న్యూయార్క్‌: ఘోర అగ్నిప్రమాదం.. అపార్ట్‌మెంట్‌లో 19 మంది మృతి

కాలిపోయిన అపార్ట్‌మెంట్

ఫొటో సోర్స్, Getty Images

అమెరికాలోని న్యూయార్క్ నగరంలోని ఒక అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో తొమ్మిది మంది చిన్నారులు సహా 19 మంది చనిపోయారు.

మరో 32 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ తెలిపారు.

మొత్తం 19 అంతస్తుల అపార్ట్‌మెంట్ భవనంలో సంభవించిన ఈ అగ్నిప్రమాదంలో దట్టమైన పొగ అలముకుందని.. ప్రతి అంతస్తులోనూ ప్రమాద బాధితులు కనిపించారని అగ్నిమాపక విభాగం కమిషనర్ డేనియర్ నీగ్రో చెప్పారు.

ఇలాంటి ప్రమాదంలో ఇంత భారీ సంఖ్యలో చనిపోవటం గడచిన మూడు దశాబ్దాల్లోనే ఇదే అత్యధికమని ఆయన ఎన్‌బీసీ న్యూస్‌కు తెలిపారు.

కొద్ది రోజుల కిందట ఫిలడెల్ఫియాలోని ఒక అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం జరిగి ఎనిమిది మంది చిన్నారులు సహా 12 మంది చనిపోయారు.

అగ్నిమాపక చర్యలు

ఫొటో సోర్స్, Getty Images

న్యూయర్క్‌లోని బ్రాంక్స్ ప్రాంతంలో ఉన్న అపార్ట్‌మెంట్‌ బ్లాక్‌లో రెండు, మూడు అంతస్తుల్లో స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో మంటలు చెలరేగాయని అధికారులు చెప్పారు.

విద్యుత్ హీటర్‌లో లోపం వల్ల ఈ అగ్నిప్రమాదం సంభవించినట్లు వారు భావిస్తున్నారు. మంటలను ఆర్పటానికి దాదాపు 200 మంది సిబ్బంది రంగంలోకి దిగారు.

రెండు అంతస్తులకు మంటలు వ్యాపించాయని.. మంటలు మొదలైన అపార్ట్‌మెంట్ తలుపు తెరిచి ఉండటంతో దట్టమైన పొగ అన్ని అంతస్తులనూ కమ్మేసిందని కమిషనర్ నీగ్రో విలేకరులకు తెలిపారు.

అగ్నికీలలు చుట్టుముడుతుండగా అపార్ట్‌మెంట్‌లో ఉన్నవారు కిటికీల నుంచి కేకలు వేస్తూ కనిపించారని సమీపంలో నివసిస్తున్న జార్జ్ కింగ్ ఏఎఫ్‌పీ వార్తా సంస్థతో చెప్పారు.

‘‘దట్టంగా పొగ అలుముకుంది. జనం భయపడిపోయి కేకలువేస్తున్నారు. బిల్డింగ్ మీద నుంచి దూకటానికి ఎవరూ సాహసించలేదు’’ అని ఆయన తెలిపారు.

అగ్నిమాపక చర్యలు

ఫొటో సోర్స్, Getty Images

మొత్తం 63 మందికి గాయాలయ్యాయని, వారిలో 32 మందిని ఆస్పత్రులకు తరలించామని మేయర్ సలహాదారు స్టీఫెన్ రింగెల్ ఏపీ వార్తా సంస్థతో చెప్పారు. క్షతగాత్రుల్లో 13 మంది పరిస్థితి విషమంగా ఉందన్నారు.

ఈ ప్రమాదం పెను విషాదమని.. బాధితులకు సహాయం చేయటానికి సహాయ నిధిని ఏర్పాటు చేస్తామని న్యూయార్క్ గవర్నర్ కేథీ హోచుల్ హామీ ఇచ్చారు.

‘‘కొత్త ఇళ్లు కట్టటానికి, అంత్యక్రియలు నిర్వహించటానికి, ఇతరత్రా అవసరాలన్నిటికీ నిధులు అందిస్తాం’’ అని ఆమె చెప్పారు.

ఈ అగ్ని ప్రమాదం సంభవించిన బ్రాంక్స్ ప్రాంతంలో అత్యధిక సంఖ్యలో ముస్లిం వలస జనాభా నివసిస్తున్నారు. ఈ ప్రమాద బాధితుల్లో ఎక్కువ మంది గాంబియా నుంచి అమెరికాకు వలస వచ్చిన వారుగా భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)