బండి సంజయ్ : తలుపులు బద్దలుకొట్టి దీక్ష భగ్నం చేసిన పోలీసులు - ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, Bandi Sanjay
తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో 317కి వ్యతిరేకంగా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కరీంనగర్‌లో చేపట్టిన దీక్షను భగ్నం చేసిన పోలీసులు ఆయన్ను మొదట మానకొండూర్ పోలీస్ స్టేషన్‌కు.. ఆ తరువాత అక్కడి నుంచి ఆయన్ను కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌కు తరలించారని 'ఈనాడు' వార్తాకథనం రాసింది.
''తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయ బదిలీల కోసం విడుదల చేసిన జీవో 317ను సవరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ చేపట్టిన జాగరణ దీక్షను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత తలెత్తింది.
ఆదివారం రాత్రి కరీంనగర్‌లో తన కార్యాలయం వద్ద బండి సంజయ్ దీక్ష తలపెట్టగా అనుమతులు లేవంటూ పోలీసులు అడ్డుకున్నారు.
బండి సంజయ్ ఎలాగోలా కార్యాలయంలోకి చేరుకుని గేటుకు తాళం వేసుకుని దీక్ష ప్రారంభించారు.
రాత్రి 10.30 గంటల సమయంలో పోలీసులు తలుపులు పగలగొట్టి బండి సంజయ్‌ను అదుపులోకి తీసుకున్నారు'' అని ఆ కథనంలో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Linkedin/eashokkumar
ఎలాన్ మస్క్: టెస్లా టీంలో తొలి భారత సంతతి వ్యక్తి అశోక్
టెస్లా కంపెనీ వ్యవస్థాపకుడు సీఈవో ఎలన్ మస్క్ సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే భారత సంతతికి చెందిన అశోక్ ఎల్లుస్వామిని తన ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీకి సంబంధించిన ఆటోపైలట్ టీమ్‌లో నియమించుకున్నట్లు ట్విట్టర్‌లో వెల్లడించారని సాక్షి పత్రిక తెలిపింది.
తాను ఆటో పైలెట్ టీమ్‌ను ప్రారంభిస్తున్నానని, టీమ్‌లో నియమితుడైన తొలి భారతసంతతి వ్యక్తి అశోక్ అని కూడా ఎలాన్ మస్క్ తెలిపారు.
ఈ మేరకు అశోక్ ఆటోపైలట్ ఇంజనీరింగ్ హెడ్‌గా పనిచేయనున్నట్లు ఆయన చెప్పారు. పైగా టెస్లా ఆటోపైలెట్ బృందంలో చాలా ప్రతిభావంతులు ఉంటారని వాళ్లు ప్రపంచంలోనే తెలివైన వ్యక్తుల్లో కొందరని అన్నారు.
అంతేకాదు, అశోక్‌ని ఇంటర్వ్యూ చేసిన వీడియోని కూడా మస్క్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఇటీవలే టెస్లా ప్రజల జీవితాలను ప్రభావితం చేసే సమస్యలను నేరుగా పరిష్కరించడంలో శ్రద్ధ వహించే హార్డ్‌కోర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఇంజనీర్ల కోసం వెతుకుతున్నట్లు ట్విట్టర్‌లో పేర్కొన్న సంగతి తెలిసిందే.
అశోక్ ఎల్లుస్వామి వోక్స్‌వ్యాగన్ ఎలక్ట్రానిక్ రీసెర్చ్ ల్యాబ్‌కి సంబంధించిన డబ్ల్యూబీఏసీఓ వెహికల్ కంట్రోల్ సిస్టమ్‌లో పనిచేశారు. ఆయన చెన్నైలోని కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ గిండీ నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీని , కార్నెగీ మెల్లన్ విశ్వవిద్యాలయం నుంచి రోబోటిక్స్ సిస్టమ్ డెవలప్‌మెంట్‌లో మాస్టర్స్ డిగ్రీ చేశారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
‘తెలంగాణ చేపలు’ వచ్చేస్తున్నాయి.. ‘హబ్-స్పోక్’ ప్రణాళిక సిద్ధం
రాష్ట్రంలో మత్స్య సంపద నుంచి ఆదాయాన్ని పెంచేందుకు ప్రత్యేకంగా ‘తెలంగాణ చేపలు’ అనే బ్రాండ్‌ను సృష్టించాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించినట్లు ఈనాడు తెలిపింది.
