17 మంది మహిళలను పెళ్లి చేసుకొని, కోట్లాది రూపాయలు కాజేసిన వ్యక్తిని పోలీసులు ఎలా పట్టుకున్నారంటే...

ఫొటో సోర్స్, BISWA RANJAN/BBC
- రచయిత, సందీప్ సాహు
- హోదా, బీబీసీ కోసం, భువనేశ్వర్ నుంచి
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖలో సీనియర్ అధికారిగా, కొన్నిసార్లు వైద్యుడిగా నటిస్తూ 17 మంది మహిళలను పెళ్లి చేసుకొని డబ్బుతో ఉడాయించిన ఓ వ్యక్తిని భువనేశ్వర్ పోలీసులు అరెస్టు చేశారు.
భువనేశ్వర్ ఖండగిరి ప్రాంతంలోని ఒక అపార్ట్‌మెంట్‌లో ఆదివారం రమేశ్ చంద్ర స్వైన్ (66) అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సబ్ డివిజనల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ సోమవారం ఆయనను జ్యూడిషియల్ కస్టడీకి అప్పగించింది.
8 రాష్ట్రాలకు చెందిన 17 మంది మహిళలను మోసం చేసి పెళ్లి చేసుకొని వారి డబ్బులను దోచుకున్నట్లు ఆయనపై ఆరోపణలు నమోదు చేశారు. ఆయన బారిన పడిన 17 మంది బాధిత మహిళల్లో నలుగురు ఒడిశాకు చెందినవారు కాగా... అస్సాం, ఢిల్లీ నుంచి ముగ్గురు చొప్పున ఉన్నారు. మధ్యప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల నుంచి ఇద్దరు చొప్పున... ఉత్తర్‌ప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌ల నుంచి ఒక్కొక్కరు ఉన్నారు.

ఫొటో సోర్స్, BISWA RANJAN/BBC
ఈ 17 మంది మహిళలే కాకుండా రమేశ్ ఉచ్చులో చిక్కిన మహిళలు మరికొంత మంది కూడా ఉండే అవకాశం ఉందని'' బీబీసీతో భువనేశ్వర్ డీసీపీ ఉమాశంకర్ దాస్ చెప్పారు.
''ఈ 17 మంది మహిళల్లో ముగ్గురి గురించి మాకు రమేశ్‌ను అరెస్ట్ చేసిన తర్వాతే తెలిసింది. ఈ ముగ్గురూ ఒడిశా, ఛత్తీస్‌గఢ్, అస్సాం రాష్ట్రాలకు చెందినవారు. ఈ ముగ్గురు కూడా ఉన్నత చదువులు చదివారు. ఆయనను రిమాండ్‌లోకి తీసుకున్నాక, ఈ 17 మందితో పాటు ఇంకా ఎంతమందిని మోసం చేశారో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తాం'' అని ఆయన చెప్పారు.
ఆయన చేసిన మోసాల గురించి మరింత క్షుణ్ణంగా తెలుసుకునేందుకు భువనేశ్వర్ మహిళా పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి నేతృత్వంలో ముగ్గురు సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేసినట్లు దాస్ తెలిపారు. రమేశ్ ఉపయోగించిన ఫోన్‌ను ఫోరెన్సిక్ నిపుణులకు పంపించి ఆయన లావాదేవీలపై విచారణ చేస్తామని చెప్పారు.

