హిమంత బిశ్వ శర్మ: కేసీఆర్‌ను ఫాంహౌస్ నుంచి లాక్కొచ్చి జైల్లో పడేస్తాం - ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, BJP telangana
తెలంగాణ సీఎం కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని, ఎంపీ కార్యాలయంలోకి చొరబడి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని అత్యంత అమానుషంగా అరెస్టు చేసిన పోలీసులే.. ఫామ్ హౌస్‌లోకి చొరబడి కేసీఆర్‌ను కూడా లాక్కుపోయే రోజు ఎంతో దూరం లేదని అస్సాం సీఎం హిమంత విశ్వ శర్మ ధ్వజమెత్తినట్లు ఆంధ్రజ్యోతి ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. ఆదివారం హనుమకొండలోని దీన్‌దయాల్‌నగర్‌లో 317 జీవోకు, బండి సంజయ్ అరెస్టుకు వ్యతిరేకంగా బీజేపీ నిర్వహించిన సభలో హిమంత విశ్వ శర్మ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి, దమన నీతితో పరిపాలన సాగించిన వారంతా కాలగర్భంలో కలిసి పోయారని ఈ సందర్భంగా హిమంత అన్నారు. దేశంలో ఎమర్జెన్సీ విధించిన తర్వాత ఇందిరాగాంధీకి పట్టిన గతే.. పోలీసుల రాజ్యం సాగిస్తున్న కేసీఆర్‌కూ పడుతుందన్నారు.
2023 ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ప్రజాశక్తి ముందు ధన బలం పని చేయదని హుజూరాబాద్ ఎన్నికలు రుజువు చేశాయని ఆయన వ్యాఖ్యానించారు.
కమ్యూనిస్టులు కాలగర్భంలో కలిసిపోతున్నారని, అలాంటి వారికి కేసీఆర్ విందు భోజనాలు ఏర్పాటు చేయడం చూస్తుంటే, కనుమరుగైపోయే పార్టీలన్నీ ఒక్కదగ్గర చేరుతున్నట్టు కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. తెలంగాణను వ్యతిరేకించిన కమ్యూనిస్టులతో కేసీఆర్ దోస్తీ చేయడం విడ్డూరంగా ఉందన్నారు.
ఒక సంవత్సరంలో లక్ష మంది నిరుద్యోగులకు ఉద్యోగాలిచ్చే సమగ్రమైన కార్యాచరణను అస్సాంలో తమ ప్రభుత్వం అమలు చేయబోతోందని.. ఇక్కడ సీఎం కేసీఆర్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయకుండా, ఉన్న ఉద్యోగులను చెట్టుకొకరిని, పుట్టకొకరిని పంపి ఇబ్బందుల పాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. 2023లో టీఆర్‌ఎస్‌ను నిరుద్యోగులు, ఉద్యోగులే పాతర పెడతారని హిమంత హెచ్చరించారు.
తాను అధికారంలో ఉన్నానని విర్రవీగుతున్న కేసీఆర్.. కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీ అన్నది మరచిపోతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు సహారా, ఈఎస్‌ఐ కేసుల్లో పెద్దఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.
ఆయన అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నందుకు తనను అరెస్టు చేశారని.. కేసీఆర్ ఏ సొరంగంలో దాక్కున్నా లాక్కొచ్చి జైలుకు పంపి తీరుతామన్నారు.
స్థానికత కోసం కొట్లాడి రాష్ట్రం తెచ్చుకుంటే, దానిని కాదని సీనియారిటీ పేరుతో సీనియర్, జూనియర్ ఉద్యోగుల మధ్య కొట్లాట పెడుతున్నారని మండిపడ్డారు. 2023లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే 317 జీవోను చెత్తబుట్టలో పడేస్తుందన్నారు. దీన్ దయాల్ నగర్‌లోని విష్ణుప్రియ గార్డెన్స్‌లో సభ నిర్వహణకు పోలీసులు అనుమతివ్వకపోవడంతో సమీపంలోని ఖాళీ ప్రదేశంలో సభ ఏర్పాటు చేశారు.

