రోడ్డు ప్రమాదాలు: 'భర్త లేకుండా బతకడం ఎంత కష్టమో ఎవరికి అర్థమవుతుంది?’

2013 అక్టోబర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తన కుమారుడు రఘువీర చనిపోవడంతో హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రి వద్ద ఏడుస్తున్న తల్లి సరళ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2013 అక్టోబర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తన కుమారుడు రఘువీర చనిపోవడంతో హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రి వద్ద ఏడుస్తున్న తల్లి సరళ
    • రచయిత, పద్మ మీనాక్షి
    • హోదా, బీబీసీ ప్రతినిధి
మీ అభిమాన భారతీయ క్రీడాకారిణికి ఓటు వేసేందుకు CLICK HERE

“ఆ రోడ్డు ప్రమాదం నా జీవితాన్ని తలకిందులు చేసింది. మరి కొన్ని రోజుల్లో పెళ్లి చేసుకుందామని అనుకున్న నా కలలను తుంచేసింది”.

విశాఖపట్నానికి చెందిన రాజేష్ మంగళూరులో ఎంటెక్ (కెమికల్ ఇంజనీరింగ్) చేస్తుండగా పెళ్లి కోసం వచ్చారు. ఆయన 2008 ఆగష్టులో బైకుపై వెళుతుండగా రోడ్డు ప్రమాదంలో ఆయన వెన్నెముక విరిగిపోయింది. అప్పటి నుంచి ఆయన వీల్ చెయిర్‌కి పరిమితమయ్యారు.

కెమికల్ ఇంజనీర్‌గా స్థిరపడాలనే కలలు కరిగిపోవడంతో ఒక చిన్న ఉద్యోగంతో సరిపెట్టుకోవాల్సి వచ్చిందని ఆయన అంటున్నారు.

"హాస్పిటల్లో కళ్ళు తెరిచేసరికి నేనిక లేచి నడవలేనని అర్ధమైంది. నా జీవితం ఇలా మారిపోతుందని అనుకోలేదు. అంతకు ముందు క్రీడల్లో బాగా ఉత్సాహవంతంగా పాల్గొనేవాడిని. చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే చాలా ఇష్టం. ఆటల్లో ఎప్పుడూ ముందుండేవాడిని. ఇక క్రికెట్ ఆడలేను, డాన్స్ చేయలేను అనే ఊహను భరించలేకపోయాను. కానీ, అదే నిజం అని అర్ధమైంది."

రాజేశ్

ఫొటో సోర్స్, Rajesh

"నా స్నేహితులంతా మంచి స్థానాలలో ఉంటే నా పరిస్థితి ఇలా ఉండటం బాధగా అనిపిస్తుండేది. కుటుంబం సహాయంతో మానసికంగా, ఆర్ధికంగా నిలదొక్కుకోగలిగాను" అని రాజేష్ చెప్పారు.

"వీల్ చెయిర్‌లో డాన్స్ చేయడం, బాస్కెట్ బాల్ లాంటివి ఆడుతున్నాను. వీల్ చెయిర్‌లోంచే స్కూబా డైవింగ్ కూడా చేస్తాను. కొత్త జీవితం వీల్ చెయిర్‌లోంచే ప్రారంభించాను" అని చెప్పారు రాజేష్.

ఇది రాజేష్ ఒక్కరి కథ మాత్రమే కాదు. రోడ్డు ప్రమాదాల కారణంగా ఏటా వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరెంతో మంది వికలాంగులుగా మారుతున్నారు.

రోడ్డు ప్రమాదం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పాత చిత్రం

ప్రమాదం తర్వాత శారీరక వైకల్యానికి గురయ్యేవారి సంఖ్య నగరాలలో కంటే గ్రామీణ ప్రాంతాలలో రెండింతలు ఎక్కువగా ఉంటోందని ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన "ట్రాఫిక్ క్రాష్ ఇంజ్యూరీస్ అండ్ డిసెబిలిటీస్ ,ది బర్డెన్ ఆన్ ఇండియన్ సొసైటీ" అనే నివేదికలో పేర్కొంది.

సేవ్ లైఫ్ ఫౌండేషన్ సహాయంతో చేసిన ఈ అధ్యయనం కోసం ఉత్తర్‌ప్రదేశ్, తమిళనాడు, బీహార్, మహారాష్ట్ర నుంచి సమాచారాన్ని సేకరించింది.

రోడ్డు ప్రమాదాలలో భారతదేశం అగ్ర స్థానంలో ఉంది. ప్రపంచంలో ఉన్న వాహనాలలో 1 శాతం వాహనాలు మాత్రమే దేశంలో ఉండగా, రోడ్డు ప్రమాదాలు మాత్రం 11 శాతం నమోదు అవుతున్నాయి. భారతదేశంలో ప్రతీ గంటకు 53 రోడ్డు ప్రమాదాలు జరుగుతుండగా, ప్రతీ నాలుగు నిమిషాలకు ఈ ప్రమాదాల కారణంగా ఒకరు మరణిస్తున్నారు.

