తెలంగాణ: జీఓ 317 ఏమిటి? ప్రభుత్వ ఉద్యోగులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, పృథ్వీరాజ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానికులు, స్థానికేతరులు అనే అంశం.. ముల్కీ ఉద్యమం నుంచి, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వరకూ చాలా కీలకమైన అంశంగా నిలిచింది. ఇదే అంశం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మరోసారి ఉద్యోగుల్లో ఆందోళన రేపుతోంది.
తెలంగాణలో కొత్త జోన్లు, కొత్త జిల్లాలకు అనుగుణంగా ఉద్యోగుల సర్దుబాటు కోసం ఉద్దేశించిన జీఓ 317.. అందుకు సంబంధించిన మార్గదర్శకాలే ఈ ఆందోళనకు కారణం.
ఈ జీఓను రద్దు చేయాలంటూ కొందరు ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. బీజేపీ, కాంగ్రెస్ తదితర ప్రతిపక్ష పార్టీలు ఈ జీఓను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఇదే డిమాండ్‌తో బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఆందోళనకు దిగగా.. ఆయన విపత్తు చట్టాన్ని ఉల్లంఘించారంటూ పోలీసులు ఆయనను అరెస్ట్ చేయటం, రిమాండ్‌కు పంపించటం మరో రాజకీయ వివాదానికి తెరతీసింది.
అసలింతకీ జీఓ 317 ఏమిటి? దీనిపై ఉద్యోగులు, ముఖ్యంగా ఉపాధ్యాయుల్లో ఆందోళన ఎందుకు వ్యక్తమవుతోందో చూద్దాం.

ఫొటో సోర్స్, FB/Telangana CMO
కొత్త జిల్లాలు, కొత్త జోన్లు
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత.. పరిపాలన సౌలభ్యం కోసం అప్పటి రాష్ట్రంలోని 10 జిల్లాలను పునర్‌వ్యవస్థీకరించి 33 జిల్లాలుగా విభజించింది రాష్ట్ర ప్రభుత్వం.
తొలుత 2016 అక్టోబరులో 31 కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. మరో రెండు కొత్త జిల్లాలు 2019 ఫిబ్రవరిలో ములుగు, నారాయణపేట జిల్లాలను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం కొన్ని జిల్లాల్లో 9 మండలాలు ఉంటే, మరికొన్ని జిల్లాల్లో 30 పైగా మండలాలు ఉన్నాయి.
కొత్త జిల్లాలు ఏర్పడిన వెంటనే ఉద్యోగులను వర్క్ టు ఆర్డర్ కింద కొత్త జిల్లాలకు కేటాయించారు. శాశ్వత కేటాయింపులు జరగలేదు.
అలాగే.. 2018లో ప్రభుత్వ ఉద్యోగాల కేటాయింపులో రాష్ట్ర ప్రభుత్వం కొత్త జోనల్ వ్యవస్థను ప్రవేశపెట్టింది.
రాష్ట్ర విభజనకు ముందు వరకూ తెలంగాణలోని మొత్తం పది జిల్లాలు జోన్-5, జోన్-6 కింద ఉండేవి. ఆ తర్వాత ఏర్పాటు చేసిన మొత్తం 31 జిల్లాలను 7 జోన్లు, 2 మల్టీ జోన్లుగా పునర్‌వ్యవస్థీకరించింది. దీనికి 2021లో కేంద్ర ప్రభుత్వం ఆమోదం లభించింది.
ఈలోగా.. జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్లుగా మూడంచెల కేడర్లకు రాష్ట్ర ప్రభుత్వ, స్థానిక సంస్థల పోస్టులను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

ఫొటో సోర్స్, FB/Naseeruddin Mohd
జీఓ 317 జారీ
కొత్త జోన్ల వ్యవస్థ అమలులోకి రావటంతో.. కొత్త జిల్లాలకు, కొత్త జోన్లకు, మల్టీ జోన్లకు.. ఉద్యోగాలను, ఉద్యోగులను సర్దుబాటు చేసే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది.
