Koo: మైక్రోబ్లాగింగ్ యాప్ 'కూ' ఇండియాలో ట్విటర్‌ని ఓడించగలదా

- రచయిత, నిఖిల్ ఇనాందార్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ట్విటర్‌ను ఓడిస్తామా లేదా అన్నది పక్కనబెడితే, ప్రస్తుతం దేశంలోని ట్విటర్ కస్టమర్లను దాటిపోవాలన్నది తమ ప్రధాన లక్ష్యమని 'కూ' సహ వ్యవస్థాపకుడు మయాంక్ బిదావత్కా అన్నారు.
2021 చివరి నాటికి ఇండియాలోని 2 కోట్లమంది ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు.
"ఇంగ్లీష్ సహా 10 భాషలలో అందుబాటులో ఉంది. ఈ సంవత్సరం దేశంలోని 22 అధికారిక భాషలను కవర్ చేయాలని అనుకుంటున్నాం'' అని బిదావత్కా బీబీసీతో అన్నారు. ఆయన కంపెనీ కార్యాలయం బెంగళూరులో ఉంది.
అమెరికాకు చెందిన ట్విటర్, భారత ప్రభుత్వానికి మధ్య గత ఏడాది రగిలిన వివాదం తర్వాత, ప్రత్యామ్నాయ మైక్రోబ్లాగింగ్ యాప్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.
అభ్యంతరకరమైన కొన్ని అకౌంట్లను తొలగించాలంటూ మోదీ సర్కారు చేసిన విజ్ఞప్తి విషయంలో ట్విటర్ అనుసరించిన విధానాలు ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించాయి. కొన్ని అకౌంట్లను రద్దు చేసిన ట్విటర్, ఆధారాలు లేవంటూ మరికొన్నింటిని కొనసాగించింది.
చట్టాలను అనుసరించకపోతే ఇండియాలోని మీ కంపెనీ అధికారులపై చర్యలు తీసుకుంటామని కేంద్రం ట్విటర్‌ను హెచ్చరించడంతో ఈ రెండింటి మధ్య ఘర్షణ కొనసాగింది.
ఇటీవలి కాలంలో ప్రభుత్వం రూపొందించిన డిజిటల్ నిబంధనలు కూడా ఈ వివాదానికి తోడయ్యాయి. యూజర్ల గోప్యతను ఉల్లంఘించేలా నిబంధనలున్నాయంటూ ప్రభుత్వం మీద వాట్సాప్ కోర్టులో కేసు కూడా వేసింది.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన డిజిటల్ నిబంధనలను పాటించకపోవడంతో ఆగ్రహించిన మోదీ ప్రభుత్వం కొత్త మైక్రోబ్లాగింగ్ యాప్ 'కూ'కు మారాలని నిర్ణయించింది.

ఫొటో సోర్స్, Getty Images
బీజేపీ ఖాతాల మార్పు
రాత్రికి రాత్రే బీజేపీకి చెందిన పలువురు క్యాబినెట్ మంత్రులు, పార్లమెంటు సభ్యులు ట్విటర్ నుంచి కొత్త యాప్ 'కూ'కు మారారు. ట్విటర్‌లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న మోదీ మాత్రం అందులో కొనసాగుతున్నారు.
భారతదేశంలోని ఇంగ్లీష్ రాని యూజర్లను ఎక్కువగా ఆకట్టుకునే 'కూ' 2020 ప్రారంభంలో విడుదలైంది.
నైజీరియా తమ దేశంలో ట్విటర్‌ను నిషేధించడంతో 'కూ' యాప్ అక్కడికి కూడా వ్యాపించింది. 2022 చివరి నాటికి 10 కోట్లమంది కస్టమర్ల బేస్‌ను చేరుకోవాలని 'కూ' భావిస్తోంది.
అపర్మేయ రాధాకృష్ణ, మయాంక్ బిదావత్క అనే ఇద్దరు ఔత్సాహిక వ్యాపారవేత్తలు 'కూ' యాప్‌ను తయారు చేయించారు. రాధాకృష్ణ ఏర్పాటు చేసిన ట్యాక్సీఫర్‌ష్యూర్ సంస్థను 2015లో ఓలా కంపెనీ సుమారు రూ.1500 కోట్లకు కొనుగోలు చేసింది.
నాలెడ్జ్ షేరింగ్ ప్లాట్‌ఫామ్ వోకల్ ను కూడా వీరే నడుపుతున్నారు. ఇది భారతీయ భాషల్లో ఉంటుంది.