ఫొటో సోర్స్, facebook/cpmtelangana
బీజేపీ వ్యతిరేక ఓటు చీలనివ్వం: సీతారాం ఏచూరి
బిజెపి వ్యతిరేక ఓటు చీలకుండా చూడడం, మతోన్మాద బిజెపిని ఓడించడమే తమ ప్రధాన లక్ష్యమని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తెలిపినట్లు ‘ప్రజాశక్తి’ ఒక కథనంలో చెప్పింది.
ఆ కథనం ప్రకారం.. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో బిజెపి వ్యతిరేకత తీవ్రంగా ఉందని, ఆ రాష్ట్రాల్లో బిజెపి వ్యతిరేక పార్టీలతో ఎన్నికల పొత్తుపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని ఏచూరి చెప్పారు.
మూడు రోజులపాటు హైదరాబాద్‌లో జరిగిన సిపిఎం కేంద్ర కమిటీ సమావేశాల ముగింపు సందర్భంగా సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో కలిసి సీతారాం ఏచూరి ఆదివారం విలేకరులతో మాట్లాడారు.
ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో బిజెపి వ్యతిరేక ఓటు చీలకుండా ఆయా రాష్ట్రాల్లోని నిర్దిష్ట పరిస్థితులకు అనుగుణంగా బిజెపిని ఓడించే బలమైన పార్టీలతో కలిసి పనిచేస్తామని తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లో బిజెపికి వ్యతిరేకంగా పోరాడుతున్న సమాజ్‌వాది పార్టీకి మద్దతిస్తున్నట్లు ఏచూరి ప్రకటించారు.
దేశాన్ని, రాజ్యాంగాన్ని, ప్రజల హక్కులను కాపాడుకోవడానికి, ప్రజల బతుకులు మెరుగుపడేందుకు బిజెపిని ఓడించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
కేంద్రంలోని మోడీ సర్కారు అనుసరిస్తోన్న విధానాలపై దేశ ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని తెలిపారు. కరోనా నియంత్రణలోనూ, అందరికీ టీకా సకాలంలో ఇవ్వడంలోనూ మోడీ విఫలమయ్యారని విమర్శించారు. పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో బిజెపిపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందన్నారు.
అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గినా భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతుండడం ప్రజలను లూటీ చేయడమేనని విమర్శించారు. ధరల పెరుగుదలతో ఆర్థిక వ్యవస్థ పతనమైందని, మోడీ విధానాలతో నిరుద్యోగం, పేదరికం, ఆకలి పెరిగిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.
రాజ్యాంగం కల్పించిన అధికారాలను ఎన్నికల కమిషన్ (ఇసి) వినియోగించుకొని పారదర్శకంగా ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రధాని సహా ఎవరైనా ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవాలని, ఎన్నికల్లో ధనప్రవాహానికి అడ్డుకట్టవేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల బాండ్లు 80 శాతం బిజెపికే వెళ్తున్నాయని, ఈ డబ్బును విచ్చిలవిడిగా ఎన్నికల్లో వాడేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తుందని, రాజకీయ అవినీతిని బిజెపి చట్టబద్ధం చేసిందని విమర్శించారు.