చేపపిల్లల పెంపకంపై ఏటా రూ.కోట్లు ఖర్చు చేస్తున్నందున ఆదాయం కూడా అదే స్థాయిలో పెరిగేలా చూడాలని ‘హబ్-స్పోక్’ అనే పేరుతో ప్రణాళిక సిద్ధం చేసింది.
రాష్ట్రంలోని నీటి వనరుల్లో వదిలిన చేపపిల్లలు పెరిగి వేసవి సీజన్‌లోని కొన్ని నెలల్లో మాత్రమే మార్కెట్లకు వస్తున్నాయి. మిగతా నెలల్లో ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించుకోవాల్సి వస్తోంది. ముఖ్యంగా కొర్రమీను, మేలురకం రొయ్యలు దిగుమతి అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏడాది పొడవునా చేపలు లభించేలా నీటివనరుల్లో పెంచాలని మత్స్యశాఖను ప్రభుత్వం ఆదేశించింది.
మత్స్యకారులకు ఆదాయం పెంచడమే కాకుండా, వినియోగదారులకు నాణ్యమైన చేపలు అందించాలన్నది దీని లక్ష్యం. మిగులు చేపలను ఇతర రాష్ట్రాలకు, విదేశాలకూ ఎగుమతి చేయనున్నారు.
సైకిల్ చక్రంలో మధ్యలో ఉండే హబ్.. టోకు చేపల మార్కెట్. చక్రంలో ఉండే చువ్వలు.. వివిధ ప్రాంతాల మార్కెట్లు. ప్రతి జిల్లా కేంద్రంలో టోకు మార్కెట్ హబ్ ఏర్పాటు చేస్తారు. దాని నుంచి జిల్లాలోని చిల్లర మార్కెట్లకు, ఇతర ప్రాంతాలకు పంపుతారు. ఇదే ‘హబ్-స్పోక్’ ప్రణాళిక అని పత్రిక వెల్లడించింది.

దళిత వలంటీర్లను తొలగించారు
కృష్ణాజిల్లా జి.కొండూరు మండలం కందులపాడు గ్రామంలో ముగ్గురు దళిత వలంటీర్లను విధుల నుంచి తొలగించడం స్థానికంగా చర్చనీయాంశమైందని ఆంధ్రజ్యోతి ఒక కథనాన్ని ప్రచురించింది.
తొలగించిన వలంటీర్లలో మందా శ్యాంసన్, మందా పవన్‌కల్యాణ్, సుకభోగి దివ్య ఉన్నారు. విధుల్లో వీరు ఎలాంటి తప్పులు చేయలేదని, అవినీతికి పాల్పడలేదని జడ్పీటీసీ సభ్యుడు మందా చక్రధరరావు తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు సవ్యంగా అందిస్తున్నారని పేర్కొన్నారు.
వైసీపీ నేతల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరుకు ఆ ముగ్గురు ఉద్యోగాలు కోల్పోవాల్సి వచ్చిందని తెలిపారు. తొలగించిన వలంటీర్లకు న్యాయం చేయాలని, తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ మందా చక్రధరరావు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, జిల్లా కలెక్టర్ జె. నివా్‌సలను కలిసి వినతిపత్రాలు అందజేశారు.
ఈ విషయంపై ఎంపీడీవో పి. అనురాధను వివరణ కోరగా తొలగించిన ముగ్గురు దళిత వలంటీర్లపై ఎలాంటి ఆరోపణలు లేవన్నారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
ఇక పిల్లలకూ టీకా
తెలంగాణ సర్కార్ ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లాలో 15 నుంచి 18 ఏండ్ల లోపు పిల్లలకు కరోనా టీకా వేసేందుకు వైద్యారోగ్యశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారని నమస్తే తెలంగాణ పత్రిక వెల్లడించింది.
పెద్దల మాదిరిగానే పిల్లలకూ రెండు డోసుల టీకా ఇవ్వనున్నారు. మొదటి డోసు వేసిన 28రోజుల తర్వాత రెండో డోస్ ఇస్తారు. టీకా వేసుకునే వారిలో 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ మొదటి సంవత్సరం చదివేవారే ఎక్కువ.
