తమిళనాడు: స్కూలు విద్యార్థిని ఆత్మహత్య చుట్టూ వివాదం.. జవాబు లేని ప్రశ్నలు

victim ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, మురళీధరన్ కాశీవిశ్వనాథన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తమిళనాడులోని ఒక ప్రైవేటు క్రిస్టియన్ మిషనరీ స్కూలులో 12వ తరగతి చదవువుతున్న ఓ 17 ఏళ్ల బాలిక జనవరి 9న ఆత్మహత్యా ప్రయత్నం చేసిందని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత పది రోజులకు ఆమె చనిపోయింది.

రాష్ట్ర రాజధాని చెన్నైకి 355 కిలోమీటర్ల దూరంలో.. తంజావూరులోని తిరుకట్టుప్పల్లిలో ఆ స్కూలు ఉంది.

అరియాలూర్ జిల్లాకు చెందిన విద్యార్థిని ఈ స్కూలులో 8వ తరగతి నుంచీ చదువుతోంది. అదే స్కూలుకు అనుబంధంగా ఉన్న హాస్టల్‌లో ఉండేది.

స్కూలు అధికారుల కథనం ప్రకారం.. జనవరి 9న ఆ బాలికకు వాంతులయ్యాయి. వెంటనే ఆమె తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. బాలికను ఆమె స్వగ్రామానికి తీసుకెళ్లారు. స్థానిక ఆస్పత్రుల్లో చికిత్స చేయించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. ఆ బాలిక జనవరి 19వ తేదీన చనిపోయింది.

ఆ మరుసటి రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అన్నామలై ట్వీట్ చేస్తూ.. ‘‘ఆ బాలిక చదువుకుంటున్న స్కూలు ఆమెను మతం మారాలని బలవంతం చేయటం వల్ల.. ఆమె ఆత్మహత్య చేసుకుంది’’ అని ఆరోపించటంతో ఈ అంశంపై వివాదం రాజుకోవటం మొదలైంది.

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

ఆయన తన ట్వీట్‌తో పాటు ఆ బాలిక మాట్లాడుతున్న వీడియోను కూడా షేర్ చేశారు.

‘‘నన్ను క్రైస్తవమతంలోకి మార్చటానికి సిద్ధంగా ఉన్నారా అని నా ముందే వాళ్లు నా అమ్మానాన్నలను అడిగారు. నా చదువు గురించి తాము చూసుకుంటామని వాళ్లు చెప్పారు. అప్పటి నుంచీ వాళ్లు ఎప్పుడూ నన్ను తిడుతూ ఉన్నారు’’ అని ఆ బాలిక చెప్తుండటం ఆ వీడియోలో కనిపించింది. ఆ వీడియో కచ్చితత్వాన్ని బీబీసీ స్వతంత్రంగా తనిఖీ చేయలేదు.

ఆ వీడియోలో బాలిక ఒక క్రైస్తవ సన్యాసిని పేరును ప్రస్తావిస్తూ.. తనను మతం మారాలని ఆమె అడిగినట్లు చెప్పింది.

విశ్వహిందూ పరిషత్ సహా పలు హిందూ సంస్థలకు చెందిన వారు, బీజేపీ కార్యకర్తలు ఈ వీడియోను విస్తృతంగా షేర్ చేశారు. అయితే.. ఆ వీడియో ఎక్కడి నుంచి వచ్చిందనే దాని గురించి ఇతర సంస్థలు కొన్ని సందేహాలు వ్యక్తంచేశాయి. ఆ వీడియోను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

లైంగిక వేధింపులు

ఫొటో సోర్స్, Getty Images

పోలీసులు ఏం చెప్తున్నారు?

హిందూ సంస్థల వాదనలను పోలీసులు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు.

తంజావూర్ పోలీస్ సూపరింటెండెంట్ రవళి ప్రియ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.

‘‘ఆ బాలిక చికిత్స పొందుతున్నపుడు మెజిస్ట్రేట్ ఆమె నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. మతమార్పిడి గురించి ఆమె ఏమీ ప్రస్తావించలేదు. అలాగే, ఆమె తల్లిదండ్రులు కూడా దాని గురించి ఏమీ ప్రస్తావించలేదు. మెజిస్ట్రేట్ సైతం అలాంటి దానిగురించి ప్రత్యేకంగా చెప్పలేదు. కాబట్టి, మతమార్పిడి ఆరోపణను ఎఫ్ఐఆర్‌లో నమోదు చేయలేదు’’ అని అందులో పేర్కొన్నారు.

