రంగారెడ్డి జిల్లాలో ‘వితంతువుల తండా’: ‘మా ఊరిలో శుభకార్యాలకు ముత్తైదువలు లేరు.. పక్క ఊళ్ల నుంచి పిలిపిస్తున్నాం’

- రచయిత, సురేఖ అబ్బూరి
- హోదా, బీబీసీ ప్రతినిధి
రంగారెడ్డి జిల్లా పెద్దకుంట తండా... 44వ నంబర్ జాతీయ రహదారిపై ఉండే ఈ గ్రామంలోకి వెళ్లాలంటే హైవే పక్కనే ఉన్న మట్టి రోడ్డు మీద నుంచి వెళ్లాలి. ఇలాంటి మట్టి రోడ్డు కోసం కూడా చాలా పోరాడాల్సి వచ్చిందని గ్రామస్థులు చెప్పారు.
ఆ తండాలోకి వెళ్లగానే బాగా ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే, అక్కడ ఎక్కువగా ఆడవాళ్లే కనిపిస్తారు. వారిలో చాలా మంది వితంతువులు. ఒక్కొక్కరిదీ ఒక్కో కన్నీటి గాథ.
‘మా ఊరిలో శుభకార్యాలకు ముత్తైదువలను పక్క ఊళ్ల నుంచి పిలిపిస్తున్నాం’ అని వాళ్లు చెబుతుంటే ఆశ్చర్యం కలుగకమానదు.
దేశంలోనే అతి పెద్ద జాతీయ రహదారి 44 (ఎన్‌హెచ్ 44) కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ వెళుతుంది. ఈ రోడ్డు ఎంత పొడవైనదో, దానిపై జరిగే ప్రమాదాల జాబితా కూడా అంతే పొడవైనది అని వీళ్లు అంటున్నారు.

ప్రమాదాలంటే హైవే వెంబడి జరిగేవి మాత్రమే కావు
రంగారెడ్డి జిల్లాలో ఈ హైవేను ఆనుకుని ఉన్న ఒకే ఒక్క ఊరు రోడ్డు ప్రమాదాలకు బలవుతోంది. పెద్దకుంట తండాకు ఈ హైవే మృత్యుమార్గంగా మారింది. ఈ హైవే ప్రమాదాల వల్ల ఈ తండాకు 'వితంతువుల తండా' అని పేరు వచ్చింది.
ఈ తండాకు చెందని అసలీ అనే మహిళను బీబీసీ పలకరించింది. ఆమె భర్త, అన్న, తండ్రి ముగ్గురూ హైవేపై జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో మరణించారు.
"నాకు చిన్న వయసులోనే పెళ్లి చేశారు. మా పుట్టిల్లు కూడా ఇదే. నా భర్త, తండ్రి, అన్న ముగ్గురూ వేరే వేరే యాక్సిడెంట్లలో చనిపోయారు. నా కొడుకే నాకు ఇప్పుడు తోడు. మా ఊరి పరిస్థితి ఎలా ఉంటుందంటే.. ఈ ఊరిలో పిల్లలకు పెళ్లి చూపులప్పుడు, మా సంప్రదాయం ప్రకారం ముత్తైదువులే పెళ్లి వారికి నీళ్లు ఇవ్వాలి . మేం అందుకోసం వేరే ఊరినుంచి మహిళలను పిలిపించుకుంటాం" అని బీబీసీతో చెప్పారు అసలీ.
ఇక్కడ 45 ఇళ్లు ఉంటే, అందులో 37 కుటుంబాలలో మగవారు రోడ్డు ప్రమాదంలో చనిపోయారు అని తండాలోని మహిళలు చెప్పారు.
ఈ ప్రమాదాలు జరిగి ఏళ్లు గడుస్తున్నా, ఇక్కడి మహిళలు ఆ భయం నుంచి బయటపడలేకపోతున్నారు. తమ పిల్లల్ని పోషించుకోవడానికి, ఇళ్లు దాటి బయట ఏదైనా పనికి వెళ్తే తిరిగి వస్తామో, రామో అనే భయంతో, రోడ్డుకి సాధ్యమైనంత దూరంగానే ఉంటూ కూలి పని, పక్కనే ఉన్న లేబొరేటరీలో చిన్న చిన్న పనులు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు.

బయటికెళ్లిన మనిషి సాయంత్రమైనా రాలేదంటే..
"ఎప్పుడైనా ఏ జ్వరం వచ్చినా కనీసం మమ్మల్ని చూసుకోడానికీ, మందులు తీసుకురావడానికీ ఇంట్లో మగవాళ్లు లేరే అని బాధపడుతుంటాం. మా పిల్లలు బాగా చదువుకోవాలన్నదే మా కోరిక. అందుకే 10వ తరగతి వరకు ప్రభుత్వ హాస్టళ్లలో వేస్తాం. ఆ తరువాత, పై చదువులు చదవాలంటే రోజూ ఈ రోడ్డు మీదే వెళ్లి రావాల్సి వస్తుంది కదా. మళ్లీ వాళ్లకు ఏమైనా అయితే.. అన్నదే మా భయం. పైగా మా దగ్గర అంత డబ్బు కూడా లేదు. అందుకే వారిని ఇక్కడే, రోడ్డుకు ఇవతలే ఏదో ఒక పని చేసుకోమని నచ్చచెప్పుకుంటాం" అని అసలీ అన్నారు.

