గౌతమ్ అదానీ: కాలేజీ చదువు మధ్యలోనే వదిలేసిన యువకుడు సంపదలో ముకేష్ అంబానీతోనే పోటీపడేలా ఎలా ఎదిగారు?

గౌతమ్ అదానీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గౌతమ్ అదానీ
    • రచయిత, అభినవ్ గోయల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అది 1978. ఒక యువకుడు కాలేజీలో చదువుతున్నప్పుడే పెద్ద పెద్ద కలలు కంటున్నాడు. ఒక రోజు హఠాత్తుగా చదువు మధ్యలోనే వదిలేశాడు.

తర్వాత ఆ యువకుడు ఆసియాలోని అత్యంత సంపన్నుల్లో ఒకరుగా ఎదిగాడు.

ఆయనే గౌతమ్ అదానీ. ఈ ఏడాది ఫిబ్రవరి 8 నాటికి గౌతమ్ అదానీ మొత్తం సంపద విలువ 88.5 బిలియన్ డాలర్లకు చేరింది.

ఫిబ్రవరి 8న బ్లూంబర్గ్ బిజినెస్ ఇండెక్స్ జాబితాలో గౌతమ్ అదానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీని మించిపోయారు.

ఆరోజు ముకేష్ సంపద విలువ 87.9 బిలియన్ డాలర్లు. కానీ, ఆయన ఆ తర్వాత రోజే మళ్లీ అదానీని దాటేశారు.

ఇంటి సరుకుల నుంచి, బొగ్గు గనులు, రైల్వేలు, విమానాశ్రయాలు, ఓడ రేవులు, విద్యుత్ ఉత్పత్తి వరకూ గౌతమ్ అదానీకి ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి.

అయితే, గౌతమ్ అదానీ ఈ విజయం వెనుక రహస్యం ఏంటి. ఈ స్థాయికి చేరుకునేవరకూ ఆయన జీవితం, వ్యాపార ప్రయాణం ఎలా సాగింది.

గౌతమ్ అదానీ

ఫొటో సోర్స్, SAM PANTHAKY/AFP/GETTY IMAGES

ప్రయాణం ఎక్కడ మొదలైంది?

మీడియాలో వచ్చిన కొన్ని రిపోర్టుల ప్రకారం గౌతమ్ అదానీ 1978లో తన కాలేజీ చదువు మధ్యలోనే వదిలేశారు. ముంబయిలో వజ్రాల మార్కెట్‌లో పనిచేశారు.

అయితే, 1981లో అహ్మదాబాద్‌కు రావాలని ఆయనకు వాళ్ల అన్న నుంచి పిలుపొచ్చింది. అది అదానీ జీవితాన్ని మలుపు తిప్పింది.

ఆయన అన్న సరుకులు చుట్టి ప్యాక్ చేసే ప్లాస్టిక్‌‌ను తయారుచేసే ఒక కంపెనీని కొన్నారు. కానీ, అది సరిగా నడవడం లేదు. ఆ కంపెనీకి అవసరమైన ముడిసరుకు సరిగా దొరకడం లేదు.

దాన్ని ఒక అవకాశంగా మార్చుకున్న అదానీ కాండ్లా పోర్ట్‌ నుంచి ప్లాస్టిక్ గ్రాన్యూల్స్ దిగుమతి చేసుకోవడం ప్రారంభించారు.

1988లో అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్‌ను స్థాపించారు, దాని ద్వారా లోహాలు, వ్యవసాయ ఉత్పత్తులు, బట్టల కమాడిటీ ట్రేడింగ్ ప్రారంభించారు. కొన్నేళ్లకే ఆ కంపెనీకి, అదానీ వ్యాపారానికి బాగా పేరొచ్చింది.

అదానీ ఎంటర్‌ప్రైజెస్ వివరాల ప్రకారం 1994లో బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో ఆ కంపెనీ షేర్ లిస్ట్ అయింది. ఆ సమయంలో దాని ఒక్కో షేరు ధర రూ.150. కానీ అది ప్రారంభం మాత్రమే.

