ఉన్నావ్: రెండు నెలల కిందట అదృశ్యమైన యువతి మృతదేహం మాజీ మంత్రి కుమారుడి స్థలంలో దొరికింది

ఫొటో సోర్స్, ANI
ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో రెండు నెలల కిందట అదృశ్యమైన యువతి మృతదేహం లభ్యమైంది.
ఉన్నావ్‌లోని కబ్బా ఖేడా గ్రామంలో, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పీ) మాజీ మంత్రి ఫతే బహదూర్ సింగ్‌కు చెందిన ఖాళీ స్థలంలో ఆమె మృతదేహం లభించింది.
ఈ కేసు గురించి ఉన్నావ్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
2021 డిసెంబర్ 8 నుంచి ఆ యువతి కనిపించకుండా పోయింది. అనంతరం, ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
2022 జనవరి 10న భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్లు 366, 323,504, 506 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
యువతి మృతదేహం దొరికిన తరువాత, ఉన్నావ్ అడిషనల్ పోలీసు సూపరింటెండెంట్ (ఏఎస్‌పీ) శశి శేఖర్ సింగ్ విలేఖరులతో మాట్లాడుతూ, కేసు పూర్తి వివరాలు అందించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
"గత ఏడాది డిసెంబర్ 8న ఒక యువతి అదృశ్యమైంది. వెంటనే కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. కానీ, 24 గంటలు గడిచినా ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు చర్యలు తీసుకుంటూ కొత్వాలి ఇంచార్జ్ ఇన్‌స్పెక్టర్‌ను సస్పెండ్ చేశారు" అని ఆయన వెల్లడించారు.
ఈ మొత్తం వ్యవహారంపై చర్యలు తీసుకుంటున్నట్లు, మరొక నిందితుడిని అరెస్ట్ చేసినట్లు శశి శేఖర్ సింగ్ తెలిపారు.
ఈ కేసులో, ఫతే బహదూర్ సింగ్ కుమారుడు రాజోల్ సింగ్‌ను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు.
దొరికిన మృతదేహం అదృశ్యమైన యువతిదేనని అడిషనల్ పోలీసు సూపరింటెండెంట్ ధ్రువీకరించారు.
మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపించామని, ఆ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

ఫొటో సోర్స్, ANI
యువతి తల్లి ఆరోపణలు
2022 జనవరి 24న యువతి తల్లి ఏఎన్ఐ వార్తాసంస్థతో మాట్లాడుతూ, సుమారు 50 రోజుల క్రితం రాజోల్ సింగ్ తన కుమార్తెను బలవంతంగా ఎత్తుకెళ్లాడని ఆరోపించారు.
అదే రోజు అంటే జనవరి 24న ఇరవై ఏళ్ల యువతి కిడ్నాప్ కేసు నమోదు చేసినట్లు ఏఎస్‌పీ శశి శేఖర్ సింగ్ ఒక ప్రకటనలో వెల్లడించారు.
నిందితుడిని ప్రశ్నించేందుకు అదుపులోకి తీసుకున్నామని, ఈ కేసులో దర్యాప్తు జరిపేందుకు రెండు బృందాలను ఏర్పాటుచేశామని తెలిపారు.
జనవరి 25న లఖ్‌నవూలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ కారు ముందు యువతి తల్లి ఆత్మాహుతికి ప్రయత్నించారని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రిక ఓ కథనంలో తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
రాజకీయ పార్టీల మధ్య వాగ్యుద్ధం
ఈ కేసులో రాజకీయ పార్టీల మధ్య వాగ్యుద్ధం మొదలైంది. ప్రతిపక్ష పార్టీలు ఎస్‌పీపై విరుచుకుపడుతున్నాయి.
ఈ కేసుపై ముందుగా బీఎస్‌పీ అధ్యక్షురాలు మాయావతి ట్వీట్ చేశారు.
"ఉన్నావ్ జిల్లాలో ఎస్పీ నేత పొలంలో దళిత యువతి మృతదేహం దొరకడం అత్యంత బాధాకరమైన, తీవ్రమైన విషయం. యువతి అపహరణ, హత్యపై ఆమె కుటుంబ సభ్యులు ముందు నుంచే ఎస్‌పీ నేతపై అనుమానాలు వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకుని దోషులను శిక్షించాలి, బాధితులకు న్యాయం చేకూర్చాలి" అని ఆమె అన్నారు.
"శ్రీ అఖిలేశ్ యాదవ్ జీ.. ఎస్‌పీ నేత పొలంలో దళిత యువతి మృతదేహం దొరికింది. ఆమె తల్లి మీ కారుకు అడ్డంగా పడి వేడుకున్నా మీరు పట్టించుకోలేదు. ఎస్‌పీ నేతను మాత్రం కాపాడుతారు. పార్టీలో నేరాలకు పాల్పడేవారిని క్షమిస్తారు. ఈ ఘటనలో పూర్తి విచారణ జరిగి, బాధితులకు న్యాయం లభించే వరకూ ఊరుకోం" అంటూ ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య ట్వీట్ చేశారు.
ఇదిలా ఉండగా, అఖిలేశ్ యాదవ్ ఒక న్యూస్ ఛానెల్‌తో మాట్లాడుతూ, "ఫతే బహదూర్ సమాజ్‌వాదీ పార్టీలో ఉండేవారు. ఆయన మరణించారు. ఇప్పుడు నిందితుడికి, పార్టీకి ఏ సంబంధం లేదు. ఆయన పార్టీలో సభ్యుడు కాదు" అని అన్నారు.
ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తరువాత కూడా ఇంత సమయం ఎందుకు తీసుకున్నారని అఖిలేశ్ యాదవ్ పోలీసులను ప్రశ్నించారు.
"పోలీసులు దేనికోసం ఎదురు చూస్తున్నారు? నిద్రపోతున్నారా? యూపీ పోలీసులు న్యాయ వ్యవస్థను మెరుగుపరుస్తారా లేదా?" అని అఖిలేశ్ అన్నారు.
"ఎస్‌పీలో ఉన్నారంటూ చెబుతున్న నేత మరణించి నాలుగేళ్లు అవుతోంది. యువతిని వెతకడానికి పోలీసులకు ఇన్ని రోజులు ఎందుకు పట్టింది? పోలీసులు ముందే కఠిన చర్యలు తీసుకొని ఉండవచ్చు. మరణించిన యువతి తల్లి ఏం కోరితే అది నెరవేర్చాలి" అని ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అఖిలేశ్ అన్నారు.