ఫొటో సోర్స్, Ttd
పర్యావరణహిత టీటీడీ.. నెట్ జీరో ఎనర్జీ టూరిజం డెస్టినేషన్‌కు ఎంపిక
దేశంలోని పర్యాటక, యాత్రా స్థలాలను పర్యావరణ హితంగా తీర్చిదిద్దాలని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ(బీఈఈ) సంకల్పించిందని.. ఇందులో భాగంగా ‘నెట్ జీరో ఎనర్జీ టూరిజం డెస్టినేషన్’ ప్రాజెక్టుకు మహారాష్ట్ర, కేరళ, గుజరాత్, జమ్మూకశ్మీర్‌లలోని పర్యాటక ప్రాంతాలతో పాటు ఏపీలోని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)ను ఎంపిక చేసిందని ‘సాక్షి’ ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. ఇంధన సామర్థ్యానికి తీసుకోవాల్సిన చర్యలపై నెడ్‌క్యాప్‌తో కలిసి బీఈఈ అధ్యయనం చేయనుంది. ఆ తర్వాత ఇంధన సామర్థ్యం కలిగిన వాటర్ పంపింగ్ సిస్టమ్, ఫ్యాన్లు, లైట్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను బీఈఈ సౌజన్యంతో ఇంధన పరిరక్షణ మిషన్ ఆధ్వర్యంలో టీటీడీ అధికారులు ఏర్పాటు చేయనున్నారు.
మరోవైపు ప్రభుత్వ సహకారంతో తిరుమలను కాలుష్య రహితంగా, పర్యావరణ హిత, ఇంధన సామర్థ్య పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దేందుకు టీటీడీ చర్యలు తీసుకుంటోంది. తిరుపతిలోని కళాశాలలు, పాఠశాలలు, తిరుమలలోని టీటీడీ భవనాల్లో 2.2 మెగావాట్ల రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్, పవన విద్యుత్ ప్రాజెక్టులు, బయోగ్యాస్ ప్లాంట్లు, విద్యుత్ వాహనాల చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడానికి నెడ్ క్యాప్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని టీటీడీలో సౌకర్యాలను మరింత మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఈవో జవహర్‌రెడ్డి చెప్పారు. టీటీడీ, ఇంధన శాఖ అధికారులతో వర్చువల్ విధానంలో ఆయన సమీక్ష జరిపారు. ఈ వివరాలను ఏపీ రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ సీఈవో ఎ.చంద్రశేఖరరెడ్డి ఆదివారం మీడియాకు వెల్లడించారు.
టీటీడీ భవనాల్లో విద్యుత్ వినియోగాన్ని తగ్గించడం, పునరుత్పాదక ఇంధన కార్యక్రమల ద్వారా కొంత మేర విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకోవడం లక్ష్యంగా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఆధునిక, ఇంధన సామర్థ్య, పునరుత్పాదక కార్యక్రమాలు చేపట్టడంలో ఏపీ దేశంలోనే అగ్రగామిగా నిలవాలని ప్రభుత్వం భావిస్తోందని ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ తెలిపారు.
2070 నాటికి కాలుష్య రహిత దేశంగా తీర్చిదిద్దాలనే కేంద్ర ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా ప్రముఖ యాత్రా స్థలాల్లో నెట్ జీరో ఎనర్జీ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు బీఈఈ డైరెక్టర్ జనరల్ అభయ్ బాక్రే తమకు పంపిన సందేశంలో పేర్కొన్నట్లు నెడ్ క్యాప్ ఎండీ ఎస్.రమణారెడ్డి వెల్లడించారు.

ఫొటో సోర్స్, ANI
మీసాలు ట్రిమ్ చేయనందుకు సస్పెండైన పోలీస్
మీసాలు ట్రిమ్ చేయడానికి నిరాకరించాడనే కారణంతో మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ కానిస్టేబుల్ మీద సస్పె న్షన్ వేటు పడిందని ‘ఈనాడు’ ఒక కథనంలో చెప్పింది. తనను ఉద్యోగం నుంచి తొలగించినా సరే ఈ విషయంలో రాజీపడేది లేదంటున్నాడు ఆ కానిస్టేబుల్.
