R-ABI, NutriHub: కొత్త బిజినెస్ చేయాలనుకుంటున్నారా? శిక్షణ ఇచ్చి, రూ.25 లక్షల దాకా చేయూత కూడా ఇస్తున్నారు ఇక్కడ..

చిరుధాన్యాల ఉత్పత్తిలో ఆసక్తి ఉన్నవారికి శిక్షణ ఇస్తోంది న్యూట్రీ హబ్​

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, చిరుధాన్యాల ఉత్పత్తిలో ఆసక్తి ఉన్నవారికి శిక్షణ ఇస్తోంది న్యూట్రీ హబ్​
    • రచయిత, నాగ సుందరి
    • హోదా, బీబీసీ కోసం

మన ఆహారపు అలవాట్లు మారిపోతున్నాయి. ఏది తిన్నా దీన్నుంచి మనకు ఎన్ని పోషకాలు వస్తాయి, ఏం పోషకాలు వస్తాయి, ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి అనే కోణంలో ఆలోచించడం పెరిగింది. దాంతో, వరి, గోధుమల స్థానంలో చిరుధాన్యాల(మిల్లెట్లు)కు డిమాండ్​ పెరుగుతోంది.

డయాబెటిస్(మధుమేహం), రక్తపోటు, గుండె జబ్బులు, ఊబకాయం లాంటి సమస్యలున్నవాళ్లకైతే మిల్లెట్​ డైట్​ ప్రయత్నించమని అలవోకగా సలహాలు ఇస్తున్నారు.

మారుతున్న జీవన శైలి, ఆరోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఒంటికి ఏది మంచిదో అదే తినేందుకే జనం కూడా ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా 30 నుంచి 40 ఏళ్లు, ఆపైబడిన వారు చాలామంది మిల్లెట్​ డైట్​కు మారుతున్నారు.

పూర్వం చిరుధాన్యాలే ప్రధాన ఆహారంగా ఉండేవి

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, పూర్వం చిరుధాన్యాలే ప్రధాన ఆహారంగా ఉండేవి

ఏమిటీ మిల్లెట్ ​ డైట్​

మిల్లెట్లు అంటే చిరుధాన్యాలు. వాటితో తయారైన ఆహార పదార్థాలను తీసుకోవడమే మిల్లెట్​ డైట్​. వరి, గోధుమలు తృణ ధాన్యాలు. జొన్నలు, రాగులు, సజ్జలు, కొర్రలు, ఊదలు, అరికెలు, సామలు, అండు కొర్రల్లాంటి వాటిని చిరుధాన్యాలు అంటారు. ఇపుడు జనం వీటిని బాగా వినియోగిస్తున్నారు.

పూర్వకాలంలో చిరుధాన్యాలనే ప్రధానంగా తీసుకునేవారు. తర్వాత వాటి స్థానాన్ని వరి ఆక్రమించింది. ఇపుడు మళ్లీ అలవాట్లు మారి జనం చిరుధాన్యాల వైపు మళ్లుతున్నారు.

అయితే చిరుధాన్యాలు వరి అంత రుచిగా, తియ్యగా ఉండవు. చూడడానికి కూడా ముతకగా కనిపిస్తాయి. అందుకే ఇపుడు చిరుధాన్యాలను తినమని ప్రోత్సహించే వాళ్లు వాటితో ఎన్ని రకాల వంటలు చేసుకోవచ్చో చెబుతున్నారు. మిల్లెట్​ రెసిపీ పుస్తకాలు కూడా మార్కెట్లోకి వచ్చాయి. (ఐఐఎంఆర్​ కూడా ఒక పుస్తకాన్ని తయారుచేసింది. ఆ సంస్థ వెబ్​సైట్​లో అందుబాటులో ఉంది).

రాగులు

ఫొటో సోర్స్, Getty Images

వంటకాలతో పాటు మిల్లెట్ల ఆధారంగా ఇపుడు లేటెస్ట్​గా బిస్కెట్లు, చిక్కీలు, ఇతర చిరుతిళ్లు కూడా తయారై మార్కెట్లోకి వస్తున్నాయి. అందమైన ప్యాకింగ్​లతో, మంచి రుచితో రకరకాల ప్రోడక్టులు షాపుల్లో కనిపిస్తున్నాయి. ప్రత్యేకంగా మిల్లెట్​ స్టోర్లు కూడా వెలుస్తున్నాయి. వీటికి జనం నుంచి బాగానే ఆదరణ ఉంటోంది.

వీడియో క్యాప్షన్, ఫుడ్ గార్డెన్: ఇంట్లోంచే నెలకు రూ.12 లక్షల వ్యాపారం

మిల్లెట్ ​ ప్రోడక్టుల తయారీలో శిక్షణ

మిల్లెట్లపై పరిశోధన కోసం ఇండియన్​ ఇనిస్టిట్యూట్ ​ఆఫ్ ​మిల్లెట్​ రీసెర్చ్​ (ఐఐఎంఆర్​) 1958లో ఏర్పడింది. దేశంలో మిల్లెట్ల సాగు ప్రోత్సహించడం, సమస్యలు వస్తే అధిగమించేలా రైతులకు సలహాలు, సూచనలు అందజేయడం లాంటి ప్రాధమిక లక్ష్యాలతో దీన్ని ప్రారంభించారు.

