మీకు ఓటు ఉందా, స్మార్ట్ ఫోను కూడా ఉందా.. అయితే మిమ్మల్ని ఏ రాజకీయ పార్టీ ఎందుకు, ఎలా టార్గెట్ చేస్తోందో తెలుసా.. - డిజిహబ్

ఫొటో సోర్స్, GETTY IMAGES
- రచయిత, పూర్ణిమ తమ్మిరెడ్డి
- హోదా, బీబీసీ కోసం
ఎన్నికల్లో టెక్నాలజీ అన్న మాట వినిపించగానే ముందుగా గుర్తొచ్చేది ఈ-ఓటింగ్. అయితే, ఇప్పటికీ మెషీన్ బాలెట్ కన్నా పేపర్ బాలెట్ మెరుగనే వాదోపవాదాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ చర్చలు ఎటూ తేలకపోయినా, టెక్నాలజీ మరో విధంగా ఎన్నికల ఫలితాలను నిర్దేశిస్తోంది.
ఎన్నికలకు ముందు జరిగే ప్రచార కార్యక్రమాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా టెక్నాలజీని ఉపయోగించడం గణనీయంగా పెరిగింది.
2014, 2019లలో బీజేపీ అధికారంలోకి రావడానికి ఆ పార్టీ టెక్నాలజీని ఉపయోగించుకున్న తీరుతెన్నులే ముఖ్యకారణమని కొందరు విశ్లేషకుల అభిప్రాయం.
2020 నాటికి 74కోట్ల భారతీయులకు, అంటే దాదాపు నలభై శాతం జనాభాకి ఇంటర్నెట్ అందుబాటులో ఉందని గణాంకాలు చెప్తున్నాయి. వీరిలో అధికులు ఇంటర్నెట్‌ను స్మార్ట్ ఫోన్ల మీద యాక్సెస్ చేస్తున్నవారే.
ఈ పరిణామాన్ని రాజకీయ పార్టీలు తమ లాభానికి వాడుకుంటున్నాయి. డేటా ప్రొఫైలింగ్, అనలటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి అధునాతన టెక్నాలజీలతో పాటు అందరికీ అందుబాటులో ఉండే వాట్సాప్, ఫేస్బుక్, ట్విటర్లను సమర్థవంతంగా వాడుకుని ఓటర్లను చేరుకుంటున్నాయి. ఆ విశేషాలు కొన్ని ఈ వ్యాసంలో చూద్దాం.
ఓటర్ టార్గెటింగ్ - అప్పుడు, ఇప్పుడు
సాధారణ ఎన్నికల ప్రచారంలో ఓటర్లను చేరుకోడానికి కొన్ని పద్ధతులు అవలంబించేవారు. ప్రతీ బూత్ కిందకి వచ్చే ఓటర్లను కులం, మతం వారీగా క్యాటగిరీలు చేసుకోవడం, ఆయా ఊరి పెద్దలతో లేదా మత పెద్దలతో ఓటర్లకు తమ గురించి చెప్పమనడం చేసేవారు.
టెలిఫోన్లు వచ్చాక, పార్టీకి చెందిన కార్యకర్తలో, వలంటీర్లో ఒక యాభై నుంచి వంద ఫోన్ నెంబర్లు పోగేసి, ఆ నెంబర్లకి కాల్ చేసి ఓటు వేయమని అడిగేవారు.
లోకల్ NGOలు, స్వయం సహకార గ్రూపులపై ప్రత్యేక దృష్టి పెట్టడం, ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో మంచి, చెడులను ఓటర్లకు వివరించడం ద్వారా తమ పార్టీల వైపుకు తిప్పుకునే ప్రయత్నాలు జరిగేవి. ఏ పార్టీకీ చెందనివారిని మచ్చిక చేసుకునే ప్రయత్నాలు, సారాకో, డబ్బుకో లొంగి ఓటు వేసేవారిని కనుక్కోవడం మరో పద్ధతి.
ఇప్పుడు ఇంటర్నెట్ వినియోగం పెరగడంతో ప్రచార పద్ధతుల్లో గణనీయమైన మార్పు వచ్చింది. ఆ పద్ధతులేంటో చూద్దాం.
ఓటర్ల పర్సనల్ డేటా కలెక్షన్: యాప్స్, సోషల్ మీడియా, ఫోన్ నెంబర్ల సహాయంతో ఓటర్ల పేరు, వయసు, మతం, నివాసం లాంటి వివరాలన్నీ సేకరిస్తున్నారు.
