తోంది.

ఆమె అజర్‌బైజాన్ దేశానికి చెందినవారు. కానీ స్వదేశాన్ని విడిచిపెట్టేలా తనపై ఒత్తిడి తెచ్చారని ఆమె చెబుతున్నారు. తన భర్తతో సెక్స్‌లో పాల్గొన్న వీడియోను ఆమె కుటుంబ సభ్యులకు పంపించడంతో పాటు టెలిగ్రామ్ గ్రూపులోనూ పోస్ట్ చేశారు.

''మా అమ్మ ఏడ్వటం మొదలుపెట్టింది. ఏడుస్తూనే తనకు వచ్చిన వీడియో గురించి నాతో చెప్పి బోరున విలపించింది'' అని ఆమె తెలిపారు.

40 వేల మంది సభ్యులు ఉన్న గ్రూపులో ఆ వీడియోను షేర్ చేశారు. ఇప్పుడామె తన భర్తతో విడిపోయారు. ఆ వీడియోలో తన మాజీ భర్త ముఖాన్ని బ్లర్ చేశారు. కానీ ఆమె ముఖం మాత్రం స్పష్టంగా కనబడేలా ఉంచారు.

తన మాజీ భర్తే రహస్యంగా ఈ వీడియో చిత్రీకరించారని ఆమె నమ్ముతున్నారు. అజర్‌బైజాన్ అధ్యక్షున్ని తరచుగా విమర్శించే ఆమె సోదరున్ని బ్లాక్ మెయిల్ చేయడానికే ఈ వీడియోను ఆయన చిత్రీకరించి ఉంటారని ఆమె భావిస్తున్నారు.

''నీ కొడుకు కంట్రోల్‌లో ఉండకపోతే, వీడియోను టెలిగ్రామ్‌లో విడుదల చేస్తామని మా అమ్మను బెదిరించారు'' అని ఆమె చెప్పారు.

''అందరూ మా వైపు అవమానంగా చూస్తారు. నాకు పెళ్లి జరిగిందనే సంగతిని ఎవరు పట్టించుకుంటారు?'' అని నిగర్ ఆవేదన వ్యక్తం చేశారు.

వీడియో గురించి తన మాజీ భర్తను నిలదీసినట్లు ఆమె చెప్పారు. తాను ఆ పనిచేయలేదని ఆయన బుకాయించారని ఆమె తెలిపారు. దీని గురించి ఆయనతో మాట్లాడేందుకు మేం ప్రయత్నించాం. కానీ ఆయన స్పందించలేదు.

తన జీవితాన్ని కొనసాగించడానికి నిగర్ చాలా కష్టపడుతున్నారు.

''నేను ఈ బాధ నుంచి కోలుకోలేను. వారానికి రెండుసార్లు థెరపిస్టులను కలుస్తున్నాను. ఇప్పటివరకు నా పరిస్థితిలో ఎలాంటి పురోగతి లేదని వారు చెబుతున్నారు. ఈ సంఘటనను మీరు మర్చిపోగలరా అని వారు నన్ను అడుగుతుంటారు. కానీ నేను వారికి చెప్పే సమాధానం 'లేదు' అని మాత్రమేనని ఆమె తన పరిస్థితిని వివరించారు.

సారా, నిగర్‌లకు చెందిన ఫొటోలు, వీడియోల గురించి టెలిగ్రామ్‌ యాజమాన్యానికి నివేదిక పంపారు. కానీ ఈ సమస్య గురించి టెలిగ్రామ్ స్పందించలేదు.

టెలీగ్రామ్

రష్యా నుంచి బ్రెజిల్ వరకు, కెన్యా నుంచి మలేసియా వరకు వివిధ దేశాలకు చెందిన 18 టెలిగ్రామ్ చానెళ్లను, 24 గ్రూపుల పనితీరుపై బీబీసీ నిఘా పెట్టింది.

ఫొటోలతో పాటు ఇంటి చిరునామా, తల్లిదండ్రుల ఫోన్ నంబర్లు వంటి వ్యక్తిగత వివరాలను కూడా పోస్ట్ చేస్తారు.