ఫొటో సోర్స్, BISWA RANJAN/BBC
రమేశ్‌ను ఎలా పట్టుకున్నారు?
రమేశ్ అరెస్ట్ గురించి దాస్ వివరించారు. ''ఈ వ్యక్తిని పట్టుకోవడానికి చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నాం. ఆయన కోసం ఒక ప్రత్యేక వ్యూహం పన్నాం. కానీ చాలా నెలలుగా ఆయన భువనేశ్వర్‌లో ఉండటం లేదు. మొబైల్ నంబర్ కూడా మార్చేశారు. అందుకే ఆయన్ను పట్టుకోవడం కష్టమైంది. ఆయన భువనేశ్వర్ వచ్చినట్లు ఆదివారం మాకు తెలిసింది. అదే రోజు రాత్రి ఖండగిరిలోని అపార్ట్‌మెంట్‌లో అరెస్ట్ చేశాం'' అని ఆయన చెప్పారు.
రమేశ్ చేతిలో మోసపోయిన 17 మంది మహిళల్లో ఒకరు, భువనేశ్వర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చివరగా ఆయన చేతిలో మోసపోయిన మహిళ... దిల్లీలోని ఒక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు.
ఆరోగ్య మంత్రిత్వశాఖలో డిప్యూటీ డైరెక్టర్ జనరల్‌గా పేర్కొంటూ రమేశ్ ఈ మహిళతో పరిచయం పెంచుకున్నారు. 2020లో కుబేర్‌పురిలోని ఆర్యసమాజ్‌లో వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత కొన్ని రోజులు దిల్లీలోనే ఉన్న ఆయన తర్వాత ఆమెతో కలిసి ఖండగిరిలోని ఓ అపార్ట్‌మెంట్‌కు వచ్చారు.
భువనేశ్వర్‌లో నివసిస్తోన్న సమయంలోనే రమేశ్‌కు ఇంతకుముందే వివాహం జరిగినట్లు ఆమెకు తెలిసింది. ఈ విషయాన్ని ధ్రువీకరించుకున్న తర్వాతే భువనేశ్వర్‌లోని మహిళా పోలీస్‌స్టేషన్‌లో 2021 జూలై 5న రమేశ్‌పై ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత తిరిగి దిల్లీకి వచ్చేశారు.
భారతీయ శిక్షా స్మృతిలోని 498 (ఎ), 419, 468, 471, 494 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసిన పోలీసులు ఆయన గురించి వెతకడం ప్రారంభించారు. అయితే మొబైల్ నంబర్ మార్చేసిన ఆయన పోలీసుల నుంచి తప్పించుకొని తిరగడం ప్రారంభించారు. భువనేశ్వర్ నుంచి అదృశ్యమయ్యారు.
ఈ సమయంలో ఆయన గువాహటిలో నివసించే మరో భార్యతో ఉన్నారు.
పరిస్థితులు సద్దుమణిగి ఉంటాయని భావించిన రమేశ్ ఏడు నెలల తర్వాత తిరిగి భువనేశ్వర్‌కు వచ్చారు. కానీ దిల్లీకి చెందిన భార్య అక్కడ ఒక ఇన్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేసినట్లు ఆయనకు తెలియదు. రమేశ్, ఖండగిరి అపార్ట్‌మెంట్‌కు వచ్చిన వెంటనే ఈ విషయం ఆమెకు తెలిసిపోయింది. తక్షణమే సదరు మహిళ, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఏళ్లుగా మహిళలను మోసం చేస్తోన్న ఆయన పోలీసులకు దొరికిపోయారు.

ఫొటో సోర్స్, BISWA RANJAN/BBC
2002 నుంచి మోసాలు
ఒడిశాలోని కేంద్రపార జిల్లా పాట్కురాకు చెందిన రమేశ్‌కు 1982లో మొదటి వివాహం జరిగింది. ఆయన మొదటి భార్య ముగ్గురు కుమారులకు జన్మనిచ్చారు. ఈ ముగ్గురూ డాక్టర్లు. విదేశాల్లో ఉంటున్నారు.
పెళ్లి అయిన 20 సంవత్సరాల తర్వాత, అంటే 2002లో ఆయన ఒక మహిళను మోసగించారు. పోలీసు వర్గాల ప్రకారం, జార్ఖండ్‌కు చెందిన మహిళ ఆయన చేతిలో మోసపోయిన తొలి వ్యక్తి. ఆమె ఒడిశాలోని పారాదీప్ పట్టణంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యురాలు.
కొన్ని రోజుల తర్వాత అలహాబాద్‌కు ఆమె బదిలీ అయ్యారు. ఆమెతో పాటు అలహాబాద్ వెళ్లిన రమేశ్... ఆమె ఆభరణాలు, డబ్బు వాడుకోవడం మొదలుపెట్టారు.
ఇప్పటివరకు భువనేశ్వర్ పోలీసులు సేకరించిన సమాచారం ప్రకారం, దిల్లీలో ఉపాధ్యాయురాలిగా పనిచేసే భార్య నుంచి ఆయన రూ. 13 లక్షల రూపాయలు మోసం చేసి తీసుకున్నారు. సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్‌కి చెందిన ఒక మహిళా అధికారి నుంచి రూ. 10 లక్షలు తీసుకున్నట్లు తెలిసింది. ఇతర మోసాలకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులు సేకరిస్తున్నారు.