ఓటర్ ప్రొఫైలింగ్: ఓటర్ల పర్సనల్ డేటాను బట్టి వారిని వయసు, కులం, ప్రాంతం వారీగా విభజించి, వారికి రాజకీయ నేతల నుంచి కస్టమైజ్ చేసిన వాయిస్ మెసేజీలను పంపిస్తారు. ఉదాహరణకు, నగరవాసులకు రోడ్ల మీద గుంతలు లేకుండా చూస్తామని హామీ ఇస్తే, అదే నగరంలోని స్లమ్ ఏరియాలో ఉండేవారికి సంక్షేమ పథకాలు చేపడతామని హామీ ఇవ్వడమన్నమాట.
కొత్త ఓటర్లను గురిపెట్టడం: తొలిసారి ఓటు హక్కు వచ్చిన యువతను ఆకట్టుకోడానికి ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా వేదికల ద్వారా వారికి చేరువవుతున్నారు. వారికోసం ప్రత్యేక పేజీలు నిర్వహించి అక్కడ రాజకీయ అప్‍డేట్స్‌తో పాటు మీమ్స్/జోక్స్/స్పూఫ్స్ లాంటి హాస్య, వ్యంగ్య కంటెంట్‍ను క్రియేట్ చేసి వారి దృష్టిని ఆకర్షించడం లాంటివి చేస్తున్నారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
ఇన్‍ఫ్లుయన్సర్లని గుర్తించడం: టెక్నాలజీ అందుబాటులో ఉండి కాస్తో కూస్తో చదవడం, రాయడం, మాట్లాడడం వచ్చినవారిని ఇన్‍ఫ్లుయన్సర్లుగా గుర్తించి వారి ద్వారా తమ ప్రచారాన్ని మరి కొంతమందికి చేరేలా చూస్తున్నారు.
ఉదాహరణకు, ఒక ఊరిలో కేవలం ఒకరిద్దరి దగ్గరే మోబైల్ ఫోన్ ఉంది, లేదా ఒకరిద్దరికే సోషల్ మీడియా తెలుసు అనుకుందాం. అప్పుడు వీళ్ళ ద్వారా తమ నాయకుల గురించి ఊర్లో ఉన్న ఇతర ఓటర్లకి చెప్పిస్తారు.
కొన్ని పార్టీలు ఇలాంటి వారిని “సెల్‍ఫోన్ ప్రముఖ్” అని పిల్చుకుంటున్నాయి.
క్యాంపెయిన్ వాన్స్‌లో జీపీఎస్: క్యాంపెయిన్‌కు వాడే వాహనాల్లో జీపీఎస్ వాడడం వల్ల ఎన్ని ఊర్లు కవర్ చేసింది, ఎక్కడ వరకూ వెళ్లింది అన్నీ కళ్ల ముందు మాప్‍లో కనిపిస్తుంటుంటాయి. దీనిని ఆధారంగా చేసుకుని క్యాంపెయిన్ సమయాన్ని మరింత సమర్థవంతంగా వాడుకోగలుగుతున్నారు.

ఫొటో సోర్స్, Reuters
పార్టీ కార్యకర్తలతో టెక్ ద్వారా సమన్వయం
ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీలకు ఉండే అతిపెద్ద పని కార్యకర్తలను ఏక తాటిపై నిలబెట్టి, పనులు జరిగేట్టు చూడడం. దీని కోసం కూడా ప్రస్తుతం టెక్‍ని బాగా ఉపయోగిస్తున్నారు.
వాట్సాప్ గ్రూపుల ద్వారా గ్రాస్‍రూట్‌లో పనిచేసే కార్యకర్తల నుంచి లోకల్ సమాచారాన్ని తెలుసుకుంటూ, పైన ఉన్న నాయకులకు చేరవేస్తున్నారు.
ఉదాహరణకు, ఎవరైనా ఒక ఉపాధి పథకం ద్వారా లాభపడుంటే ఆ సమాచారం వెంటనే పైవారికి తెలియజేస్తారు.
కోవిడ్ నేపథ్యంలో వర్చువల్ ర్యాలీల కోసం టెక్
కోవిడ్ కారణంగా ప్రస్తుతం జరగుతున్న అయుదు రాష్ట్రాల ఎన్నికల్లో ర్యాలీలకు ఎన్నికల కమిషన్ అనుమతినివ్వలేదు. కేవలం వర్చువల్ ర్యాలీలు నిర్వహించుకోవచ్చని చెప్పింది. అందుకు అనుగుణంగానే అనేక పార్టీలు ఈ కింది విధంగా టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నాయి.