గత ఏడాది నుంచి క్రికెటర్లు, బాలీవుడ్ స్టార్లను కూడా 'కూ' ఆకర్షించింది. ప్రస్తుతం 5000 ఉన్న సెలబ్రిటీల సంఖ్య ఈ ఏడాది చివరికి మూడురెట్లు పెరుగుతుందని కంపెనీ అంచనా వేస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
ప్రభుత్వానికి అనుకూలమా?
అయితే, ప్రభుత్వానికి ప్రచారం కల్పిస్తోందని, ముస్లింలకు వ్యతిరేకంగా జరుగుతున్న ద్వేషపూరిత ప్రసంగాలను ఈ యాప్ అదుపు చేయలేకపోతోందన్న ఆరోపణలున్నాయి.
భారతదేశ రాజకీయాలలో సోషల్ మీడియా ఒక యుద్ధభూమిగా మారింది. బీజేపీ కార్యకర్తలు ప్రధాని మోదీ విమర్శకులపై దారుణంగా ట్రోలింగ్‌లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.
తమ ప్లాట్‌ఫామ్ విద్వేషపూరిత ప్రసంగాలను, వివక్ష, అభ్యంతరకరమైన కంటెంట్‌ను అడ్డుకుంటుందని 'కూ' యాజమాన్యం చెబుతోంది.
అయితే, ఈ 'కూస్' (ట్వీట్‌ల వెర్షన్) క్షణాల మీద తయారవుతుండటంతో ట్విటర్ సహా ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో మాదిరిగానే వీటిని అదుపు చేయడం, మోడరేషన్ చేయడం కష్టం.
హ్యూమన్ మోడరేటర్‌ల కంటే సాంకేతికతను ఉపయోగించి సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉందని, ద్వేషపూరితమైనవిగా భావించే పోస్ట్‌లను ఫ్లాగ్ చేయడంలో యూజర్ కమ్యూనిటీని భాగస్వాములను చేస్తే ప్రయోజనం ఉంటుందని తాము భావిస్తున్నట్లు బిదావత్కా అన్నారు.
'కూ'లో బీజేపీకి చెందినవారు ఎక్కువమంది ఉన్నమాట వాస్తవమేనని, అయితే, తాము రైట్ వింగ్ మద్దతుదారులమని, ప్రభుత్వ వ్యతిరేకుల గొంతులను వినిపించకుండా చేస్తామన్న ఆరోపణలను బిదావత్కా అంగీకరించలేదు.
ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీకి చెందిన రాష్ట్ర ముఖ్యమంత్రులతో సహా 19 పార్టీలకు చెందిన ప్రతిపక్ష నాయకులు కూడా ఈ యాప్‌ను ఉపయోగిస్తున్నారని ఆయన చెప్పారు.
''కొంతమంది ముందుగా అందులో చేరి ఉండవచ్చు. కానీ, ప్రారంభంలో ఎవరు చేరారో అందరూ వారే ఉంటారని అనుకోకూడదు'' అన్నారు బిదావత్కా.
''వ్యాపారవేత్తలుగా మేం సమాజంలో ఒక వర్గానికి మాత్రమే ఉపయోగపడే వాటిని సృష్టించాల్సిన అవసరం లేదు'' అన్నారాయన.
'కూ ని ట్విటర్‌కు ప్రత్యామ్నాయంగా మోదీ పార్టీ ప్రోత్సహించడానికి స్పష్టమైన కారణం ఉంది'' అని డిజిటల్ రైట్స్ యాక్టివిస్ట్ నిఖిల్ పహ్వా అన్నారు.
భవిష్యత్తులో ట్విటర్‌ను నిషేధించాల్సి వస్తే, అప్పుడు ఇది వారికి బాగా ఉపయోగపడుతుందని పహ్వా అభిప్రాయపడ్డారు.
చైనాలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సైబర్ స్పేస్ స్ప్లింటర్‌నెట్ మాదిరిగానే, భారత ప్రభుత్వం కూడా ఇంటర్నెట్‌పై నియంత్రణ కోసం ప్రయత్నిస్తోందని పహ్వా అన్నారు.