ఫొటో సోర్స్, BISWA RANJAN/BBC
మహిళలను ఉచ్చులోకి ఎలా దింపుతారు?
మహిళలను మోసం చేసే విషయంలో రమేశ్ చాలా జాగ్రత్తగా వ్యవహరించేవారు. మ్యాట్రిమోనియల్ సైట్ల ద్వారా మహిళలపై గురిపెట్టేవారు. విడాకులు తీసుకున్న వారు, భర్త నుంచి విడిపోయినవారు, ఇంకా పెళ్లి కాని మధ్యవయస్కులైన మహిళలను లక్ష్యంగా చేసుకునేవారు. తాను ఎంచుకునే మహిళకు ఉన్నత ఉద్యోగం, ఆస్తిపాస్తులు ఉన్నాయో లేదో ధ్రువీకరించుకొని రంగంలోకి దిగేవారు.
మ్యాట్రిమోనియల్ సైట్ల ద్వారా సదరు మహిళలతో పరిచయం పెంచుకున్న తర్వాత వారిని కలిసి మాయమాటలు చెప్పి బుట్టలో దింపేవారు. తానొక వైద్యుడినని, కొన్నిసార్లు కేంద్ర ఆరోగ్య శాఖలో సీనియర్ అధికారిని అని అందరితో చెబుతుండేవారు. నకిలీ గుర్తింపు కార్డులతో అందరినీ నమ్మించేవాడని భువనేశ్వర్ పోలీసులు తెలిపారు.
అంతేకాకుండా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ లోగోతో కూడిన నకిలీ పత్రాలను ఉపయోగించేవారు. బిధుభూషన్ స్వైన్, రంజన్ స్వైన్ పేరిట నకిలీ గుర్తింపు కార్డులతో రమేశ్ చలామణీ అవుతున్నారు. ఈ గుర్తింపు కార్డులను పోలీసులు ఖండగిరి అపార్ట్‌మెంట్ నుంచి స్వాధీనం చేసుకున్నారు.
నిజానికి రమేశ్ వైద్యుడు కాదు. ఆయన కొచ్చిలోని పారా మెడికల్ లాబోరేటరీ టెక్నాలజీ అండ్ ఫార్మసీలో డిప్లొమా చేశారు. ఈ పరిజ్ఞానాన్ని మహిళలను మోసం చేయడం కోసం వినియోగించారు.

ఫొటో సోర్స్, BISWA RANJAN/BBC
ఇతర మోసాలు
మహిళలకు మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకొని మోసం చేయడమే కాకుండా చాలామందిని ఇతర విధాలుగా కూడా రమేశ్ మోసగించారు. వైద్య కళాశాలల్లో సీటు ఇప్పిస్తానని చెబుతూ దేశంలోని చాలామంది యువకుల నుంచి డబ్బులు కాజేశారు. ఈ అంశంలో హైదరాబాద్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ (ఎస్‌టీఎఫ్) పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. బెయిల్‌పై బయటకు వచ్చిన ఆయన మళ్లీ మోసాలు చేయడం ప్రారంభించారు.
రమేశ్ చేసిన మోసాల గురించి హైదరాబాద్ పోలీసుల ద్వారా మరింత సమాచారం తెలుసుకుంటున్నామని డీసీపీ దాస్ చెప్పారు.
వీటితో పాటు 2006లో, వైద్య విద్యార్థులకు విద్యా రుణాలు ఇప్పిస్తానని పేర్కొంటూ నకిలీ ధ్రువపత్రాలతో కేరళలోని పలు బ్యాంకుల నుంచి కోటి రూపాయలకు పైగా కొల్లగొట్టారు. ఈ కేసులోనూ అరెస్టయి, తర్వాత కొన్ని రోజులకే బెయిల్‌పై విడుదలయ్యారు.
మెడికల్ కాలేజీ నడపడానికి అనుమతి ఇప్పిస్తానని చెబుతూ ఒక గురుద్వారా నుంచి రూ. 13 లక్షల రూపాయలను దండుకున్నారు.
దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన పలువురిని మోసం చేసినా, రెండుసార్లు అరెస్ట్ అయినప్పటికీ రమేశ్‌కు ఇంతవరకు తగిన రీతిలో శిక్ష పడకపోవడం... దుర్మార్గపు తెలివితేటలతో మహిళలను పెళ్లి చేసుకుంటూ ఇంతమందిని మోసం చేయడం విస్మయం కలిగిస్తోంది.

ఇవి కూడా చదవండి:
- నరేంద్ర మోదీ చెప్పినట్లు యోగి పాలనలో మహిళలు సురక్షితంగా ఉన్నారా, వారి జీవితం మెరుగుపడిందా?
- బప్పి లహిరి మరణానికి కారణమైన ఈ నిద్ర సమస్య ఏమిటి? దీన్ని ఎలా గుర్తించాలి?
- యుక్రెయిన్ సంక్షోభం: బలగాలు వెనక్కి వస్తున్నాయన్న రష్యా
- హిప్పోక్రటిస్ ప్రమాణం ఏంటి? దీనికీ చరక శపథానికీ తేడా ఏంటి?
- స్నేహను కాపాడేందుకు రైలు కిందికి దూకిన మొహమ్మద్ మహబూబ్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
- గుడ్ మార్నింగ్ ధర్మవరం: ఎమ్మెల్యే కేతిరెడ్డి పర్యటనల్లో ఏం జరుగుతోంది? ప్రజలు ఏమంటున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















