'గేట్ వే టు హెల్': ఈ అంతుచిక్కని రహస్య బిలాన్ని మూసివేయాలని తుర్క్‌మెనిస్తాన్ ఎందుకు యోచిస్తోంది

ఫొటో సోర్స్, GETTY IMAGES
తుర్క్‌మెనిస్తాన్‌లో ఉన్న ‘గేట్ వే టు హెల్’ గ్యాస్ క్రేటర్‌ను మూసివేయాలనుకుంటున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు ఇటీవల ప్రకటించారు. ఇది అక్కడ ప్రసిద్ధ పర్యటక స్థలం. ఎన్నో దశాబ్దాలుగా మండుతున్న సహజ వాయు బిలం.
ఈ బిలాన్ని ‘నరకానికి ద్వారాలు’ (గేట్ వే టు హెల్) అని పిలుస్తారు. ఇది తుర్క్‌మెనిస్తాన్‌లోని కరాకుమ్ ఎడారికి ఉత్తరాన ఉంది. 3.5 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న ఈ ఎడారి తుర్క్‌మెనిస్తాన్‌లో 70 శాతాన్ని ఆక్రమించింది.
69 మీటర్ల వెడల్పు, 30 మీటర్ల లోతు గల గేట్ వే టు హెల్ బిలం నుంచి సహజ వాయువు మీథేన్ నిరంతరం వెలువడుతుంది.
తుర్క్‌మెనిస్తాన్ అధ్యక్షుడు గుర్బాంగులీ బెర్దిముఖమెదోవ్ శనివారం అక్కడి టీవీ చానల్‌లో మాట్లాడుతూ, మండుతున్న ఈ బిలాన్ని ఆర్పివేయామని అధికారులను ఆదేశించారు.
పర్యావరణం, ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. అలాగే, గ్యాస్ ఎగుమతులను పెంచేందుకు ఇది తోడ్పడుతుందని అన్నారు.
"మనకు అధిక ప్రయోజనం కలిగించే ముఖ్యమైన సహజ వనరులను మనం కోల్పోతున్నాం. దానిని ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి ఉపయోగించుకోవచ్చు. ఈ మంటలను చల్లార్చడానికి మార్గాన్ని కనిపెట్టండి" అంటూ ఆయన అధికారులకు పిలుపునిచ్చారు.
గేట్ వే టు హెల్ మంటలను ఆర్పడానికి ప్రయత్నించడం ఇదేమీ తొలిసారి కాదు. 2010లో కూడా ఈ మంటలను ఆర్పడానికి మార్గాలని అన్వేషించమని ఆ దేశాధ్యక్షుడు నిపుణులను కోరారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
ఈ బిలం ఎప్పుడు ఏర్పడింది?
1971లో సోవియట్ యూనియన్‌కు చెందిన కొందరు భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు కరాకుమ్ ఎడారిలో ముడి చమురు నిక్షేపాల కోసం అన్వేషించారని చెబుతారు.
ఈ కథనం ప్రకారం, వారు ఒక చోట సహజ వాయువు నిల్వలను కనుగొన్నారు. అక్కడ తవ్వుతున్న క్రమంలో డ్రిల్లింగ్ భూమి లోపల సహజ వాయువు ఉన్న ప్రాంతాన్ని తాకింది. ఫలితంగా మూడు భారీ బిలాలు ఏర్పడ్డాయి.
వీటి నుంచి భారీగా మీథేన్ వాయువు వెలువడింది. అది వాతావరణంలో కలవకుండా అడ్డుకునేందుకు ఓ శాస్త్రవేత్త గ్యాస్‌కు నిప్పు పెట్టారనే వదంతులు ఉన్నాయి. ఇలా చేస్తే కొన్ని వారాలపాటు గ్యాస్ మండి ఆగిపోతుందని ఆయన భావించారు.
అయితే, ఈ కథనానికి అనుకూలంగా ఎలాంటి పత్రాలు, దస్తావేజులు దొరకలేదని కెనడియన్ పరిశోధకుడు జార్జ్ కొరోనిస్ అంటారు.
