LPG Insurance: గ్యాస్ సిలిండర్ ప్రమాదాల నష్టం నుంచి మిమ్మల్ని ఆర్థికంగా కాపాడే ఈ బీమా మీకూ ఉంది.. పైసా ఖర్చు లేకుండా రూ. 30 లక్షల ఇన్స్యూరెన్స్

పేలిన గ్యాస్ సిలిండర్ (ప్రతీకాత్మక చిత్రం)

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, నాగ సుందరి
    • హోదా, బీబీసీ కోసం

ప్రమాదవశాత్తు ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలితే..? తలచుకుంటూనే భయం వేస్తుంది కదా.

అలాంటి ప్రమాదం జరిగినపుడు తీవ్రమైన గాయాలపాలు కావొచ్చు. ప్రాణాలు కూడా పోవచ్చు. ఇలాంటి ప్రమాదాల్లో ఆస్తి నష్టం కూడా ఉంటుంది.

సిలిండర్ ప్రమాదాల్లో ఆసుపత్రుల ఖర్చులు, ఇతర నష్టాలు భర్తీ చేసుకోవడం చాలా కష్టం. ఇలాంటి పరిస్థితుల్లో మన జేబు నుంచి పైసా ఖర్చు లేకుండా రూ. 30 లక్షల వరకు బీమా కింద పరిహారం పొందవచ్చని మీకు తెలుసా?

సిలిండర్ ప్రమాదాలు జరిగినపుడు బాధితులకు అండగా ఉండేలా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీ) ఈ బీమా పథకాన్ని తమ ఎల్పీజీ వినియోగదారులకు అందిస్తాయి.

ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు 'పబ్లిక్ లయబిలిటీ పాలసీ ఫర్ ఆయిల్ ఇండస్ట్రీస్' విధానం కింద ఈ బీమాను అందిస్తున్నాయి.

ఎల్పీజీ వినియోగదారులందరికీ ఈ పథకం వర్తిస్తుంది. గాయాల పాలైన వారికి ఆసుపత్రి ఖర్చులు ఈ బీమాలో అందుతాయి.

మరణించిన వారికి కూడా ఈ పాలసీ వర్తిస్తుంది. అంటే సిలిండర్ పేలుడులో ప్రాణాలు పోయినా, గాయపడ్డా ఈ బీమా వర్తిస్తుంది.

గ్యాస్ సిలిండర్ పేలిన ప్రమాదం (ప్రతీకాత్మక చిత్రం)

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గ్యాస్ సిలిండర్ పేలుడుతో కాలి బూడిదైన ఇల్లు(ప్రతీకాత్మక చిత్రం)

దేనికెంత పరిహారం?

* ప్రమాదంలో ప్రాణం పోతే రూ. 6 లక్షల పరిహారం ఆ కుటుంబానికి ఇస్తారు.

* తీవ్రంగా గాయపడితే రూ. 2 లక్షలతో పాటు వైద్య ఖర్చుల కోసం అదనంగా రూ. 30 లక్షల వరకూ ఇస్తారు.

* ఆస్తి నష్టానికి గరిష్ఠంగా రూ. 2 లక్షల వరకు ఇస్తారు.

పాలసీ సమాచారం ఓఎంసీల వెబ్ సైట్లలో ఉంటుంది. సిలిండర్‌ని ఎలా భద్రంగా వాడాలి, దాని రక్షణ విధానాలు ఏమిటి అనే వివరాలతోపాటు బీమా సమాచారంపై వినియోగదారులకు అవగాహన కోసం కంపెనీలు రక్షణ క్లినిక్స్, సదస్సులను కూడా నిర్వహిస్తాయి.

'పబ్లిక్ లయబిలిటీ పాలసీ ఇండస్ట్రీల' కింద ఓఎంసీ కంపెనీలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్-ఇండేన్), హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(హెచ్‌పీసీఎల్-హెచ్‌పీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్-భారత్ గ్యాస్) ఈ బీమాను అందజేస్తున్నాయి.

పెట్రోలియం, సహజవాయువుల శాఖ, 2019, జులైలో రాజ్యసభలో ప్రకటించిన విధంగా ఇవి బీమా సేవలు అందిస్తున్నాయి.

గ్యాస్ సిలిండర్

ఫొటో సోర్స్, Getty Images

క్లెయిమ్ చేసుకోవడం ఎలా?

ఎల్పీజీ వినియోగదారులందరూ పీఎస్‌యూ ఆయిల్ కంపెనీల బీమా కిందకు వస్తారు. సిలిండర్ ప్రమాదం జరిగినపుడు వెంటనే ఆ విషయాన్ని సంబంధిత గ్యాస్ ఏజెన్సీ డిస్ట్రిబ్యూటర్‌కి రాత పూర్వకంగా తెలపాలి. తర్వాత డిస్ట్రిబ్యూటర్ ఆ విషయాన్ని ఆయిల్ కంపెనీకి, బీమా కంపెనీకి తెలియజేస్తాడు.

