Sedition: అధికారం చేతిలో అస్ర్తంగా మారిన ’’దేశద్రోహం’’

రఘురామ కృష్ణరాజు

ఫొటో సోర్స్, RAGHU RAMA KRISHNA RAJU/FACEBOOK

ఫొటో క్యాప్షన్, రఘురామ కృష్ణరాజు
    • రచయిత, అజయ్ గూడవర్తి
    • హోదా, బీబీసీ కోసం

భారత రాజకీయాల్లో కొత్త పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అసమ్మతి గళం వినిపించేవారిపై, విమర్శలు చేసేవారిపై దేశద్రోహం కేసులు పెట్టి అరెస్టులు చేయడం, విచారణ పేరుతో కోర్టులు చుట్టూ తిప్పడం వీటిలో ఒకటి.

ఇప్పడు ధర్నాలు చేసేవారితోపాటు సోషల్ మీడియాలో తమకు వ్యతిరేకంగా మాట్లాడేవారిపైనా ఇలాంటి కేసులు పెడుతున్నారు.

విమర్శలు చేయడమే కాదు అధికారంలో ఉన్నవారితో విభేదిస్తూ తమ అభిప్రాయాలను స్పష్టంగా వెల్లడించినా కేసులు వెంటాడుతున్నాయి.

ఇప్పుడు ఇది కొత్త మలుపు తీసుకుంది. తమను విమర్శించే ప్రతిపక్షంలోని నాయకులపై ప్రభుత్వాలు అవినీతి, దేశద్రోహం కేసులను పెట్టడాన్ని దాటి తమతో విభేదిస్తే సొంత పార్టీ ఎంపీలపైనా ప్రభుత్వాలు దేశద్రోహం, అవినీతి కేసులు పెట్టే స్థాయికి పరిస్థితి వచ్చింది.

అరెస్టైన తృణమూల్ మంత్రులు ఫిర్హాద్ హుస్సేన్, సుబ్రతో ముఖర్జీ, ఎమ్మల్యే మదన్ మిత్రా, టీఎంసీ మాజీ నేత శోభన్ చటర్జీ

ఫొటో సోర్స్, SANJAY DAS/BBC

ఫొటో క్యాప్షన్, అరెస్టైన తృణమూల్ మంత్రులు ఫిర్హాద్ హుస్సేన్, సుబ్రతో ముఖర్జీ, ఎమ్మల్యే మదన్ మిత్రా, టీఎంసీ మాజీ నేత శోభన్ చటర్జీ

ఇటీవల పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు మంత్రులు, నలుగురు ఎమ్మెల్యేలను పెండింగ్‌లో ఉన్న అవినీతి కేసులు బయటకు తీసి అరెస్టు చేశారు.

అంతకుముందు మరికొందరు నాయకులను.. తమ పార్టీలో చేరకపోతే వారిపై ఉన్న అవినీతి కేసులపై అరెస్టు కావాల్సి ఉంటుందని బీజేపీ బెదిరించినట్లు వార్తలు వచ్చాయి.

ఈ విషయాన్ని ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రస్తావించారు. తమ పార్టీలో చేరితే అవినీతి ఆరోపణలన్నీ చిటికెలో మాయం కావడానికి బీజేపీ ఏమైనా వాషింగ్ మెషీనా? అని ఆమె వ్యాఖ్యానించారు.

అయితే, ఇలాంటి చర్యలు కేవలం బీజేపీకి మాత్రమే పరిమితం కాదు. తమిళనాడులో జయలలిత అధికారంలోకి వచ్చిన వెంటనే అర్థరాత్రి డీఎంకే నాయకుడు కరుణానిధి అరెస్టు అయ్యారు.

అక్రమ ఆస్తుల కేసులో తన అరెస్టుకు స్పందనగా జయ ఈ అరెస్టు చేయించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అమిత్ షా, చిదంబరం అర్ధరాత్రి అరెస్టుల సమయంలోనూ ఇలాంటి నాటకీయ పరిణామాలే చోటుచేసుకున్నాయి.

జగన్

ఫొటో సోర్స్, facebook/ysjaganmohanreddy

ఆంధ్రప్రదేశ్‌లోని జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం ఈ తంతును ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లింది.

తనపై విమర్శలు చేసిన సొంత పార్టీ ఎంపీ రఘురామ కృష్ణరాజు అరెస్టు, చంద్రబాబు నాయుడుతోపాటు చాలా మంది టీడీపీ నాయకులకు నోటీసులు పంపించడం లాంటి చర్యలు ఏపీలో చోటుచేసుకున్నాయి.

తెలంగాణలోనూ ఇదే పంథా అనుసరిస్తున్నారు. తనపై వ్యతిరేకంగా గళమెత్తిన 13 ఎన్జీవోలు, విద్యార్థి సంఘాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి వేటువేశారు.

