గౌతమ్ అదానీ, ముఖేశ్ అంబానీకి కేంద్ర బడ్జెట్‌తో భారీ లబ్ధి చేకూరనుందా? - ప్రెస్ రివ్యూ

అదానీ, అంబానీ

కేంద్రం బడ్జెట్ నిర్ణయాల వల్ల ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ లాంటి కార్పొరేట్ దిగ్గజాలకు భారీగా లబ్ధి చేకూరుతుందని విశ్లేషకులు భావిస్తున్నట్లు ఆంధ్రజ్యోతి పత్రిక వార్తా కథనం ప్రచురించింది.

బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెద్దపీట వేసింది. ఈ దిశగా చేపట్టిన చర్యల్లో భాగంగా డేటా సెంటర్లు, ఎనర్జీ స్టోరేజీతో పాటు ఎలక్ట్రిక్‌ చార్జింగ్‌ ఇన్‌ఫ్రా, గ్రిడ్‌ స్కేల్‌ బ్యాటరీ సిస్టమ్స్‌ వంటి ఆధునిక సదుపాయాలకు సైతం మౌలిక హోదా కల్పిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్లో ప్రకటించారు.

దీంతో ఈ సదుపాయాల ఏర్పాటుకు బ్యాంకుల నుంచి కారు చౌకగా రుణాలు లభిస్తాయి. కాబట్టి, ఈ నిర్ణయం ముకేశ్‌ అంబానీ, గౌతమ్‌ అదానీ, సునీల్‌ మిట్టల్‌ వంటి కార్పొరేట్‌ దిగ్గజాలకు భారీగా లబ్ది చేకూర్చనుందని విశ్లేషకులు అంటున్నారు.

ఎందుకంటే, ఈ విభాగాల్లో అదానీ, మిట్టల్‌, అంబానీలు ఇప్పటికే భారీ ప్రణాళికలు ప్రకటించారు.

విదేశీ రుణాల సేకరణ, తక్కువ వడ్డీకే దీర్ఘకాలిక రుణాల సేకరణతో పాటు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను సైతం ఆకర్షించేందుకు డేటా సెంటర్లకు ఇన్‌ఫ్రా హోదా దోహదపడనుందని హైదరాబాద్‌కు చెందిన డేటా సెంటర్ల నిర్వహణ సంస్థ కంట్రోల్‌ఎస్‌ వ్యవస్థాపకులు, సీఈఓ శ్రీధర్‌ పిన్నపురెడ్డి అన్నట్లు పత్రిక రాసింది.

డిజిటల్‌ యూనివర్సిటీలు, డిజిటల్‌ బ్యాంక్‌లు, డిజిటల్‌ రుపీ ప్రవేశంతో పాటు శరవేగంగా పెరుగుతున్న డిజిటల్‌ చెల్లింపులు, భారత్‌నెట్‌ ద్వారా మారుమూల ప్రాంతాల వరకు ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌ ఏర్పాటుతో భవిష్యత్‌లో గిగావాట్ల కొద్దీ డిజిటల్‌ సమాచారం పుట్టుకురానుందని, ఆ డేటాను దేశీయంగా నిక్షిప్తం చేసేందుకు పెద్దఎత్తున డేటా సెంటర్లు అవసరం అవుతాయమని ఆయన పేర్కొన్నారు.

పూర్తిగా పునరుత్పాదక ఇంధన శక్తి ఆధారంగా నడిచే గ్రీన్‌ డేటా స్టోరేజీ సెంటర్ల ఏర్పాటులో తమ గ్రూప్‌ ప్రపంచ దిగ్గజంగా ఎదగాలనుకుంటున్నట్లు దేశంలో రెండో అత్యంత ధనవంతుడైన గౌతమ్‌ అదానీ గత ఏడాది నవంబరులో ప్రకటించారు.