సహోద్యోగులు, మాజీ భాగస్వాములు, తోటి విద్యార్థులకు చెందిన ప్రైవేటు ఫొటోలను ఆటోమేటెడ్ అకౌంట్‌కు పంపించాలని సభ్యులను గ్రూపు అడ్మిన్లు కోరడం మేం గమనించాం. ఇలా చేయడం వల్ల ఫొటో పంపిన వారి వివరాలు బహిర్గతం కాకుండా ఫొటోలు మాత్రమే గ్రూపుల్లో షేర్ అవుతుంటాయి.

ట్విటర్ కంటే ఎక్కువగా, ప్రపంచవ్యాప్తంగా 50 కోట్లకు పైగా ఆక్టివ్ యూజర్లు ఉన్నారని, ప్రైవసీ విషయంలో కఠిన విధానాల కారణంగానే వినియోగదారులు తమ ప్లాట్‌ఫామ్‌ను వినియోగిస్తున్నారని టెలిగ్రామ్ చెప్పుకుంటోంది.

బెలారస్‌లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనల కోసం టెలీగ్రామ్‌ను ఉపయోగించుకున్నారు

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, బెలారుస్‌లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనల కోసం టెలిగ్రామ్‌ను ఉపయోగించుకున్నారు

2021 జనవరి నెలలో వాట్సాప్, ప్రైవసీ నిబంధనల్లో మార్పులు చేయడంతో... లక్షలాది మంది ప్రజలు టెలిగ్రామ్‌ వైపు మళ్లారు.

మీడియా సెన్సార్‌షిప్ ఉన్న దేశాల్లో ప్రజాస్వామ్య నిరసనకారుల కారణంగా టెలిగ్రామ్ చాలా ప్రజాదరణ పొందింది. ఇందులో తమ పేరు, ఫోన్ నంబర్ చెప్పకుండానే వినియోగదారులు తమ అభిప్రాయాలను పోస్ట్ చేయవచ్చు. 20 వేల సభ్యులు ఉన్న గ్రూపులను, చానెళ్లను ఏర్పాటు చేయవచ్చు.

గోప్యత కారణంగానే ప్రసిద్ధి పొందిన టెలిగ్రామ్‌లో కేవలం 'సీక్రెట్ చాట్' ఆప్షన్ మాత్రమే 'ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్' సౌకర్యాన్ని కల్పిస్తుంది. అంటే సందేశాలు పంపుకునే ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఆ సందేశాన్ని చూడగలరు. మిగతా మెసేజింగ్ యాప్‌లైన 'సిగ్నల్', 'వాట్సాప్'లలో ఈ సౌకర్యం డీఫాల్ట్‌గానే ఉంటుంది.

వీడియో క్యాప్షన్, ‘నా న్యూడ్ ఫొటోలను టెలిగ్రాం తొలగించట్లేదు... అలాంటి ఫొటోలు ఇంకా కావాలంట’

తక్కువ నిబంధనలు, ఎక్కువ స్వేచ్ఛ కోరుకునే వినియోగదారులు అధికంగా టెలిగ్రామ్ వైపు ఆకర్షితులు అవుతారు. ఇతర యాప్‌లు బ్యాన్ చేసిన యూజర్లకు కూడా టెలిగ్రామ్‌లో చోటు ఉంటుంది.

''ఖాతాదారులపై నియమాలు రుద్దాలని టెలిగ్రామ్, దాని యాజమాన్యం అనుకోవడం లేదు'' అని డిజిటల్ రైట్స్ గ్రూప్ యాక్సెస్‌కు చెందిన టెక్ లీగల్ కౌన్సిల్‌ నటాలియా క్రపివా అన్నారు.

టెలిగ్రామ్ అనుసరిస్తోన్న ఈ విధానం కారణంగానే సన్నిహిత ఫొటోలు లీక్ అవ్వడానికి, షేర్ అవ్వడానికి టెలిగ్రామ్ స్వర్గధామంగా మారినట్లు మా పరిశోధనలో తెలిసింది.

ఈ సమస్యను పరిష్కరించడానికి టెలిగ్రామ్‌ ఎలాంటి ప్రత్యేక విధానాన్ని పాటించడం లేదు. కానీ ప్రజలు చూసే టెలిగ్రామ్ చానెళ్లలో అశ్లీల, చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను పంచుకోవద్దని వినియోగదారులను కోరుతుంటుంది.

