కేసీఆర్, ఉద్ధవ్ ఠాక్రే భేటీ: ఉన్నట్లుండి మోదీపై కేసీఆర్ స్వరం ఎందుకు పెంచారు?

వీడియో క్యాప్షన్, కేసీఆర్ ఉన్నట్లుంది మోదీపై స్వరం ఎందుకు పెంచారు? కేసీఆర్ దిల్లీ కల ఫలిస్తుందా?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో భేటీ అయ్యారు.

కేసీఆర్ వెంట ముంబయి వెళ్లిన వారిలో ఎంపీలు సంతోష్ కుమార్, రంజిత్ రెడ్డి, బి. బి పాటిల్, ఎమ్మెల్సీ కవిత, పల్లా రాజేశ్వర్ రెడ్డి, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి శ్రవణ్ కుమార్ రెడ్డి తదితరులు ఉన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీపై కేసీఆర్ ఉన్నట్టుండి స్వరం పెంచారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను ఆయన విమర్శించారు. దేశవ్యాప్తంగా ప్రజలు కోరుకుంటే, అవసరమైతే జాతీయ పార్టీ పెడతానని కూడా ఆయన అన్నారు.

కేసీఆర్

ఫొటో సోర్స్, ugc

ఫొటో క్యాప్షన్, ఉద్ధవ్ ఠాక్రేతో కేసీఆర్ భేటీ

జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ చక్రం తిప్పగలరా?

ఈ నేపథ్యంలో కేంద్ర రాజకీయాల్లో కేసీఆర్ చక్రం తిప్పగలరా? కేసీఆర్ థర్డ్ ఇన్నింగ్స్‌‌ ఎంతవరకు ఫలించొచ్చు?

ఫస్ట్ ఇన్నింగ్స్, సెకెండ్ ఇన్నింగ్స్ అంటారు కానీ ఈ థర్డ్ ఇన్నింగ్స్ ఏంటి అని మీరు అనుకోవచ్చు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. తనకు మూడో ఇన్నింగ్స్ ఉంటుందని కేసీఆర్ కూడా గతంలో అనుకుని ఉండకపోవచ్చు.

కుమారుడికి తారక రామారావు అని పేరు పెట్టుకునేంత ఎన్టీఆర్ అభిమానిగా తెలుగుదేశంలో రాజకీయ జీవితం ఆరంభించి అక్కడ ఓ మోస్తరు నాయకుల్లో ఒకరిగా సాగించిన ప్రయాణం ఒక ఇన్నింగ్స్ అయితే... సొంతంగా పార్టీ పెట్టి రెండు దశాబ్దాల పాటు ఎదురీది తెలంగాణ సాధనతో రాష్ర్టంలో ముఖ్యమంత్రిగానే కాకుండా తెలంగాణలో తిరుగులేని నాయకుడిగా ఎదిగిపోవడం రెండో ఇన్నింగ్స్ అనుకోవచ్చు.

ప్రస్తుతం ఆయన వేస్తున్న నిచ్చెన చాలా పెద్దది. కొడితే కుంభస్థలం కొట్టాలన్నట్టు ఇప్పుడు ఆయన చూపు దిల్లీ మీద. ఇది థర్డ్ ఇన్నింగ్స్. ప్రస్తుత ఎపిసోడ్లో మూడు అంకాలు ప్రధానంగా ఉన్నాయి.

ఒకటి ..బీజేపీ ప్రధాన ప్రత్యర్థి అని శషభిషలు లేకుండా పై స్థాయి నుంచి కుండబద్దలు కొట్టి చాటడం. రెండు, తెలంగాణకు కొత్త శత్రువుగా మోదీని నిలబెట్టి ఎమోషనల్ పోలరైజేషన్‌ కోసం ప్రయత్నించడం. మూడు, జాతీయ రాజకీయాల్లో ఢీ అండే ఢీ అనే సన్నద్ధత, ఎత్తుకు పైఎత్తు వేయగలిగే నైపుణ్యం తనకున్నాయని గట్టిగా చాటుకునే ప్రయత్నం చేయడం.

ఇట్లా తమకే కాకుండా మొత్తం తెలంగాణకు శత్రువుగా చూపించి రాజకీయ మొబిలైజేషన్‌కు ప్రయత్నించడం కొత్త కాదు. ఒక (2009) ఎన్నికల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన నేతృత్వంలోని రాష్ట్ర కాంగ్రెస్ శత్రువు. అప్పుడు తెలుగు దేశంతో కలిసి పోటీ చేశారు. ఇంకో (2004) ఎన్నికలో చంద్రబాబు తెలంగాణకు ప్రధాన శత్రువు. అపుడు కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేశారు. గులాంనబీ ఆజాద్‌తో కలిసి ప్రచారం చేశారు.

కేసీఆర్ థర్డ్ ఇన్నింగ్స్‌పై బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ విశ్లేషణ పై వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)