పెగాసస్: ఇజ్రాయెల్‌లో ఫోన్ల హ్యాకింగ్ కలకలం - నేతలు, జర్నలిస్టులపై పోలీసులు స్పైవేర్ ప్రయోగించారని ఆరోపణలు

పెగాసస్ స్పైవేర్

ఫొటో సోర్స్, Getty Images

ఇజ్రాయెల్‌ పోలీసులు అక్కడి కొందరి ఫోన్లను హ్యాక్ చేయడానికి పెగాసస్ స్పైవేర్‌ను ఉపయోగించారనే ఆరోపణలపై విచారణకు ఆ దేశ ప్రభుత్వం ఎంక్వైరీ కమిషన్‌ ఏర్పాటు చేయనుంది. ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే పోలీసులు ఈ హ్యాకింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి.

కోర్టు ఉత్తర్వులు లేకుండానే మాజీ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కుమారుడితోపాటు అధికారులు, నిరసనకారులు, జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకున్నట్లు వార్తాపత్రిక కాల్‌కాలిస్ట్ తెలిపింది.

నెతన్యాహు అవినీతి కేసుకు సంబంధించిన ఒక సాక్షి ఫోన్ కూడా హ్యాకింగ్‌కు గురైనట్లు పేర్కొంది.

''ఒకవేళ నిజమైతే ఇది చాలా సీరియస్ అంశం'' అని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నఫ్టాలీ బెన్నెట్ అన్నారు.

ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్ఓ అనే సంస్థ తయారుచేసిన స్పైవేర్ టూల్ 'పెగాసస్'ను పోలీసులు ఉపయోగించారని నివేదికలు చెబుతున్నాయి. ఈ టూల్‌ను ప్రపంచవ్యాప్తంగా అధికారంలో ఉన్న ప్రభుత్వాలకు విక్రయించారని, దాన్ని దుర్వినియోగం చేశారని ఎన్‌ఎస్ఓ సంస్థపై విస్తృతమైన ఆరోపణలు వచ్చాయి.

ఈ సాఫ్ట్‌వేర్‌ను ఒక్కసారి క్లయింట్‌లకు విక్రయించిన తర్వాత దాన్ని తాము ఆపరేట్ చేయలేమని ఆ కంపెనీ చెప్పింది. ఇజ్రాయెల్ పౌరుల ఫోన్లను హ్యాక్ చేయడానికి ఈ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించలేమని గతంలోనే పేర్కొంది. కాగా తాజా పరిణామాలపై ఈ కంపెనీ ఇంకా స్పందించలేదు.

వ్యక్తుల ఫోన్ల మీద పెగాసస్ నిఘా పెడుతుంది. యూజర్‌కు తెలియకుండానే అతని ఫోన్‌లో ఇన్‌స్టాల్ అయ్యే ఈ టూల్.. ఆ యూజర్‌కు సంబంధించిన మెసేజీలు, ఫొటోలు, ఈమెయిల్స్, కాల్ రికార్డులను దొంగిలించడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా ఈ టూల్ ద్వారా యూజర్ ఫోన్ కెమెరాను, మైక్రోఫోన్‌ను కూడా ఎటాకర్లు ఆపరేట్ చేయగలుగుతారు.

''ఉగ్రవాదం, తీవ్రమైన నేరాలకు వ్యతిరేక పోరాటంలో పెగాసస్ లాంటి సాధనాలు చాలా ముఖ్యమైనవి. కానీ వీటిని ఇజ్రాయెల్ పౌరులను, అధికారులను లక్ష్యంగా చేసుకునేందుకు ఉపయోగించకూడదు. అందుకే అసలు ఏం జరిగిందో క్షుణ్ణంగా తెలుసుకోవాలి'' అని బెన్నెట్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ అంశాన్ని డిప్యూటీ అటార్నీ జనరల్ అమిత్ మెరారీ అత్యవసర ప్రాతిపదికగా పర్యవేక్షిస్తున్నారని ప్రధాని తెలిపారు. ''కొత్తగా నియమితులైన అటార్నీ జనరల్ గాలి బహరావ్ మియారా... ప్రజలకు సమాధానం చెప్పకుండా ఈ అంశాన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టరు'' అని ఆయన వ్యాఖ్యానించారు.

