విశాల్ గార్గ్ క్షమాపణ: 'ఒకేసారి 900 మందిని తొలగించాల్సిందే.. జూమ్ కాల్‌లో చెప్పిన విధానమే సరికాదు'

విశాల్ గార్గ్

ఫొటో సోర్స్, LINKEDIN

జూమ్ కాల్‌లో ఒకేసారి 900 మంది ఉద్యోగాలను తొలిగించిన యూఎస్ గృహరుణాల కంపెనీ బెటర్.కామ్‌ బాస్ విశాల్ గార్గ్, తాజాగా క్షమాపణలు చెప్పారు.

ఉద్యోగులను తొలిగించిన తీరు పట్ల తీవ్రంగా చింతిస్తున్నానని అన్నారు.

ఉద్యోగుల తొలగింపులు అవసరమేనని, కాకపోతే వారిని తొలిగించిన విధానం సరైనది కాదని పేర్కొన్నారు. తన చర్యతో ఉద్యోగులను ఇబ్బంది పెట్టానని చెప్పారు.

''బాధితులకు సరైన గౌరవం, ప్రశంసలు ఇవ్వడంలో నేను విఫలమయ్యాను'' అని వారి సంస్థకు సంబంధించిన వెబ్‌సైట్‌లో ఒక లేఖలో పేర్కొన్నారు.

జూమ్ మీటింగ్‌లో ఒకేసారి 900 మందిని తొలగించడం పట్ల గార్గ్‌పై అనేక విమర్శలు వచ్చాయి.

వీడియో క్యాప్షన్, ఏం చదివితే ఉద్యోగం వస్తుంది?

''నేను తీవ్రంగా చింతిస్తున్నా. ఈ ఘటన నుంచి నేర్చుకున్న గుణపాఠానికి కట్టుబడి ఉంటా. ఒక నాయకుడిగా మీరు నన్ను ఎలా చూడాలని అనుకుంటున్నారో అలా ఉండేందుకు కృషి చేస్తా'' అని ఆయన పేర్కొన్నారు.

''ఉద్యోగులను తొలగిస్తున్నట్లు నేను చెప్పిన విధానంతో, కఠినంగా ఉన్న పరిస్థితి మరింత దిగజారినట్లు'' గ్రహించానని అన్నారు.

గృహరుణాల స్టార్టప్ కంపెనీ అయిన బెటర్.కామ్ సంస్థ న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తోంది.

''ఒకవేళ మీరు ఈ సమావేశంలో ఉన్నట్లయితే, ఉద్యోగాలను కోల్పోయిన దురదృష్టవంతుల జాబితాలో కూడా మీరు ఉన్నట్లే. మీ ఉద్యోగాలను తొలగిస్తున్నాం. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది'' అని గతవారం గార్గ్, తన ఉద్యోగులకు చెప్పారు.

ఆ జూమ్ కాల్‌కు సంబంధించిన రికార్డింగ్‌, సామాజిక మాధ్యమాల్లోకి వచ్చింది. క్రిస్మస్ ముందు ఉద్యోగులను ఇలా తొలగించడం చాలా కఠినమైన, భయంకరమైన చర్యగా పలువురు విమర్శిస్తున్నారు.

ఇళ్ల కొనుగోలు ప్రక్రియను మరింత వేగంగా, సమర్థంగా జరపడానికి సాంకేతికతను ఉపయోగించాలని లక్ష్యంగా పెట్టుకున్న ఈ కంపెనీ, స్టాక్ మార్కెట్‌లో చేరాలని యోచిస్తున్నట్లు ఈ ఏడాది ప్రారంభంలో స్పష్టం చేసింది.

2015లో విశాల్ గార్గ్ ఈ కంపెనీని స్థాపించారు. దీని విలువ 6.9 బిలియన్ డాలర్ల (రూ. 52 వేల కోట్లు) నుంచి 7.7 బిలియన్ డాలర్ల (రూ. 58,117 కోట్లు) మధ్య ఉంటుంది.

బెటర్. కామ్ సీఈవో విశాల్ గార్గ్

ఫొటో సోర్స్, BETTER.COM

ఫొటో క్యాప్షన్, బెటర్. కామ్ సీఈవో విశాల్ గార్గ్

ఉద్యోగాలు తొలగిస్తున్నట్లు గార్గ్ ఎలా చెప్పారంటే...

'' ప్రతీ ఒక్కరికి స్వాగతం. సమావేశంలో భాగం అయినందుకు ధన్యవాదాలు. నేను గొప్పది కాని ఒక వార్తతో ఇప్పుడు మీ ముందుకు వచ్చాను. మార్కెట్ ఎలా మారిందనేది మీకు తెలుసు. మన మిషన్, లక్ష్యాలను నెరవేర్చుకునేందుకు కచ్చితంగా మార్కెట్‌ తీరుతెన్నులకు అనుగుణంగా మనం నడుచుకోవాలి.''