ఇందుకోసం 2021 డిసెంబర్ 6వ తేదీన ప్రభుత్వం 317 జీఓను జారీ చేసింది. పాత జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్లలోని ఉద్యోగులు.. ఆ పాత జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్ల పరిధిలోని కొత్త జిల్లాలు, కొత్త జోన్లు, కొత్త మల్టీ జోన్లలో తాము కోరుకున్న చోటుకు వెళ్లటానికి ఆప్షన్ ఎంచుకునే అవకాశం కల్పించింది.
ఈ ఆప్షన్లకు ఆ కేడర్ పోస్టులో సీనియారిటీని ప్రధాన ప్రాతిపదికగా నిర్ణయించింది. అలాగే.. వికలాంగులు, వితంతువులు, క్యాన్సర్ వంటి తీవ్ర అనారోగ్యాలు ఉన్న వారికి ప్రత్యేక ప్రాధాన్యత కింద ఆప్షన్లు ఎంచుకునే వెసులుబాటునిచ్చింది.
ఆప్షన్‌లను సమర్పించటానికి జిల్లా స్థాయిలో వారం రోజులు; జోనల్, మల్టీ-జోనల్ స్థాయిలో మూడు రోజుల సమయం ఇచ్చింది.
అంటే.. ఉద్యోగులు సీనియారిటీ ప్రకారం తాము కోరుకున్న జిల్లాను ఆప్షన్‌గా ఎంచుకోవచ్చు. ఉద్యోగులు ఇచ్చిన ఆప్షన్ ప్రకారం ఆయా జిల్లాల్లో ఉన్న ఖాళీల మేరకు అక్కడికి బదిలీ ఉత్తర్వులు ఇస్తున్నారు.
డిమాండ్ ఉన్న ప్రాంతంలో ఖాళీలు నిండిపోతే సీనియారిటీ తక్కువగా ఉన్న వారికి ఆ ఆప్షన్ లభించదు. దీంతో వారు కోరుకున్న ప్రాంతంలో.. అది తమ స్థానిక జిల్లానే అయినా - పోస్టింగ్ లభించదు. తమ స్థానిక జిల్లా కాకపోయినా వేరే జిల్లాకు శాశ్వత పోస్టింగ్ మీద వెళ్లాల్సి ఉంటుంది.
జోన్లు, మల్టీ జోన్లలో ఉద్యోగుల సర్దుబాటు, బదిలీలు కూడా ఇదే సీనియారిటీ ప్రాతిపదికన చేపడుతున్నారు.
జీఓ 317 ప్రకారం.. జిల్లా కేడర్ పోస్టులకు సంబంధించిన ఉద్యోగాలు, బదిలీలలను నిర్ణయించే అలాట్‌మెంట్ కమిటీలో జిల్లా కలెక్టరు, సంబంధిత శాఖాధిపతి సభ్యులుగా ఉంటారు.
ఇక జోనల్, మల్టీజోనల్ పోస్టులకు సంబంధించిన నిర్ణయాధికారం ప్రిన్సిపల్ సెక్రటరీ, స్పెషల్ చీఫ్ సెక్రటరీ, శాఖాధిపతి, ప్రభుత్వ సీనియర్ కన్సల్టెంట్‌లతో కూడిన కమిటీకి ఉంటుంది.

స్థానికత సమస్య...
డిప్యూటీ కలెక్టర్, కమర్షియల్ టాక్స్ ఆఫీసర్, జిల్లా పంచాయతీ ఆఫీసర్, జిల్లా రిజిస్ట్రార్, మునిసిపల్ కమిషనర్ (గ్రేడ్ 1), డివిజనల్ ఫైర్ ఆఫీసర్ వంటి గ్రూప్-1 పోస్టులన్నీ మల్టీ జోన్ కేడర్ పరిధిలో ఉన్నాయి.
జోనల్ కేడర్ పరిధిలో.. తహసీల్దార్, సీనియర్ అసిస్టెంట్, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వే, మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ వంటి పోస్టులు ఉన్నాయి.
టైపిస్ట్, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ పంచాయతీ ఆఫీసర్, పంచాయతీ సెక్రటరీ (గ్రేడ్ 4) పోస్టులు జిల్లా కేడర్ పోస్టులుగా ఉన్నాయి.