వీడియో కాల్/టెలీ కాన్ఫరెన్సింగ్: భారీ సంఖ్యల్లో హాజరు కాగలిగే టెలీ కాన్ఫరెన్సింగ్ టూల్స్ ఇప్పుడు అందుబాటులో ఉండడంతో, డబ్బులు ఖర్చు చేయగల పార్టీలు వీటిని ఆసరాగా తీసుకుని వర్చువల్ క్యాంపెయినింగ్ చేస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఫేస్బుక్/ట్విటర్/వాట్సాప్‌లపై లైవ్ సెషన్లు: వర్చువల్ ర్యాలీలను ఫేస్బుక్, ట్విటర్ లాంటి సోషల్ మీడియా సైట్లలో లైవ్ చేయడం ద్వారా టీవీకి దూరంగా ఉండే ప్రేక్షకులను కూడా చేరుకుంటున్నారు.
దానికి తోడు రికార్డ్ అయిన సమావేశాలను వాట్సాప్ ద్వారా తమ కార్యకర్తలకు పంపిస్తే, వాళ్లు ఓటర్లకు ఫార్వార్డ్ చేస్తున్నారు.
ఇంటింటికి వెళ్లి చేసే ప్రచారంలో కూడా వర్చువల్ ర్యాలీ అటెండ్ అవ్వడానికి వీలుగా అవసరమైన లింక్స్/కోడ్స్ ముందే అందజేస్తున్నారు.

ఫొటో సోర్స్, AFP
హ్యూమనాయిడ్స్/రోబోలు: కోవిడ్ వల్ల భౌతిక దూరం పాటిస్తూ ప్రచారం చేయాలి కాబట్టి హ్యూమనాయిడ్‍లను వాడే అవకాశం ఉండవచ్చని కొన్ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
గత ఏడాది 'దూత్' అనే హ్యూమనాయిడ్ రోబోను ప్రవేశపెట్టింది. వచ్చే ఎన్నికల ప్రచారంలో దీన్ని వాడే అవకాశం ఉందని అప్పట్లో ట్వీట్ చేసింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
అచ్చంగా మనుషుల్లా మాట్లాడుతూ, మనుషుల ముఖకవళికలను గుర్తిస్తూ సంభాషణ చేయడం ఈ రోబో ప్రత్యేకత. చదునుగా లేని నేలపై కూడా చక్రాల ద్వారా నడవగలదు. రాజకీయ నేతల బదులుగా ఇంటింటికీ వెళ్లి వారి తరఫున సందేశాన్ని వినిపించగలదు.
గత ఏడాది తమిళనాడులో మక్కల్ మున్నేట్ర కట్చి (IMMK) అని కొత్తగా ఏర్పాటైన రాజకీయ పార్టీ, “డూజీ” అనే రోబోను ఎన్నికల ప్రచారంలో వాడాలని నిర్ణయించినట్లు బిజినెస్ ఇన్‍సైడర్ ఒక కధనాన్ని ప్రచురించింది. కానీ అది కుదరలేదు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
హ్యూమనాయిడ్లను ఎన్నికల ప్రచారాల్లో వాడుకునే రోజులు ఎంతో దూరంలో లేవనడానికి ఇవి ఉదాహరణలు.
డీప్‌ఫేక్ టెక్నాలజీతో పలు భాషల్లో ప్రచారాలు
డీప్‌ఫేక్ ఒక వివాదాస్పదమైన టెక్నాలజీ. దీని ద్వారా ఒక వీడియోలోని మాటలను మార్చి వేరే మాటలను పెట్టవచ్చు. ఆ మాటలకు అనుగుణంగా పెదాల కదలిక, ముఖంలో భావాలను కూడా మార్చవచ్చు. అలాంటప్పుడు ఏది అసలైనది, ఏది ఫేక్ అన్నది తెలుసుకోవడం చాలా కష్టం.
అయితే, దురుద్దేశ్యాలు లేకుండా ఈ టెక్నాలజీని వాడుకునే వీలు కూడా ఉంది. ఒక వ్యక్తి మాట్లాడిన వీడియోను తీసుకుని, డీప్‌ఫేక్ టెక్నాలజీ ద్వారా ఆ వ్యక్తికి తెలీని భాషల్లో కొత్త వీడియోలు సృష్టించవచ్చు.