2013లో నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ కోసం ఓ కార్యక్రమాన్ని రూపొందించేందుకు ఒక పరిశోధన బృందం తుర్క్‌మెనిస్తాన్‌లోని ఈ ప్రాంతానికి చేరుకుంది. జార్జ్ కొరోనిస్ ఈ బృందంలో సభ్యుడు.
నిరంతరంగా మండుతున్న ఈ బిలం అసలు ఎప్పుడు మొదలైందో తెలుసుకునేందుకు ఆయన ప్రయత్నించారు.
అయితే, జార్జ్‌కు సమాధానం దొరకకపోగా, మరిన్ని ప్రశ్నలు తలెత్తాయి.
ఈ భారీ బిలం 1960లలో ఏర్పడిందని, 1980లలో మాత్రమే దీనిలో మంటలు రగులుకున్నాయని తుర్క్‌మెనిస్తాన్‌కు చెందిన భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు అంటున్నారు.
అంతుచిక్కని రహస్యం
ఈ బిలం పుట్టుపూర్వోత్తరాలను తార్కికంగా అర్థం చేసుకోవచ్చని చరిత్రకారుడు జెరోనిమ్ పెరోవిక్ అంటారు.
"ఈ బిలం, దీని చరిత్రకు సంబంధించిన కథనాల బట్టి సోవియట్ యూనియన్ కాలంలో పనులు ఎలా జరిగాయో మనం తెలుసుకోవచ్చు. విజయవంతమైన ప్రాజెక్టుల గురించి మాత్రమే వారు ప్రపంచానికి తెలియజేస్తారు. విఫలం అయిన వాటిని రహస్యంగానే ఉంచేస్తారు. స్థానికులు ఏదైనా తప్పు చేస్తే, అది బయట ప్రపంచానికి తెలియకూడదని వారు అనుకునేవారు" అని జెరోనిమ్ బీబీసీతో అన్నారు.
ఈ అగ్నిగుండం ఎడారి మధ్యలో ఏర్పడింది. దీనివల్ల ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం వాటిల్లుతుందనే భయం లేదు. దీని ప్రభావం కూడా దాదాపు శూన్యమనే చెప్పవచ్చు.
ఆ సమయంలో సోవియట్ యూనియన్‌కు సహజ వాయువులు లేదా ఇంధనం కొరత లేదని, ఏటా ఏడు లక్షల క్యూబిక్ మీటర్ల సహజ వాయువును ఉత్పత్తి చేసేవారని నిపుణులు అంటున్నారు.
అలాంటప్పుడు వాయువులకు మంటపెట్టడం అనేది ఓ ప్రయోగాత్మక చర్య కావొచ్చు.
"స్విట్జర్లాండ్ లాంటి దేశాలు ఏటా 15 వేల నుంచి 16 వేల క్యూబిక్ మీటర్ల సహజవాయువును వినియోగించుకునేవి. దానికి నాలుగు రెట్లు ఎక్కువ వాయువును మంటపెట్టడం సోవియట్ యూనియన్‌కు పెద్ద విషయం కాదు. ఈ వాయువును ఇక్కడి నుంచి మరోచోటుకు తరలించేందుకు పైప్‌లైన్ వేయడం ఒక తార్కిక ఆలోచన. అలా చేయాలంటే, ఇక్కడ భారీ స్థాయిలో నిర్మాణాలు చేపట్టాల్సి ఉంటుంది. బదులుగా వాటిని తగులబెట్టాలని నిర్ణయించుకుని ఉండవచ్చు" అని జెరోనిమ్ అభిప్రాయపడ్డారు.
"మీథేన్‌ను అలా వదిలేసి, వాతావరణంలో కలిసిపోనివ్వడం మంచి ఆలోచన కాదు. దీన్ని తగులబెట్టడానికి కారణాలను అర్థం చేసుకోవచ్చు" అని జార్జ్ పరిశోధనా బృందంలోని మైక్రోబయాలజిస్ట్ స్టీఫెన్ గ్రీన్ అంటారు.