ఇక ఉపాధ్యాయుల్లో నాన్-గెజిటెడ్ టీచర్ పోస్టులన్నీ జిల్లా కేడర్ పోస్టులయ్యాయి. అయితే.. ఉపాధ్యాయుల్లో అత్యధికులు (ఎస్‌జీటీ, స్కూల్ అసిస్టెంట్) జిల్లా కేడర్ పోస్టుల్లో ఉన్నారు.
మల్టీ జోనల్, జోనల్ కేడర్ పోస్టుల్లో కన్నా జిల్లా కేడర్ ఉద్యోగుల సర్దుబాటుపై.. ముఖ్యంగా ఉపాధ్యాయుల నుంచి ఆందోళనలు, నిరసనలు పెల్లుబుకుతున్నాయి.
ఒక పాత జిల్లాను కొత్తగా రెండు జిల్లాల నుంచి ఏడు జిల్లాల వరకూ విభజించారు. దీంతో పాత జిల్లాలోని ఉద్యోగులను కొత్త జిల్లాలకు సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. ఈ సర్దుబాటులో ఆప్షన్లు ఎంచుకోవటానికి సీనియరిటీని పరిగణనలోకి తీసుకుంటున్నారు.
అయితే.. ‘‘గతంలో సొంత జిల్లా నుంచి వేరే జిల్లాకు బదిలీ మీద వెళితే నాలుగైదేళ్లకైనా సొంత జిల్లాకు వస్తామనే ఆశ, ఆలోచన ఉండేది. కానీ ఇప్పుడు కొత్త జిల్లాలకు శాశ్వత ఉద్యోగులుగా కేటాయించటం వల్ల తమ సొంత జిల్లాలను వదిలి వేరే జిల్లాలకు శాశ్వత ఉద్యోగులుగా వెళ్లాల్సి వస్తోంది. సొంత ప్రాంతంలో కాకుండా వేరే జిల్లాలో పరాయి జిల్లా వారిగా ఉండాల్సి వస్తోంది’’ అని ఉపాధ్యాయ సంఘాల నేతలు కొందరు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
అంతేకాదు.. వేరే జిల్లా నుంచి వచ్చిన వారు తమ జిల్లాలో శాశ్వత ఉద్యోగులుగా ఉండటం వల్ల.. అది స్థానికుల్లో అసంతృప్తికి, వ్యతిరేకతకు దారితీస్తుందని.. వారి వల్ల స్థానికంగా తమ ఉద్యోగాలను కోల్పోతున్నామనే ఆందోళన తలెత్తుతుందని కూడా చెప్తున్నారు.

ఫొటో సోర్స్, FB/Ponguleti Sudhakar Reddy
ఉద్యోగులు, విపక్షాల ఆందోళన...
ఈ నేపథ్యంలో జీఓ 317ను వ్యతిరేకిస్తూ డిసెంబర్ చివరి నుంచి ఉద్యోగులు, ఉపాధ్యాయులు నిరసన చేపట్టారు.
ప్రభుత్వం తమను సంప్రదించకుండా ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకుందని పలు ఉద్యోగ సంఘాలు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాయి. ఉద్యోగుల స్థానికతను ఈ జీఓ పరిగణనలోకి తీసుకోవటం లేదని, వారికి శాశ్వత ఉద్యోగాలు కేటాయిస్తున్నారని, వేరే జిల్లాలకు బదిలీ చేస్తున్నారని చెప్తున్నారు.
అంతేకాకుండా కేటాయింపు జాబితా తయారీలోనూ లోపాలున్నాయని వారు ఆరోపిస్తున్నారు. జిల్లాలకు కేటాయింపుల్లో సీనియారిటీకి ప్రాధాన్యం ఇచ్చారని.. కానీ సీనియారిటీ జీబితా తప్పులతడకగా ఉందని మండిపడుతున్నారు.
