మహేశ్‌ బాబుకు కోవిడ్ పాజిటివ్, అందరూ జాగ్రత్తగా ఉండాలంటూ ట్వీట్

హీరో మహేశ్ బాబు Mahesh Babu/

ఫొటో సోర్స్, Mahesh Babu/twitter

తనకు కోవిడ్ పాజిటివ్ అని నిర్థరణ అయ్యిందని సినీ నటుడు మహేశ్‌ బాబు తెలిపారు. తనను కలిసినవారంతా కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని కోరారు. ఇంట్లోనే ఐసోలేట్ అయ్యానని చెప్పారు.

''తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకున్నాను. అయినప్పటికీ నాకు కొవిడ్‌ పాజిటివ్ అని‌ రిపోర్టు వచ్చింది, స్వల్పంగా కోవిడ్ లక్షణాలు ఉన్నాయి. ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉంటున్నాను. డాక్టర్ల సూచనలను పాటిస్తున్నాను. నన్ను కలిసిన వారందరూ కొవిడ్‌ పరీక్షలు చేయించుకోండి. ఇప్పటివరకూ కోవిడ్-19 టీకా వేయించుకోని వారు వెంటనే తీసుకోండి. టీకా వేయించుకుంటే వ్యాధి తీవ్రతను తగ్గిస్తుంది, ఆస్పత్రిలో చేరే అవకాశాలు తక్కువగా ఉంటాయి. దయచేసి అందరూ కొవిడ్‌ నిబంధనలు పాటించండి. సురక్షితంగా ఉండండి'' అంటూ మహేశ్‌ బాబు ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

amritsar airport

ఫొటో సోర్స్, ANI

అమృత్‌సర్: ఒకే విమానంలో 125 మందికి కోవిడ్ పాజిటివ్, విమానాశ్రయానికి క్యూ కట్టిన అంబులెన్సులు

ఇటలీ నుంచి చార్టర్డ్ విమానంలో పంజాబ్‌లోని అమృత్‌సర్ విమానాశ్రయానికి చేరుకున్న 125 మంది ప్రయాణికులకు కోవిడ్ పాజిటివ్ అని నిర్థరణ అయ్యిందని విమానాశ్రయం అధికారులు తెలిపారు.

ఇటలీ నుంచి చార్టర్డ్ విమానంలో మొత్తం 179 మంది వచ్చారు. వారందరికీ అమృత్‌సర్ విమానాశ్రయంలో కోవిడ్-19 పరీక్షలు చేశారు. వారిలో 125 మందికి పాజిటివ్ అని తేలిందని విమానాశ్రయం డైరెక్టర్ వీకే సేథ్ చెప్పారు.

దాంతో, వారిని ఆస్పత్రులకు, ఐసోలేషన్ కేంద్రాలకు తరలించేందుకు భారీ సంఖ్యలో అంబులెన్సులు విమానాశ్రయానికి వచ్చాయి.

covid

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

దేశంలో తొలి ఒమిక్రాన్‌ మరణం

భారత్‌లో తొలి ఒమిక్రాన్‌ మరణం నమోదైంది. రాజస్థాన్‌కు చెందిన 74ఏళ్ల వృద్ధుడు ఒమిక్రాన్‌తో మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్‌ సెక్రటరీ లవ్‌ అగర్వాల్‌ ప్రకటించారు. ఆ వృద్ధుడికి డయాబెటిస్‌తో పాటు ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయని అధికారులు తెలిపారు.

దేశంలో ఇప్పటివరకు 2,630 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. రోజువారీ కరోనావైరస్‌ కేసుల సంఖ్య 90 వేలు దాటింది. వారం రోజుల్లోనే రోజువారీ కేసుల సంఖ్య ఆరు రెట్లు పెరిగింది.

కేసుల్లో పెరుగుదలకు ఒమిక్రాన్‌ వేరియెంటే కారణమని నిపుణులు చెబుతున్నారు. గత 24 గంటల్లో కరోనా బారిన పడి 325 మంది చనిపోగా వారిలో ఒకరు ఒమిక్రాన్‌ వేరియెంట్‌తో మరణించారని అధికారులు వెల్లడించారు.

ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌ వార్తా పత్రిక కథనం ప్రకారం... డిసెంబర్‌ 15న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో హాస్పిటల్‌లో చేరిన ఆ వృద్ధుడు 15 రోజుల తర్వాత మరణించారు. ఆయన కరోనా టీకాను తీసుకున్నారు. ఒమిక్రాన్‌ వేరియెంట్ నగరాల్లో చాలా వేగంగా వ్యాపిస్తోందని, ప్రజలు సమూహాలుగా తిరగరాదని లవ్‌ అగర్వాల్ సూచించారు.

covid

ఫొటో సోర్స్, Getty Images

మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, దిల్లీ, కేరళ, తమిళనాడు, కర్నాటక, ఝార్ఖండ్‌లలో కేసుల్లో పెరుగుదల, పాజిటివిటీ రేటు కొంత ఆందోళనకరంగా ఉన్నాయని ఆయనన్నారు.

భారత్‌లో 2021 ఏప్రిల్‌, మే నెలల్లో కోవిడ్‌ సెకండ్‌ వేవ్ విలయతాండవం చేసింది. దేశవ్యాప్తంగా హాస్పిటళ్లన్నీ రోగులతో నిండిపోయాయి. బెడ్లు, ఆక్సిజన్, అత్యవసర ఔషధాలు దొరక్క ప్రజలు విలవిల్లాడారు.

గత వేరియెంట్లతో పోల్చి చూస్తే ఒమిక్రాన్‌ సోకినవారు హాస్పటల్‌ చేరాల్సిన అవసరం తక్కువ ఉంటుందని ప్రాథమిక పరిశోధనల్లో వెల్లడైంది. ఓవైపు పెరుగుతున్న కేసులు, మరోవైపు కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు జరగుతుండడంతో మరోసారి వైద్యసేవలపై, డాక్టర్లపై పెను భారాన్ని మోపేలా ఉన్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఎన్నికల సమయంలో నిర్వహించే భారీ ర్యాలీలు వైరస్‌ వ్యాప్తిని మరింత వేగవంతం చేస్తాయని భయపడుతున్నారు. ఇప్పటికే దిల్లీ, మహారాష్ట్ర వంటి కొన్ని రాష్ట్రాలు నైట్‌ కర్ఫ్యూ, వీకెండ్ కర్ఫ్యూ వంటి ఆంక్షలు విధించాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)