2020లో దిల్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా, బీజేపీ దిల్లీ ప్రెసిడెంట్ హిందీ భాషలో ఒక వీడియోలో మాట్లాడారు. ఆ వీడియోను ఆధారంగా చేసుకుని, ఆయన మాటలను ఇంగ్లిష్, హరియాణా భాషల్లోకి మార్చి దానికి తగ్గట్టుగా పెదాల కదలికలనూ మార్చారు. ఆయనే స్వయంగా ఆ భాషల్లో మాట్లాడారా అన్న భావన కలిగించేలా ఉన్నాయవి.
ప్రత్యర్థులకు ఓటు వేయొద్దని చెప్పడానికి హరియాణా మాట్లాడేవారు దీన్ని ఉపయోగించుకున్నారు. ఈ వీడియో లక్షలాది మందికి చేరిందని న్యూస్ బైట్స్ యాప్ సమాచారం.

ఫొటో సోర్స్, Getty Images
టెక్ ప్రచారాల వల్ల ముప్పులు
ప్రస్తుతం బాగా ఎక్కువ ఫండ్స్ ఉండి, టెక్నాలజీని బాగా వాడుకోగల రాజకీయ పార్టీలకే ఎక్కువ లాభం చేకూరుతోంది. ఎన్నికల ప్రచారంలోనూ, మామూలు సమయాల్లోనూ సోషల్ మీడియాను ఉపయోగించుకోలేని పార్టీలు వెనక్కి ఉండిపోతున్నాయి. అది ప్రజాస్వామ్య విధానానికి అంత మంచిది కాదు.
ఓటర్ల పర్సనల్ డేటాను వినియోగించుకునే విషయంలో కొన్ని అనైతిక అంశాలు ఉంటాయి. ఓటర్ల డేటాను వారి ఆమోదం లేకుండా పొందడం, వారికి వద్దనుకున్న సమాచారాన్ని పదే పదే పంపడం, ఇవన్నీ ప్రైవసీ ఉల్లంఘన కిందకి వస్తాయి. ఈ విషయంలో ఓటర్ల హక్కులను కాపాడే బలమైన చట్టాలు ఇప్పుడు చాలా అవసరం.
డీప్‍ఫేక్ లాంటి వివాదాస్పద టెక్నాలజీలను ఎన్నికల విషయంలో ఉపయోగించడం ఆరోగ్యకరం కాదు. ముఖ్యంగా, మన దేశంలో భాష, ప్రాంతం, ఆచార వ్యవహారాల పరంగా వైవిధ్యం ఉన్నప్పుడు, భాష రాని నాయకుల చేత భాష వచ్చినట్టు మాట్లాడించి డీప్‌ఫేక్ వీడియోలు పంపడం టెక్నాలజీపై అంతగా అవగాహన లేని ఓటర్లను మాయచేస్తున్నట్టే.
బాధ్యత గల పౌరులుగా, ఓటర్లుగా సోషల్ మీడియాలో మనకు ఎక్కువగా ఎలాంటి యాడ్స్, మీమ్స్, స్పూఫ్స్ కనిపిస్తున్నాయి, ఎలాంటి మేసేజీలు, కాల్స్ వస్తున్నాయి అని గమనించుకోవాలి. టెక్నాలజీ వల్ల ఏర్పడే మిస్-ఇన్‍ఫర్‍మేషన్, ఫేక్ న్యూస్‍ల సుడిగుండంలో చిక్కుకోకుండా జాగ్రత్త వహించాలి.

ఇవి కూడా చదవండి:
- 1857 తిరుగుబాటుకు, చపాతీ ఉద్యమమే కారణమా?
- పరవళ్లు తొక్కుతున్న ప్రవాహంతో కనువిందు చేస్తున్న ఈ జోలాపుట్ రిజర్వాయర్ విశేషాలు మీకు తెలుసా?
- అటల్ బిహారీ వాజ్‌పేయీ: ప్రేమించిన అమ్మాయిని వాజ్‌పేయీ ఎందుకు పెళ్లి చేసుకోలేకపోయారు?
- ఫ్రెంచ్ సైన్యం మాలిని వదిలిపెట్టి ఎందుకు వెళుతోంది?
- అమెరికాతో ఒప్పందంపై నేపాల్ ప్రభుత్వం ఎందుకు వివాదంలో చిక్కుకుంది? దీనికి భారత్ ఆమోదం ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