పైస్థాయిలో పలుకుబడి ఉన్న కొందరు ప్రభుత్వ ఉపాధ్యాయులు నగరాలు, పట్టణాల్లో పోస్టులు పొందుతున్నారని ఆరోపిస్తున్నారు. వారికన్నా ఎక్కువ సీనియారిటీ ఉన్నా, కొత్త ప్రాంతాల స్థానికులు కాకపోయినా కూడా పలుకుబడి లేని వారిని శాశ్వత కేటాయింపులతో మారుమూల ప్రాంతాలకు బలవంతంగా బదిలీచేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
ఉద్యోగుల బదిలీల్లో స్థానికతను అధికారులు విస్మరిస్తుండటంతో.. కొత్త జోనల్ వ్యవస్థను తీసుకొచ్చిన ప్రధాన లక్ష్యం నీరుగారి పోతోందని ఈ ఆందోళనకు సారథ్యం వహిస్తున్న ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ చెప్పింది. ఉద్యోగులకు సొంత ప్రాంతాలు కాని ప్రదేశాల్లో వారికి ఉద్యోగాలను కేటాయిస్తున్నారని చెప్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
ఆదివాసీల అభ్యంతరం
ఉపాధ్యాయులతో పాటు ఆదివాసీ సంఘాలు కూడా ఈ జీఓను ఉపసంహరించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ జీఓలో ఆదివాసీ ఏజెన్సీ ప్రాంతానికి కేడర్ల కేటాయింపు గురించి నిర్దిష్టంగా చెప్పనందున.. రాజ్యాంగంలోని ఐదో షెడ్యూలు కింద ఆదివాసీలకు లభించిన రక్షణను ఈ జీఓ బలహీనపరుస్తుందని వారు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
ఈ జీఓను ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ.. ఆదివాసీ సంఘం తుడుం దెబ్బ డిసెంబర్ 27 ఆదిలాబాద్ జిల్లా బంద్ చేపట్టింది.
‘‘మైదాన ప్రాంతాల ఉద్యోగులు గిరిజన ఏజెన్సీ ప్రాంతాలకు, ఏజెన్సీ ప్రాంత ఉద్యోగులు మైదాన ప్రాంతాలకు బదిలీ కావటానికి జీఓ 317 వీలు కల్పిస్తోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేసే మైదాన ప్రాంత ఉద్యోగులు చాలా మంది.. తమ సొంత జిల్లాలకు తిరిగి వెళ్లటానికి సీనియరిటీ సరిపోకపోవటం వల్ల.. వారు ఏజెన్సీ ప్రాంతాల్లోనే పనిచేయటం కొనసాగుతుంది. ఇది ఆదివాసీల ఉద్యోగ అవకాశాలను దెబ్బతీస్తుంది’’ అని ఆయన తుడుం దెబ్బ ఆదిలాబాద్ అధ్యక్షుడు గోదాం గణేశ్ చెప్పారు.
‘‘ఆదివాసీయేతరులు స్థానికులుగా మారి, ఏజెన్సీ ప్రాంతాల్లో ఆస్తులు కొనటం వల్ల మా సంస్కృతి, సంప్రదాయాలు కూడా దెబ్బతింటాయి. ఇప్పటికే ఇలాంటి ఉల్లంఘనలు చోటుచేసుకుంటున్నాయి’’ అని ఆయన చెప్పినట్లు తెలంగాణ టుడే ఒక కథనంలో తెలిపింది.

హైకోర్టులో కేసు
ఉద్యోగుల సర్దుబాటు కోసం ప్రభుత్వం జారీ చేసిన జీఓ 317 అమలుపై స్టే విధించాలని కోరుతూ ఉద్యోగులు కొందరు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్ మీద గత గురువారం విచారణ చేపట్టిన హైకోర్టు స్టే విధించటానికి నిరాకరించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలంటూ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన ధర్మాసనం.. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
కాంగ్రెస్ లేఖ
కొత్త జోనల్ విధానం ప్రకారం పోస్టుల విభజన కొందరికీ వరంగా, మరికొందరికి శాపంగా మారిందని.. ఉద్యోగుల విభజన, బదిలీల్లో కొత్త జిల్లాల వారీగా స్థానికతను పరిగణనలోకి తీసుకోవడం లేదని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తప్పుపట్టారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
సీనియారిటీ ఆధారంగా శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగులను, సర్దుబాటు చేసే విధంగా విడుదల చేసిన జీవో 317ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ.. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకు ఆయన ఒక బహిరంగ లేఖ రాశారు.