పోర్నోగ్రఫీ గురించి ఫిర్యాదు చేయడానికి టెలిగ్రామ్ యాప్‌లో ఒక ఫీచర్ కూడా ఉంటుంది.

టెలీగ్రామ్

పాలసీ విధానాన్ని టెలిగ్రామ్ ఎంత కఠినంగా అమలు చేస్తుందో పరీక్షించడానికి, ఇన్-యాప్ రిపోర్టింగ్ ఫీచర్ సహాయంతో పోర్నోగ్రఫీకి చెందిన 100 చిత్రాల గురించి మేం టెలిగ్రామ్‌కు ఫిర్యాదు చేశాం.

నెల తర్వాత కూడా మేం ఫిర్యాదు చేసిన చిత్రాల్లో 96 ఫొటోలు అలాగే ఉన్నాయి. మాకు అనుమతి లేని గ్రూపుల్లో మరో నాలుగు ఫొటోలు ఉండటంతో వాటిని మేం కనుగొనలేకపోయాం.

మరింత దురదృష్టకరమైన విషయం ఏంటంటే... టెలిగ్రామ్‌కు చెందిన ఈ సమూహాల గురించి మేం పరిశోధన చేస్తోన్న సమయంలోనే రష్యాకు చెందిన ఒక ఖాతా మాతో బేరానికి దిగింది. చిన్నపిల్లలకు సంబంధించిన సున్నితమైన వీడియోలున్న ఫోల్డర్‌ను కాఫీ కన్నా తక్కువ ధరకే మాకు అమ్మేందుకు ప్రయత్నించింది.

దీని గురించి కూడా మేం టెలిగ్రామ్‌తో పాటు మెట్రోపాలిటన్ పోలీసులకు ఫిర్యాదు చేశాం. కానీ రెండు నెలల తర్వాత కూడా సదరు ఖాతా మనుగడలోనే ఉంది. మేం టెలిగ్రామ్ మీడియా టీమ్‌ను సంప్రదించిన తర్వాతే ఆ ఖాతాను తొలిగించారు.

మేం అందించిన వీడియోల కారణంగా ఆపిల్, తమ యాప్ స్టోర్ నుంచి టెలిగ్రామ్ యాప్‌ను తాత్కాలికంగా తొలిగించిన తర్వాత... చిన్నారుల ఫొటోలు దుర్వినియోగంపై టెలిగ్రామ్ మరింత చురుకుగా వ్యవహరించింది.

విపరీతంగా పెరిగిపోయిన ఇస్లామిక్ స్టేట్ కంటెంట్‌ను పెద్దమొత్తంలో తొలగించడంలో ఈ ప్లాట్‌ఫామ్ 2019లో ఈయూ క్రైమ్ ఏజెన్సీ యూరోపోల్‌కు సహకరించింది.

''తీవ్రవాదానికి సంబంధించిన లేదా రాడికల్ రాజకీయ పార్టీలకు సంబంధించిన కంటెంట్‌ను టెలిగ్రామ్ తొలగిస్తోందని మాకు తెలుసు'' అని ఆక్స్‌ఫర్డ్ ఇంటర్నెట్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన పరిశోధకుడు, డాక్టర్ అలియాక్సందర్ హెరాసిమెంకా చెప్పారు.

టెలీగ్రామ్

ఫొటో సోర్స్, Reuters

కానీ సన్నిహిత ఫొటోల తొలగింపు విషయానికి అంతగా ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపించడం లేదు.

పేరు బయటపెట్టకూడదనే షరతుతో టెలిగ్రామ్‌కు చెందిన ఐదుగురు కంటెంట్ మాడరేటర్లు మాతో మాట్లాడారు. ఆటోమేటెడ్ సిస్టమ్ ద్వారా వినియోగదారుల నుంచి తమకు ఫిర్యాదులు వస్తాయని వారు చెప్పారు.

సన్నిహిత ఫొటోల కోసం తాము ప్రత్యేకించి వెతకట్లేదని వారు చెప్పారు. ఈ విషయంలో కృత్తిమ మేధ సహాయం కూడా టెలిగ్రామ్ తీసుకోదని వెల్లడించారు. ఇలాంటి చర్యలు లోపించడం వల్లే కొంతమంది మహిళలు స్వయంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు.