ముంద్రా పోర్ట్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ముంద్రా పోర్ట్

ముంద్రా పోర్ట్

1995లో అదానీ గ్రూప్ ముంద్రా రేవును ఉపయోగించడం మొదలైంది. దాదాపు 8 వేల హెక్టార్లలో వ్యాపించిన అదానీ ముంద్రా పోర్ట్ ఇప్పుడు భారత్‌లోనే అతిపెద్ద ప్రైవేటు ఓడరేవుగా ఉంది.

ఇప్పుడు మొత్తం భారత్‌లో జరిగే ఎగుమతులు, దిగుమతుల్లో నాలుగోవంతు ఈ ముంద్రా పోర్ట్ నుంచే జరుగుతున్నాయి.

గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిషా లాంటి ఏడు సముద్ర తీర రాష్ట్రాల్లోని ఓడరేవుల్లో కూడా అదానీ గ్రూప్‌కు వాటాలున్నాయి.

అదానీ ముంద్రా పోర్టులో బొగ్గు ఆధారిత భారీ విద్యుత్ కేంద్రం, స్పెషల్ ఎకనామిక్ జోన్ కూడా ఉన్నాయి. ఈ రేవుకు ప్రపంచంలోనే అత్యధికంగా బొగ్గు దిగుమతి చేసుకునే సామర్థ్యం ఉంది. దీనిని స్పెషల్ ఎకనామిక్ జోన్ కింద నిర్మించారు. అంటే, దీని ప్రమోటర్ కంపెనీ ప్రభుత్వానికి ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం ఉండదు.

ముంద్రా ఎస్ఈజడ్‌లో విద్యుత్ ప్లాంట్, ప్రైవేటు రైల్వే లైన్, ప్రైవేట్ విమానాశ్రయం కూడా ఉన్నాయి.

ఫర్ట్యూన్ మార్ట్

ఫొటో సోర్స్, ADANI WILMAR

ఫొటో క్యాప్షన్, ఫర్ట్యూన్ మార్ట్

సరకుల వ్యాపారం

1999 జనవరిలో విల్ అగ్రీ బిజినెస్ గ్రూప్ విల్మర్‌తో చేతులు కలిపిన అదానీ గ్రూప్ వంట నూనెల వ్యాపారంలోకి అడుగుపెట్టింది.

ఇప్పుడు దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఫర్చ్యూన్ వంట నూనెలను తయారుచేసేది అదానీ-విల్మర్ కంపెనీనే. ఫర్చ్యూన్ ఆయిల్‌తోపాటూ వినియోగ వస్తువుల రంగంలో అదానీ గ్రూప్ పిండి, బియ్యం, పప్పులు, చక్కెర లాంటి ఎన్నో ఉత్పత్తులను అందిస్తోంది.

అదానీ గ్రూప్ 2005లో ఇండియన్ ఫుడ్ కార్పొరేషన్‌(ఎఫ్‌సీఐ)తో కలిసి పెద్దపెద్ద సైలోస్(గాదెలు) నిర్మించడం ప్రారంభించింది. ఈ సైలోస్‌లో భారీ ఎత్తున ధాన్యం నిల్వ చేస్తున్నారు.

అదానీ గ్రూప్ మొదట 20 ఏళ్ల కాంట్రాక్ట్ ఒప్పందం ప్రకారం దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఈ సైలోస్ నిర్మించింది. తర్వాత వాటి కనెక్టివిటీ కోసం, సైలో యూనిట్ నుంచి భారత దేశమంతటా ఉన్న పంపిణీ కేంద్రాల వరకూ ఆ ధాన్యాన్ని సులభంగా చేర్చడానికి వీలుగా ప్రైవేటు రైలు మార్గాలు కూడా వేసింది.

అదానీ అగ్రీ లాజిస్టిక్స్ లిమిటెడ్ ఇప్పుడు కూడా ఎఫ్‌సీఐ, మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన ధాన్యాన్ని తమ సైలోస్‌లో ఉంచుతోంది. వీటిలో ఎఫ్‌సీఐ 5.75 లక్షల మెట్రిక్ టన్నులు, మధ్యప్రదేశ్ మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వచేసింది.