ఒమిక్రాన్ వంటి వేరియంట్స్ విజృంభిస్తున్న నేపథ్యంలో పిల్లలకూ టీకా వేయాలని ప్రభుత్వం సంకల్పించింది. టీకా కార్యక్రమం సోమవారం మొదలు కానున్నది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 70-75 వేల మంది, భద్రాద్రి జిల్లాలో 60 వేల మంది వరకు ఉన్నట్లు అంచనా.
ఉమ్మడి జిల్లా కలెక్టర్లు గౌతమ్, అనుదీప్ ఆదేశాల మేరకు వైద్యారోగ్యశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉభయ జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్ హెల్త్ సెంటర్లు, జిల్లా ప్రధాన వైద్యశాల, ఏరియా వైద్యశాల, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో మాత్రమే పిల్లలకు టీకా అందనున్నది.
పిల్లలందరికీ కోవాగ్జిన్ వ్యాక్సిన్ వేస్తున్నామని రెండు జిల్లాల డీఎంహెచ్‌వోలు మాలతి, శిరీష తెలిపారు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారితో పాటు చేయించుకోని వారికీ స్పాట్ రిజిస్ట్రేషన్ టీకా ఇస్తామన్నారు.
కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు చేపడుతున్నది. రెండు డోసులు తీసుకున్న వారికి బూస్టర్ డోసు టీకా వేసేందుకూ సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నెల 10వ తేదీ బూస్టర్ డోస్ ప్రక్రియ ప్రారంభం కానున్నది. బూస్టర్ డోసు ముందుగా 60 ఏండ్లు పైబడిన వారికి, ఫ్రంట్‌లైన్ వారియర్స్, పోలీసులకు అందనున్నది. కొత్తగూడెం జిల్లాకేంద్రంలోని రామవరంలో కలెక్టర్ అనుదీప్, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, మున్సిపల్ చైర్మన్ కాపు సీతాలక్ష్మి వ్యాక్సినేషన్‌ను ప్రారంభించనున్నారు.
ఇవి కూడా చదవండి:
- విడాకులు తీసుకున్న తల్లికి దగ్గరుండి మళ్లీ పెళ్లి చేసిన కొడుకు, కూతురు
- అరుణాచల్‌ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలకు చైనీస్ పేర్లు పెట్టిన చైనా, తీవ్రంగా స్పందించిన భారత్
- దళిత యువకుడు గెడ్డం శ్రీనుది హత్యా, ఆత్మహత్యా... మూడునెలలుగా ఎందుకు తేలడం లేదు?
- RRR విడుదల వాయిదా: కోవిడ్‌తో దెబ్బతిన్న సినిమా థియేటర్ల భవిష్యత్తు ఏంటి... ఓటీటీల ప్రభావం ఎంత?
- హైదరాబాద్‌లో పెరిగిన పెళ్లిళ్లు.. అమ్మాయిల వివాహ వయస్సు 21 ఏళ్లకు పెంచే బిల్లు గురించి ఎందుకు భయపడుతున్నారు?
- మరోసారి రష్యా నమ్మకం గెలుచుకున్న భారత్... అమెరికాను దూరం పెడుతోందా?
- ఆంధ్రప్రదేశ్: అమూల్ ఒప్పందం ఏంటి... దానిపై వివాదం దేనికి?
- కోవిడ్-19: 2021 చివరికల్లా 100 శాతం వ్యాక్సినేషన్ లక్ష్యాన్ని భారత్ ఎందుకు సాధించలేకపోయింది?
- సినిమా టిక్కెట్లపై వివాదం ఎక్కడ మొదలైంది? దీని వెనుక మూడు కోణాలు
- 2021 వైరల్ వీడియోలు: సోషల్ మీడియాను కదిలించిన 5 వీడియోలను ఇక్కడ చూసేయండి...
- తన చిన్ననాటి జ్ఞాపకాలతో గ్రామం మ్యాప్ గీశాడు.. కిడ్నాప్ అయిన 30 ఏళ్ల తర్వాత కన్నతల్లిని కలిశాడు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)