సంబంధిత ప్రక్రియ అంతా ముగిసిన తర్వాత బీమా క్లెయిమ్ మొత్తం కంపెనీ అందజేస్తుంది.

ప్రమాదం జరిగిన తరువాత బీమా పొందడానికి కావాల్సిన వివరాలన్నీ ఆయా కంపెనీల వెబ్ సైట్లతో పాటు కంపెనీల గ్యాస్ ఏజన్సీ డిస్ట్రిబ్యూటర్ల దగ్గర, కస్టమర్ సర్వీస్ విభాగంలో వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి.

ఫిర్యాదు

ఫొటో సోర్స్, Getty Images

ఇవి గుర్తుంచుకోవాలి

బీమా క్లెయిమ్ చేయడానికి అవసరమైన డాక్యుమెంట్ల గురించి ఎల్పీజీ డిస్ట్రిబ్యూటరును అడిగి తెలుసుకోవచ్చు.

ఒరిజనల్ యాక్ససరీస్ (గ్యాస్ ట్యూబ్, లైటర్ వంటివి) మాత్రమే వాడి ఉండాలి. ప్రతి ఏడాది మెయింటెనెన్స్ కోసం డీలర్‌ను క్రమం తప్పకుండా సంప్రదించాలి.

ముఖ్యమైన డాక్యుమెంట్లన్నింటినీ జాగ్రత్తగా దగ్గర ఉంచుకోవాలి. ప్రమాదంలో మరణిస్తే కుటుంబీకులు పరిహారం కోరుతూ కోర్టులో అప్పీలు చేసుకోవచ్చు.

పోలీసులకు, గ్యాస్ ఏజెన్సీకి ప్రమాదం గురించి చెప్పాలి. ఇన్సూరెన్స్ అధికారులు ప్రమాదం జరిగిన ప్రదేశానికి వచ్చి జరిగిన నష్టాన్ని సర్వే చేస్తారు.

చాలా సందర్భాలలో బీమా పాలసీకి సంబంధించిన వ్యక్తులు రావడానికి ముందే ప్రమాదం జరిగిన స్థలాన్ని శుభ్రం చేసేస్తుంటారు. అలా చేయకూడదు.

వినియోగదారుడు ఇన్సూరెన్స్ కంపెనీతో నేరుగా సంప్రదించనవసరం లేదు. డిస్ట్రిబ్యూటర్ కి సమాచారం అందిస్తే సరిపోతుంది.

క్లెయిమ్ కోసం కూడా నేరుగా దరఖాస్తు చేసుకోనక్కర్లేదు. డిస్ట్రిబ్యూటరే అన్నీ చూసుకోవాలి.

ప్రీమియం చెల్లించనవసరం లేదు

ఈ బీమా కోసం ఎలాంటి ప్రీమియం ఉండదు.

ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లు వినియోగదారుల నుంచి ప్రీమియం తీసుకోకుండానే బీమా వర్తింపజేయాలి.

గ్యాస్ సిలిండర్

ఫొటో సోర్స్, Getty Images

అవసరమైన పత్రాలు

వినియోగదారులు క్లెయిం కోసం యాక్సిడెంట్ వల్ల తమకు జరిగిన నష్ట సమాచారం, విచారణ నివేదికల ఒరిజనల్ డాక్యుమెంట్లు ఇవ్వాలి.

ఒకవేళ ప్రమాదంలో ఎవరైనా మరణిస్తే డెత్ సర్టిఫికెట్, పంచనామా ధ్రువపత్రం అందజేయాలి.

అలాగే హాస్పిటలైజేషన్ ఒరిజినల్ డాక్యుమెంట్లు, డిశ్చార్జ్ కార్డు కూడా ఇవ్వాలి. మెడికల్ బిల్స్, డాక్టర్ ప్రిస్ర్కిప్షన్లు , ప్రమాద ప్రదేశాన్ని పరిశీలించిన అధికార ధ్రువపత్రాలు కూడా ఇవ్వాలి.

బీమా సమాచారం కోసం...

* భారత్ గ్యాస్ ఎల్పీజీ ఇన్సూరెన్స్ వివరాలకు http://my.ebharatgas.com/bharatgas/PublicLiability.jsp చూడొచ్చు.

* ఇండేన్ గ్యాస్ ఎల్పీజీ ఇన్సూరెన్స్ వివరాలకు https://indane.co.in/transparency/insurance-policies.php చూడొచ్చు.

* హెచ్‌పీ గ్యాస్ వినియోగదారులు డిస్ట్రిబ్యూటర్ లేదా కస్టమర్ కేర్ సెల్‌ని 1800-2333-555 / 022 22863900 నంబరులో సంప్రదించాలి. [email protected] చిరునామాకు మెయిల్ చేయొచ్చు. ఇతర వివరాలకు https://myhpgas.in/myHPGas/HPGas/InsurancePolicies.aspx సంప్రదించొచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)