బొగ్గు గనులు

బొగ్గు గనులు

ఫార్చ్యూన్ ఇండియా మ్యాగజైన్ వివరాల ప్రకారం 2010లో ఆస్ట్రేలియాకు చెందిన లింక్ ఎనర్జీ నుంచి అదానీ గ్రూప్ రూ.12,147 కోట్లకు బొగ్గు గనులు కొనుగోలు చేసింది.

గెలీ బెస్ట్ క్వీన్ ఐలండ్‌లో ఉన్న ఈ బొగ్గు గనుల్లో 7.8 బిలియన్ టన్నుల ఖనిజ నిల్వలు ఉన్నాయి. అదానీ గ్రూప్ వాటి నుంచి ప్రతిఏటా 60 మిలియటన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తోంది.

ఇండోనేషియాలో కూడా చమురు, గ్యాస్, బొగ్గు లాంటి సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయి. కానీ, మౌలిక సదుపాయాల కొరతతో ఆ దేశం తమ వనరుల నుంచి తగినంత ప్రయోజనం పొందలేకపోతోంది.

ఇండోనేషియాలోని దక్షిణ సుమత్రాలో బొగ్గు తవ్వకాలకు 1.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడుతున్నట్లు 2010లో అదానీ గ్రూప్ ప్రకటించింది.

బొగ్గు రవాణా కోసం దక్షిణ సుమత్రాలో రైల్వే ప్రాజెక్టు నిర్మాణానికి స్థానిక ప్రభుత్వంతో ఒప్పందం కూడా చేసుకుంది.

అదానీ గ్రూప్ ఐదు కోట్ల టన్నుల సామర్థ్యం ఉన్న ఒక బొగ్గు హాండిలింగ్ పోర్ట్ నిర్మిస్తుందని, దక్షిణ సుమత్రా దీవిలో బొగ్గు తవ్వకాల కోసం 250 కిలోమీటర్ల రైల్వే లైన్ వేస్తుందని ఇండోనేషియా పెట్టుబడుల బోర్డ్ ఆ సమయంలో చెప్పింది.

వీడియో క్యాప్షన్, ఆరేళ్లలో ప్రపంచ సంపన్నుడిగా ఎదిగిన అదానీ

వ్యాపార విస్తరణ

2002లో అదానీ వ్యాపార సామ్రాజ్యం విలువ 76.5 కోట్ల డాలర్లు. 2014లో అది 10 బిలియన్ డాలర్లకు పెరిగింది.

2015 తర్వాత అదానీ గ్రూప్ ఆర్మీ రక్షణ పరికరాల దిగుమతులు కూడా ప్రారంభించింది. కొంతకాలం తర్వాత సహజ వాయువు రంగంలో కూడా వ్యాపారం పెంచింది. 2017లో సోలార్ పీవీ ప్యానళ్ల తయారీ కూడా మొదలుపెట్టింది.

అదానీ గ్రూప్ 2019లో విమానాశ్రయాల రంగంలో ప్రవేశించింది. అహ్మదాబాద్, లఖ్‌నవూ, మంగళూరు, జైపూర్, గువాహటి, తిరువనంతపురంలోని ఆరు విమానాశ్రయాల ఆధునీకరణ, నిర్వహణ బాధ్యతలు ఇప్పుడు అదానీ గ్రూప్ చేతిలోనే ఉన్నాయి.

50 ఏళ్ల పాటు ఈ ఆరు విమానాశ్రయాల మేనేజ్‌మెంట్, డెవలప్‌మెంట్‌ను అదానీ గ్రూపే చూసుకోనుంది.

గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్‌కు ముంబయి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్‌లో 74 శాతం వాటా కూడా ఉంది. దిల్లీ తర్వాత దేశంలోని అతిపెద్ద విమానాశ్రయం ఇదే.