ఉద్యోగుల సర్దుబాటు, బదిలీల్లో స్థానికతను పరిగణలోకి తీసుకోవాలని.. దీనిపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలతో చర్చించాలని సూచించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
బండి సంజయ్ అరెస్ట్
జీఓ 317 సవరణ డిమాండ్‌తో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ కుమార్ ఈ నెల 2వ తేదీ రాత్రి కరీంనగర్‌లో తన కార్యాలయం ఎదుట జాగరణ దీక్ష చేపట్టారు.
అయితే కోవిడ్ ఆంక్షలు అమలులో ఉన్న సమయంలో ఈ దీక్షకు అనుమతులు లేవంటూ పోలీసులు కొన్ని గంటల్లోనే ఆయన దీక్షను భగ్నం చేసి, అరెస్ట్ చేశారు.
ఆయనను సోమవారం కరీనంగర్ కోర్టులో హాజరుపరచగా.. కోర్టు ఆయనకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఆయన బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది.

ఫొటో సోర్స్, Getty Images
మావోయిస్టుల ప్రకటన
ఉద్యోగుల విభజన కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 317 జీఓను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం (మావోయిస్టు) పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికీర ప్రతినిధి జగన్ పేరుతో ఒక ప్రకటన విడుదలైంది.
‘‘స్థానికత లేకుండా మెరిట్, సీనియారిటీ ఆధారంగా కొనసాగిస్తున్న బదిలీల ప్రక్రియ వల్ల ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగులు అనేక సమస్యలను ఎదుర్కొంటారు. ప్రభుత్వ అనాలోచిత చర్యలతో అన్ని ప్రాంతాల స్థానిక విద్యార్థులు, రిజర్వేషన్ కలిగిన ఆదివాసీ ప్రాంతాల విద్యార్థులు ఉద్యోగ అవకాశాలను కోల్పోతున్నారు’’ అని ఆ ప్రకటనలో విమర్శించారు.
‘‘ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే విభజన ప్రక్రియ చేపట్టి స్థానిక నిరుద్యోగులకు తీరని అన్యాయం చేస్తోంది. ఇలాంటి ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, యువకులు ఐక్యమై ఉద్యమం చేపట్టాలని పిలుపునిస్తున్నాం’’ అని పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
- మొబైల్ ఫోన్ కొనేటప్పుడు గుర్తుంచుకోవలసిన ఏడు విషయాలు
- ఆస్కార్ రేసులో ఆశలు రేపుతున్న 15 సినిమాలివే...
- పుష్ప-సమంత: ‘ఊ అంటావా మావా..’ పాట ఐటెం సాంగ్ పంథాను తిరగరాస్తుందా? ‘మగ బుద్ధి’ గురించి చంద్రబోస్ ఏమన్నారు?
- ఈ సినీ దర్శకుడు ఇస్లాం వదిలి హిందూ మతం స్వీకరించడానికి, బిపిన్ రావత్ మరణానికి సంబంధం ఏమిటి
- జేమ్స్ బాండ్: డేనియల్ క్రెయిగ్ స్థానంలో వచ్చే కొత్త హీరో ఎవరు?
- కృతి శెట్టి: ‘శృంగారం కూడా నటనే కదా.. అలా ఉంటే బాగుంటుందని నేనే దర్శకుడికి చెప్పా’
- ‘శకుంతలా దేవి నా జాతకం చూసి తోడు దొరకదని చెప్పారు.. ఇప్పటికీ ఒంటరిగానే ఉన్నాను’
- 'సావిత్రికి అభిమానిని.. ఆ తర్వాతే అల్లుడిని!'
- నటుడు విజయ్ సేతుపతిపై రూ.3 కోట్ల పరువు నష్టం దావా.. బెంగళూరు విమానాశ్రయం దాడిలో ఏం జరిగింది?
- మైక్ టైసన్: విజయ్ దేవరకొండ 'లైగర్'లో ఈ బాక్సింగ్ హీరో ఏం చేస్తున్నాడు?
- ప్రేమ, విరహం, భక్తి, రక్తి, విప్లవం, వినోదం అన్నీ తెలిసిన కలం
- కరుణ కుమార్: పలాస, శ్రీదేవి సోడా సెంటర్ల నుంచి మెట్రో కథల వరకు..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










