కేసీఆర్: ఎరువుల ధరలు పెంచవద్దంటూ ప్రధాని మోదీకి లేఖ -ప్రెస్ రివ్యూ

తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్‌

ఫొటో సోర్స్, TRSParty/FACEBOOK

దేశంలో ఎరువుల ధరలు పెరగకుండా చూడాలని తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్‌, ప్రధాని నరేంద్ర మోదీని కోరినట్లు 'ఆంధ్రజ్యోతి' కథనంలో పేర్కొంది.

''ప్రస్తుతం ఉన్న ధరలనే యథాతథంగా కొనసాగించాలని, ధరలు పెంచి రైతులపై భారం మోపొద్దని విజ్ఞప్తి చేశారు. బుధవారం ఆయన ఈ మేరకు ప్రధానికి లేఖ రాశారు.

'‘కేంద్ర ప్రభుత్వ పరిధిలోని కొన్ని అంశాలు.. రైతుల ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తున్నాయి. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని కేంద్ర ప్రభుత్వం 2016లో ప్రకటించింది. ఆరేళ్లవుతున్నా ఆ దిశగా ఎలాంటి నిర్మాణాత్మక చర్యలూ చేపట్టలేదు.

రైతుల పెట్టుబడి వ్యయాలు రెట్టింపు కావడం అందరినీ నిరాశ నిస్పృహలకు గురి చేస్తోంది. ఆరేళ్లలో ఆదాయం క్షీణించడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు'' అని కేసీఆర్‌ లేఖలో పేర్కొన్నారు.

ఆరేళ్లుగా ఎరువుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నా కేంద్రం గుడ్డిగా వ్యవహరిస్తోంది. యూరియా, డీఏపీ తదితర ఎరువుల వాడకాన్ని తగ్గించేలా ప్రచారం చేయాలంటూ రాష్ట్రాలను పురిగొల్పుతోంది.

రైతులు ఎక్కువగా వినియోగించే 28.28.0 ఎరువుల ధరలను 50 శాతానికి పైగా, పొటాషియం ధరను 100 శాతానికి పైగా పెంచడం శోచనీయం.

ఎరువుల ముడిసరుకులపై పెరుగుతున్న దిగుమతి సుంకాన్ని భరిస్తూ ధరలను రైతులకు అందుబాటులో ఉంచాల్సిన కేంద్రం.. ఆ భారాన్ని రైతులపైనే రుద్దుతోంది.

రాష్ట్రాల్లో వ్యవసాయ యాంత్రీకరణ రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో వ్యవసాయ రంగంలో డీజిల్‌, పెట్రోలు వాడకం కూడా పెరుగుతున్న సంగతి తెలిసిందే.

ముడి చమురు ధరలు పెరగకున్నా, కేంద్రం విధిస్తున్న అసంబద్ధ సెస్‌ కారణంగా పెట్రోలు, డీజిల్‌ ధరలు విపరీతంగా పెరిగి రైతులకు అదనపు భారంగా మారాయి.

సాగు ఖర్చులో కొంతమేరకైనా తగ్గించాలన్న ఉద్దేశంతో ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానించాలంటూ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపించాం. దీనిపై ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

ఈ తప్పుడు విధానాలకు తోడుగా వ్యవసాయ రంగంలో విద్యుత్ సంస్కరణల పేరుతో మోటార్లకు మీటర్లు బిగించాలన్న నిర్ణయం రైతులకు ఆందోళన కలిగిస్తోందని కేసీఆర్ లేఖలో తెలిపినట్లు'' ఆంధ్రజ్యోతి పేర్కొంది.