భారతదేశంలో ఏటా 4. 5 లక్షల రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటుండగా, 1.5 లక్షల మరణాలు సంభవిస్తున్నాయి.

50 శాతానికి పైగా కుటుంబాలు ప్రమాదం తర్వాత మానసిక ఒత్తిడికి గురైనట్లు ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన సర్వేలో వెల్లడైంది.

గత దశాబ్దంలో రోడ్డు ప్రమాదాల బారిన పడి 13 లక్షల మంది మరణించగా, 50 లక్షల మంది గాయపడ్డారు.

ఈ రోడ్డు ప్రమాదాలలో మరణించిన వారిలో 76.2 శాతం మంది 18-45 సంవత్సరాల మధ్య వయసులో ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో 2019 సంవత్సరంలో 22,188 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోగా, తెలంగాణాలో 22,196 చోటు చేసుకున్నట్లు రోడ్డు ప్రమాదాలపై ఎన్‌సీఆర్‌బీ విడుదల చేసిన నివేదిక పేర్కొంది.

ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న మరణాలకు కారణాలలో రోడ్డు ప్రమాదాలది 8వ స్థానం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ 2018లో విడుదల చేసిన నివేదిక తెలిపింది.

అయితే, వ్యక్తిగత స్థాయిలో ఈ రోడ్డు ప్రమాదాలు పేద వారికి తీవ్రమైన ఆర్ధిక భారాన్ని కలిగించి కొంతమందిని అప్పుల ఊబిలోకి తోసేసి పేదరికంలోకి కూడా నెట్టేస్తాయి అని నివేదిక పేర్కొంది.

ఇది మహిళలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రమాదం తర్వాత మహిళల పని తీరులో, జీవన శైలిలో చాలా మార్పులు వచ్చినట్లు ఈ నివేదిక తెలిపింది.

ప్రమాదం తర్వాత శారీరక, మానసిక క్షోభతో పాటు కుటుంబ పోషణ భారం కూడా ఆమెపై పడుతోంది. రోడ్డు ప్రమాదాల వలన పేద, అణగారిన కుటుంబాలపై పడే సాంఘిక, ఆర్ధిక, లైంగిక, శారీరక ప్రభావాన్ని కూడా ఈ సర్వే అంచనా వేసింది.

రోడ్డు ప్రమాదాల వలన జీవితాలు తలకిందులైన కొంత మంది బాధితులతో బీబీసీ న్యూస్ తెలుగు మాట్లాడింది.

రోడ్డు ప్రమాదం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పాత చిత్రం

కరీంనగర్‌కు చెందిన సాహితి (పేరు మార్చాం) భర్త నవంబరు 2015లో ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి దగ్గర జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో మరణించారు.

కుటుంబాన్ని పోషించే వ్యక్తి మరణించడంతో వారి కుటుంబ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సాహితికి ఉద్యోగం లేదు. చేతిలో చిల్లి గవ్వ లేదు. ఆమె భర్త అప్పటికి ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తుండేవారు.

వారికి ఇద్దరు పిల్లలు. భర్త మరణంతో అత్త, మామను చూసుకునే బాధ్యత కూడా ఆమెపై పడింది.

గత సంవత్సరం ఆమె కుమారుడు కూడా అనారోగ్యంతో మరణించాడు. "ఇది ఆర్ధికంగా, మానసికంగా నన్ను మరింత కుంగదీసింది" అని సాహితి బీబీసీకి చెప్పారు.

గత సంవత్సరం బాబు మరణంతో ఇంట్లో మరో బాబును, మామగారిని చూసుకోవడం కోసం ఉద్యోగం మానేయాల్సి వచ్చింది అని చెప్పారు. ప్రమాదం తర్వాత లభించిన పరిహారంపై వచ్చే కొద్దిపాటి వడ్డీతో ప్రస్తుతం ఈ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది.

"ఇప్పుడు నా ఆరోగ్యం కూడా బాగుండటం లేదు. 30 ఏళ్ల వయసులో సామాజిక, ఆర్ధిక ఒత్తిడి తట్టుకుంటూ భర్త లేకుండా బతకడం ఎంత కష్టమో ఎవరికి అర్ధం అవుతుంది?’’ అని ఆమె అంటున్నారు.

"నా లాంటి ఎంతో మంది మహిళలు ఉన్నారు. వారి బాధ ఎవరికర్ధమవుతుంది" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

"ఇలా ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులకు ఇచ్చే నష్ట పరిహారం సకాలంలో అందితే కాస్త సహాయ పడినట్లు అవుతుంది" అని ఆమె అన్నారు.