''ఇది మీరు వినడానికి ఇష్టపడే న్యూస్ కాదు. కానీ చివరకు నేను ఈ నిర్ణయం తీసుకున్నా. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఇది చాలా సవాలుతో కూడుకున్న నిర్ణయం. నా కెరీర్‌లో రెండోసారి ఇలాంటి నిర్ణయానికి వచ్చాను. దీన్ని నేను చేయకూడదు అనే అనుకుంటా. గతంలో ఇలాగే చేసినప్పుడు నేను ఏడ్చాను. కానీ ఈసారి దృఢంగా ఉండాలనుకుంటున్నా. మార్కెట్, సామర్థ్యం, పనితీరు, ఉత్పాదకత ప్రాతిపదికగా మేం కంపెనీలో 15 శాతం మందిని తొలగిస్తున్నాం.''

''ఒకవేళ మీరు ఈ సమావేశంలో ఉన్నట్లయితే, ఉద్యోగాలను కోల్పోయిన దురదృష్టవంతుల జాబితాలో కూడా మీరు ఉన్నట్లే. మీ ఉద్యోగాలను తొలగిస్తున్నాం. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది'' అని చెప్పారు.

ఇప్పటివరకు ఉద్యోగులు అందించిన సేవలకు కృతజ్ఞుడిగా ఉంటానని గార్గ్ అన్నారు.

''మీపై నాకు నమ్మకం ఉంది. కలిసికట్టుగా పని చేయడం ద్వారా గృహయాజమాన్య రంగాన్ని మరింత ఉత్తమంగా మార్చవచ్చని నేను నమ్ముతున్నా'' అని ఆయన రాసుకొచ్చారు.

జాబ్స్

ఫొటో సోర్స్, Getty Images

సిబ్బందిని తొలగించేందుకు అది సరైన పద్దతేనా?

''సంస్థలు, ఉద్యోగాలను తొలగిస్తూ ఉంటాయి. ఇది కఠినమైన నిజం'' అని చార్టెర్డ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పర్సనల్ అండ్ డెవలప్‌మెంట్‌ ఎంప్లాయిస్ రిలేషన్స్‌లో సీనియర్ పాలసీ అడ్వైజర్ రాచెల్ సఫ్ అన్నారు.

''కానీ తొలగింపుల్లో సంస్థలు పాటించే పద్ధతులు, విధానాలు... బాధితులు ఆ షాకింగ్ న్యూస్‌ను ఎదుర్కొనే తీరుపై ప్రభావం చూపుతాయి'' అని అన్నారు.

''యూఎస్‌లో బెటర్.కామ్ సిబ్బంది ప్రస్తుతం ఎదుర్కొంటోన్న పరిస్థితి, యూకేలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ ఉద్యోగి కూడా ఎదుర్కోరు. ఎందుకంటే యూకేలో ఒకవేళ 100 మందికి పైగా తీసివేయాల్సి వస్తే, యజమానులు చట్టపరంగా వారికి 30 రోజులు లేదా 45 రోజుల కన్సల్టేషన్ పీరియడ్‌ను కేటాయిస్తారు.''

''ఆ సమయంలో ఉద్యోగులతో మాట్లాడటం, పని గురించి హెచ్చరించడం, ఉద్యోగం తొలగించేందుకు కారణాలు వివరించి అందుకు వారిని సిద్ధం చేస్తారని'' తెలిపారు.

ఉద్యోగుల కోసం ప్రత్నామ్నాయ ఉద్యోగ మార్గాలను కూడా యూకే యజమానులు చూపించాల్సి ఉంటుందని చెప్పారు. ''ప్రత్యామ్నాయ ఉద్యోగాల్లో కూడా వారి ప్రదర్శనతో సంతృప్తి చెందని పక్షంలో, ఆఖరి నిర్ణయంగా ఉద్యోగులను తొలగిస్తారు. ఉద్యోగి గౌరవానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా యజమానులు వ్యవహరిస్తారు'' అని ఆమె చెప్పారు.

''అలాగే మీరు గమనించినట్లయితే, ఉద్యోగుల్ని తొలిగించాలనే నిర్ణయం తనపై ఎలాంటి ప్రభావం చూపిందనే దాని గురించి గార్గ్ మాట్లాడారు. గతంలో ఇలా చేసినప్పుడు ఏడ్చాను అని ఆయన చెప్పారు. కానీ ఇక్కడ ఉద్యోగం పోగొట్టుకుంటోంది ఎవరు? ఆయనపై ఈ నిర్ణయం చూపిన ప్రభావం గురించి మాట్లాడటం గొప్పే. కానీ దాని బారిన పడి ఉద్యోగుల పరిస్థితి ఏంటి?'' అని ఆమె ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)