''మనం ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రజాస్వామ్యాన్ని విస్మరించకూడదు. మన విధానాలను వదిలిపెట్టకూడదు. ప్రజాస్వామ్యంపై, ప్రభుత్వ విధానాలపై ప్రజల నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కోల్పోకూడదు. అందుకే ఈ అంశంలో లోతైన, సమగ్రమైన విచారణ అవసరం'' అని అధ్యక్షుడు ఇసాక్ హర్‌జోగ్ అన్నారు.

పెగాసస్ స్పైవేర్

''రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు అవుతుందని... రాజకీయ, చట్టపరమైన, భద్రతా వ్యవస్థల్లోని ఏ వ్యక్తినైనా ప్రశ్నించే అధికారం, పత్రాలను స్వాధీనం చేసే హక్కు వీరికి ఉంటుంది’’ అని మంత్రి ఒమెర్ బర్లెవ్ స్పష్టం చేశారు.

ఇజ్రాయెల్ పౌరులకు చెందిన డజన్ల కొద్దీ ఫోన్లను పోలీసులు హ్యాక్ చేశారని సోమవారం ప్రచురించిన ఒక నివేదికలో ఇజ్రాయెల్ బిజినెస్ పత్రిక కాల్‌కాలిస్ట్ పేర్కొంది.

పెగాసస్‌తో లక్ష్యంగా చేసుకున్నవారి జాబితా

  • రవాణా, ఆర్థిక, న్యాయ మంత్రిత్వ శాఖలకు చెందిన డైరెక్టర్ జనరల్స్
  • వికలాంగుల హక్కుల సంఘాలు, ఇథియోపియా సంతతికి చెందిన ఇజ్రాయెలీలు నిర్వహించిన నిరసనలకు సంబంధించిన నాయకులు
  • నెతన్యా, మెవసెరెట్ జియాన్, కిర్యాత్ అటా, హోలోన్‌ల మేయర్లు
  • ఇజ్రాయెల్‌కు చెందిన అతిపెద్ద టెలీకమ్యూనికేషన్స్ కంపెనీ 'బెజాక్' వాటాదారు షాల్ ఎలోవిచ్‌, నెతన్యాహులపై నమోదైన అవినీతి ఆరోపణలకు సంబంధించిన '4000' కేసు విచారణలో భాగంగా ఉన్న సాక్షులు.
  • వాలా న్యూస్ వెబ్‌సైట్ సీఈవో, మాజీ ఎడిటర్ ఇన్ చీఫ్, వెబ్‌సైట్‌కు చెందిన పలువురు జర్నలిస్టులు
  • నెతన్యాహు కుమారుడు అవ్‌నర్‌తో పాటు మాజీ ప్రధానమంత్రి మీడియా సలహాదారుల్లో ఇద్దరిపై ఈ టూల్‌ను ఉపయోగించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

కాల్‌కాలిస్ట్ కథనం ప్రకారం, 2015 నుంచి 2018 వరకు పోలీస్ కమిషనర్‌గా ఉన్న రోనీ ఆల్‌షేక్ నేతృత్వంలో ఈ హ్యాకింగ్ ప్రక్రియ నడిచింది.

సమాచార మంత్రిత్వ శాఖకు చెందిన మాజీ డైరెక్టర్ జనరల్ శ్లోమో ఫిల్బర్‌ ఫోన్‌ కూడా హ్యాక్‌కు గురైందని గత బుధవారం ఇజ్రాయెల్ మీడియా పేర్కొంది. నెతన్యాహు అవినీతి కేసుతో పాటు మరో రెండు కేసుల్లో ఫిల్బర్ ప్రధాన సాక్షిగా ఉన్నారు. అయితే ఈయన ఫోన్ హ్యాకింగ్‌లో పెగాసస్‌ టూల్‌ను వాడారో లేదో అనే విషయాన్ని మీడియా నివేదికలు స్పష్టంగా పేర్కొనలేదు.

ఎలోవిచ్‌తో పాటు నెతన్యాహు కూడా తాము ఎలాంటి తప్పు చేయలేదని, తమపై వస్తోన్న ఆరోపణలు భూకంపాల్లాంటివని పేర్కొన్నారు. ఈ కేసులో వచ్చే వారం ఫిల్బర్ వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నారు. అయితే దీన్ని వాయిదా వేయాల్సిందిగా తమ న్యాయవాదులు కోర్టును అభ్యర్థిస్తారని నెతన్యాహు చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)