ఆస్ట్రేలియాలో అదానీకి వ్యతిరేకత

ఫొటో సోర్స్, Getty Images

అదానీని చుట్టుముట్టిన వివాదాలు

భారత్‌లోనే అతిపెద్ద ఓడరేవు అయిన ముంద్రా కోసం గుజరాత్ ప్రభుత్వం అదానీ గ్రూప్‌కు అతి తక్కువ ధరకే భారీగా భూములను కట్టబెట్టిందని ఆరోపణలున్నాయి.

2010 ఫిబ్రవరిలో కస్టమ్స్ డ్యూటీ ఎగవేశారనే ఆరోపణలతో అదానీ సోదరుడు రాజేష్ అదానీని అరెస్ట్ చేశారు. ఆయన అదానీ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు.

2014లో ఆస్ట్రేలియా ఫెయిర్‌ఫాక్స్ మీడియా అదానీ గ్రూప్ మీద ఒక ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్ విడుదల చేసింది.

గుజరాత్‌లో నిర్మిస్తున్న ఒక లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్టులో పనిచేస్తున్న 6 వేల మంది కార్మికుల దుస్థితి గురించి అది కథనం ప్రచురించింది.

కార్మికుల దుస్థితికి అదానీ గ్రూపే కారణమని ఫెయిర్‌ఫాక్స్ తన కథనంలో పేర్కొంది. ఆ కార్మికులను అదానీ గ్రూప్‌ కోసం పనిచేసే కాంట్రాక్టర్లే ఆ పనిలో పెట్టారని చెప్పింది. అయితే, తాము ఏ చట్టాలూ ఉల్లంఘంచలేదని అదానీ గ్రూప్ స్పష్టం చేసింది.

2014లో విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగించే పరికరాల దిగుమతుల వ్యయాన్ని దాదాపు ఒక బిలియన్ డాలర్లు పెంచి చూపించినందుకు ప్రభుత్వ అధికారులు అదానీ గ్రూప్‌కు నోటీసులు జారీ చేశారు.

ఉత్తర ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్ రాష్ట్రంలో కార్మైకల్ బొగ్గు గని ఉంది. అక్కడ బొగ్గు తవ్వకాలకు అదానీ కంపెనీకి అనుమతులు లభించాయి. ఇక్కడ తవ్వకాలపై అదానీ గ్రూప్‌ తీవ్ర వ్యతిరేకతలు ఎదుర్కోవాల్సి వస్తోంది.

ప్రధాని మోదీతో గౌతమ్ అదానీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రధాని మోదీతో గౌతమ్ అదానీ

మోదీతో సంబంధాలు

ప్రధానమంత్రితో గౌతమ్ అదానీకి ఉన్న సాన్నిహిత్యం 2002లో మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కనిపించడం మొదలైంది.

గుజరాత్‌లో ఆ సమయంలో మతఘర్షణలు జరిగాయి. దాంతో పరిస్థితులను నియంత్రించడంలో ముఖ్యమంత్రి విఫలమయ్యారంటూ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ)లోని పారిశ్రామికవేత్తలు మోదీపై తీవ్ర విమర్శలు చేశారు.

మరోవైపు, మోదీ మాత్రం గుజరాత్ పెట్టుబడులకు స్వర్గధామంగా చెప్పుకునే ప్రయత్నం చేశారు. అదే సమయంలో మిగతా పారిశ్రామికవేత్తలందరినీ మోదీకి అనుకూలంగా తీసుకురావడానికి గౌతమ్ అదానీ కీలక పాత్ర పోషించారు. సీఐఐకి సమాంతరంగా మరో సంస్థను ఏర్పాటుచేస్తానని హెచ్చరికలు కూడా చేశారు.

2013 మార్చిలో అమెరికాలోని వార్టన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో నరేంద్ర మోదీని ప్రధాన వక్తగా ఆహ్వానించారు. కానీ, ప్రొఫెసర్లు, విద్యార్థుల వ్యతిరేకతతో మోదీని దాని నుంచి తొలగించారు.

దాంతో, ఆ కార్యక్రమానికి ప్రధాన స్పాన్సర్స్‌లో ఒకటిగా ఉన్న అదానీ గ్రూప్ తమ ఆర్థిక సహకారం వెనక్కి తీసుకుంది.

ISWOTY Footer

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)