ఆ బాలిక మెజిస్ట్రేట్‌కు ఇచ్చిన వాంగ్మూలం నకలును బీబీసీ సంపాదించింది. హాస్టల్ వార్డెన్ ఒకరు.. తన చేత బలవంతంగా స్కూల్ అకౌంట్ వివరాలను పదేపదే రాయించారని, తనను చదువుకోనివ్వకుండా హింసించారని ఆమె అందులో చెప్పింది.

ఏవైనా వస్తువులు కనిపించకపోతే ఆ వార్డెన్ తనను అనుమానించి, తనను తిట్టేవారని కూడా ఆమె చెప్పింది. క్రిస్టమస్‌కు ఇంటికి వెళ్లటానికి తనకు సెలవు ఇవ్వకుండా, స్కూలు ఖర్చుల వివరాలను చూసే పని అప్పగించినందువల్ల జనవరి 9వ తేదీన ఆ బాలిక ఆత్మహత్యాయత్నం చేసినట్లు ఆ వాంగ్మూలం చెప్తోంది.

అన్నామలై నిరసన

ఫొటో సోర్స్, Getty Images

తల్లిదండ్రుల నుంచి వేర్వేరు ఫిర్యాదులు...

మరోవైపు.. ఆస్పత్రి బెడ్ మీద ఉండి మాట్లాడుతున్న ఆ బాలిక వీడియోలను షేర్ చేసిన వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోస్కో చట్టం కింద అది నేరం.

ఈలోగా ఆ బాలిక తల్లిదండ్రులు పోలీసులకు మరో ఫిర్యాదు చేశారు. మతమార్పిడి చేసుకోవాలని తమ కూతురును బలవంతం చేస్తుండటం వల్ల ఆమె ఆత్మహత్యాయత్నం చేసి ఉండవచ్చని అందులో ఆరోపించారు.

‘‘బాలిక చేత ఇతర పనులు చేయించటానికి ఆమెను వేధించారని తల్లిదండ్రులు చేసిన తొలి ఫిర్యాదు ఆధారంగా.. హాస్టల్ వార్డెన్‌ను అరెస్ట్ చేశాం. దానిపై దర్యాప్తు జరుగుతోంది. బాలిక తల్లిదండ్రులు రెండో ఫిర్యాదు చేశారు. బాలికను మతం మార్చుకోవాలని బలవంతం చేశారని అందులో ఆరోపించారు. దీని మీద కూడా దర్యాప్తు చేస్తున్నాం’’ అని తిరుచ్చి జోన్ ఐజీ బాలకృష్ణన్ బీబీసీకి చెప్పారు.

విశ్వహిందూ పరిషత్‌కు చెందిన ఒక కార్యకర్త మీద కూడా కేసు నమోదు చేశామని, ఆ వీడియోను షేర్ చేసిన వారి మీద దర్యాప్తు జరుగుతోందని ఐజీ తెలిపారు.

అన్నామలై
ఫొటో క్యాప్షన్, అన్నామలై

రెండో వీడియోతో మరో మలుపు...

ఇప్పుడు ఈ కేసును సీబీసీఐడీకి బదిలీ చేయాలని కోరుతూ బాలిక తల్లిదండ్రులు మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్‌ను ఆశ్రయించారు. మరణశయ్యపై ఉన్న ఆ బాలికను వీడియో తీసి, విడుదల చేసినట్లు భావిస్తున్న విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు ముత్తువేల్‌.. ఆ మొబైల్ ఫోన్‌ను అప్పగించి, దర్యాప్తుకు సహకరించాలని కోర్టు నిర్దేశించింది. దీంతో ముత్తువేల్ ఆ మొబైల్ ఫోన్‌ను అప్పగించారు.

ఆ మరుసటి రోజు బాలికకు సంబంధించిన మరొక వీడియో బయటికి వచ్చింది. తను ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయం ఎందుకు తీసుకున్నానో ఆ బాలిక చెప్పటం అందులో స్పష్టంగా ఉంది.