రోడ్డు ప్రమాదం

ఫొటో సోర్స్, Getty Images

నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు

రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు పేద కుటుంబాలపై సాంఘిక, ఆర్ధిక భారం ఎక్కువగా పడుతుంది. తక్కువ ఆదాయం ఉండే కుటుంబాల్లో 75 శాతం ఆదాయం పడిపోగా, ఎక్కువ ఆదాయం ఉండే కుటుంబాల్లో 54 శాతం తగ్గుదల కనిపించింది.

గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయం తగ్గిపోవడం వలన కలిగే ఆర్ధిక నష్టం 56 శాతం ఎక్కువగా ఉండగా, నగరాలలో ఇది 29.5 శాతంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ ఆదాయం ఉండేవారిలో 39.5 శాతం ఆర్ధిక నష్టం చోటు చేసుకుంటోందని నివేదిక పేర్కొంది.

గ్రామీణ ప్రాంతాలలో నివాసం ఉండే కుటుంబాలలో రోడ్డు ప్రమాదం తర్వాత కనీసం ఒక మరణం చోటు చేసుకున్నట్లు 44 శాతం మంది తెలిపారు. ఇది నగరాలలో 11.6 శాతం మాత్రమే ఉంది.

ప్రమాదం తర్వాత అప్పుల బారిన పడే వారిలో అధిక ఆదాయం ఉన్న వారిలో కంటే తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలలో మూడు రెట్లు అధికంగా ఉంది. ఆర్ధిక భారంతో పాటు మానసిక ఒత్తిడి కారణంగా తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాల జీవన ప్రమాణాలు కూడా తీవ్రంగా పడిపోతాయి.

రోడ్డు ప్రమాదాలు, ప్రమాదాల వలన ఏర్పడిన గాయాల వలన 2016లో భారతదేశ స్థూల జాతీయ ఉత్పత్తి లో 7. 5 శాతం (12. 9 లక్షల కోట్లు) ఖర్చు అవుతున్నట్లు వరల్డ్ బ్యాంకు ప్రచురించిన గైడ్ ఫర్ రోడ్ సేఫ్టీ ఆపర్ట్యూనిటీస్ అండ్ ఛాలెంజెస్ 2019 నివేదికలో పేర్కొన్నారు. ఇది భారత ప్రభుత్వం చెప్పిన సొమ్ము కంటే 3 శాతం ఎక్కువ.

రోడ్డు ప్రమాదాల వలన భారతదేశానికి 1, 47,114 కోట్ల రూపాయిల ఆర్ధిక సామాజిక వ్యయం అవుతోందని ఇటీవల రోడ్లు, రవాణా, హైవే మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఒక అధ్యయనం అంచనా వేసింది. ఇది దేశ స్థూల జాతీయ ఉత్పత్తిలో 0.77 శాతం.

ఇన్సూరెన్సు అందటంలో జరిగే జాప్యం వలన కూడా ప్రమాదానికి గురైన కుటుంబాలు కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఇన్సూరెన్సు విషయంలో కూడా గ్రామీణ, నగర ప్రాంతాల మధ్య తారతమ్యాలు ఉన్నాయి.

ప్రమాదాలు జరిగినప్పుడు ప్రభుత్వం ఇచ్చే సాయం గురించి సమాచారం చాలా మంది బాధితులకు తెలియదు.

చాలా మంది ట్రక్ డ్రైవర్లు ప్రమాదం తర్వాత ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంలేదు. కేవలం 40 శాతం మంది ట్రక్ డ్రైవర్లకు మాత్రమే ఇన్సూరెన్సు సౌకర్యం, 18 శాతం మందికి వైద్య బీమా ఉంది.

కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం

ఫొటో సోర్స్, ugc

ఫొటో క్యాప్షన్, కర్నూలు జిల్లా వెల్దుర్తి సమీపంలో హైదరాబాద్- బెంగళూరు రహదారిపై జరిగిన ప్రమాదంలో 14 మంది మరణించారు.

మోటార్ వెహికల్స్ చట్టం 2019 ఏమి చెబుతోంది?

రహదారులపై భద్రతను మెరుగు పరిచేందుకు తగిన విధానాలను రూపొందించేందుకు సెప్టెంబరు 01, 2019న అమలు చేసిన మోటార్ వెహికల్స్ చట్టం సవరణ 2019న దేశ వ్యాప్తంగా అమలులోకి వచ్చింది. ఈ చట్టంలో 93 సవరణలు చోటు చేశారు.

ఈ సవరణల ద్వారా రోడ్డు ప్రమాద బాధితులకు క్యాష్ లెస్ చికిత్స అందించే పథకం, ప్రయాణాల్లో పిల్లల భద్రత కోసం జాగ్రత్తలు, ఎలక్ట్రానిక్ పర్యవేక్షణ, అమలు, రోడ్డు అవకతవకలకు ఇంజనీర్లను బాధ్యులను చేయడం లాంటి వాటిని కూడా చేర్చింది.

BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)