ఆ కథనం ప్రకారం.. మధ్యప్రదేశ్ పోలీస్ శాఖలో రాకేశ్ రానా అనే వ్యక్తి కానిస్టేబుల్‌గా నియమితులయ్యారు. విధుల్లో ఉండగా మీసాలను ట్రిమ్ చేయాలని ఆదేశాలు ఇచ్చినప్ప టికీ.. వాటిని పాటించేందుకు నిరాకరించాడట రాకేశ్ రానా. దీంతో నిబంధనలను పాటించనందుకు గానూ అతడిని సస్పెండ్ చేశారు.
‘‘పోలీస్ శాఖలో ఇలాంటి వైఖరిని ప్రోత్సహించం. మీసాన్ని మెడవరకూ పెంచాడు. వాటిని ట్రిమ్ చేయకుండా వస్తే.. అక్కడ పని చేసే సిబ్బంది పైనా రానా ప్రభావం పడేలా ఉంది. అందుకే విధుల నుంచి సస్పెం డ్ చేయాల్సి వచ్చింది’’ అని అసిస్టెంట్ ఇన్స్పె క్టర్ జనరల్ ప్రశాంత్ వర్మ తెలిపారు.
జరిగిన ఘటనపై రాకేశ్ రానా స్పందించాడు. ‘‘ఉద్యోగం పరంగా ఎలాంటి ఫిర్యాదులూ లేవు. నేను రాజ్‌పుత్ వంశం నుంచి వచ్చా. మీసాలు ఉండటమే మాకు గర్వకారణం. దాని కోసం సస్పెండ్ అయినా ఫర్వాలేదు. కానీ ఈ విషయంలో రాజీపడే ప్రసక్తేలేదు. నేనెప్ప టికీ మీసాలు ట్రిమ్ చేయను. ఇది నా ఆత్మ గౌరవంతో ముడిపడిన విషయం’’ అని చెప్పా డు.
ఇవి కూడా చదవండి:
- బుల్లీ బాయి-సుల్లీ డీల్స్ ఏంటి? యాప్‌లో భారతీయ ముస్లిం యువతుల వేలంపై పోలీసులు ఏమంటున్నారు?
- మొబైల్ ఫోన్ కొనేటప్పుడు గుర్తుంచుకోవలసిన ఏడు విషయాలు
- అరుణాచల్‌ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలకు చైనీస్ పేర్లు పెట్టిన చైనా, తీవ్రంగా స్పందించిన భారత్
- పుష్ప-సమంత: ‘ఊ అంటావా మావా..’ పాట ఐటెం సాంగ్ పంథాను తిరగరాస్తుందా? ‘మగ బుద్ధి’ గురించి చంద్రబోస్ ఏమన్నారు?
- ఈ సినీ దర్శకుడు ఇస్లాం వదిలి హిందూ మతం స్వీకరించడానికి, బిపిన్ రావత్ మరణానికి సంబంధం ఏమిటి
- జేమ్స్ బాండ్: డేనియల్ క్రెయిగ్ స్థానంలో వచ్చే కొత్త హీరో ఎవరు?
- కృతి శెట్టి: ‘శృంగారం కూడా నటనే కదా.. అలా ఉంటే బాగుంటుందని నేనే దర్శకుడికి చెప్పా’
- ‘శకుంతలా దేవి నా జాతకం చూసి తోడు దొరకదని చెప్పారు.. ఇప్పటికీ ఒంటరిగానే ఉన్నాను’
- నటుడు విజయ్ సేతుపతిపై రూ.3 కోట్ల పరువు నష్టం దావా.. బెంగళూరు విమానాశ్రయం దాడిలో ఏం జరిగింది?
- మైక్ టైసన్: విజయ్ దేవరకొండ 'లైగర్'లో ఈ బాక్సింగ్ హీరో ఏం చేస్తున్నాడు?
- ప్రేమ, విరహం, భక్తి, రక్తి, విప్లవం, వినోదం అన్నీ తెలిసిన కలం
- కరుణ కుమార్: పలాస, శ్రీదేవి సోడా సెంటర్ల నుంచి మెట్రో కథల వరకు..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