‘‘బోర్డింగ్‌లో ఉన్న సిస్టర్ నన్ను అకౌంట్లు నిర్వహించాలని ఎప్పుడూ ఒత్తిడి చేస్తుండేది. నేను తర్వాత చేస్తానని చెప్తే ఆమె ఒప్పుకునేది కాదు. నా చేత అకౌంట్లు రాయించేది. ముందు అకౌంట్లు చేసి, ఆ తర్వాత నా పని చేసుకోవాలని చెప్పేది’’ అని ఆ వీడియోలో చెప్పిందా బాలిక.

ఆ వీడియోను షూట్ చేస్తున్న వ్యక్తి.. ‘‘నిన్ను బొట్టు పెట్టుకోవద్దని, లేదంటే అలాంటిది ఏమైనా చెప్పిందా?’’ ఆ బాలికను అడగటం, ‘‘లేదు అలాంటివేమీ వారు చెప్పలేదు’’ అని ఆ బాలిక బదులివ్వటం కూడా ఆ వీడియోలో ఉంది.

విద్యాశాఖ దర్యాప్తులో ఏం తేలింది?

ఈ రెండో వీడియో తీవ్ర ఆగ్రహం సృష్టించింది. జిల్లా విద్యాశాఖ తనిఖీలు నిర్వహించి ఒక నివేదికను సమర్పించింది. ఆ నివేదిక పత్రికల్లోనూ అచ్చయింది.

‘‘గత పది సంవత్సరాల్లో జిల్లా విద్యాధికారులు, ప్రధాన విద్యాధికారులు ఆ స్కూలును 16 సార్లు తనిఖీ చేశారు. ఎప్పుడూ కూడా విద్యార్థుల నుంచి మతం మీద ఫిర్యాదులేవీ అందలేదు. ఆ స్కూలును ఒక మైనారిటీ కమ్యూనిటీ నిర్వహిస్తున్నప్పటికీ.. అక్కడ చదువుకుంటున్న విద్యార్థుల్లో ఎక్కువ మంది హిందూ మతానికి చెందినవారు. కాబట్టి, స్కూల్ ప్రిన్సిపల్ కానీ, టీచర్లు కానీ మత ప్రచారాలేవీ నిర్వహించలేదు’’ అని ఆ నివేదిక చెప్పింది.

ఆ బాలిక తన ఆత్మహత్యాయత్నానికి.. రెండో వీడియోలో భిన్నమైన కారణం చెప్పటంతో పాటు, విద్యాశాఖ విచారణ నివేదికతో.. మితవాద సంస్థలను వ్యతిరేకించే సంస్థలు, రాజకీయ పార్టీలు.. మతమార్పిడి ఆరోపణలను తీవ్రంగా ఖండించాయి.

రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు ఆరోపణలు చేసినందుకు బీజేపీ, ఇతర సంస్థలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి.

మైఖేల్‌పట్టి గ్రామస్థులు

ఫొటో సోర్స్, Getty Images

బీజేపీ దర్యాప్తు బృందం.. గ్రామస్తుల ప్రతిస్పందన...

ఒత్తిడి రావటంతో ఈ అంశాన్ని వదిలివేయటానికి సుముఖంగా లేని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా.. ఈ అంశంపై దర్యాప్తు చేయటానికి నలుగురు సభ్యుల బృందాన్ని నియమించారు.

మధ్యప్రదేశ్‌కు చెందిన ఎంపీ సంధ్యా రే, తెలంగాణకు చెందిన విజయశాంతి, మహారాష్ట్రకు చెందిన చిత్రా తాయ్ వాగ్, కర్ణాటకకు చెందిన గీతా వివేకానందలు ఆ కమిటీ సభ్యులు.

అదే సమయంలో స్కూలు ఉన్న గ్రామం మైఖేల్‌పట్టి నివాసులు.. గురువారం నాడు తిరుచ్చి జిల్లా కలెక్టర్‌కు ఒక పిటిషన్ సమర్పించారు. గ్రామంలో అన్ని మతాల వారినీ ఐక్యంగా ఉంచుతున్న సామరస్యాన్ని దెబ్బతీసే ఎలాంటి దర్యాప్తులనైనా తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని వారు అందులో పేర్కొన్నారు.

