షర్మిల వైయస్సార్ తెలంగాణ పార్టీ పేరు రిజిస్ట్రేషన్‌పై మహబూబ్ భాషా అభ్యంతరం

వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ జెండాను ఆవిష్కరిస్తున్న షర్మిల
    • రచయిత, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

వైఎస్ షర్మిల స్థాపించిన కొత్త పార్టీ పేరు రిజిస్ట్రేషన్‌కు అభ్యంతరం వ్యక్తం చేశారు కడప జిల్లాకు చెందిన మహబూబ్ భాషా అనే వ్యక్తి.

అన్నా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరుతో ఆయన ఇప్పటికే ఒక పార్టీని ఎన్నికల సంఘం దగ్గర రిజిష్టర్ చేశారు.

దీంతో తన పార్టీ పేరుతో పోలిన వైయస్సార్ తెలంగాణ పార్టీ రిజిస్ట్రేషన్‌ను చేయకూడదంటూ ఆయన భారత ఎన్నికల సంఘాన్ని కోరారు.

మహబూబ్ భాషా వైయస్సార్ పేరుతో పెట్టిన పార్టీలపై అభ్యంతరం వ్యక్తం చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో వైయస్సార్సీపీ గుర్తింపు రద్దు చేయాలని కోరుతూ ఆయన దిల్లీ హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. అయితే ఆ పిటిషన్ను కోర్టు కొట్టేసింది. దానిపై తిరిగి సుప్రీంకు వెళ్లారు.

గతంలో ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పేరుతో ఒక పార్టీ రిజిష్టర్ చేయడానికి ప్రయత్నించారు. కానీ అభ్యంతరాలు రావడంతో, అన్నా వైయస్సార్ కాంగ్రెస్ పేరుతో పార్టీని నమోదు చేశారు. ఆ తరువాత జగన్, ఇప్పుడు షర్మిళల పార్టీలపై భారత ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశారు.

షర్మిళ పార్టీ విషయంలో భాషా ఫిర్యాదును ఎన్నికల సంఘం స్వీకరించింది. ఆ మేరకు వివరణ కోరుతూ షర్మిళ పార్టీ వారికి లేఖ కూడా రాసింది.

దీంతో ఇక షర్మిల పార్టీ ఆ పేరుతో రిజిష్టర్ అయ్యే అవకాశం లేదని బీబీసీతో చెప్పారు మహబూబ్ భాషా.

''ఎన్నికల సంఘం నా ఫిర్యాదును పరిగణనలోకి తీసుకుంది. ఇప్పటికే ఆ పార్టీ వారికి నోటీసులు ఇచ్చింది. వారికి పేరు మార్చుకోవడం తప్ప మరో గత్యంతరం లేదు'' అని బీబీసీతో చెప్పారు ఆయన.

పార్టీ అభిమానులకు అభివాదం చేస్తున్న షర్మిల
ఫొటో క్యాప్షన్, పార్టీ అభిమానులకు అభివాదం చేస్తున్న షర్మిల

భాషా వాదన అర్థరహితం-వైయస్సార్ తెలంగాణ పార్టీ

అయితే భాషా వాదన అర్థరహితమని వైయస్సార్ తెలంగాణ పార్టీ తరపున ఎన్నికల సంఘానికి సమాధానం కూడా ఇచ్చారు.

''మేం ఇప్పటికే దీనిపై వివరణ ఇచ్చాం. మాకు వైయస్సార్ అనే పేరు వాడుకునే హక్కు లేదన్న వాదన అర్థ రహితం. సదరు భాషా అనే వ్యక్తి గతంలో కూడా అనేక కేసులు వేశారు. అవేవీ కోర్టులో నిలబడలేదు. అప్పటి తీర్పులు కూడా మేం ఎన్నికల సంఘానికి ఇచ్చాం. అతి త్వరలోనే ఎన్నికల సంఘం వైయస్సార్ తెలంగాణ పార్టీని నమోదు చేసుకుంటుంది'' అని బీబీసీకి చెప్పారు ఆ పార్టీ నాయకులు కొండా రాఘవ రెడ్డి.

అన్నా వైయస్సార్ కాకుండా, వైయస్సార్ పేరుతో కడప కేంద్రంగా మరో రెండు పార్టీలు ఉండటం విశేషం. ఏకీకృత సంక్షేమ రాష్ట్రీయ ప్రజా పార్టీ, వైయస్సార్ బహుజన పార్టీ పేర్లతో రెండు పార్టీలు భారత ఎన్నికల సంఘం దగ్గర రిజిష్టర్ అయి ఉన్నాయి.

తాజాగా వైయస్సార్ తెలంగాణ పార్టీ రిజిస్ట్రేషన్ పరిస్థితిపై మహబూబ్ భాషా వేసిన ఆర్టీఐ అప్లికేషన్‌కి భారత ఎన్నికల సంఘం స్పందించింది.

ఎన్నికల సంఘం ఇచ్చిన సమాధానంలో జత పరిచిన పత్రాల ప్రకారం, వైయస్సార్ తెలంగాణ పార్టీ ఇచ్చిన వివరణతో ఎన్నికల సంఘం అధికారులు సంతృప్తి చెందినట్టు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)