తర్వాత కాలంలో మిల్లెట్ల సహాయంతో వివిధ రకాల ఉత్పత్తులు ఎట్లా తయారుచేసుకోవచ్చో శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేపట్టింది.

తమ ఉత్పత్తులను మార్కెట్ ​చేసుకోవడానికి ఆర్థిక సహాయం కూడా అందిస్తారు

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, తమ ఉత్పత్తులను మార్కెట్ ​చేసుకోవడానికి ఆర్థిక సహాయం కూడా అందిస్తారు

ప్రస్తుతం, మిల్లెట్లపై జనంలో ఉన్న ఆసక్తిని దృష్టిలో పెట్టుకొని ఆ పంటల సాగు, ఉత్పత్తుల తయారీలో ఐఐఎంఆర్ సంస్థ ప్రత్యేక అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేస్తోంది.

స్టార్టప్​లకు ట్రైనింగ్​ ఇచ్చి వాళ్ల బిజినెస్​ నిలదొక్కుకునేలా సహాయం అందజేస్తోంది. ఈ సంస్థ ఆధ్వర్యంలోని న్యూట్రీహబ్ ​ఈ శిక్షణా కార్యక్రమం చేపడుతోంది.

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని డిపార్ట్​మెంట్​ ఆఫ్​ అగ్రికల్చర్​ అండ్​ ఫార్మర్​ వెల్ఫేర్​ సంస్థ, వ్యవసాయ రంగంలో ఔత్సాహిక వ్యాపారులుగా మారాలనుకునే వాళ్లు, నూతన ఆవిష్కరణల ఆలోచనలు ఉన్న వాళ్లను ప్రోత్సహించేందుకు రాబీ (ఆర్​–ఎబిఐ) అనే అగ్రి బిజినెస్​ ఇంక్యూబేటర్​లను నెలకొల్పింది.

అందులో న్యూట్రీహబ్​ కూడా ఒకటి. ఆర్​కేవీవై (రాష్ట్రీయ కృషి వికాస్​ యోజన)–రఫ్తార్​ (రెమ్యునరేటివ్ ​అప్రోచెస్​ ఫర్​ అగ్రికల్చర్​ అండ్​ అలైడ్​ సెక్టార్స్​ రెజువనేషన్​) ప్రోగ్రాం​నే రాబీ అని వ్యవహరిస్తున్నారు.

రెండు రకాల శిక్షణ

రాబీ ప్రోగ్రామ్​లో భాగంగా రెండు రకాల శిక్షణ అందుతుంది. ఔత్సాహిక విద్యార్థులు, కొత్తగా ఈ రంగంలోకి రావాలనుకునే వారి కోసం నెస్ట్​ (న్యూట్రీ–సెరెల్స్​ ఎంటర్​ప్రెన్యూర్​షిప్​ అండ్​ స్టార్టప్​ ట్రైనింగ్​ ప్రోగ్రామ్​) ఉంది.

అలాగే, ఈ రంగంలో ఇప్పటికే ఉన్న వాళ్లు తమ వ్యాపారాన్ని మరింతగా విస్తరించదలుచుకునే వాళ్ల కోసం ఎన్​–గ్రెయిన్​ (గ్రోయింగ్​ అండ్​ రివార్డింగ్​ అగ్రిప్రెన్యూర్​షిప్​ ఇన్​ న్యూట్రీసెరల్స్ ​ ప్రోగ్రామ్​) ఉంది.

విజయవంతంగా శిక్షణ ముగించుకున్నవారికి సంస్థ నియమ నిబంధనల మేరకు గ్రాంట్​ కూడా అందజేస్తారు.

జొన్నలు

ఫొటో సోర్స్, Getty Images

న్యూట్రీహబ్​లోనే ప్రోడక్టుల తయారీ

శిక్షణ పూర్తి చేసుకున్నవారు తమ ఉత్పత్తులను న్యూట్రీహబ్​లోని యంత్రాలను ఉపయోగించుకొని అక్కడే తయారుచేసుకోవచ్చు. భారీ పెట్టుబడితో యంత్రాలు విడిగా నెలకొల్పాల్సిన అవసరం లేదు.

న్యూట్రీహబ్​లో ఉత్పత్తుల తయారీ, ప్యాకింగ్​ సదుపాయం ఉంటుంది. తమ ప్రోడక్టులకు బ్రాండింగ్​ కూడా చేసుకోవచ్చు. స్టార్టప్​లు బ్రాండెడ్​ ప్యాకింగ్​ చేసుకొని ఆ ఉత్పత్తులను మార్కెటింగ్​ చేసుకోవాలి.