తనకు వ్యతిరేకంగా గళమెత్తన సొంత పార్టీ నాయకుల గొంతునూ నొక్కేస్తున్నారన్న విమర్శలు పెరుగుతున్నాయి.

ఈటెల రాజేందర్‌పై భూవివాదం, అవినీతి కేసులు, మంత్రి పదవి నుంచి తొలగించడం దీనికి ఉదాహరణగా చెబుతున్నారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా విమర్శలు చేసిన తరువాత ఈటెల ఈ పరిణామాలు ఎదుర్కొన్నారు.

యోగి ఆదిత్య నాథ్

ఫొటో సోర్స్, facebook/MYogiAdityanath

ఉత్తర్ ప్రదేశ్‌లో కోవిడ్-19 కట్టడికి అనుసరిస్తున్న విధానాలను విమర్శించిన బీజేపీ ఎంఎల్ఏ రాకేశ్ రాథోడ్‌కూ దేశద్రోహం కేసే ఎదురైంది.

కారణాలు వేరైనా అన్ని పార్టీలు అనుసరిస్తున్న విధానాలు మాత్రం ఒకే బాటలో నడుస్తున్నాయి. బీజేపీ కరడుగట్టిన జాతీయవాదం, హిందూత్వ రాజకీయాలతో ముందుకు వెళ్తుంటే.. జగన్, కేసీఆర్, మమతలను తమ సొంత మార్కు రాజకీయాలు నడిపిస్తున్నాయి.

దాదాపు అన్ని పార్టీలూ అధినేతల పేరు చేప్పుకునే ముందుకు వెళ్తున్నాయి. తృణమూల్‌లో మమత మాత్రమే కనిపిస్తారు. బీజేపీలో అయితే మోదీ-షాల ద్వయం. నాయకుల చుట్టూ తిరిగే ఈ రాజకీయాల్లో తమ పదవికి ఎసరు వస్తుందనే భయంతో తీసుకునే చర్యలు బహిరంగంగానే బయటకు కనిపిస్తాయి.

అమిత్ షా

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, అమిత్ షా

ఇక్కడ అవినీతి లేదా ఇతర కారణాలను సాకుగా చూపిస్తూ తీసుకునే చర్యలు తమ సొంత పగలు, ప్రతీకారాలను తీర్చుకోవడం కోసమేనని అందరికీ తెలిసిందే. ఇప్పడు ప్రజల అభిప్రాయాలు, మీడియా రాసే వార్తలను కూడా పట్టించుకోకుండా బహిరంగంగానే చర్యలు తీసుకుంటున్నారు.

ఎందుకంటే ఇక్కడ అంతా కులాలు, మతాలు, పార్టీల పేరుతో విడిపోయి ఉన్నారు. దర్యాప్తు సంస్థల్లో అంతర్గత విచారణ చేపట్టే వ్యవస్థలు కూడా ఉండటం లేదు. దీంతో తమకు కావాల్సిన వ్యక్తులకు పదోన్నతులు, పదవులు అప్పగిస్తున్నారు.

ఇప్పుడు అధికారం మోదీ-షాల ద్వయం, పీఎంవోతో మొదలుపెట్టి ప్రాంతీయ ప్రభుత్వాల వరకు పైనుంచి కిందకు కేంద్రీకృతమై ఉంది. దేశం లేదా రాష్ట్రాలు, ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, నాయకులు ఇలా అధికారాలన్నీ కలిసిపోయాయి.

తమకు వ్యతిరేకంగా నడుచుకునే పార్టీలపై బీజేపీ ఒత్తిడి చేస్తోంది. ఇవే విధానాలను ప్రతిపక్ష నాయకులు, పౌర సంఘాలు, ఎన్జీవోలపై ప్రాంతీయ పార్టీలు ఉపయోగిస్తున్నాయి.

ఇక్కడి సమాజం కూడా ఈ బాటలోనే నడుస్తోంది. వెనుకబడిన వర్గాలపై అగ్రవర్ణాలు అధికారం చెలాయించడానికి కూడా ఇదే కారణం.

కరోనావైరస్‌పై పోరాటంలో మనం విఫలం కావడానికీ కలసికట్టుగా ముందుకు వెళ్లకపోవడమే కారణం.

నేటి పరిస్థితులను పగ, ప్రతీకారాలు, అధికార దాహంతో నిండిన రాజకీయాలు నడిపిస్తున్నాయి. కరోనా మహమ్మారికి మనం చెల్లిస్తున్న మూల్యంతో ఇలాంటి విధానాలు కొరగానివని మనం అర్థం చేసుకోవాలి.

(అభిప్రాయాలు వ్యక్తిగతం. వ్యాసకర్త జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలోని సెంటర్ ఫర్ పొలిటికల్ స్టడీస్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)