ఈ అంశంపై స్కూల్, హాస్టల్ యాజమాన్యం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో.. తమ స్కూలు చాలా గౌరవనీయమైన సంస్థ అని, మతమార్పిడి ఆరోపణలు చౌకబారు రాజకీయ దుష్ప్రచారమని పేర్కొన్నారు.

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

సమాధానం లేని ప్రశ్నలు

విశ్వహిందూ పరిషత్ ప్రతినిధి ముత్తువేల్.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆ బాలికను ఎలా వీడియో తీయగలిగారనే ప్రశ్న కూడా ఉంది.

అతడు నాలుగు వీడియోలు తీశాడని, మొదటి వీడియోను స్వయంగా విడుదల చేశాడని చెప్తున్నారు. అతడు తన ఫోన్‌ను పోలీసులకు దర్యాప్తు కోసం అప్పగించారు.

ఆ మరుసటి రోజు, రెండో వీడియో కొన్ని మీడియా చానళ్లలో విడుదలైంది. ఈ రెండో వీడియోలోనే.. హాస్టల్‌లో తన చేత పనిచేయించటం వల్ల తాను ఆత్మహత్యాయత్నం చేసినట్లు ఆ బాలిక చెప్పింది.

ఈ వీడియోను పోలీసులే స్వయంగా మీడియాకు విడుదల చేశారని మితవాద సంస్థలు ఆరోపిస్తున్నాయి.

సహకరించని వీహెచ్‌పీ ప్రతినిధులు...

ఇప్పుడు ఈ అంశంపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆ వీడియోలో ప్రస్తావించిన నన్‌ను అరెస్ట్ చేశారు. ఈ కేసు దర్యాప్తును పోలీసుల నుంచి సీబీసీఐడీకి బదలీ చేయాలని కోరుతూ మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ వద్ద కేసు దాఖలైంది.

దర్యాప్తులో ముత్తువేల్ తమకు సహకరించలేదని పోలీసులు కోర్టుకు చెప్పారు. ఈ కేసులో తీర్పు వాయిదా పడింది.

ఈ కేసులో మతమార్పిడి కోణం ఉందనే వాదనను విశ్వహిందూ పరిషత్, హిందూ మున్నాని, భారతీయ జనతా పార్టీ మినహా.. రాజకీయ పార్టీలన్నీ తిరస్కరించాయి.

న్యాయం

ఫొటో సోర్స్, Getty Images

న్యాయ నిపుణులు ఏమంటున్నారు?

ఈ కేసులో చట్టపరమైన కోణాల గురించి మాట్లాడుతూ.. సీనియర్ న్యాయవాది సుధా రామలింగం బీబీసీతో చెప్పారు.

చట్టం ప్రకారం.. మెజిస్ట్రేట్‌కు కానీ, డాక్టర్‌కు కానీ మరణ వాంగ్మూలం ఇవ్వొచ్చు. ఆ వాంగ్మూలం ఇచ్చే వ్యక్తి మైనర్ అయినట్లయితే వారి గుర్తింపును కానీ, వారి ఫొటోను కానీ వెల్లడించరు.

అయితే ఈ కేసులో మూడో వర్గం వారు వీడియో షూట్ చేశారు. ఇలా వీడియో షూట్ చేయటం గురించి చట్టం ఏమీ చెప్పలేదని ఆమె పేర్కొన్నారు.

‘‘కానీ ఆ బాలిక గుర్తింపును బహిర్గతం చేసే విధంగా ఆ వీడియోను విడుదల చేయటం నిజంగా నేరం. దానిపై దర్యాప్తు జరుగుతుంది’’ అని ఆమె స్పష్టంచేశారు.

ఈ అంశాన్నంతటినీ చాలా పేలవంగా వ్యవహరిస్తున్నారని సుధా రామలింగం పేర్కొన్నారు. ‘‘ఆ బాలికను ఆత్మహత్య చేసుకునేలా పురికొల్పినట్లయితే, అందుకు బాధ్యులైన వారికి శిక్షపడాలి. అది దర్యాప్తు పూర్తయ్యాకే తెలుస్తుంది. దానికి ముందు.. మత కోణంలో ఈ అంశాన్ని కొనసాగించటం సరికాదు’’ అని ఆమె అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)