న్యూడ్ చిత్రాల గురించి జోవాన్నా టెలీగ్రామ్‌కు ఫిర్యాదు చేశారు
ఫొటో క్యాప్షన్, న్యూడ్ చిత్రాల గురించి జోవాన్నా టెలిగ్రామ్‌కు ఫిర్యాదు చేశారు

13 ఏళ్ల జోవాన్నాకు, ఆమె నగ్నచిత్రం ఒకటి మలేసియా టెలిగ్రామ్ గ్రూపులో తిరుగుతున్నట్లు తెలిసింది.

ఆ సమూహంలో చేరేందుకు ఒక నకిలీ టెలిగ్రామ్ ప్రొఫైల్‌ను జోవాన్నా తయారు చేసుకున్నారు. తన వివరాలు తెలియకుండా గ్రూపులో వ్యాప్తి చెందుతోన్న న్యూడ్ చిత్రాల గురించి పరిశోధించి వాటిపై ఫిర్యాదు చేశారు. వాటి వివరాలను తన మిత్రులకు కూడా పంపించారు.

మీడియాలో ఒత్తిడి పెరిగిపోవడంతో ఆ గ్రూపును మూసివేశారు. కానీ ఆ తరహా చిత్రాలను షేర్ చేస్తోన్న మరో రెండు నకిలీ సమూహాలు ఉన్నట్లు మేం పరిశోధన చేస్తోన్న సమయంలో మాకు తెలిసింది.

''కొన్నిసార్లు మీరు నిస్సహాయంగా మారిపోతారు. ఇలాంటి గ్రూపులను తొలిగించేందుకు మా శాయశక్తులా ప్రయత్నించాం. కానీ అవి మళ్లీ పుట్టుకొస్తూనే ఉన్నాయి. నిజం చెప్పాలంటే వీటికి అంతం ఉందో లేదో నాకు తెలియట్లేదు'' అని జోవాన్నా అన్నారు.

మాకు ఇంటర్వ్యూ ఇచ్చేందుకు టెలిగ్రామ్ నిరాకరించింది. కానీ నియమ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కంటెంట్ గురించి వినియోగదారుల నుంచి వచ్చే ఫిర్యాదులపై వేగంగా చర్యలు తీసుకుంటున్నామని ఒక ప్రకటన ద్వారా మాకు తెలిపింది.

వ్యక్తుల సమ్మతి లేకుండా సన్నిహిత ఫొటోలను పంచుకునేందుకు యాప్ అనుమతిస్తుందా? లేదా వాటిని తొలిగిస్తుందా అనే అంశంపై టెలిగ్రామ్ ఎలాంటి ధ్రువీకరణ ఇవ్వలేదు.

టెలిగ్రామ్‌లోని కొన్ని పబ్లిక్ చానెళ్లలో పెట్టుబడులకు సంబంధించిన ప్రకటనలు కుప్పలుగా వస్తుంటాయి. టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ డ్యురోవ్, డబ్బు ఆర్జన కోసం ప్లాట్‌ఫామ్‌ను వినియోగిస్తున్నారని దీన్ని బట్టి అర్థమవుతుంది.

సన్నిహిత చిత్రాలను పంచుకోవడానికి వ్యతిరేకంగా విధానాలను ప్రారంభించిన వాట్సాప్ వంటి సోషల్ మీడియా ప్రత్యర్థులకు అనుగుణంగా టెలిగ్రామ్‌పై, దాని వ్యవస్థాపకులపై ఇది ఒత్తిడి పెంచే అవకాశం ఉంది.

ఈ గ్రేటర్ మాడరేషన్‌ను టెలిగ్రామ్ ఎంతకాలం ప్రతిఘటిస్తుందో చూడాలి.

టెలిగ్రామ్‌లో సన్నిహిత ఫొటోలు షేర్ కావడం వల్ల చిన్నాభిన్నమైన మహిళల జీవితాలు మాత్రం ఇప్పట్లో మారిపోయేలా లేవు.

ఈ కథనాన్ని లూసీ స్విన్‌మన్, జాక్ గాడ్‌మన్, హన్నా గెల్‌బర్ట్, మరియా కొరెన్యుక్, జులియానా గ్రాగ్నానీ రాశారు.

డిస్‌ఇన్ఫర్మేషన్ ఎడిటర్: రెబెక్కా స్నిప్పేజ్

ISWOTY

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)