ఇలాంటి ఆలోచనలు 'కూ'లాంటి ప్లాట్‌ఫారమ్‌లు ఏర్పాటుకు తోడ్పతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
కఠినమైన నిబంధనల కారణంగా, డేటా, సెక్యూరిటీ ఆధారంగా నిర్వహించే పెద్ద పెద్ద టెక్ కంపెనీలు కూడా భారత దేశంలో ఎదగలేక పోతున్నాయని పహ్వా అన్నారు.

ఫొటో సోర్స్, HARI ADIVAREKAR
సక్సెస్ సాధ్యమేనా?
ట్విటర్‌తో ఇబ్బంది పడే కస్టమర్లకు మెరుగైన ప్లాట్‌ఫామ్‌ను సృష్టించడం, కంటెంట్ మోడరేషన్ సమస్యలను పరిష్కరిస్తే 'కూ' విజయం సాధించగలుగుతుందని పహ్వా అన్నారు.
భిన్నమైన రాజకీయ అభిప్రాయాలకు చోటివ్వడానికి 'కూ' ప్రయత్నించాల్సి ఉంది. ప్రభుత్వ వ్యతిరేక భావజాలం ఉన్న వారు ట్విటర్ నుంచి నిష్క్రమించడానికి, రెండింటిలో అకౌంట్ కొనసాగించడానికి ఇష్టపడకపోవచ్చని ఆయన అన్నారు.
ఇక ఇందులో రిజిస్టర్ కావడానికి మొబైల్ నంబర్ తప్పనిసరి కావడం దీని సక్సెస్‌లో సవాల్‌గా మారుతుందని పహ్వా అభిప్రాయపడ్డారు. ట్విటర్ కస్టమర్లకు ఉండే "అజ్ఞాత''(అనానిమస్) సౌలభ్యం ఇందులో కనిపించదు.
అయితే, ఇంగ్లీష్ రాని వారికి ఒక యాప్ ఉండటం దీనిని ఆకర్షణీయంగా మార్చింది. కస్టమర్లు తాము చేసిన 'కూస్'ను పలుభాషల్లో అందించే సౌకర్యాన్ని కూడా కంపెనీ ప్రవేశపెట్టింది.
ఇప్పటి వరకు బాలీవుడ్ నటులు సోషల్ మీడియాలో తమ అభిమానులతో ఇంగ్లీష్‌లోనే కమ్యూనికేట్ చేసేవారు. ఇప్పుడు వివిధ భాషల్లోని ప్రేక్షకులకు తమ సందేశాలను పంపడానికి ఈ ఫీచర్‌ని ఉపయోగించుకుంటారని బిదావత్కా అన్నారు.
'కూ' ప్రస్తుతం భారతదేశంలో షేర్‌చాట్‌తో పోటీపడుతోంది. నైజీరియాలో కూడా తమ ప్లాట్‌ఫామ్ సక్సెస్ కావడంతో ఉత్సాహంగా కనిపిస్తున్న కంపెనీ, భారతదేశానికి ఆవల, ఇంగ్లీష్ ఆధిపత్యం లేని ఇతర దేశాలకు కూడా దీనిని విస్తరింపజేయాలని భావిస్తోంది.
''ప్రపంచంలో కేవలం 20% మంది మాత్రమే ఇంగ్లీషు మాట్లాడతారు. 80% మందికి ఇంగ్లీష్ రాదు'' అని బిదావత్క అన్నారు. ''ఈ మార్కెట్ అంతా మా కోసం తెరిచి ఉంది'' అన్నారాయన.
ఇవి కూడా చదవండి:
- ఒక్క రోజులో రూ.17 లక్షల కోట్ల సంపద ఆవిరి, ఫేస్‌బుక్ మార్కెట్ విలువ అంతగా ఎలా పడిపోయింది?
- గల్వాన్ డీకోడెడ్: 'గల్వాన్ లోయలో జరిగిన భారీ నష్టాన్ని చైనా దాచిపెడుతోంది'.. క్లాక్సన్ నివేదిక వెల్లడి
- గుంటూరు జిన్నా టవర్: ఆకుపచ్చగా ఉన్న ఈ టవర్‌కి భారత్ జెండా రంగులు ఎవరు., ఎందుకు వేశారు?
- రాష్ట్రపతికి బహుమానంగా జింబాబ్వే ఇచ్చిన ఏనుగును తిరిగి పంపించేయమంటూ కోర్టులో పిటిషన్
- సముద్రంలో కూలిన అమెరికా యుద్ధ విమానం, చైనాకు ఆ రహస్యాలు దొరకకుండా ఆపసోపాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