అదానీ గ్రూప్‌ తొలుత ముంబై, చెన్నై, హైదరాబాద్‌, ఢిల్లీలో డేటా సెంటర్లను ఏర్పాటు చేయాలనుకుంటోంది. సునీల్‌ మిట్టల్‌కు చెందిన టెలికాం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్‌ సైతం కూడా డేటా సెంటర్ల ఏర్పాటులో భారీ ప్రణాళికలను రూపొందించుకుంది.

2025 నాటికి గ్రూప్‌ డేటా సెంటర్ల సామర్థ్యాన్ని మూడింతలకు పెంచేందుకు రూ.5,000 కోట్లు పెట్టుబడిగా పెట్టనున్నట్లు తెలిపింది.

ముకేశ్‌ అంబానీకి చెందిన డిజిటల్‌ సేవల విభాగమైన జియో ప్లాట్‌ఫామ్‌ కూడా డేటా సెంటర్ల ఏర్పాటుపై దృష్టిసారించింది.

అంతేకాదు, గత ఏడాది ద్వితీయార్ధంలో ప్రకటించిన 7,600 కోట్ల డాలర్ల భారీ పెట్టుబడి ప్రణాళికలో భాగంగా గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో రియలన్స్‌ ఎనర్జీ స్టోరేజీ సహా నాలుగు గిగా ఫ్యాక్టరీలను ఏర్పాటు చేయబోతోంది.

వీటికయ్యే భారీ పెట్టుబడుల కోసం చౌకగా రుణాలు పొందేందుకు మౌలిక హోదా దోహదపడనుందని ఆంధ్రజ్యోతి వివరించింది.

డ్రగ్స్ వాడేవారిపై దృష్టి

ఫొటో సోర్స్, Getty Images

తెలంగాణలో డ్రగ్స్ వాడేవారిపై దృష్టి సారించేలా దర్యాప్తు సంస్థల అడుగులు

తెలంగాణలో డ్రగ్స్ వాడేవారిని ఇప్పటివరకూ బాధితులుగా చూస్తున్న యంత్రాంగం, ఇక మీద వారిపై నిశితంగా దృష్టి పెట్టనుందని ఈనాడు దిన పత్రిక వార్తా కథనం ప్రచురించింది.

మాదకద్రవ్యాల కట్టడిలో భాగంగా వాటిని ఉపయోగించేవారిపై దృష్టి సారించే దిశగా దర్యాప్తు సంస్థలు అడుగులు వేస్తున్నాయి.

డిమాండే సరఫరాకు మూలం అనే సూత్రం ఆధారంగా వ్యూహరచన చేస్తున్నాయి.

మాదకద్రవ్యాల వినియోగం బాగా ఉన్న ప్రాంతాలకే స్మగ్లర్లు రిస్కు తీసుకుని మరీ చేరవేస్తున్నారనే కోణంలో సరికొత్త ప్రణాళికకు శ్రీకారం చుడుతున్నాయి.

అసలు డిమాండే లేకుండా చేయగలిగితే డ్రగ్స్ సరఫరాదారుల్ని కట్టడి చేసేందుకు వీలవుతుందని అధికారులు భావిస్తున్నారు.

ఈ క్రమంలో వినియోగానికి ఆస్కారం ఉన్న హాట్‌స్పాట్లపై ప్రత్యేకంగా దృష్టి సారించబోతున్నారు.

ముఖ్యంగా రైల్వే స్టేషన్లు, ఆటోస్టాండ్లు, విద్యాసంస్థలు, ఐటీ సంస్థలు లాంటి హాట్ స్పాట్లలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని పోలీస్, ఎక్సైజ్ శాఖలు నిర్ణయించాయి.

ఇప్పటివరకూ మాదకద్రవ్యాలు సరఫరా చేసే ముఠాలపైనే కఠినచట్టాలు ప్రయోగిస్తున్న దర్యాప్తు సంస్థలు.. వినియోగదారులను బాధితులుగానే గుర్తిస్తున్నాయి.