"ఇది చాలా ప్రమాదకరంగా పరిణమించవచ్చు. మంటలు మండుతున్నంత కాలం మీథేన్ ఒకే చోట పేరుకుపోదు. లేదంటే, అప్పుడప్పుడు భారీ పేలుళ్లు సంభవించే ప్రమాదం ఉంది."
కార్బన్ డయాక్సైడ్‌ను వాతావరణంలోకి విడుదల చేయడం హానికరం. మీథేన్‌ను విడుదల చేయడం అంతకన్నా ఎక్కువ ప్రమాదకరం అన్నది వాస్తవమే. ఇరాక్, ఇరాన్, అమెరికా లాంటి దేశాలు మీథేన్‌ను వాతావరణంలోకి విడుదల చేయకుండా తగులబెడతాయి.
"అయితే, దురదృష్టవశాత్తు ఈ సమస్యకు ఇప్పటిదాకా పరిష్కారం కనుగొనలేకపోయారు" అని జెరోనిమ్ పెరోవిక్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రసిద్ధ పర్యటక స్థలంగా..
ఎన్నో ఏళ్లుగా ఈ బిలం సందర్శకులను ఆకర్షిస్తోంది. తుర్క్‌మెనిస్తాన్‌లోని ప్రసిద్ధ పర్యటక స్థలాల్లో ఇదీ ఒకటి.
2018లో ఈ బిలానికి "షైనింగ్ ఆఫ్ కరాకుమ్" అని అధికారికంగా నామకరణం చేశారు.
తుర్క్‌మెనిస్తాన్‌కు ఏటా సుమారు ఆరు వేల మంది పర్యాటకులు వస్తుంటారు. వారంతా కచ్చితంగా సందర్శించే ప్రాంతం ఈ బిలం.
రాత్రి పూట కూడా ఇది చాలా దూరం నుంచి వెలుగులు విరజిమ్ముతూ కనిపిస్తుంటుంది. ఏటా దీన్ని చూడటానికి వచ్చే పర్యటకులు పెరుగుతున్నారని స్థానికులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- ప్రపంచంలోనే అత్యంత స్వచ్ఛమైన మంచినీరు ఇది
- విశాఖ: సాగర గర్భంలో అద్భుతమైన సహజ శిలా తోరణం
- వరల్డ్ ఎర్త్ డే: డైనోసార్లలా మానవజాతి అంతం కానుందా
- అంతరించిపోయే దశలో ఉన్న ఈ పాటల పిట్ట.. ‘తన పాట మరచిపోయింది’
- పులి, మేకల మధ్య స్నేహ బంధం ఎలా సాధ్యం? వైరి జంతువుల మధ్య మితృత్వం వెనుక రహస్యం ఏమిటి?
- చుండ్రుకు డైనోసార్లకు సంబంధం ఏంటి?
- గోదావరి నది: తాగడానికే కాదు కనీసం స్నానానికి కూడా నీళ్లు పనికిరాకుండా అవుతున్నాయా
- ఈ అడవికి జబ్బు చేసింది, దాన్ని బతికించుకునేందుకు స్థానికులు ఏం చేస్తున్నారో తెలుసా?
- భారీ కృత్రిమ దీవి నిర్మాణానికి డెన్మార్క్ పార్లమెంట్ ఆమోదం
- లక్ష కోట్ల చెట్లతో గాలిలోని కార్బన్ డై ఆక్సైడ్‌ను నిర్మూలించవచ్చా?
- ఫ్రాన్స్‌లో బయటపడ్డ భారీ డైనోసార్ తొడ ఎముక.. పొడవు ఆరు అడుగుల పైమాటే..
- ఆ మానవ తప్పిదం ఎన్నో అరుదైన జీవులకు మరణ శాసనం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