ఈ తండాలో కొన్ని ఇళ్లు పాత మట్టి గుడిసెల్లా కనిపిస్తాయి. వీరిలో కొంత మందికి నష్ట పరిహారం అందింది. దానితో కొంత మంది ఇళ్లు బాగు చేసుకున్నారు. అంతకు ముందు ఊరంతా పాతబడిపోయినట్టుగా ఉండేదని స్థానికులు చెప్పారు.
ఒకప్పుడు ఈ తండా వాసులు బయటకి వెళ్లాలంటే ఎన్‌హెచ్ 44 మీద నుంచే వెళ్లాలి. వేగంగా వస్తున్న వాహనాల కారణంగా ఇక్కడ ఎన్నో ప్రమాదాలు జరిగాయి.
సాయంత్రం వస్తానన్న మనిషి పొద్దుగుంకినా ఇంటికి రాలేదంటే, రోడ్డు మీద శవమై తేలాడా అనే సందేహంతో ఎన్‌హెచ్ 44 పైకి పరిగెత్తుకెళ్లి చూసిన రోజులున్నాయని ఇక్కడి వారు చెబుతున్నారు.
అలాంటి స్థితి నుంచి ఎలాగైనా బయట పడాలని, ఎంతో మందిని కలిసి, ఎన్నో పోరాటాలు చేసిన తరువాతే ఈ మట్టి దారి వచ్చింది.

'రోడ్డు మీద నుంచి వెళ్లాలన్న భయంతో పిల్లలు చదువులు మానేస్తున్నారు'
ఎన్‌హెచ్ 44 కింద మట్టి దారి రావడంతో ఇప్పుడు ఈ ప్రమాదాలు తగ్గాయని పెద్దకుంటకు ఆనుకుని ఉన్న బండగుట్ట తండా వాసి సునీత చెప్పారు.
సునీత చిన్నప్పుడే, వాళ్ల అన్న ఒక రాత్రి రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఆ శబ్దం తండా వరకు వినపడిందని గుర్తు చేసుకున్నారామె.
"అప్పుడు నేను చాలా చిన్నదాన్ని. పెళ్లికి స్నేహితులతో వెళ్లిన మా అన్న రాజు ఇంకా తిరిగి రాలేదని ఎదురు చూస్తూ ఉన్నాం. అప్పుడే పెద్ద సౌండ్ వినపడింది. రోడ్డు మీదకి వెళ్లి చూస్తే, అన్నతో పాటు వెళ్లిన మరో వ్యక్తి బైక్ పైనుంచి పడి కొనఊపిరితో కొట్టుకుంటున్నాడు. అతన్ని అంబులెన్సు ఎక్కించారు. మరి కొద్దీ దూరంలో మా అన్న రక్తపు మడుగులో పడి ఉన్నాడు. ప్రాణాలతో లేడు" అని సునీత చెప్పుకొచ్చారు.
ఆ సంఘటన ఇప్పటికీ తనను వెంటాడుతుందని, ఆ రోడ్డు ఎక్కాలంటే భయమేస్తుందని ఆమె అన్నారు. తాను స్కూటీ నేర్చుకున్నప్పటికీ దానిని రోడ్డు మీదకు తీసుకెళ్లడానికి ఇంట్లోవాళ్లు ఒప్పుకోరని చెప్పారు.

"ఇక్కడ చాలామందికి పై చదువులు చదువుకోవాలన్న ఆశ ఉన్నా, రోడ్డు దాటి పోవాలనే భయంతో మానేస్తున్నారు.
బస్సులో వెళదామంటే కూడా, బస్సు స్టాప్ చాలా దూరం ఉండడంతో చదువులు మానేసుకుంటున్నారు" అని సునీత చెప్పారు.
ఈ గ్రామస్థుల జీవితాల్లో ఈ రోడ్డు ఒక బూచి. తమకు ఒక కొత్త జీవితం, ఒక కొత్త ఆశ, సరికొత్త మార్గం కావాలని, ప్రభుత్వం తమ పిల్లలకు విద్య, భవిష్యత్తుపై భరోసా కల్పించాలని ఈ మహిళలు కోరుకుంటున్నారు.
ఈ తండావాసుల్లో 44వ నంబర్ జాతీయ రహదారి గురించి నెలకొన్న భయాలపై స్థానిక ఎంఆర్ఓ వెంకట లక్ష్మి స్పందించారు.
గతంలో ఈ ప్రాంతంలో చాలా రోడ్డు ప్రమాదాలు జరిగాయన్నది వాస్తవమే కానీ, ప్రజలు ఇలా భయభ్రాంతులకు గురి అవుతున్నారనే విషయం తమ దృష్టికి రాలేదన్నారు.
ఇప్పుడేమైనా చర్యలు తీసుకుంటారా అని ప్రశ్నించాం. కానీ ఆమె నుంచి సమాధానం రాలేదు. దీనిపై సైబరాబాద్ పోలీసులను బీబీసీ సంప్రదించింది, కానీ వారు స్పందించలేదు.
ఇవి కూడా చదవండి:
- ఈ ఆస్పత్రిలో ఒక్క రూపాయికే వైద్యం.. మూడు రూపాయలకే మందులు
- Ankur Warikoo: యువతరం ఏం కోరుకుంటోందంటే..
- జీతంలో, ఆదాయంలో సేవింగ్ ఎంత ఉండాలి? ఎలా చేయాలి? మదుపుకు ఏడు సూత్రాలు
- దామోదరం సంజీవయ్య: భారత్లో తొలి దళిత సీఎం.. ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించినా మళ్లీ సీఎం కాలేదు ఎందుకు?
- పేదలకు ఫ్రీగా 5 లక్షల ఆరోగ్య బీమా.. కేంద్రం హెల్త్ కార్డును ఇలా పొందండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