మళ్లీ చర్చల్లో ఉన్నావ్
2017 నుంచి ఉన్నావ్ చర్చల్లో ఉంది.
2017 జూన్ 4.. ఉద్యోగం ఇప్పించమనని అడగడానికి ఎమ్మెల్యే కులదీప్ సెంగర్ ఇంటికి వెళ్తే ఆయన తనను రేప్ చేశాడని ఒక మైనర్ బాలిక ఆరోపించింది.
అప్పటి నుంచి ఈ వ్యవహారం అనేక మలుపులు తిరుగుతూ ముందుకు సాగింది.
2019 డిసెంబర్‌లో దిల్లీ కోర్టు ఆయనకు జీవిత ఖైదు విధించింది. ఆ తరువాత ఆయన శాసనసభ్యత్వాన్ని రద్దుచేశారు. ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు బీజేపీ ప్రకటించింది.

ఫొటో సోర్స్, Getty Images
2020 మార్చి 4న, బాధితురాలి తండ్రి జ్యుడీషియల్ కస్టడీలో మరణించడానికి కారణం కుల్దీప్ సింగ్ సెంగర్ అంటూ కోర్టు ఆయన్ను దోషిగా నిర్థరించింది.
ప్రస్తుతం తాజా ఘటనతో ఉన్నావ్ మళ్లీ చర్చల్లోకి వచ్చింది.
మరోవైపు, ఉన్నావ్ రేప్ కేసు బాధితురాలి తల్లి ఆశా సింగ్‌కు కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది.
2022 ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నాలుగో దశ (ఫిబ్రవరి 23)లో ఉన్నావ్‌లో పోలింగ్ జరగనుంది. ఆ జిల్లాలో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.
(రిపోర్ట్: భూమికా రాయ్)

ఇవి కూడా చదవండి:
- గౌతమ్ అదానీ: కాలేజీ చదువు మధ్యలోనే వదిలేసిన యువకుడు సంపదలో ముకేష్ అంబానీతోనే పోటీపడేలా ఎలా ఎదిగారు?
- అల్లా-హు-అక్బర్ అంటూ నినాదాలు చేసిన ముస్లిం యువతి ముస్కాన్ ఇంటర్వ్యూ
- భవిష్యత్‌లో రాబోయేవన్నీ టెంపరరీ ఉద్యోగాలేనా?
- ‘హీరోయిన్లు అందంగా, సన్నగా ఉండాలి, పొట్ట ఉండకూడదు అనేవి ఎప్పటి నుంచి వచ్చాయి?’
- డిజిటల్ ప్రచారంలో కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలన్నీ బీజేపీ వెనుకే ఉన్నాయి ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