చిరుధాన్యాలు

ఫొటో సోర్స్, Getty Images

నెస్ట్​ శిక్షణా కార్యక్రమం

ఇది కొత్తగా ఈ రంగంలోకి వచ్చి, ఎంటర్​ప్రెన్యూర్​గా ఎదగాలనుకునే వాళ్ల కోసం ఉద్దేశించింది. దీనికి సంబంధించిన నోటీస్​ ఏడాదిలో ఒకటి, రెండు సార్లు వస్తుంది. దానికి ఆన్​లైన్లో దరఖాస్తులు పెట్టుకోవాలి.

వచ్చిన దరఖాస్తుల్లో అర్హులైన వారిని ఎంపిక చేసి రెండు నెలల పాటు శిక్షణ ఇస్తారు. అనంతరం, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని మరో సంస్థ మేనేజ్​ (నేషనల్​ ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ అగ్రికల్చర్​ ఎక్స్​టెన్షన్​ మేనేజ్​మెంట్​) ముందు ఔత్సాహికులు తమ ప్రపోజల్​ ఉంచాలి.

అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత కొన్ని సంస్థలను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి రూ. 5 లక్షలు గ్రాంట్​గా అందజేస్తారు.

దరఖాస్తు చేసుకునే సమయంలో తమ ఆలోచన ఎంత వినూత్నమైందో ఔత్సాహికులు చెప్పగలగాలి. మిగతా ఉత్పత్తుల కన్నా తమ ప్రోడక్టు ఎట్లా భిన్నంగా ఉంటుందో వివరించాలి. ఆ ఐడియా వ్యాపారానికి అనుకూలంగా ఉండాలి. ఆ స్టార్టప్​ ఐడియా మార్కెట్లో మనుగడ సాగిస్తుందనే నమ్మకం కలుగజేయాలి.

అలా మెప్పించిన స్టార్టప్​ ఐడియాలకు శిక్షణ ఇస్తారు. తర్వాత కూడా మేనేజ్ ముందు తమ ఐడియా వినూత్నమైనదని మరోసారి ప్రూవ్​ చేసుకోవాలి. అపుడే ఆర్థిక సహాయానికి అర్హత లభిస్తుంది.

అర్హతలు: వినూత్నమైన ఆలోచనలు ఉన్న విద్యార్థులు, యువతీ యువకులు ఎవరైనా ఈ ప్రోగ్రాంకి అర్హులు. ఎంటర్​ప్రెన్యూర్​‌గా ఎదిగే ఆసక్తి ఉండాలి. వ్యాపారాన్ని ప్రారంభించేందుకు ప్రాధమిక ప్రణాళిక రూపొందించుకొని ఉండాలి. మార్కెట్​లో మనుగడలో ఉన్న చిన్న స్టార్టప్​ నిర్వాహకులు కూడా దీనికి అర్హులే.

రాగి రొట్టె

ఫొటో సోర్స్, Getty Images

ఎన్​–గ్రెయిన్​ ట్రైనింగ్​

మార్కెట్లో కొంత నిలదొక్కుకున్న సంస్థలకు, ప్రోడక్టు సక్సెస్​ సాధించే దిశలో ఉన్న సంస్థలకు ఈ ట్రైనింగ్​ వర్తిస్తుంది. అంటే చిన్న చిన్న స్టార్టప్ ​ కంపెనీలు మరింతగా తమ వ్యాపారాన్ని విస్తరించుకునేందుకు ఇది పనికి వస్తుంది.

నెస్ట్​ తరహాలోనే దీనికి కూడా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఎంపికైన వారికి రెండు నెలల శిక్షణ ఉంటుంది. అనంతరం మేనేజ్​‌లో ఇంటర్వ్యూ, స్క్రూటినీ తర్వాత ఎంపికైన స్టార్టప్​ సంస్థలకు సీడ్​ ఫండింగ్​ కింద రూ. 25 లక్షల వరకు గ్రాంట్​ అందజేస్తారు.

ఎంపికైన వారికి తమ ఉత్పత్తులను మార్కెట్ ​ చేసుకోవడానికి, వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి​, పెట్టుబడి సమకూర్చుకునేందుకు సంస్థ సహాయం చేస్తుంది. వెంచర్​ క్యాపిటల్స్​, కమర్షియల్​ బ్యాంకులు, ఫైనాన్షియల్​ సంస్థల నుంచి లోన్లు పొందేందుకు అవసరమైన సహాయాన్ని అందజేస్తుంది.

అర్హతలు: దరఖాస్తు దారు దేశంలో చట్టపరంగా సంస్థను రిజిస్ట్రర్​ చేసుకొని ఉండాలి. భారతీయ స్టార్టప్​ అయి ఉండాలి. మరో రెండు నెలల్లో ఈ ప్రోగ్రాం​కు దరఖాస్తులు ఆహ్వానించే అవకాశం ఉంది.

వివరాలు, దరఖాస్తు చేసుకునేందుకు సంప్రదించాల్సిన వెబ్​ సైట్​.. https://nutrihub-tbi-iimr.org/

ISWOTY

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)