ఇలాంటి వినియోగం విషయంలో ఇకమీదట కొంత కఠినంగా వ్యవహరించనున్నారు. మొదట విస్తృత అవగాహన కల్పించడం, కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇవ్వడం... అప్పటికీ మార్పు రాకపోతే కేసుల్లో నిందితులుగా చేర్చడంపై దృష్టి సారించనున్నాయి.

ఐపీఎల్ వేలం

ఫొటో సోర్స్, Ipl20

ఐపీఎల్‌లో వేలానికి 590 మంది ఆటగాళ్లు

ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌(ఐపిఎల్‌) ఈ ఏడాది సీజన్‌ కోసం వేలం బరిలో 590మంది ఆటగాళ్లు నిలిచారని నవ తెలంగాణ పత్రిక వార్తా కథనం ప్రచురించింది.

ఈసారి ఐపిఎల్‌ వేలం బరిలో నిలిచిన మొత్తం 1,214మంది ఆటగాళ్లను ఫిల్టర్‌ చేసి తుది వేలంలో పాల్గొనే ఆటగాళ్ల జాబితాను బిసిసిఐ మంగళవారం వెల్లడించింది.

ఈ నెల 12, 13న రెండు రోజుల పాటు బెంగుళూరు వేదికగా ఐపిఎల్‌ వేలం జరగనుంది. మొత్తం 590 మంది ఆటగాళ్లలో 228 మంది క్యాప్డ్‌ ప్లేయర్స్‌(అంతర్జాతీయ ఆటగాళ్లు) కాగా, 355 మంది అన్‌క్యాప్డ్‌(అంతర్జాతీయ క్రికెట్‌ ఆడని) ఆటగాళ్లు ఉన్నారు.

మరో ఏడుగురు ఇతర దేశాలకు చెందినవారు ఉన్నారు. ఈసారి వేలం బరిలో కొత్తగా 44మంది ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు.

అసోసియేట్‌ దేశాలకు చెందిన ఏడుగురిలో డేవిడ్‌ వైస్‌, జెజె స్మిట్‌, రూబెన్‌ ట్రంపెల్మన్‌, సందీప్‌ లమిచ్ఛనే, బ్రాడ్‌ వీల్‌, సఫయాన్‌ షరీఫ్‌, అలీ ఖాన్‌ ఉన్నారు.

ఇక విదేశీ ఆటగాళ్లు డేవిడ్‌ వార్నర్‌, బౌల్ట్‌, కమ్మిన్స్‌, డికాక్‌, రబడా, డుప్లెసిస్‌ వంటి స్టార్‌ ఆటగాళ్లు ఈసారి వేలం బరిలో నిలవడంతో వీరిని దక్కించుకొనేందుకు 10 ఫ్రాంచైజీలు పోటీపడే అవకాశముంది.

భారత్‌నుంచి శ్రేయస్‌, ఇషాన్‌ కిషన్‌, అశ్విన్‌, శిఖర్‌ ధావన్‌, రహానే, రైనా, చాహల్‌, సుందర్‌, శార్దూల్‌, దీపక్‌ చాహర్‌, ఇశాంత్‌ శర్మ, ఉమేశ్‌ యాదవ్‌ కూడా వేలంలో పాల్గొంటున్నారు.

పది ఐపీఎల్‌ జట్లు ఈ ఆటగాళ్లను ఎంపిక చేసుకుంటాయి. రిజర్వ్‌ ప్రైస్‌ రెండు కోట్ల రేంజ్‌లో 48 మంది ఆటగాళ్లు ఉండగా.. 1.5 కోట్ల రిజర్వ్‌ ప్రైజ్‌లో 20 మంది, కోటి ప్రైస్‌లో మరో 34 మంది ఉన్నారు. మొత్తం 370మంది భారత ఆటగాళ్లు, 220మంది విదేశీ ఆటగాళ్లు ఈసారి వేలం బరిలో నిలిచారని పత్రిక వివరించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)