నరసాపురం ఎంపీ కనుమూరు రఘురామకృష్ణరాజు

ఫొటో సోర్స్, RAGHU RAMA KRISHNA RAJU/FACEBOOK

17న విచారణకు రండి... ఎంపీ రఘురామకృష్ణ రాజుకు ఏపీ సీఐడీ నోటీసు

ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర, ముఖ్యమంత్రిని అవమానించేలా, కులాలను కించపరిచేలా, సమాజంలో అశాంతిని రేకెత్తించేలా వ్యాఖ్యలు చేసిన కేసులో నరసాపురం ఎంపీ కనుమూరు రఘురామకృష్ణరాజును ఈ నెల 17న విచారణకు రావాలంటూ ఏపీ సీఐడీ నోటీసు జారీ చేసినట్లు 'సాక్షి' ఒక వార్తను ప్రచురించింది.

''బుధవారం హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని బౌల్డర్‌హిల్స్‌లో విల్లా నంబర్‌ 74లో ఉన్న రఘురామ ఇంటికి సీఐడీ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ బృందం ఉదయం 9 గంటలకు వెళ్లింది.

తొలుత సీఐడీ బృందాన్ని ఇంట్లోకి అనుమతించలేదు. రఘురామకృష్ణరాజు న్యాయవాది వచ్చిన అనంతరం ముగ్గురిని అనుమతించారు. క్రైమ్‌ నంబర్‌ 12/2021, సెక్షన్‌ 153, 505, 124-ఎ రెడ్‌ విత్‌ 120బి కేసు దర్యాప్తులో భాగంగా సీఐడీ ఆయనను విచారణకు పిలిచింది.

17న మధ్యాహ్నం 3 గంటలకు గుంటూరు రీజినల్‌ సీఐడీ కార్యాలయానికి వచ్చి విచారణకు సహకరించాలని ఆ నోటీసులో పేర్కొంది.

ఈ కేసులో గతంలో అరెస్టైన రఘురామకు కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. దర్యాప్తునకు సహకరించాలని, మీడియా సమావేశాలు నిర్వహించకూడదని, ప్రభుత్వాన్ని, వ్యక్తులను కించపరిచేలా వ్యాఖ్యలు చేయకూడదనే షరతులు ఉన్నాయి.

కేసు దర్యాప్తు అధికారి, సీఐడీ ఏఎస్పీ విజయపాల్‌ ఇటీవల రిటైరయ్యారు. దీంతో దర్యాప్తు బాధ్యతలను డీఎస్పీ జయసూర్యకు సీఐడీ అప్పగించింది. ఈ కేసులో మరింత లోతైన దర్యాప్తు కోసం రఘురామను విచారించేందుకు సీఐడీ సిద్ధమైంది. కోర్టు ఆదేశాల ప్రకారమే వ్యవహరిస్తున్నామని, నోటీసు అందులో భాగమేనని సీఐడీ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ తెలిపారు. ఇదిలా ఉంటే సీఐడీ నోటీసు ఇచ్చిన కొద్దిసేపటికే రఘురామ ఇంటికి అమరావతి జేఏసీ కీలక నేత వెళ్లి మాట్లాడటం గమనార్హం.

సీఐడీ నోటీసులు ఇచ్చిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చట్టాలను, న్యాయస్థానాలను గౌరవిస్తానని అన్నారు.

గతంలో నమోదు చేసిన కేసులో మరిన్ని వివరాలు సేకరించేందుకు విచారణకు రావాలంటూ సీఐడీ అధికారులు నోటీసు ఇచ్చారని ఎంపీ రఘురామకృష్ణరాజు చెప్పినట్లు'' సాక్షి పేర్కొంది.

సినీనటుడు సిద్ధార్థ్‌

ఫొటో సోర్స్, Getty Images

సిద్ధార్థ్‌పై హైదరాబాద్‌ సైబర్‌ ఠాణాలో కేసు

ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌పై ట్విటర్‌ వేదిక అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సినీనటుడు సిద్ధార్థ్‌పై హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో కేసు నమోదైనట్లు 'ఈనాడు' ఒక వార్తలో తెలిపింది.

''ఆయన ట్వీట్‌ మహిళలను కించపరిచేలా, అవమానపరిచేలా ఉందని నగరానికి చెందిన సామాజికవేత్త, పరిశోధకురాలు ప్రేరణ ఫిర్యాదు చేశారు.

సిద్ధార్థ్ ట్విట్టర్ ఖాతాను తొలగించాలని, అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. క్షమాపణలు కోరుతూ సిద్ధార్థ్ చేసిన ట్వీట్‌లో పశ్చాత్తాపం కనబడట్లేదని అన్నారు.

దీనిపై న్యాయ సలహా తీసుకొని సిద్ధార్థ్‌పై సైబర్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌రావు కేసు నమోదు చేశారు.

తమ్మారెడ్డి భరద్వాజ

ఫొటో సోర్స్, Tammareddy Bharadwaj/fb

‘ఇండస్ట్రీలో పిరికివాళ్లు ఎవరూ లేరు’: తమ్మారెడ్డి భరద్వాజ

''సినీ పరిశ్రమలో అందరూ పిరికివాళ్లే ఉన్నారంటూ కొంతమంది ఏపీ రాజకీయ నాయకులు ఇష్టానుసారం విమర్శలు చేస్తున్నారు. ఇండస్ట్రీ వారికి సిగ్గు, దమ్ములేదు. అంటూ రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు. ఇకపై వారి పిచ్చి మాటలను సహించేది లేదు. నాయకుల బెదిరింపులకు ఇండస్ట్రీలో భయపడేవారు ఎవరూ లేరు' అని దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ వ్యాఖ్యానించినట్లు 'నమస్తే తెలంగాణ' కథనం పేర్కొంది.

''తెలుగు సినీ పరిశ్రమపై ఏపీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌ చేసిన విమర్శలను తమ్మారెడ్డి భరద్వాజ ఖండించారు.

బుధవారం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ 'ఇండస్ట్రీలో పిరికివాళ్లు ఎవరూ లేరు. సమస్య వచ్చినప్పుడు వెనుకంజ వేయకుండా ధైర్యంగా పోరాడేతత్వం ప్రతి ఒక్కరిలో ఉంది. సినిమా వాళ్లపై శాసనసభ్యుడు ప్రసన్నకుమార్‌ చేసిన మాటలు బాధించాయి.

కులమతాలకు అతీతంగా ఉపాధి కల్పించేది ఒక్క సినీ పరిశ్రమ మాత్రమేననే వాస్తవాన్ని ఏపీ నాయకులు గ్రహించాలి. ఇతరుల మెప్పు పొందడం కోసం కులమతాల ప్రస్తావన తీసుకువచ్చి సినీ పరిశ్రమను విడగొట్గడం తగదు.

అన్ని సామాజిక వర్గాల ఓట్లతోనే గెలిచారనే సత్యాన్ని వారు గ్రహించాలి. రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మీ ఆస్తులెంతా.. ఇప్పుడెంతో చెప్పడానికి బహిరంగ చర్చకు మీరు సిద్ధంగా ఉన్నారా అని నాయకులను అడుగుతున్నా. ఎవరు ఎంత తింటున్నారో లెక్కలు తేలుద్దాం. రాజకీయ నాయకుల బెదిరింపులకు మేము భయపడాం. సినీ రంగాన్ని టార్గెట్‌ చేయడం తగదు.

అలాగే సినీ పరిశ్రమలో దాసరి నారాయణరావు స్థానాన్ని ఎవరూ భర్తీచేయలేరు. ఆయనలా అన్ని విషయాల పట్ల అవగాహన ఉన్న వ్యక్తి ఎవరూ లేరు. చిరంజీవి,బాలకృష్ణ, మోహన్‌బాబుతో పాటు అగ్రనటులందరూ తమ పరిధి మేరకు ఇండస్ట్రీకి ఏదో ఒక రకంగా తోడ్పాటునందిస్తున్నారు. వారిపై నిందలు వేయడం తగదు' అని ఆయన అన్నట్లు'' నమస్తే తెలంగాణ తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)